ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

  • అట్టహాసంగా అథ్లెటిక్స్ పోటీలు
  • వరంగల్ జేఎన్ఎస్ స్టేడియంలో ప్రారంభమైన స్టేట్ చాంపియన్ షిప్ ఈవెంట్స్
  • జిల్లాల నుంచి తరలివచ్చిన క్రీడాకారులు


హనుమకొండ, వెలుగు: తెలంగాణ స్టేట్ 8వ జూనియర్​ అథ్లెటిక్స్​ ఛాంపియన్​ షిప్​-2022 పోటీలు శనివారం హనుమకొండలోని జవహర్​ లాల్​ నెహ్రూ స్టేడియంలో ప్రారంభయ్యాయి. ప్రభుత్వ చీఫ్​ విప్​ దాస్యం వినయ్ భాస్కర్​, వరంగల్ సీపీ డా.తరుణ్​ జోషి, అథ్లెటిక్స్​ అసోసియేషన్​ ప్రతినిధులు చీఫ్​ గెస్టులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. బాలురు, బాలికలకు సెపరేట్​ గా అండర్​ 14, 16, 18, 20 విభాగాల్లో వివిధ పోటీలు నిర్వహించారు. ముందుగా అండర్​ 14 బాలుర 60 మీ పరుగు పందెం నిర్వహించగా.. ఖమ్మం జిల్లాకు చెందిన పెండ్ర వికాస్ 7.13 సెకన్లలోనే లక్ష్యాన్ని ఛేదించాడు. ఆ తరువాత భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన బి.లోకేశ్ 7.28 సెకన్లు​, జరుపుల దీక్షిత్ 7.34 సెకన్లలో  పరుగును పూర్తి చేసి పతకాలు సాధించారు. ఆ తరువాత  హైజంప్​ లో ఆదిలాబాద్​కు చెందిన మడావి సోము, యాదాద్రి భువనగిరికి చెందిన పి.హతిరామ్​, రంగారెడ్డికి చెందిన కె.శివకుమార్​ మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. లాంగ్​ జంప్ లో నల్గొండకు చెందిన కే.అజయ్​ కుమార్​, హైదరాబాద్​కు చెందిన జి.లలిత్​, ఆదిలాబాద్​కు చెందిన మడావి సోము పతకాలు సాధించారు. అనంతరం  షార్ట్​ పుట్​, జావెలిన్​ త్రో పోటీలు, అండర్​​ 16 బాయ్స్​కు 100 మీ, 300 మీ, 5 కి.మీ, డిస్క్​ త్రో, హై జంప్​, లాంగ్​ జంప్​ షార్ట్​ పుట్​ పోటీలు కొనసాగాయి. ఆ తరువాత అండర్​ 18, 20 విభాగాల విద్యార్థులకు కూడా పోటీలు కొనసాగాయి. ఆయా పోటీల్లో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి గోల్డ్, సిల్వర్​, బ్రాంజ్​ మెడల్స్​ ప్రకటించినట్లు తెలంగాణ అథ్లెటిక్స్​ అసోసియేషన్​ సెక్రటరీ సారంగపాణి తెలిపారు. రెండు రోజుల పాటు జరగనున్న ఈ పోటీలు ఆదివారం ముగియనున్నాయి.

క్రీడాకారులను ప్రోత్సహించడమే లక్ష్యం..
–చీఫ్​ విప్​ దాస్యం వినయ్​ భాస్కర్​

రాష్ట్రంలో టీఆర్​ఎస్​ ప్రభుత్వం క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకుంటోందని ప్రభుత్వ చీఫ్ విప్​ దాస్యం వినయ్​ భాస్కర్​ అన్నారు. హైదరాబాద్ తర్వాత వరంగల్ నగరం అన్ని రంగాల్లో  అభివృద్ధి చెందుతోందని,  జాతీయ, అంతర్జాతీయ క్రీడలు ఇక్కడ నిర్వహించడం అభినందనీయమన్నారు. ఇక్కడి క్రీడాకారులకు, అథ్లెట్​ కిట్స్​ కోసం  తన నెలవారీ వేతనం నుంచి రూ.1.16 లక్షలను అందిస్తానని హామీ ఇచ్చారు.  వరంగల్ సీపీ డా.తరుణ్ జోషి మాట్లాడుతూ  గెలుపే  లక్ష్యంగా కృషి చేయాలని,  ఓటమితో నిరుత్సాహ పడకూడదన్నారు.  కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ అజీజ్ ఖాన్ , తెలంగాణ అథ్లెట్స్​ అసోసియేషన్​ రాష్ట్ర కార్యదర్శి సారంగపాణి, హనుమకొండ  జిల్లా  అధ్యక్షుడు  ఎర్రబెల్లి వరదరాజేశ్వర్ రావు, ములుగు జిల్లా అధ్యక్షుడు రాజిరెడ్డి, మెదక్ జిల్లా అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షుడు కుమార్, స్పోర్ట్స్ మీట్ కన్వీనర్ ఐలి చంద్రమోహన్, వివిధ విభాగాల కోచ్ లు వెంకటేశ్వర రెడ్డి, యుగేందర్ రెడ్డి , పవన్ కుమార్, కైలాస్ యాదవ్ , రమేశ్ రెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

  • సర్కారు జాగలో ఇండ్ల ధ్వంసం
  • అడ్డుకున్న పేదలు.. బలవంతంగా తరలింపు

మహబూబాబాద్ అర్బన్, వెలుగు: మహబూబాబాద్ కలెక్టరేట్ సమీపంలోని ప్రభుత్వ భూమిలో రెండేండ్ల కింద పేదలు నిర్మించుకున్న ఇండ్లు, గుడిసెలను ఆఫీసర్లు ధ్వంసం చేశారు. రెవెన్యూ, మున్సిపల్, పోలీసులు శనివారం తెల్లవారుజామునే వచ్చి జేసీబీలు, డోజర్లతో తొలగించారు. అడ్డుకున్న పేదల్ని అదుపులోకి తీసుకున్నారు. కొందరిని బెదిరించి, ఇండ్లలోకి చొరబడి సామాన్లు బయటవేశారు. అక్కడ ఉన్న కరెంట్ తీగలను కూడా తొలగించారు. ఈ సందర్భంగా పేదలు మాట్లాడుతూ.. ఇండ్లు లేక ప్రభుత్వ జాగలో చిన్న చిన్న ఇండ్లు, గుడిసెలు వేసుకొని బతుకుతుంటే.. ధ్వంసం చేయడం అన్యాయమన్నారు. ప్రత్యామ్నాయంగా ఎలాంటి ఇండ్లు ఇవ్వకుండా, సౌలతులు కల్పించకుండా ఇండ్లు కూలగొట్టడం సరికాదన్నారు. రూపాయి రూపాయి కూడబెట్టుకుని కట్టుకున్న ఇండ్లను కూల్చేశారని కంటతడిపెట్టారు.

పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయండి

మహబూబాబాద్, వెలుగు: మహబూబాబాద్ జిల్లాలో పత్తి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ శశాంక ఆఫీసర్లను ఆదేశించారు. శనివారం సాయంత్రం కలెక్టరేట్ లో ఆయన రివ్యూ నిర్వహించారు. ఈ సీజన్​లో జిల్లా వ్యాప్తంగా 91,385 ఎకరాల్లో పత్తి సాగు నమోదైందన్నారు. సుమారు 7.31లక్షల క్వింటాళ్ల పత్తి దిగుబడి అంచనా వేశామన్నారు. తేమ శాతం 8 ఉంటే క్వింటాలుకు రూ.6,380 కనీస మద్దతు ధర ఉంటుందన్నారు. వచ్చే నెల మొదటి వారంలో కొనుగోళ్లు ప్రారంభించాలని ఆదేశించారు. మాయిశ్చర్, వెయింగ్ మెషిన్లు రెడీ చేసుకోవాలన్నారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ఫైర్ ఆఫీసర్లు చర్యలు తీసుకోవాలన్నారు.

  • ఒంటరి మహిళలను బెదిరించి..  బంగారు నగల చోరీ
  • చైన్ స్నాచింగ్ కు పాల్పడుతున్న వ్యక్తి అరెస్ట్
  • పరారీలో మరో ఏడుగురు నిందితులు

వరంగల్‍, వెలుగు: ఒంటరిగా వెళ్లే మహిళలను బెదిరించి, బంగారం దొంగతనాలు చేస్తున్న అంతర్రాష్ట దోపిడీ ముఠా సభ్యుడిని వరంగల్‍ పోలీసులు అరెస్ట్ చేశారు. వరంగల్‍ కమిషనర్‍ తరుణ్‍జోషి కథనం ప్రకారం.. ఉత్తరప్రదేశ్‍ రాష్ట్రం బదాయున్‍ జిల్లాకు చెందిన ఫర్మాన్‍ఖాన్‍(22) ముంబైలో పండ్ల వ్యాపారం చేసేవాడు. జల్సాలకు ఆదాయం సరిపోకపోవడంతో స్థానికంగా ఉండే మరో నిందితునితో కలిసి ట్రాక్టర్‍ బ్యాటరీల చోరీలకు అలవాటు పడ్డాడు. ఓసారి పోలీసులు అరెస్ట్ చేయడంతో జైల్‍కు వెళ్లాడు. జైల్‍ నుంచి రిలీజ్‍ అయ్యాక తోటి నిందితుడు తారీఫ్‍ సూచన మేరకు వరంగల్‍ రెడ్డిపాలెంలో నివాసముంటూ.. మరో వ్యక్తి సోనుసింగ్‍ టీంతో జత కట్టాడు. సోనూసింగ్‍ తో కలిసి చైన్ స్నాచింగ్ లకు పాల్పడ్డాడు. గత నెల 23న జనగామ జిల్లా లింగాల ఘన్‍పూర్‍ పోలీస్‍ స్టేషన్‍ పరిధిలోని నెల్లుట్ల గ్రామంలో ఓ మహిళ ఇంట్లోకి చొరబడ్డారు. ఆమెను చంపుతామని బెదిరించి బీరువాలో ఉన్న 250 గ్రాముల బంగారు అభరణాలు, రూ.70వేల నగదు, ఏటీఎం కార్డులు చోరీ చేశారు. ఏపీలోని ఆందోని, నారాయణపేటల్లో సైతం దొంగతనాలు చేశారు. క్రైమ్స్ అడిషనల్‍ డీసీపీ పుష్పారెడ్డి ఆదేశానుసారం సీసీఎస్‍, లింగాల ఘన్‍పూర్‍ పోలీసులు నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. శనివారం ఉదయం వరంగల్‍ రెల్వే స్టేషన్​లో తనిఖీ చేస్తుండగా ఫర్మాన్‍ఖాన్‍ వారిని చూసి పారిపోయే ప్రయత్నం చేశాడు. అతన్ని వెంబడించి, అరెస్ట్ చేసి విచారించగా దోపిడీలకు పాల్పడ్డ విషయాన్ని అంగీకరించాడు. నిందితుని నుంచి 60 గ్రాముల బంగారు అభరణాలు, రెండు సెల్‍ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మిగతా ఏడుగురు సభ్యుల ముఠా పరారీలో ఉన్నారు.

న్యాయం చేయాలని సీపీ కాళ్ల మీద పడ్డ మహిళ..

హనుమకొండ: ‘నా భర్త నన్ను ఇబ్బంది పెడుతున్నడు సార్. చెప్పులతో కొట్టి హింసిస్తున్నడు. చంపుతానని బెదిరిస్తున్నడు. సుబేదారి, విమెన్​ పోలీస్​ స్టేషన్లకు పోతే ఎవరూ పట్టించుకుంటలేరు. మీరైనా న్యాయం చేయండి సార్​’ అంటూ ఓ మహిళ వరంగల్ సీపీ డా.తరుణ్​ జోషి కాళ్ల మీద పడింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. హనుమకొండ జవహర్​ లాల్​ నెహ్రూ స్టేడియంలో నిర్వహిస్తున్న స్టేట్​ జూనియర్​ అథ్లెటిక్స్​ ఛాంపియన్​ షిప్ పోటీలను ప్రారంభించేందుకు చీఫ్​ గెస్ట్ గా ప్రభుత్వ చీఫ్​ విప్​ దాస్యం వినయ్​ భాస్కర్​, వరంగల్ సీపీ డా.తరుణ్​ జోషి శనివారం హాజరయ్యారు. సీపీ  స్టేజ్ పై ప్రసంగిస్తుండగా.. అక్కడున్న కాళేశ్వరి అనే మహిళ  సీపీ కాళ్లను పట్టుకుని బోరున విలపించింది. వరంగల్ ధర్మరానికి చెందిన తాను భర్త సతీశ్​ కుమార్​, ముగ్గురు పిల్లలతో కలిసి హంటర్​ రోడ్డులో ఉంటున్నట్లు తెలిపింది. ఇతర మహిళలతో సతీశ్​ కుమార్ ఎఫైర్స్​ పెట్టుకొని..  తనను వేధింపులకు గురి చేస్తున్నాడని, చెప్పులతో ఇష్టమొచ్చినట్లు కొడుతున్నాడని పేర్కొంది. పోలీసులకు చెప్తే పట్టించుకోవడం లేదని చెప్పింది. దీంతో న్యాయం చేస్తామని సీపీ, చీఫ్ విప్ హామీ ఇచ్చారు.

దొరికిన జ్యూవెలరీ షాప్​ దొంగలు..

ఏటూరునాగారం: ములుగు జిల్లా మంగపేట మండలకేంద్రంలోని శ్రీలక్ష్మీ జ్యూవెలరీ షాప్​లో గత నెల 13న దొంగతనానికి పాల్పడ్డ ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. శనివారం ఏఎస్పీ అశోక్​కుమార్ ఈ కేసు వివరాలు తెలియజేశారు. షాప్ ఓనర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుల కదలికలపై నిఘా పెట్టారు. మండలంలోని కమలాపూర్ శివారులోని హనుమాన్ టెంపుల్ వద్ద నిందితులు ఉన్నారని సమాచారం రాగా ఎస్సై తాహార్ బాబా వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 7 కేజీల వెండి, 4తులాల బంగారం స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిలో ఇద్దరు మైనర్లు కాగా.. వారిని వరంగల్ జువైనల్ కోర్టుకు తరలించారు. మేజర్ ​అయిన నిమ్మల వినయ్ ని రిమాండ్ కు పంపారు. వినయ్​ఇప్పటికే 8 కేసుల్లో నిందితుడని ఏఎస్పీ తెలిపారు. కేసును ఛేదించిన మంగపేట పోలీసులను అభినందించారు.

ఘనంగా కుమ్రం భీం జయంతి

ఏటూరునాగారం, వెలుగు: కుమ్రం భీం జయంతిని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా శనివారం ఘనంగా నిర్వహించారు. వివిధ సంఘాల నేతలు, పార్టీల నాయకులు కుమ్రంభీం చిత్రపటాలకు, విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కాల్వపల్లిలో  ఎమ్మెల్యే సీతక్క  కుమ్రం భీం విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ.. జల్, జంగల్, జమీన్​కోసం పోరాడిన కుమ్రం భీం.. ఆదివాసీ గిరిజనులందరికీ స్ఫూర్తిగా నిలుస్తారని తెలిపారు. సమస్యల పరిష్కారానికి పోరాటమే సరైన మార్గమని, అదే ప్రజలను విముక్తి చేస్తుందని నమ్మిన నాయకుడు కుమ్రం భీం అని గుర్తు చేశారు.

ముత్యంధారలో మునిగి వ్యక్తి మృతి

కాజీపేట, వెంకటాపూర్, వెలుగు: ములుగు జిల్లా వెంకటాపురం మండలం వీరభద్రవరం సమీపంలోని ముత్యంధార జలపాతంలో మునిగి ఒకరు చనిపోయారు. పోలీసుల వివరాల ప్రకారం.. కాజీపేట మండలం సోమిడి గ్రామానికి చెందిన మదనపురి హరి.. శనివారం ఫ్రెండ్స్ తో కలిసి వాటర్ ఫాల్ వద్దకు వెళ్లాడు. నీటిలో గల్లంతై మృతి చెందాడు.

అత్తింటి వేధింపులతో కోడలు ఆత్మహత్య

జనగామ అర్బన్, వెలుగు: అత్తింటి వేధింపులతో కోడలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ పట్టణంలో జరిగింది. జిల్లాలోని లింగాలఘనపురం మండలం వనపర్తికి చెందిన చిలుకూరి మానస(25)ను ఈ ఏడాది ఫిబ్రవరిలో జనగామ టౌన్​కు చెందిన న్యాయం సందీప్ రెడ్డి ఇచ్చి పెండ్లి చేశారు. కొన్నిరోజుల తర్వాత అదనపు కట్నం కోసం భర్తతో పాటు అత్త ధనలక్ష్మి వేధించింది. దీంతో మానస పాయిజన్ తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలు ప్రస్తుతం మూడు నెలల గర్భవతి కావడంతో.. మానస కుటుంబసభ్యలు తీవ్రంగా రోదించారు.

బైక్ అదుపుతప్పి వ్యక్తి మృతి!

ములుగు(గోవిందరావుపేట), వెలుగు: మూడు నెలల్లో బిడ్డ పెండ్లి.. అంతలోనే ఆ తండ్రిని మృత్యువు కబలించింది. వివరాల్లోకి వెళితే.. ములుగు మండలం చిన్నగుంటూరుపల్లికి చెందిన సపావట్ బాలాజీ(49) ములుగు మార్కెట్ సమీపంలో ఓ క్యాంటీన్ నడిపిస్తున్నాడు. ఆయనకు భార్య సమ్మక్క, ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు ఉన్నారు. భార్య సమ్మక్క తాడ్వాయి మండలం మేడారంలో ఉంటూ కిరాణా షాప్​నడిపిస్తోంది. శుక్రవారం రాత్రి బాలాజీ తన క్యాంటీన్ ను మూసివేసి, మేడారం బయలుదేరాడు. గోవిందరావుపేట మండలం ప్రాజెక్టు సమీపంలో బైక్ అదుపుతప్పి కింద పడి చనిపోయాడు. తీవ్ర గాయాలు కావడంతో స్పాట్​లో చనిపోయాడు. గుంతల రోడ్ల వల్లే బాలాజీ చనిపోయినట్లు బంధువులు ఆరోపిస్తున్నారు.

ఏకశిలలో ఇన్​ఫెక్షన్​ ప్రివెన్షన్ వీక్​

హన్మకొండ సిటీ, వెలుగు: హనుమకొండలోని ఏకశిల హాస్పిటల్స్​లో శనివారం ‘ఇంటర్నేషనల్‍ ఇన్‍ఫెక్షన్‍ ప్రివెన్షన్‍ వీక్​–-2022’ నిర్వహించారు. చీఫ్ గెస్టులుగా  డీఎంహెచ్‍ఓ సాంబశివరావు, హాస్పిటల్స్ చైర్మన్ కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హాస్పిటల్స్ లో ఇన్‍ఫెక్షన్‍ కేసులు తగ్గించి బాధితులకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా జిల్లాలో అవగాహన కార్యక్రమాలు  నిర్వహిస్తున్నట్లు చెప్పారు. వైద్యరంగంలో ఎంతో ముఖ్యమైన  ఇన్​ఫెక్షన్​ అవేర్ నెస్ ప్రోగ్రాం మొట్టమొదటిసారిగా ఏకశిల హాస్పిటల్​లో నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో హాస్పిటల్స్ ఎండీ డాక్టర్‍ రమేశ్, డైరెక్టర్‍ డాక్టర్‍ సంధ్యారాణి, సిబ్బంది పాల్గొన్నారు.

ఉద్రిక్తంగా మారిన వంటావార్పు

హసన్​పర్తి, వెలుగు: కాకతీయ యూనివర్సిటీలో నెలకొన్న సమస్యలు, విద్యార్థుల ఇబ్బందులపై ఏబీవీపీ లీడర్లు నాలుగు రోజులు వివిధ రూపాల్లో నిరసనలు తెలుపుతున్నారు. శనివారం కేయూ ముందు వంటా వార్పు చేస్తుండగా.. పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు ఏబీవీపీ లీడర్ల చొక్కాలు పట్టుకుని, ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్​కు తరలించారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. యూనివర్సిటీలో అడ్మిషన్ పొందిన విద్యార్థులందరికీ హాస్టల్ వసతి కల్పించాలని, పెంచిన ఫీజులు తగ్గించాలని, అడ్మిషన్ రెన్యూవల్, స్పెషల్ ఫీజులను రద్దు చేయాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు.

తొర్రూరు పీఎస్ లో బ్లడ్ డొనేషన్ క్యాంప్

తొర్రూరు, వెలుగు: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పోలీస్ స్టేషన్ లో శనివారం మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించారు. చీఫ్ గెస్టుగా ఎస్పీ శరత్ హాజరై ప్రోగ్రాంను ప్రారంభించారు. ఆరోగ్యంగా ఉన్నవాళ్లంతా రక్తందానం చేయవచ్చని, ప్రజలు ఎలాంటి అపోహలకు గురికావొద్దన్నారు. పోలీసు అమరవీరుల త్యాగాలను ప్రతిఒక్కరూ స్మరించుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎస్పీ రఘు, సీఐ సత్యనారాయణ, ఎస్సై సతీశ్, పీఏసీఎస్ చైర్మన్ హరిప్రసాద్ రావు తదితరులున్నారు.