రైతు సమస్యలపై బీజేపీ పోరుబాట
నిజామాబాద్, వెలుగు: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై బీజేపీ పోరుబాట చేపట్టింది. మంగళవారం నగరంలోని ధర్నా చౌక్‌లో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు బస్వా లక్ష్మీనర్సయ్య మాట్లాడుతూ రైతులకు శాపంగా మారిన ధరణి పోర్టల్ రద్దు చేయాలని, ఏక కాలంలో రుణమాఫీ చేసి వారిని ఆర్థిక ఇబ్బందుల నుంచి దూరం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం ధరణిని రద్దు చేసే వర కు బీజేపీ ఆధ్వర్యంలో దశల వారీ ఆందోళన చేస్తామని నేతలు స్పష్టం చేశారు. బీజేపీ రాష్ట్రకార్యదర్శి పల్లె గంగారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్‌పాల్ సూర్యనారాయణ, నాయకులు మల్లికార్జున్‌రెడ్డి, వి నయ్రెడ్డి, అల్జాపూర్శ్రీనివాస్, దినేశ్ పాల్గొన్నారు.
కామారెడ్డిలో ధర్నా చేస్తున్న నాయకులు
కామారెడ్డి: రైతు రుణమాఫీ అమలు చేయాలని, ధరణిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ప్రెసిడెంట్ అరుణతార మాట్లాడుతూ ధరణితో రైతులు ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వానికి సోయి రావడంలేదని విమర్శించారు. పేదల భూములు ధరణిలో చిక్కుకున్నాయన్నారు. పాస్ బుక్స్ రాక పేద, మధ్య తరగతి రైతులు చాలా మంది ఇంకా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కిసాన్ మోర్చా జిల్లా ప్రెసిడెంట్ పొతంగల్ కిషన్‌రావు, పార్టీ కామారెడ్డి నియోజకవర్గ ఇన్‌చార్జి కాటిపల్లి వెంకటరమణరెడ్డి, స్టేట్కార్యవర్గ మెంబర్ నీలం చిన్న రాజులు, జిల్లా జనరల్ సెక్రటరీలు మర్రి బాపురెడ్డి, తెలు శ్రీనివాస్, లీడర్లు భరత్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.
డెలివరీలపై దృష్టి పెట్టాలి
బాల్కొండ, వెలుగు: గర్భిణులు గవర్నమెంట్ హాస్పిటల్‌లోనే డెలివరీ అయ్యేలా ఆశావర్కర్లు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డీఎంహెచ్‌వో రమేశ్ సూచించారు. మంగళవారం ఆయన బాల్కొండ గవర్నమెంట్ హాస్పిటల్‌ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆశావర్కర్లతో సమావేశమయ్యారు. హాస్పిటల్‌కు చెకప్‌కు వచ్చిన ప్రత్రి గర్భిణి ఇక్కడే డెలివరీ కావాలని, ఇందుకు ఆశావర్కర్లు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్స్ సిబ్బంది, ఆశావర్కర్లు పాల్గొన్నారు.
ప్రగతి భవన్‌ను ముట్టడిద్దాం: మాజీ మంత్రి షబ్బీర్ అలీ
కామారెడ్డి, వెలుగు: రైతులకు నష్టం కలిగించే కామారెడ్డి మాస్టర్ ప్లాన్‌ను రద్దు చేయకపోతే ప్రగతి భవన్‌ను ముట్టడిద్దామని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత షబ్బీర్‌అలీ పిలుపునిచ్చారు. మంగళవారం కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని అడ్లూర్‌లో కాంగ్రెస్ ఆధ్వర్యంలో రచ్చబండ పోగ్రామ్ నిర్వహించారు. మాస్టర్ ప్లాన్‌తో నష్టపోతున్న ఆయా గ్రామాలకు చెందిన రైతులు అక్కడ ఉండడంతో వారి వద్దకు షబ్బీర్ అలీ వెళ్లి మాట్లాడారు. ప్లాన్ తయారీలో మీ పాత్ర ఏమైనా ఉందా..? అని రైతులు ఆయనను ప్రశ్నించారు. ఇండస్ట్రియల్ జోన్, గ్రీన్ జోన్‌తో పాటు 100 ఫీట్ల రోడ్లతో వందలాది ఎకరాల భూములు నష్టపోతున్నామని వివరించారు. మీ పాత్ర లేకపోతే రైతుల ఉద్యమంలో ఎందుకు పాల్గొనడం లేదని రైతులు ప్రశ్నించారు. ఇందుకు స్పందించిన షబ్బీర్‌అలీ ప్లాన్ తయారీలో తన పాత్ర ఏమి లేదని, తనపై కావాలనే కొందరు ఆరోపణలు చేస్తున్నారని సమాధానం ఇచ్చానన్నారు. తాను కూడా రైతుల ఉద్యమంలో పాల్గొంటానని పేర్కొన్నారు. డీసీసీ ప్రెసిడెంట్ కైలాస్ శ్రీనివాస్‌రావు, పార్టీ మండల, టౌన్ ప్రెసిడెంట్లు గూడెం శ్రీనివాస్‌రెడ్డి, పండ్ల రాజు, లీడర్లు బీమ్‌రెడ్డి, గణేశ్‌నాయక్, సందీప్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.
జీజీహెచ్‌లో సెల్ఫ్ చెకింగ్
ప్రపంచ వ్యాప్తంగా మరో మారు కరోనా విజృంభిస్తున్న నేపథ్యం కేంద్ర ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలపై మాక్ డ్రిల్ నిర్వహించాలని సూచించారు. ఈ క్రమంలో మంగళవారం నిజామాబాద్ జీజీహెచ్‌లో కూడా సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతిమ రాజ్ ఆధ్వర్యంలో సదుపాయాలను చెక్ చేశారు. హాస్పిటల్‌లోని ఆక్సిజన్ ప్లాంట్ పనితీరు, వార్డుల్లో ఆక్సిజన్ పాయింట్ల పరిస్థితి, సిలిండర్ల స్టాక్ పొజిషన్, ఎమర్జెన్సీ వార్డు పరిశీలించారు.
- వెలుగు ఫొటోగ్రాఫర్, నిజామాబాద్
అ‘పూర్వ’ సమ్మేళనం..
నిజామాబాద్‌లోని మాణిక్ భవన్ పాఠశాలకు చెందిన 1970 ఎస్‌ఎస్‌సీ బ్యాచ్ ఓల్డ్ స్టూడెంట్ల గోల్డెన్ జూబ్లీ వేడుకలు హైదరాబాద్‌లో కొంపల్లిలో మంగళవారం ఘనంగా జరిగాయి. దాదాపు 50 మంది పూర్వ విద్యార్థులు తమ కుటుంబాలతో సహా విచ్చేసి ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుని భావోద్వేగానికి గురయ్యారు. సమావేశానికి ముందు మరణించిన తమ బ్యాచ్ సహచరులు, ఉపాధ్యా యులకు ఒక నిమిషం మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. - నిజామాబాద్, వెలుగు
ముందస్తు అరెస్టులు సరికాదు
వర్ని, వెలుగు: పోలీసులు ముందస్తు అరెస్టులు చేయడం సరికాదని పీసీసీ నేత డాక్టర్ కూనిపూర్ రాజిరెడ్డి మండిపడ్డారు. పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో జరిగుతున్న అన్యాయాలను ప్రశ్నిస్తూ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనరెడ్డి మంగళవారం చేపట్టిన చలో ఇందిరా పార్క్ దీక్షకు వెళ్లకుండా వర్ని కాంగ్రెస్ నాయకులను ముందుస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా రాజారెడ్డి మాట్లాడుతూ ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించే తమ గొంతునొక్కడం సరికాదన్నారు. హైకోర్టు చివాట్లు పెట్టి అభ్యర్థలకు న్యాయం చేయాలని చెప్పినా ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. పోలీస్ రిక్రూట్‌మెంట్‌లో సుమారు 50 నుంచి 60 వేల మంది అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, దీనికి టీఆర్‌ఎస్ ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. అరెస్ట్ అయిన వారిలో మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, దయానంద్ ఉన్నారు.
వైభవంగా అయ్యప్ప మండల పూజ
బోధన్, వెలుగు : పట్టణంలోని ఏక చక్రపుర అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం అయ్యప్ప సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో మండల పూజా మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవతో మొదలై అభిషేకం, సహస్ర నామాలు, గణపతి పూజ, పుణ్యాహావచనం, పూర్ణాహుతి నిర్వహించారు. గురుస్వామి జగ్జీవన్, ఆలయ ప్రధాన అర్చకులు సంతోష్ మహరాజ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమంలో శబరిమల యాత్ర 18 ఏళ్లు పూర్తి చేసుకున్నా గురుస్వాములకుఋ షి తుల్య పూజ, అవబృత స్నానం, దండ ప్రధానోత్సవం నిర్వహించారు. మధ్యాహ్నం బీజేపీ నాయకులు మేడపాటి ప్రకాశ్‌రెడ్డితో పాటు మరో ఏడుగురు అయ్యప్ప స్వాములకు బిక్ష ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం అయ్యప్ప సేవా ట్రస్ట్ ప్రతినిధులు శివన్నారాయణ, చక్రవర్తి, కొయ్యాడ శ్రీనివాస్ గౌడ్ పర్యవేక్షణలో జరిగింది. ఆర్డీవో రాజేశ్వర్ దంపతులతో పాటు పలువురు ప్రముఖులు
హాజరయ్యారు.
మౌనిక మరింత ఉన్నతంగా ఎదగాలి: స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి
కామారెడ్డి, వెలుగు: గుడ్ గవర్నెన్స్ డే సందర్భంగా పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జరిగిన యూత్ పార్లమెంట్‌లో మన రాష్ట్రం నుంచి మాట్లాడిన కె.మౌనిక భవిష్యత్‌లో మరింత ఉన్నతంగా ఎదగాలని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆకాంక్షించారు. స్పీకర్ పోచారంతో పాటు మండలి చైర్మన్ గుత్తా సుఖేంధర్‌రెడ్డి, పంజాబ్ స్పీకర్ సర్ధార్ కుల్తార్ సంధ్వాన్ తదితరులు మంగళవారం హైదరాబాద్‌లో మౌనికను సన్మించారు. ఈ సందర్భంగా పోచారం మాట్లాడుతూ తమ ఊరికి చెందిన మౌనిక తెలంగాణ పేరు ప్రతిష్టలను ఢిల్లీకి చాట చెప్పడం అభినందనీయమన్నారు. మౌనిక చదువుకు అయ్యే ఖర్చుతో పాటు సివిల్స్ శిక్షణకు అయ్యే ఖర్చును పూర్తిగా తానే భరిస్తానని స్పీకర్ చెప్పారు.
రిటైర్డ్ ఆర్మీ జవాన్లకు సన్మానం
కోటగిరి (పొతంగల్), వెలుగు: పొతంగల్ మండలం హంగర్గ గ్రామానికి చెందిన జంగం లింగాయప్ప ఆర్మీలో పని చేసి రిటైర్ అయి గ్రామానికి వచ్చిన సందర్భంగా గ్రామస్తులు, మిత్రులు ఆయనను ఘనస్వాగతం పలికారు. పొతంగల్ చెక్ పోస్ట్ నుంచి హంగర్గ గ్రామం వరకు భారీ బైక్ ర్యాలీ తీశారు. ఆయనతో పాటు మండలానికి చెందిన మరో పది మంది రిటైర్డ్ జవాన్ల కూడా హంగర్గ గ్రామస్తులు సన్మానించారు. ఈ సందర్భంగా లింగాయప్ప మాట్లాడుతూ తన 23 ఏళ్ల సర్వీస్‌లో ఎంతో నేర్చుకున్నానని దేశానికి సేవ చేయడం గర్వంగా ఉందన్నారు. హంగర్గ అంటేనే జవాన్ల గ్రామమని 20 మంది వరకు జవాన్లు ఆర్మీలో చేరి దేశ సేవ చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఉజ్జయినీ మహంకాళీ ఆనంద్ సరస్వతీ మహరాజ్, రిటైర్డ్ ఆర్మీ జవాన్లు జంగం సంజుకుమార్, సూదం శంకర్, సయ్యద్ జిలానీ, విశ్వంబర్, నాగరాజు, ఎంఎస్ రావు, నవీన్, హైమద్ పాషా, బాబీ, గురునాథ్, పబ్బ శేఖర్, మానికప్ప, రాజాగౌడ్ పాల్గొన్నారు.