వెస్టిండీస్ క్రికెట్ లో గొప్ప బ్యాటర్లు అంటే వివి రిచర్డ్స్, బ్రియాన్ లారా, క్రిస్ గేల్, చంద్రపాల్, గ్రీనిడ్జ్,హేన్స్ లాంటి దిగ్గజ పేర్లు గుర్తొస్తాయి. వీరిలో విండీస్ ఆల్ టైం గ్రేట్ బ్యాటర్ గా లారాను అభివర్ణిస్తారు. అయితే, లారా మాత్రం తన జట్టులోని ఒక బ్యాటర్ ను తనకంటే టాలెంట్ అని చెప్పుకొచ్చాడు. అతను వివి రిచర్డ్స్, క్రిస్ గేల్, చంద్రపాల్ లాంటి స్టార్ బ్యాటర్ కాదు. మాజీ వెస్టిండీస్ కెప్టెన్ కార్ల్ హూపర్ అత్యంత ప్రతిభావంతుడైన బ్యాటర్ గా లారా చెప్పుకొచ్చాడు. అంతేకాదు, అతను సచిన్ కంటే గొప్ప బ్యాటరని విండీస్ దిగ్గజం కితాబులిచ్చాడు.
''లారా: ది ఇంగ్లాండ్ క్రానికల్స్" అనే తన పుస్తకంలో ఈ విండీస్ దిగ్గజం, తన సహచరుడు హూపర్ సామర్ధ్యాన్ని పొగుడుతూ గొప్పగా రాశాడు. "నేను చూసిన వారిలో కార్ల్ హూపర్ బెస్ట్ బ్యాటర్ లలో ఒకడు. నేను, సచిన్ టెండూల్కర్ అతని ప్రతిభకు చాలా దూరంలో ఉన్నాం. కెప్టెన్ గా వేరు చేసి చూస్తే అతని యావరేజ్ చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కెప్టెన్ గా అతని యావరేజ్ 50 ఉంది. తన బాధ్యతను ఎంజాయ్ చేశాడు. 1991లో ఇంగ్లాండ్ పై లార్డ్స్ టెస్టులో హూపర్ చేసిన సెంచరీ నన్ను విస్మయానికి గురి చేసింది.
Also Read :- అండర్సన్ కొత్త అవతారం
హేన్స్, రిచర్డ్స్, గ్రీనిడ్జ్ లాంటి స్టార్ ఆటగాళ్లు అతడు బ్యాటింగ్ ఆడుతుంటే చూస్తూ ఉండిపోతారు. అతను ప్రతిభ గుర్తించకుండా పోయింది. కెప్టెన్ గా తన బాధ్యతను సమర్ధవంతంగా పోషించాడు". అని లారా అన్నారు. హూపర్ వెస్టిండీస్ తరపున 102 టెస్టులు ఆడాడు. 36.46 సగటుతో 13 సెంచరీలు, 27 అర్ధ సెంచరీలతో 5762 పరుగులు చేశాడు. 227 వన్డేల్లో 35.34 సగటుతో 5761 పరుగులు చేశాడు. కెప్టెన్‌గా అతను టెస్టుల్లో 45.97 సగటుతో 1609 పరుగులు చేశాడు. వీటిలో నాలుగు సెంచరీలు.. తొమ్మిది హాఫ్ సెంచరీలు ఉన్నాయి.