టీ20 ప్రపంచ కప్ లో టీమిండియా ఓపెనర్లు ఎవరనే ప్రశ్నపెద్ద సవాలుగా మారింది. ఒక ఓపెనర్ గా రోహిత్ కన్ఫర్మ్ కాగా.. మరో ఓపెనర్ ఎవరనే సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. యువ ఆటగాళ్లు ఇషాన్ కిషాన్, శుభమాన్ గిల్, జైస్వాల్, గైక్వాడ్ లలో ఎవరు హిట్ మ్యాన్ కు ఓపెనింగ్ పార్ట్ నర్ అనే విషయం అర్ధం కావట్లేదు. అయితే వీరందరిని కాదని స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేసే అవకాశాలు లేకపోలేదు. ప్రస్తుతం ఐపీఎల్ లో ఓపెనర్ గా అదరగొడుతున్న కోహ్లీ.. టీ20 వరల్డ్ కప్ లో ఇన్నింగ్స్ ఓపెన్ చేయొచ్చు అని కొన్ని నివేదికలు తెలుపుతున్నాయి.
వెస్టిండీస్ దిగ్గజం బ్రియాన్ లారా.. టీ20 ప్రపంచకప్‌లో కోహ్లీ- రోహిత్ ఓపెనింగ్ జోడీని ఖండించాడు. ప్రపంచకప్‌లో భారత జట్టుకు వీరి జోడీ గొప్ప వ్యూహం కాదని ఆయన అన్నారు. "టోర్నమెంట్ సమయంలో భారత్ పవర్‌ప్లే ఓవర్‌లను ఉపయోగించుకోవాలంటే.. ఒక సీనియర్ బ్యాటర్ కు ఒక యంగ్ ఓపెనర్ ఉండాలి. రోహిత్, విరాట్ ఇద్దరూ గొప్ప ప్లేయర్లు. వీరిలో ఒకరిని ఓపెనింగ్ చేయించి.. మరొకరిని మిడిల్ లో ఆడించాలి. ఇన్నింగ్స్ మొత్తానికి ఒక సీనియర్ బ్యాటర్ క్రీజ్ లో ఉంటే బాగుంటుంది". అని ఈ విండీస్ దిగ్గజం తన అభిప్రాయాన్ని తెలియజేశాడు.
ముందుగా అనుభవమున్న ఇద్దరూ ఔటైతే జట్టు కష్టాల్లో పడుతుంది. యంగ్ ప్లేయర్లు ఒత్తిడిని తట్టుకోలేరు. ఇది జట్టుపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి నేను ఒకరిని ఓపెనర్ గా.. మరొకరిని నెంబర్ 3 లో ఆడిస్తాను అని లారా స్టార్ స్పోర్ట్స్ తో అన్నారు. జూన్ 1 నుంచి టీ20 వరల్డ్ కప్ ప్రారంభమవుతుంది. జూన్ 29 న ఫైనల్ తో ఈ పొట్టి సమరం ముగుస్తుంది. భారత జట్టును ఏప్రిల్ చివరి వారలో ప్రకటించే అవకాశం ఉంది.