- ఇండ్లు పూర్తయినా.. పంపిణీ చేస్తలే
- డబుల్ బెడ్రూమ్లకు దరఖాస్తులు ఎక్కువ..
నిజామాబాద్, వెలుగు: హౌసింగ్ మినిస్టర్ ప్రశాంత్ రెడ్డి సొంత జిల్లాలో డబుల్ బెడ్ రూం డబుల్ ఇండ్ల నిర్మాణాలు పూర్తయినా పంపిణీ జరగడంలేదు. కొన్ని ఇండ్లలో ఇప్పటికే పగుళ్లు వచ్చాయి. కట్టిన ఇండ్లు తక్కువగా ఉండడం, ధరఖాస్తులు భారీ సంఖ్యలో ఉండటం తో నాయకులు, అధికారులు కేటాయింపులపై ఇంకా దృష్టి పెట్టడం లేదు.
ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది నియోజకవర్గాల పరిధిలో మొత్తం 24142 డబుల్ బెడ్ రూం ఇండ్లు మంజురు అయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 11956 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు కాగా.. మొత్తం రూ. 206,94 కోట్ల నిధులు కేటాయించారు. ఇందులో 9772 ఇండ్ల నిర్మాణాలు ప్రారంభించారు. వీటిలో 1534 ఇండ్లు పూర్తయ్యాయి. కామారెడ్డి జిల్లాలో మొత్తం 13186 ఇండ్లు మంజూరయ్యాయి. నిర్మాణానికి మొత్తం రూ. 223.54 కోట్లు కేటాయించారు. ఇందులో 5705 నిర్మాణాలు ప్రారంభించగా 3485 డబుల్ బెడ్ రూం ఇళ్లు పూర్తయ్యాయి . నిజామాబాద్ న్యూకలెక్టరేట్ పక్కన 500 ఇండ్లు నిర్మాణం చివరిదశకు చేరాయి. మరో 650 ఇండ్ల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. ఇండ్ల సంఖ్య కంటే దరఖాస్తు దారులు ఎక్కువ ఉండటంతో పంపిణీ చేయడానికి ఆఫీసర్లు జంకుతున్నారు. నిజామాబాద్ అర్బన్ పరిధిలో ఇప్పటివరకు ఒక్క ఇళ్లు కూడా పంపిణీ చేయలేదు. దరఖాస్తుదారులు ఆఫీస్ ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అర్బన్ లోని నాగారం వద్ద రెండేళ్ల క్రితం డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తయ్యాయి. వీటికోసం 25 వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. లబ్దిదారులను పంపిణీ చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేసి 15 నెలలు అవుతోంది. ఇప్పటివరకు ఇండ్ల పంపిణీ చేయలేని పరిస్థితి ఉంది.
ఇండ్ల పంపిణీలో ఫెయిల్యూర్ : ధన్ పాల్ సూర్యనారాయణ బీజేపీ నేత
హౌసింగ్ మినిస్టర్ జిల్లాలోనే డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీలో ఫెయిల్ అయింది. పంపిణీలో జాప్యం చేస్తున్రు. పూర్తయిన ఇండ్లు శిథిలావస్థకు చేరుతున్నాయి. అర్బన్ లో ఇండ్ల పంపిణీ చేయాలంటే ఇరవై ఏండ్లు దాటేటట్టుంది .
పంపిణీకి చర్యలు
అర్బన్ నియోజకవర్గంలో 396 డబుల్ బెడ్ ఇండ్ల నిర్మాణం పూర్తయింది. దుబ్బ ప్రాంతంలో తుది దశకు చేరాయి. నిర్మాణం పూర్తయిన ఇండ్లను అ ర్హులకు పంపిణీ చేస్తాం.
- సింహాచలం నోడల్అధికారి
అభివృద్ధి పనులు స్పీడ్‌గా పూర్తి చేయాలె
భీంగల్, వెలుగు: మన ఊరు–మన బడి పనులు స్పీడ్ గా పూర్తి చేయాలని కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. భీంగల్ లోని ఉర్దూ మీడియం ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలను, పల్లికొండ జిల్లా పరిషత్ హైస్కూల్ ను శనివారం ఆయన విజిట్ చేశారు. పనులను పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. అంగన్వాడీ కేంద్రంలో విద్యార్థులకు పెడుతున్న భోజనాన్ని తనిఖీ చేశారు. ఆనంతరం ఆయన మాట్లాడుతూ.. పాఠశాలలకు చెందిన ఖాళీ స్థలాలను ఉపయోగించుకోవాలని చెప్పారు. పాఠశాలలోనే నేషనల్ అకాడమీ ఆఫ్ కన్ స్ట్రక్షన్ (ఎన్ఏసీ) ఆధ్వర్యంలో నిరుద్యోగ యువకులకు ఎలక్ట్రీషియన్, హౌస్ వైరింగ్ లో, యువతులకు కుట్టు మిషన్ శిక్షణ అందిస్తున్న కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. కలెక్టర్ వెంట భీంగల్ తహసీల్దార్ శ్రీధర్, ఎంపీడీఓ రాజేశ్వర్ తదితరులు ఉన్నారు.
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు రూ.10కోట్ల రుణం
నిజామాబాద్, వెలుగు: ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రూ. 10 కోట్లు రుణసహాయం అందిస్తున్నట్లు కలెక్టర్ సి. నారాయణ రెడ్డి చెప్పారు. మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ స్కీమ్ ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. యూనిట్ల స్థాపన కోసం వ్యక్తిగతంగానే కాకుండా స్వయం సహాయక సంఘాలకు, ఎఫ్ పీ ఓ లకు, కో-ఆపరేటివ్ సొసైటీలకు ఈ పథకం కింద సబ్సిడీతో లోన్ ఇస్తుందని చెప్పారు. యూనిట్ విలువలో లబ్ధిదారుడు పది శాతం తన వాటా కింద సమకూరిస్తే, 35 శాతం ప్రభుత్వ సబ్సిడీ ఇస్తుందని వివరించారు.
చెరువులోకి చేప పిల్లల విడుదల
నందిపేట, వెలుగు: మండల కేంద్రంలోని రఘుపతి చెరువులో ప్రభుత్వం సబ్సిడీపై అందజేసిన 57, 600 చేప పిల్లలను అధికారులు శనివారం వదిలిపెట్టారు. ఈ సందర్బంగా ఎంపీపీ సంతోష్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వందశాతం సబ్సిడీపై అందజేస్తున్న చేప పిల్లలతో మత్స్యకారులు ఆర్థికాభివృద్ది సాధిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో జడ్పీటీసీ ఎర్రం యమునా ముత్యం, ఎంపీడీఓ నాగవర్ధన్ పాల్గొన్నారు.
ఆయిల్ పామ్ సాగుపై అవగాహన
నందిపేట, వెలుగు: అయిల్‌పామ్ సాగుపై మండలంలోని వెల్మల్‌లో అధికారులు శనివారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా ఏఓ జ్యోత్స్న భవాని మాట్లాడుతూ ఒక్కో ఆయిల్ పామ్ మొక్క ఖరీదు రూ. 193 కాగా రైతు రూ. 20 చెల్లిస్తే సరిపోతుందని మిగతాది ప్రభుత్వం రాయితీ ఇస్తుందన్నారు. నాలుగు సంవత్సరాల పాటు ఈ పంట సాగుతో పాటు అంతర పంటల సాగు కోసం ప్రభుత్వం ఎకరాకు రూ. 4,200 ను నేరుగా రైతు ఖాతాలో జమ చేస్తుందన్నారు. అలాగే డ్రిప్ కోసం రాయితీ ఉంటుందని తెలిపారు. ఆసక్తి ఉన్న రైతులు పాసుపుస్తకం, ఆధార్ కార్డ్, బ్యాంక్ ఖాతా పుస్తకాన్ని తీసుకుని వ్యవసాయ శాఖను సంప్రదించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మచ్చర్ల సాయమ్మ గంగారాం, ఉపసర్పంచ్ ముప్పెడ నారాయణ, రైతులు పాల్గొన్నారు.
దళితబంధు యూనిట్ పరిశీలన
బోధన్,వెలుగు: మండలంలోని పెంటకుర్దులో ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రమేశ్ దళితబంధు యూనిట్‌ను శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈడీ రమేశ్ మాట్లడుతూ.. వందశాతం సబ్సిడీపై అందించిన రుణాలులను లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. పెంటకుర్దులోని షాప్‌ను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన వెంట ఎంపీడీవో మధుకర్, సర్పంచ్ శ్రీనివాసరావు, పంచాయతీ కార్యదర్శి సద్గుణ, పాల్గొన్నారు.
- వడ్డెర కాలనీకి నీళ్లొస్తలేవు..
- గ్రామసభలో మహిళల ఆందోళన
కోటగిరి, వెలుగు: తమ కాలనీకి చుక్క నీరూ రావట్లేదని పొతంగల్ లోని వడ్డెర కాలనీ వాసులు శనివారం నిర్వహించిన గ్రామసభలో ఆందోళన వ్యక్తం చేశారు. సర్పంచ్ శంకర్ ఆధ్వర్యంలో గ్రామ సభ జరుగగా.. గ్రామంలోని వడ్డెర కాలనీకి చెందిన మహిళలు తమ కాలనీకి నీళ్లురావడం లేదని, కరెంటు ప్రాబ్లమ్ కూడా ఉందని సర్పంచ్‌దృష్టికి తీసుకొచ్చారు. గత గ్రామ సభలో చేసిన తీర్మాణాలను చదివి దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశామని జీపీ సెక్రెటరీ యాదవ్ తెలిపారు. గ్రామంలోని మూడు స్కూళ్లు మన ఊరు మన బడి కార్యక్రమానికి సెలెక్ట్ కాగా రూ. 40 లక్షల నిధులు శాంక్షన్ అయ్యాయని హెచ్‌ఎం తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ కేశ వీరేశం,గంట్ల విఠల్,రాజు, హన్మాండ్లు,దత్తు,తదితరులు పాల్గొన్నారు.
ఐక్య పోరాటాలతోనే హక్కులు సాధ్యం
నిజామాబాద్ టౌన్, వెలుగు: ఐక్య పోరాటాల ద్వారానే హక్కులు సాధించగలమని అంగన్వాడి జిల్లా మహాసభలో వక్తలు అన్నారు. స్థానిక తిలక్ గార్డెన్ లోని న్యూ అంబేద్కర్ భవవన్‌లో అంగన్వాడి ఉద్యోగుల ఆరవ మహాసభ శనివారం జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా గౌరవ అధ్యక్షులు ఏ రమేశ్ బాబు, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి నూర్జహాన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఐసీడీఎస్‌ను కేంద్రం నిర్వీర్యం చేస్తోందని నూతన జాతీయ విద్యా విధానం తీసుకొచ్చి, నిరుపేదలకు పౌష్టికాహారం అందకుండా చేస్తున్నారని అన్నారు. జిల్లాలో అంగన్వాడీ ఉద్యోగుల సమస్యల పై పైన ఐక్యంగా పోరాటాలు చేస్తామన్నారు.. అంగన్వాడీలకు బకాయిలు, వేతనాలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు జై శంకర్ గౌడ్, ఏం గోవర్ధన్, అంగన్వాడీ యూనియన్ జిల్లా నాయకులు దేవగంగు, స్వర్ణ, చంద్రకళ పాల్గొన్నారు.
పద్మశాలి యువజన సంఘం జిల్లా కార్యవర్గం ఎన్నిక
నిజామాబాద్ టౌన్, వెలుగు; జిల్లా పద్మశాలి యువజన సంఘం నూతన కార్యవర్గాన్నిశనివారం ఎన్నుకున్నారు. అధ్యక్షులు మెరుగు నాగరాజు, ప్రధాన కార్యదర్శిగా పడాల పురంధర్, కోశాధికారిగా ఆదోని పురుషోత్తం నియమితులయ్యారు. ఎంపికైన నూతన కార్యవర్గంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు దికొండ యాదగిరి ప్రమాణ స్వీకారం చేయించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్గం హనుమాన్లు, కోశాధికారి గుడ్ల భూమేశ్వర్, వెంకట్ నర్సయ్య, , విట్టల్ చింతల గంగాదాస్ తదితరులు పాల్గొన్నారు.
నేషనల్ హాకీ పోటీలకు స్టూడెంట్ల ఎంపిక
సిరికొండ,వెలుగు: మండలంలోని తూంపల్లి హైస్కూలుకు చెందిన మాలవత్ మమత, బనావత్ వెన్నెల, అర్చన,రాజశ్రీ నేషనల్ లెవల్ హాకీ పోటీలకు ఎంపికైనట్లు పీఈటీ నగేశ్ చెప్పారు. గత నెల 29 నుంచి 31 వరకు ఆర్మూర్‌లో జరిగిన స్టేట్ లెవల్ జూనియర్ గర్ల్స్ పోటీల్లో ప్రతిభ కనబరిచి , నేషనల్ లెవల్‌కు ఎంపికైయ్యారన్నారు. విద్యార్థులను సర్పంచ్ బాలమణి, ఎంపీటీసీ లింగం, వీడీసీ సభ్యులు ,టీచర్లు అభినందించారు.
ఘనంగా ఆదివాసీ భీమన్న పండుగ
నవీపేట్, వెలుగు : మండల కేంద్రంలో ఆదివాసీ నాయకపోడ్ ల ఆధ్వర్యంలో భీమన్న పండగను శనివారం ఘనంగా నిర్వహించారు. ఏటా కార్తీక మాసంలో గోదావరి జలాలు తెచ్చి భీమన్నకు అభిషేకం, ప్రత్యేక పూజలు చేస్తారు. ఈకార్యక్రమంలో ఆదివాసీ సంఘ సభ్యులు నర్సయ్య, సుదర్శన్, సాయిలు,
ఆంజనేయులు, భోజన్న లు పాల్గొన్నారు.
నియోజకవర్గంలో రూ. 70 కోట్ల అభివృద్ధి పనులు
ధర్పల్లి, వెలుగు: నిజామాబాద్ రూరల్ లో ఇప్పటి వరకూ రూ. 70కోట్ల అభివృద్ధి పనులు చేపట్టినట్లు ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తెలిపారు. మండలంలోని రామడుగు లో శనివారం శివాలయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూరల్ పరిధిలో సీసీరోడ్లు, తాగునీటి పథకాలు, చెరువుల అభివృద్ది, మంచిప్ప రిజర్వాయర్ నిర్మాణం, అభివృద్ది కార్యక్రమాలతో ప్రజాసంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తున్నాని తెలిపారు. గంగపుత్రులు చేపల వలలతో బోనాలు తీశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ జగన్, ఎంపీపీ సారికహన్మంత్రెడ్డి, వైస్ ఎంపీపీ కల్లెడ నవీన్‌రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు మహిపాల్ యాదవ్ పాల్గొన్నారు.
మొరం టిప్పర్లను అడ్డుకున్న గ్రామస్తులు
బోధన్,వెలుగు: మండలంలోని ఊట్పల్లిలో మొరం టిప్పర్లను శనివారం స్థానికులు అడ్డుకున్నారు. ఊట్పల్లి నుంచి ప్రతిరోజూ టిప్పర్లతో మొరం తరలించడంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటున్నారని తెలిపారు. రోడ్డుపై ఒకవైపు రైతులు వడ్లను ఆరపోస్తుంటే మరోవైపు టిప్పర్లు అతి వేగంగా వెళ్తున్నాయని చెప్పారు. ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించారు. . ఊట్పల్లి నుంచి మొరం టిప్పర్ల నడుపవద్దని హెచ్చరించినా టిప్పర్లు నడుపుతున్నారని తెలిపారు.
ఇతరులకు సాయం చేయడమే నిజమైన శక్తి
బాన్సువాడ, వెలుగు : ఎన్ని కష్టాలున్నా.. ఇతరులకు సాయం చేయడమే నిజమైన శక్తి అని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గాయత్రి ఆశ్రమంలో సుదర్శన దండి స్వామి చాతుర్మాస దీక్ష పూర్తయిన సందర్భంగా శనివారం సభ ఏర్పాటు చేశారు. ఈ సభకు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా స్పీకర్ కు తులాభార మహోత్సవం నిర్వహించారు. స్పీకర్ పోచారం మాట్లాడుతూ బాన్సువాడ భక్తివాడ గా మారిందని, భక్తి పెరగడంతో పాటు ధర్మం కూడాపెరగాలన్నారు. బీర్కూరు మండలం తిమ్మాపూర్ లోని తెలంగాణ తిరుమల దేవస్థానం గొప్పగా అభివృద్ధి చెందుతుందని స్పీకర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి దంపతులు, సరస్వతి ఆలయ కమిటీ అధ్యక్షులు షంబురెడ్డి సొసైటీ చైర్మన్ కృష్ణారెడ్డి, ఎంపీపీ నీరజ, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు నారాయణరెడ్డి ఉన్నారు.
నెలల నిండకుండా ఆపరేషన్లు చేస్తే చర్యలు
నిజామాబాద్, వెలుగు: నెలలు నిండకముందే ఆపరేషన్లు చేస్తే హాస్పిటల్స్ పై చర్యలు తప్పవని కలెక్టర్ సి నారాయణ రెడ్డి హెచ్చరించారు. కాన్పుల సమగ్ర పరిశీలనకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశామని శనివారం ఓ పత్రికా ప్రకటనలో తెలిపారు. తల్లి గర్భంలో 40 వారాలు పూర్తిగా నిండితేనే.. శిశువులు ఆరోగ్యవంతులు అవుతారని చెప్పారు. జిల్లాలో ఏ ప్రైవేట్ ఆసుపత్రిలో అయినా గర్భిణీకి నెలలు పూర్తిగా నిండకముందే ప్రసవం చేయాల్సి ఉంటే పై అధికారులకు సమాచారం తెలియజేయాల్సి ఉంటుందన్నారు. సాధారణ ప్రసవాల కోసం జిల్లా కేంద్రంలో, ఆర్మూర్ గవర్నమెంట్ హాస్పిటల్ లో గర్భినులకు యోగా, సులభమైన ఎక్సర్సైజ్ లు చేయించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని తెలిపారు..
ఖతార్ జైలు నుంచి ఇంటికి చేరిన ఇద్దరు మహిళలు
నిజామాబాద్ టౌన్, వెలుగు: ఖతర్ దేశానికి వెళ్లి అక్కడ జైల్లో చిక్కుకున్న బాధితులు శనివారం క్షేమంగా ఇంటికి చేరారు. నాగారం కు చెందిన ఆసియా బేగం, షేక్ నసీమా లు పది నెలల క్రితం బతుకుదెరువు కోసం ఖతర్ వెళ్లారు. అక్కడ ఓ ఇంట్లో ఇంటి పనిలో చేరారు. కొన్ని రోజుల తర్వాత పనిలో చేర్చుకున్న వారు జీతం సరిగా ఇవ్వకపోగా వేధింపులకు గురి చేశారు. దీంతో వారు అక్కడి నుంచి పారిపోయి పోలీసులకు చిక్కారు. జైల్లో ఉన్న బాధితుల విషయాన్ని స్థానికులు ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. ఆమె చొరవతో వారు క్షేమంగా ఇంటికి చేరినట్టు తెలిపారు.
నేడు జిల్లాలోకి భారత్ జోడో యాత్ర
కామారెడ్డి , వెలుగు : భారత్ జోడో యాత్ర నేడు జిల్లాలోకి రానున్న సందర్భంగా స్థానిక నాయకులు ఆదివారం ఏర్పాట్లను పరిశీలించారు. రాహుల్ గాంధీ సోమవారం 26 కి.మీ. జిల్లాలో పాదయాత్ర చేస్తారు. సంగారెడ్డి జిల్లా నుంచి ఆదివారం రాత్రి కామారెడ్డి జిల్లాకు రాహుల్‌గాంధీ వస్తారని నాయకులు తెలిపారు. స్టేట్‌లో యాత్ర ముగింపు సందర్భంగా జుక్కల్ నియోజక వర్గంలోని మెనూర్ వద్ద మంగళవారం భారీ బహిరంగ సభ జరగనుంది. పాదయాత్ర ద్వారా రాష్ర్టంలో తన దృష్టికి వచ్చిన సమస్యలు, ఆయా వర్గాలతో మాట్లాడి తెలుసుకున్న ఆంశాలపై రాహుల్‌గాంధీ ఈసభలో వెల్లడించనున్నారు. ఈ సభకు భారీ ఎత్తున నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.
దాశరథికి నివాళి
సిరికొండ,వెలుగు: తెలంగాణ ప్రజల కన్నీళ్లను అగ్నిధారగా మలిచి తొలిదశ ఉద్యమంలో సాహిత్యంతో ప్రజలను చైతన్య పరిచిన రచయిత దాశరథి కృష్ణమాచార్య అని సత్యశోధక్ స్కూల్ ప్రిన్సిపాల్ రావుట్ల నర్సయ్య అన్నారు. హైస్కూల్లో దాశరథి వర్ధంతిని ఆదివారం నిర్వహించారు.చిత్రపటానికి పూలమాలవేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో టీచర్లు లింగం,శంకర్, తదితరులు ఉన్నారు.
కందిపప్పు దొంగల అరెస్ట్
బాల్కొండ వెలుగు: బాల్కొండ మండల కేంద్రంలోని స్టేట్ వేర్‌హౌజ్ కార్పొరేషన్ గోదాముల నుంచి కందిపప్పును దొంగలించిన ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించినట్లు ఆర్మూర్ ఏసీపీ ప్రభాకర్ రావు తెలిపారు. బాల్కొండ పోలీస్ స్టేషన్లో ఆర్మూర్ రూరల్ సీఐ గోవర్ధన్ రెడ్డితో కలిసి శనివారం ప్రెస్ మీట్ లో
మాట్లాడారు. గోదాముల నుంచి 670 తొగరు బస్తాలు చోరీకి గురైనట్లు ఈనెల 1న అందిన కంప్లైంట్ తో రూరల్ సీఐతో పాటు బాల్కొండ ఎస్సై గోపి తన సిబ్బంది తో గాలింపు చేపట్టినట్లు తెలిపారు. చోరీకి పాల్పడ్డ స్థానిక కాలనీకి చెందిన సల్ల భూమన్న, అజాస్ లను పట్టుకొని విచారించగా దొంగతనం చేసినట్లు
ఒప్పుకున్నారని ఏసీపీ తెలిపారు. వారి నుండి 29 బస్తాల కంది పప్పు, రూ. 21వేల నగదు, ఒక ఆటోను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.