- స్థానిక సమస్యలపై పోరాడాలి
- బూత్ లెవల్ నుంచి పార్టీ బలోపేతం చేయాలి
- జనవరిలో జిల్లాకు తరుణ్ చుగ్
కామారెడ్డి, వెలుగు: స్థానికంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు గుర్తించి, వారి పక్షాన పోరాటం చేయాలని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ ఆ పార్టీ నేతలకు సూచించారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా నిర్మల్ జిల్లా ఖానాపూర్‌లో బుధవారం కామారెడ్డి జిల్లా లీడర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో పార్టీ బలోపేతం, చేపట్టాల్సిన కార్యక్రమాలు తదితర ఆంశాలపై చర్చించారు. జుక్కల్, బాన్సువాడ నియోజకవర్గాల్లో కూడా ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహించాలని సంజయ్‌ను జిల్లా నేతలు కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో బూత్ కమిటీలతో పాటు ఇతర అన్ని కమిటీలను కంప్లీట్ చేయాలన్నారు. జనవరిలో కామారెడ్డి జిల్లాకు పార్టీ స్టేట్ ఇన్‌చార్జి తరుణ్ చుగ్ రానున్నారని తెలిపారు. అప్పటిలోగా అన్ని కమిటీలు పూర్తి చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టాలన్నారు. పార్టీ ఇచ్చిన కార్యక్రమాలతో పాటు ఆయా నియోజకవర్గాల్లో స్థానిక సమస్యలపై పోరాటం చేయాలని సూచించారు. అధికార టీఆర్ఎస్ బెదిరింపులకు భయపడొద్దన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా పార్టీ శ్రేణులు రెడీగా ఉండాలన్నారు. జిల్లాలో 4 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ గెలిచేలా పని చేయాలన్నారు. సమావేశంలో పార్టీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ వివేక్ వెంకటస్వామి, జిల్లా ఇన్‌చార్జి బద్దం మహిపాల్‌రెడ్డి, జిల్లా ప్రెసిడెంట్ అరుణతార, నియోజకవర్గాల ఇన్‌చార్జిలు కాటిపల్లి వెంకటరమణారెడ్డి, బాణాల లక్ష్మారెడ్డి, మల్యాద్రిరెడ్డి, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నీలం చిన్న రాజులు, జిల్లా జనరల్ సెక్రెటరీలు మర్రి బాపురెడ్డి, తేలు శ్రీనివాస్, లీడర్లు మర్రి రాంరెడ్డి, రాము, మహిపాల్‌యాదవ్
పాల్గొన్నారు.
రైతు సంక్షేమమే ధ్యేయం
కామారెడ్డి, వెలుగు: రైతుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పని చేస్తున్నారని ప్రభుత్వ విప్, కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని తలమడ్లలో పలు అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో పాలించిన ఏ ముఖ్యమంత్రి, ప్రధాన మంత్రి కూడా రైతుల అభ్యున్నతి కోసం అలోచించలేదన్నారు. కానీ మన కేసీఆర్ రైతులు అప్పుల ఊబిలో నుంచి బయటకు రావాలనే ఉద్దేశంతో పంట పెట్టుబడి సాయం ఇవ్వడంతో రైతు బీమా అమలు చేస్తున్నారన్నారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతులకు మిగతా స్టేట్‌ల కంటే మన స్టేట్‌లో ఆసరా పింఛన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. సమావేశంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ పున్న రాజేశ్వర్, ఎంపీపీ సరోజ, జడ్పీటీసీ హన్మండ్లు, పార్టీ మండల శాఖ ప్రెసిడెంట్ బిక్కాజీ బల్వంత్‌రావు, విండో చైర్మన్ నల్లవెల్లి ఆశోక్ పాల్గొన్నారు.
బాలుడికి అరుదైన చికిత్స
నిజామాబాద్, వెలుగు: ఇందూరులోని మెడికవర్ హాస్పిటల్‌లో సర్జరీ లేకుండా అరుదైన చికిత్స చేసి బాలుడి ప్రాణాలు కాపాడారు. డిచ్‌పల్లి మండలంలోని దూస్‌గాం గ్రామానికి చెందిన 11 ఏళ్ల బాలుడు శ్యాం పాల్ బుధవారం రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. బైక్ బాలుడి శరీరంపై నుంచి వెళ్లడంతో పరిస్థితి విషమించింది. హుటాహుటిన మెడికవర్ ఆస్పత్రికి తరలించారు. లివర్‌కు తీవ్ర గాయం వల్ల రక్తం సరఫరా అయ్యే రక్త నాళం బెలూన్ ఆకారంలో ఉబ్బినట్టు డాక్టర్లు గుర్తించారు. శస్త్ర చికిత్స లేకుండా తమకున్న వైద్య పరిజ్ఞానంతో ఆధునాతన టెక్నాలజీతో డాక్టర్ కౌశిక్ పొద్దుటూరి చికిత్స చేశారు. ఎలాంటి సర్జరీ లేకుండా క్యాల్ ల్యాబ్‌లో ఎంబోలైసెషన్ అనే ప్రొసీజర్ ద్వారా రక్త నాళం నుంచి సన్నని వైరును పంపి లివర్‌కు చికిత్స అందించారు. దీంతో బాలుడిని ప్రాణాపాయం నుంచి తప్పించారు. ఈ సందర్భంగా మెడికవర్ డాక్టర్ పి.కౌశిక్ మీడియాతో మాట్లాడారు. జిల్లాలో మొట్టమొదటి సారిగా సర్జరీ, కుట్లు లేకుండా అత్యాధునిక టెక్నాలజీతో ట్రీట్‌మెంట్ అందించినట్లు చెప్పారు. సమావేశంలో డాక్టర్లు వను, సందీప్, రవికిరణ్, ఆస్పత్రి మేనేజ్‌మెంట్ శ్రీనివాస్ శర్మ, స్వామి, లహరి పాల్గొన్నారు.
కళాభారతి పేరిట సర్కార్ కుట్ర
నిజామాబాద్, వెలుగు: కళాభారతి అడిటోరియం నిర్మాణం పేరిట విలువైన భూములను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు సర్కార్ కుట్ర చేస్తోందని యూత్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామర్తి గోపి ఆరోపించారు. మినీ స్టేడియం పరిరక్షణ కోసం యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్‌యూఐ ఆధ్వర్యంలో బుధవారం ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా గోపి మాట్లాడుతూ పాత కలెక్టరేట్‌ను స్థలాన్ని దేనికి ఉపయోగిస్తున్నారో స్పష్టత ఇవ్వకుండానే భవనాలను కూల్చివేస్తున్నారని మండిపడ్డారు. నగరంలో క్రీడాకారులకు అందుబాటులో ఉన్న మినీ స్టేడియాన్ని నిర్వీర్యం చేయడం కోసం కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. క్రీడరంగాన్ని ప్రొత్సహించాల్సిన ప్రభుత్వం క్రీడా మైదానాలను కమర్షియల్‌గా ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు చూడడం బాధాకరమన్నారు. కార్యక్రమంలో ఎన్ ఎస్ యుఐ జిల్లా ప్రెసిడెంట్ వేణు రాజు, యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రెసిడెంట్ విక్కీ యాదవ్, నగర అధ్యక్షుడు ప్రీతం, కార్పొరేటర్ గడుగు రోహిత్, నాయకులు నవాజ్, మోయిన్, రాష్ట్ర మైనార్టీ ప్రధాన కార్యదర్శి అబూద్ బిన్ హమ్దాన్, నరేందర్ గౌడ్, సుంకట్ విశాల్, చింతకాయల రాహుల్, సన్నీ గౌడ్, చిన్న, ప్రసాద్ పాల్గొన్నారు.
మా భూమిని కబ్జా చేస్తున్నరు
నిజామాబాద్ టౌన్, వెలుగు: అధికార పార్టీ ఓ నేత తమ భూమిని కబ్జా చేయడానికి యత్నిస్తున్నారని కబ్జాదారుల నుండి తమను కాపాడాలని బాధితులు మీర్ ఆసిఫ్ అలీ, మొహమ్మద్ అబ్దుల్ రజాక్, మహమ్మద్ కాజా పాషా విజ్ఞప్తి చేశారు. బుధవారం వారు ప్రెస్ క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ డిచ్‌పల్లి మండలం నడిపల్లి శివారులో సర్వే నంబర్ 268/ఈ/1, 282/ఆ 3/1 మొత్తం 17 ,121 గజాల భూమిని నుజాత్ సుల్తానా వద్ద కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేశామన్నారు. అధికార బలంతో టీఆర్ఎస్ నేతలు జేసీబీలతో హద్దులు ధ్వంసం చేసి కబ్జాకు ప్లాన్ చేస్తున్నారని ఆరోపించారు. దీనిపై కలెక్టర్‌కు కూడా ఫిర్యాదు చేశామని తెలిపారు.
కార్మిక హక్కుల కోసం పోరాడుదాం
బోధన్, వెలుగు: కార్మిక హక్కుల సాధన కోసం కలసి పోరాడుదామని ఐఎఫ్‌టీయూ జిల్లా ప్రతినిధి పుట్ట వరదయ్య సూచించారు. బుధవారం పట్టణంలో ఆ సంఘ ఆఫీసులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎనిమిదేళ్లు మోడీ పాలనలో కార్మికులు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నారన్నారు. 42 కార్మిక చట్టాలను నాలుగు లేబర్ కోడ్‌లుగా మార్పు చేసి తీరని అన్యాయం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ పరిశ్రమలను ప్రైవేట్ పరం చేసి అనేక మందికి ఉపాధి లేకుండా చేశారని ఆరోపించారు. కనీస వేతన చట్టం నేటికీ అమలు చేయడం లేదన్నారు. నిత్యావసర సరుకుల ధరలు పెంచి ప్రజలపై మోయలేని భారం వేస్తున్నారని విమర్శించారు. అనంతరం ఐఎఫ్‌టీయూ బోధన్ ఏరియా కమిటీని ఎకగ్రీవంగా ఎన్నుకున్నారు. బోధన్ ఏరియా అధ్యక్షుడిగా ఎం.రాజ్‌కుమార్, ఉపాధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా ఆర్.సురేశ్, సహాయ కార్యదర్శిగా సాయాగౌడ్, కోశాధికారిగా పి.సాయిలు, సభ్యులుగా టి.సాయిలు, నారాయణ, జగదీశ్, శంకర్‌గౌడ్, ఫయాజ్, అమర్, శ్రీనివాస్‌గౌడ్‌ను ఎన్నుకున్నారు.