ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాచలం, వెలుగు : 

అర్చకుల వేదఘోష నడుమ జానకీరాముడు హంసాలంకృత వాహనంపై ఆదివారం రాత్రి గోదావరిలో జలవిహారం చేశాడు. ఉదయం గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి రామయ్యకు గర్భగుడిలో పంచామృతాలు, విశేష నదీజలాలతో అభిషేకం, స్నపన తిరుమంజనం జరిగాయి.  ధనుర్మాసం సందర్భంగా గోదాదేవి తిరుప్పావై పాశురాల పారాయణం జరిగింది. చతుర్వేద పారాయణాలు, నాళాయర దివ్య ప్రబంధ పారాయణం చేశారు. తిరుమంగై ఆళ్వార్  పరమపదోత్సవాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. సాయంత్రం దర్బారు సేవ నిర్వహించాక ఊరేగింపుగా గోదావరి నదీ తీరానికి బయలుదేరారు.  దారి పొడవునా కోలాటాలు, రామనామ భజనలు, మేళతాళాలతో స్వామికి స్వాగతం పలుకుతూ ఊరేగింపు జరిగింది. అందంగా అలంకరించిన పల్లకిలో హంస వాహనంపైకి చేరుకున్నారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, వేదపఠనం పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఆస్థాన విద్వాంసులతో సంగీత కచేరీ, నాదస్వరం జరిగాయి. వేదమంత్రోచ్ఛారణల నడుమ ఐదుసార్లు హంస వాహనంలో స్వామి విహరించారు. ఈ మనోహర దృశ్యాన్ని చూసి భక్తులు తన్మయం చెందారు. పటాకులు కాల్చారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, కలెక్టర్ అనుదీప్  దురిశెట్టి, ఎస్పీ వినీత్, ఓఎస్డీ సాయిమనోహర్, ఏఎస్పీ రోహిత్​రాజ్, ఆర్డీవో రత్న కల్యాణి, దేవస్థానం ఈవో శివాజీ తదితరులు పాల్గొన్నారు.

పోటెత్తిన భక్తులు

తెప్పోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి భారీగా భక్తులు వచ్చారు. భద్రాచలం బస్టాండ్​ నుంచి కరకట్ట మీదుగా రామాలయం నుంచి రాజవీధి, చప్టా దిగువ మీదుగా భక్తులు గోదావరి తీరానికి చేరుకున్నారు. తెప్పోత్సవానికి వచ్చిన భక్తులు స్వామి దర్శనం కోసం బారులు తీరడంతో క్యూలైన్లు కిటకిటలాడాయి. 2 వేల మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. గోదావరి తీరంలో నాటు పడవలు, గజ ఈతగాళ్లతో గస్తీ నిర్వహించారు.  

పట్టువస్త్రాల సమర్పణ

ముక్కోటి ఉత్సవాలకు రెవెన్యూ శాఖ తరపున శ్రీసీతారామచంద్రస్వామికి పట్టు వస్త్రాలను సమర్పించారు. తహసీల్దార్​ శ్రీనివాస్​యాదవ్​ చేతుల మీదుగా ఈవో శివాజీ పట్టు వస్త్రాలు అందుకున్నారు. 

నేడు ఉత్తర ద్వార దర్శనం

భద్రాద్రిలో సోమవారం ఉత్తర ద్వారం నుంచి లక్ష్మణ సమేత సీతారాములు దర్శనం ఇవ్వనున్నారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి ఒంటి గంట వరకు సుప్రభాత సేవ, ఆరాధన, ఏకాంత సేవ, ఒంటి గంట నుంచి 2:30 వరకు మూలవర్లకు విశేష స్నపన తిరుమంజనం, 2:30 నుంచి 3:30 వరకు అలంకరణ, బాలభోగం నివేదన, తిరుప్పావై సేవాకాలం, 3:45 భక్తులకు మూలవరుల దర్శనం, 5 గంటలకు ఉత్సవమూర్తులు వైకుంఠ ద్వారం వద్దకు వేంచేయుట, 4:40 నుంచి 5 గంటల వరకు ద్వార దర్శన ప్రాశస్త్యంపై ప్రవచనం, 5 గంటల నుంచి 6 గంటల వరకు శ్రీ వైకుంఠ ద్వారం తెరుచుట, 6 గంటల నుంచి స్వామివారి ఉత్తర ద్వారం నుంచి తిరువీధి సేవకు బయలుదేరే కార్యక్రమాలను చేపట్టనున్నారు.  

నామా సేవా సమితి క్యాలెండర్ ఆవిష్కరణ

ఖమ్మం, వెలుగు: ప్రజా సేవలో నామా సేవా సమితి భాగస్వామ్యం మరింత పెరగాలని బీఆర్ఎస్  లోక్ సభాపక్ష నేత, ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. నామా సేవా సమితి ఆధ్వర్యంలో రూపొందించిన న్యూ ఇయర్​ క్యాలెండర్ ను ఆదివారం రిలీజ్​ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలు ఎక్కడుంటే అక్కడికి చేరుకొని సేవలు అందించాలని సూచించారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, సీఎం కేసీఆర్ కు అండగా నిలవాలన్నారు. రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, నామా సేవా సమితి నాయకులు పాల్వంచ రాజేశ్, చీకటి రాంబాబు, రేగళ్ల కృష్ణప్రసాద్, ఎం భార్గవ్, దేవభక్తిని నవీన్, జిల్లపల్లి ఉపేందర్, శ్రీకాంత్, రాజు, సాయి పాల్గొన్నారు.

సమస్యల పరిష్కారం కోసమే వాడవాడలా పువ్వాడ 

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: స్థానిక సమస్యలను వెంటనే పరిష్కరించేందుకు వాడవాడలా పువ్వాడ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి పువ్వాడ​అజయ్ కుమార్​ తెలిపారు. ఆదివారం ఖమ్మం నగరంలోని 17, 27వ డివిజన్ల పరిధిలోని​శ్రీనివాసనగర్​లో ఇంటింటికీ వెళ్లి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా కాలనీకి వచ్చిన మంత్రికి మహిళలు, కాలనీవాసులు సాదరంగా స్వాగతం పలికారు. విద్యుత్, తాగు నీరు, రోడ్డు పక్కనే ఉన్న గుంతలను పూడ్చి వేయాలని, డ్రైనేజీలు నిర్మించాలని, పెన్షన్లు మంజూరు చేయాలని కాలనీవాసులు మంత్రిని కోరారు. సమస్యలను అధికారులకు వివరించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమం చేపట్టానని తెలిపారు.


హెచ్ఎంలకు డీడీవో అధికారం ఇవ్వాలి

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కన్వర్టెడ్ ఆశ్రమ స్కూల్స్ లో పని చేస్తున్న హెచ్ఎంలకు డీడీవో అధికారాలు ఇవ్వాలని పీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు డి వెంకటేశ్వరావు డిమాండ్ చేశారు. ఆదివారం మండలంలోని లక్ష్మీదేవిపల్లిలో పీఆర్టీయూ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. టీచర్లకు ప్రమోషన్లు కల్పించాలని కోరారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు పౌష్ఠికాహారం అందించేందుకు జారీ చేసిన 56 జీవోను అమలు చేయాలన్నారు. గిరిజన సంక్షేమ శాఖలో రెగ్యులర్  పోస్టులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర బాధ్యులు దేవ్​సింగ్, సైదులు, నరసయ్య,హెచ్ఎం రామచంద్రయ్య, టీచర్లు సారమ్మ, బాలు, కిషన్, నాగులు, హీరాలాల్  పాల్గొన్నారు.

బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలి

సుజాతనగర్, వెలుగు: బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేశ్  డిమాండ్​ చేశారు.  విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్ తో ఆదివారం కొత్తగూడెం బస్టాండ్ వద్ద సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దామాషా ప్రకారం బీసీలకు రిజర్వేషన్లు పెంచాల్సిన అవసరం ఉందన్నారు. బీసీ కులగణన చేపట్టి రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు.75 ఏండ్లుగా బీసీలకు అన్యాయం జరుగుతుందని అన్నారు. రాష్ట్ర బడ్జెట్ లో బీసీలకు 50 శాతం నిధులు కేటాయించాలని డిమాండ్​ చేశారు. బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్ గౌడ్, జిల్లా ఇన్​చార్జి గంధం మల్లికార్జున్ రావు, పట్టణ అధ్యక్షుడు బాపనపల్లి కల్యాణ్ పాల్గొన్నారు.