ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం .. కమనీయం

బాన్సువాడ అయ్యప్ప ఆలయంలో సుబ్రహ్మణ్యస్వామి షష్టి వేడుకలు, కల్యాణ మహోత్సవం మంగళవారం ఘనంగా జరిగింది. ముఖ్యఅతిథిగా వచ్చిన కాశి సుదర్శన ఆశ్రమ దండి స్వామిజి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి ఒక్కరు భగవద్గీత చదవాలని, పిల్లలకు చిన్నతనం నుంచే సంస్కారం నేర్పాలని సూచించారు. 15 సంవత్సరాల నుంచి సుబ్రహ్మణ్యస్వామి కల్యాణం నిర్వహిస్తున్నామని, ఈసారి పెద్ద సంఖ్యలో భక్తులు రావడం ఆనందరంగా ఉందన్నారు. ఉదయం సుబ్రహ్మణ్యస్వామి మూలవిరాట్ కు రుద్రాభిషేకం పాలాభిషేకం నిర్వహించారు. శ్రీధర్ గురుస్వామి దంపతుల ఆధ్వర్యంలో ఈ కల్యాణం నిర్వహించారు. 
ఈ కార్యక్రమంలో,బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి మల్యాద్రి రెడ్డి, నాయకులు శంకర్ గౌడ్, గురుస్వాములు మల్లికార్జున్, సాయి రెడ్డి, లక్ష్మీ కాంత్ రెడ్డి, ఆలయ కమిటీ బాధ్యులు పాల్గొన్నారు. 

అర్బన్​ అసెంబ్లీ అభివృద్ధి ఖర్చుపై శ్వేతపత్రం 
పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ గౌడ్

నిజామాబాద్, వెలుగు‌: అర్బన్ అసెంబ్లీ లో రూ. 659 కోట్ల తో జరిగిన అభివృద్ధి ఖర్చుపై శ్వేతపత్రం విడుదల చేయాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బొమ్మ మహేశ్ గౌడ్ డిమాండ్ చేశారు. జిల్లా కాంగ్రెస్ భవన్ లో మంగళవారం ఆయన మీడియా మీటింగ్​ నిర్వహించారు. ఎన్నికలు వస్తున్నాయంటే మాయమాటలతో నమ్మించడం కేసీఆర్ నైజమని,  దేశంలో అత్యంత ధనిక ముఖ్య మంత్రి కేసీఆరే అని అన్నారు.  ఎమ్మెల్సీ గా ఉన్న కవిత మహిళ యూనివర్సిటీ ఎందుకు తేలేక పోయారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్ హయాంలో చేసిన అభివృద్ధి పనులకు సున్నాలు వేసి టీఆర్​ఎస్​  నాయకులు పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. మాజీ మంత్రి రాజారాం ఇచ్చిన స్టేడియానికి కనీసం గోడ కూడా కట్టలేని దుస్థితిలో ఉన్నారా అని ప్రశ్నించారు. కోట్లు పెట్టి కలెక్టరేట్ కడితే వరదల్లో మునిగి పోతోందని ఎద్దేవా చేశారు. ఎన్నికలు వస్తున్నాయనే తప్పుడు లెక్కలు చూపెడుతూ రోడ్లు, చెట్లు, సుందరీకరణ పేరుతో మోసగిస్తున్నారని విమర్శించారు. ధరణి స్కీమ్ తో అమాయక ప్రజలను, రైతులను తీవ్రంగా మోసం చేశారని, పోడు భూముల విషయం లో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లనే ఫారెస్ట్ ఆఫీసర్ మృతి చెందారని ఆరోపించారు. ఈ సమావేశంలో పీసీసీ ప్రధాన కార్యదర్శి గంగాధర్, కార్యదర్శి రాంభూపాల్ పటేల్ ,‌మాజీ అధ్యక్షుడు తాహెర్ , బీసీ సెల్ రాష్ట్ర నాయకుడు శేఖర్ గౌడ్ పాల్గొన్నారు.

నిరుద్యోగ భృతి ఇవ్వాలని  వినతి

నవీపేట్, వెలుగు: ఎన్నికలప్పుడు కేసీఆర్​ ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీని నిలబొట్టుకోవాలని బీజేపీ యువ మోర్చా లీడర్ బానుగౌడ్ డిమాండ్​ చేశారు. ఈమేరకు స్థానిక తహసీల్దార్ వీర్ సింగ్ కు మంగళవారం వినతి పత్రం ఇచ్చారు. భృతి ఇవ్వకుంటే పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మేక రామకృష్ణ, చరణ్ రెడ్డి, ఆనంద్, సందీప్ పాల్గొన్నారు. 

లింగంపేట: నిరుద్యోగులకు జీవన భృతి చెల్లించాలని లింగ పేట తహసీల్దార్​ మారుతికి బీజేవైఎం నాయకులు వినతిపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి అనిల్​ మాట్లాడుతూ ఉద్యోగ నోటిఫికేషన్లు వేయకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, నిరుద్యోగ భృతి హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి వడ్ల రాంచందర్​, లీడర్లు బాస్కర్, రజనీకాంత్​, ఐటీ సెల్​ కన్వీనర్​ నాగరాజ్, రాకేశ్, అంజీ పాల్గొన్నారు. 

ప్రభుత్వానికి అండగా ఉండండి: మంత్రి వేముల ప్రశాంత్​ రెడ్డి 

నిజామాబాద్, వెలుగు: అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తున్న ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉండాలని మంత్రి వేముల ప్రశాత్​ రెడ్డి కోరారు. బాల్కొండ నియోజకవర్గంలో మంగళవారం ఆయన పర్యటించారు. జలాల్పూర్ నుంచి నాగపూర్ ఎక్స్ రోడ్ వరకు రూ. 60 లక్షలతో బీటీ రోడ్డు పనులకు, ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ అదనపు గదులకు శంకుస్థాపనలు చేశారు. బోగరపు వాగుపై రూ. 2.60 కోట్లతో హైలెవల్ బ్రిడ్జి, మెండోరా వద్ద వంతెనను ప్రారంభించారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మాట్లాడారు. పల్లెల ప్రగతికి తమ ప్రభుత్వం ఎనలేని ప్రాధాన్యతనిస్తుందన్నారు. ఇటీవల భారీ వర్షాల వల్ల లోలెవల్ కాజ్ వేలు దెబ్బతిన్నట్టు సీఎం దృష్టికి తీసుకెళ్తే భీంగల్ మండలానికి మూడు హై లెవెల్ బ్రిడ్జిలు మంజూరు చేశారని తెలిపారు. వచ్చే మూడు నెలల్లో పనులు పూర్తి చేస్తామని చెప్పారు నియోజకవర్గ అభివృద్ధి నిధులతో అన్ని కులాల వారికి సంఘ భవనాలు కడుతామని హామీ ఇచ్చారు. కార్యక్రమాల్లో ఆర్మూర్ ఆర్డీఓ శ్రీనివాస్, డీసీసీబీ వైస్ చైర్మన్ రమేశ్​ రెడ్డి, జడ్పి కోఆప్షన్ సభ్యుడు మొయీజ్ పాల్గొన్నారు. 

వచ్చే ఎన్నికల్లో కేసీఆర్​ కుటుంబం ఇంటికే..


రానున్న ఎన్నికల్లో కేసీఆర్​ కుటుంబాన్ని ఇంటికి పంపిస్తామని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. చలో బైంసా సభకు ఆయన ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా ఆఫీస్ నుంచి బీజేపీ శ్రేణులు తరలివెళ్లారు.   ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. అవినీతి, కుటుంబపాలన ను ప్రజలు గద్దె దించుతారని అన్నారు. రాష్ట్రం లో శాంతి భద్రతలు క్షీణించాయని, బండి సంజయ్ పాదయాత్రకు ఆటంకాలు సృష్టించాలని ప్రభుత్వం కక్ష గట్టిందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ల లక్ష్మీ నారాయణ, ప్రధాన కార్యదర్శులు పోతన్కర్ లక్ష్మీ నారాయణ, పుట్ట వీరేందర్, ఇల్లేందుల ప్రభాకర్, పంచరెడ్డి శ్రీదర్, అమంద్ విజయ్, ఆనంద్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

రోడ్ల నిర్మాణానికి రూ.34 కోట్లు: ప్రభుత్వ విప్ గంప గోవర్దన్​ 

నియోజక వర్గంలో బీటీ రోడ్లు వేసేందుకు సీఎం స్పెషల్​ డెవలప్​ ​మెంట్​ ఫండ్స్​ నుంచి రూ.34.2 కోట్లు శాంక్షన్​అయినట్టు ప్రభుత్వ విప్ గంప గోవర్దన్​ తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ రోడ్ల అభివృద్ధి పనులు త్వరలోనే మొదలుపెడతామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ ఆకాడమీ చైర్మన్​ ముజీబుద్దీన్, ఎంపీపీ ఆంజనేయులు, జడ్పీటీసీ మినుకూరి రాంరెడ్డి, లీడర్లు బల్వంత్​రావు, ఆంజనేయులు పాల్గొన్నారు.