IND vs ENG: భయపడేది లేదు..నలుగురు స్పిన్నర్లతో ఆడతాం: ఇంగ్లాండ్ కోచ్

IND vs ENG: భయపడేది లేదు..నలుగురు స్పిన్నర్లతో ఆడతాం: ఇంగ్లాండ్ కోచ్

హైదరాబాద్ వేదికగా ఉప్పల్ స్టేడియంలో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓడిపోవడంతో ఇంగ్లాండ్ కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. మాజీ స్పిన్నర్ మాంటీ పనేసర్ భారత్ ను 5-0 తేడాతో ఓడిస్తామని బీరాలు పలికితే.. తాజాగా ఇంగ్లాండ్ హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కలం రెండో టెస్టు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వైజాగ్ టెస్టు గురించి మాట్లాడుతూ ప్లేయింగ్ 11 పై హింట్ ఇచ్చాడు, నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగుతామని బోల్డ్ స్టేట్ మెంట్ ఇచ్చాడు.

టామ్ హార్ట్లీ కొన్ని ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లు మాత్రమే ఆడాడు. అతని ప్రతిభ గుర్తించి టెస్ట్ సిరీస్ కు ఎంపిక చేశాం. చాలా అద్భుతంగా బౌలింగ్ చేసి మాకు విజయాన్ని అందించాడని ఈ యంగ్ ప్లేయర్ పై మెక్కలం ప్రశంసలు కురిపించాడు. ఆఫ్ స్పిన్నర్ షోయబ్ బషీర్  వీసా సమస్యలు తీరిపోవడంతో ఇంగ్లండ్ జట్టులో చేరాడని.. రెండో టెస్టులో మొత్తం నలుగురు స్పిన్నర్లు జాక్ లీచ్, టామ్ హార్ట్లీ,రెహాన్ అహ్మద్, షోయబ్ బషీర్ల లతో బరిలోకి దిగొచ్చు అని తెలిపాడు. వికెట్ విపరీతంగా స్పిన్ కు అనుకూలిస్తే స్పిన్ ఆడటానికి మేము భయపడమని మెక్కలం ధీమా వ్యక్తం చేశాడు.   
 
తొలి టెస్టులో ఇంగ్లాండ్ స్పిన్నర్ల ధాటికి భారత్ కుదేలైంది. ముఖ్యంగా రెండో ఇన్నింగ్స్ లో స్వల్ప లక్ష్యాన్ని ఛేజ్ చేయలేక గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయింది. టామ్ హార్ట్లీ ఒక్కడే 7 వికెట్లు తీసి రెండో టెస్ట్ కు ముందు భారత్ కు హెచ్చరికలు పంపాడు. మరో ఇద్దరు స్పిన్నర్లు రెహన్ అహ్మద్, జాక్ లీచ్ సైతం అద్భుతంగా బౌలింగ్ చేశారు. ఈ నేపథ్యంలో టీమిండియాను స్పిన్ ఉచ్చులో పడేయాలని మెక్కలం భావిస్తున్నాడు.

ఈ టెస్టులో ఇంగ్లాండ్ నిర్ధేశించిన 231 పరుగుల ఛేదనలో భారత్ 202 పరుగులకే  కుప్పకూలి.. 28 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఇంగ్లీష్ స్పిన్నర్ హార్టిలి 7 వికెట్లు తీసుకొని భారత పరాజయానికి కారణమయ్యాడు. రెండో ఇన్నింగ్స్ లో 196 పరుగులు చేసిన పోప్ అసాధారణ ఆట తీరుతో ఆకట్టుకున్నాడు. ఈ విజయంతో ఇంగ్లాండ్ 5 టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యం లభించింది. రెండో టెస్ట్ ఫిబ్రవరి 2 న విశాఖపట్నంలో జరుగుతుంది.