IND vs ENG: ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బట్లర్ కాదు.. కన్ఫర్మ్ చేసిన హెడ్ కోచ్ మెకల్లమ్

IND vs ENG: ఇంగ్లాండ్ వికెట్ కీపర్ బట్లర్ కాదు.. కన్ఫర్మ్ చేసిన హెడ్ కోచ్ మెకల్లమ్

భారత్ తో జరగనున్న టీ20 సిరీస్ కు ఇంగ్లాండ్ వికెట్ కీపింగ్ బాధ్యతలకు బట్లర్ దూరంగా ఉండనున్నాడు. సోమవారం (జనవరి 20)  ఇంగ్లండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ అధికారికంగా ప్రకటించాడు. ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు కెప్టెన్ బట్లర్ మీద పని భారం తగ్గించడానికే వికెట్ కీపింగ్ నుంచి దూరంగా ఉంచినట్టు తెలుస్తుంది. బట్లర్ కూడా వికెట్ కీపింగ్ పై ఆసక్తి చూపంచలేదని మెకల్లమ్ అన్నాడు. ఫీల్డింగ్ సమయంలో బౌలర్‌తో తనకు అవసరమైనప్పుడు మాట్లాడాలని బట్లర్‌ భావిస్తున్నట్లు మెకల్లమ్ తెలిపాడు.

ఇంగ్లాండ్ జట్టు వైట్ బాల్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్న బట్లర్.. కెప్టెన్ గా, ఓపెనర్ గా సేవలను అందిస్తూ జట్టును ముందు నడిపిస్తున్నాడు. అయితే భారత్ తో టీ20 సిరీస్ కు మాత్రం బట్లర్ వికెట్ కీపింగ్ కు దూరం కానున్నాడు. ఫిల్ సాల్ట్, జామీ స్మిత్ రూపంలో ఇంగ్లాండ్ కు ఇద్దరు బ్యాకప్ వికెట్ కీపర్లు ఉన్నారు. వీరిద్దరిలో ఒకరు వికెట్ కీపింగ్ బాధ్యతలు చేపట్టనున్నారు. సాల్ట్ తో కలిసి బట్లర్ ఇన్నింగ్స్ ఆరంభిస్తాడు కాబట్టి స్మిత్ వికెట్ కీపర్ గా అవకాశం దక్కొచ్చు. 

బట్లర్ సారధ్యంలోని ఇంగ్లాండ్ జట్టు పటిష్టంగా కనిపిస్తుంది. సిరీస్ గెలిచి భారత్ కు షాక్ ఇవ్వాలని గట్టి ప్రయత్నాలు చేస్తుంది. మూడు టీ20 మ్యాచ్ ల సిరీస్ లో భాగంగా తొలి టీ20 బుధవారం (జనవరి 22) ప్రారంభం కానుంది. కోల్ కతా లోని ఈడెన్ గార్డెన్స్ ఈ మ్యాచ్ కు ఆతిధ్యమివ్వనుంది. ఇప్పటికే ఇరు జట్లు ఈడెన్ గార్డెన్స్ లో ప్రాక్టీస్ ప్రారంభించేసాయి. భారత కాలమాన ప్రకారం మూడు టీ20 మ్యాచ్ లు సాయంత్రం 7 గంటలకు ప్రారంభం కానున్నాయి.