Riley McCullum: వారసుడు వస్తున్నాడు.. భారీ సిక్స్‌లు బాదేస్తున్న మెకల్లమ్ కొడుకు

 Riley McCullum: వారసుడు వస్తున్నాడు.. భారీ సిక్స్‌లు బాదేస్తున్న మెకల్లమ్ కొడుకు

క్రికెట్ లో న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ బ్రెండన్ మెకల్లమ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. దాదాపు రెండు దశాబ్దాలపాటు న్యూజిలాండ్ క్రికెట్ లో పవర్ హిట్టర్ గా పేరుగాంచాడు. మిడిల్ ఆర్డర్ నుంచి ఓపెనర్ గా ప్రమోట్ అయిన తర్వాత సంచలన హిట్టింగ్ తో ప్రపంచ క్రికెట్ లో తనదైన ముద్ర వేశాడు. ఫాస్ట్ బౌలర్లు బంతులు వేస్తున్నప్పుడు ఎలాంటి భయం లేకుండా ముందుకు వచ్చి ఆడడంలో మెకల్లమ్ తర్వాతే ఎవరైనా. ప్రస్తుతం ఇంగ్లాండ్ క్రికెట్ హెడ్ కోచ్ గా బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో మెకల్లమ్ క్రికెట్ లో చెలరేగేందుకు సిద్ధమయ్యాడు. 

ALSO READ | Ranji Trophy: గంగూలీ రికార్డును బ్రేక్ చేసిన టెన్త్ క్లాస్ కుర్రాడు

బ్రెండన్ మెకల్లమ్ కుమారుడు రిలే మెకల్లమ్ తన తండ్రి అడుగుజాడల్లో నడుస్తున్నాడు. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటూ బౌండరీల వర్షం కురిపిస్తున్నాడు. న్యూజిలాండ్ టీ20  బ్లాక్ క్లాష్‌లో కేవలం 13 బంతుల్లో 23 పరుగులు చేసి ఔరా అనిపించాడు. లెఫ్ట్ హ్యాండర్ గా బంతిని అలవోకగా బౌండరీకి తరలిస్తున్నాడు. లాంగ్-ఆన్ రీజియన్‌లో అతను కొట్టిన సిక్సర్‌ మ్యాచ్ మొత్తానికే హైలెట్ గా నిలిచింది. రిలే మెకల్లమ్ ఇలాగే ఆడితే త్వరలో న్యూజిలాండ్ క్రికెట్ లోకి వచ్చే అవకాశం ఉంది. 

ఇంగ్లండ్ టెస్ట్ జట్టుకు హెడ్ కోచ్‌గా ఉన్న బ్రెండన్ మెకల్లమ్.. ఇప్పుడు అన్ని ఫార్మాట్ లలో కోచ్ బాధ్యతలను చేపడుతున్నారు. మాథ్యూ మోట్ స్థానంలో మెకల్లమ్ ఈ పదవి బాధ్యతలు స్వీకరిస్తున్నాడు. అంతర్జాతీయ కెరీర్ విషయానికి వస్తే 101 టెస్టుల్లో 6453 పరుగులు.. 260 వన్డేల్లో 6083 పరుగులు.. 71 టీ20 మ్యాచ్ ల్లో 2140 పరుగులు చేశాడు. మూడు ఫార్మాట్లలో కలిపి మొత్తం 19 సెంచరీలు బాదాడు.