ఏసీబీ కేసులకు ఆఫీసర్లు భయపడ్త లేరు
పైరవీలతోమళ్లీ ఉద్యోగాల్లో చేరుతున్నరు
65 శాతం మంది కేసుల నుంచి తప్పించుకుంటున్నరు
ప్రాసిక్యూషన్ కు పర్మిషన్ ఇవ్వడంలో సర్కార్ నిర్లక్ష్యం
హైదరాబాద్. వెలుగు: గవర్నమెంట్ ఆఫీసర్లు ఏసీబీ కేసులకు భయపడ్తలేరు. డిపార్ట్ మెంట్ లో తమకున్న పలుకుబడి, రాజకీయ పెద్దల అండదండలతో అడ్డగోలుగా దోచుకుంటున్నారు . ఏసీబీకి చిక్కిన వారిలో దాదాపు 65% మంది కేసుల నుంచి తప్పించుకుంటున్నారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో క్లీన్ చీట్ తో బయటపడుతున్నారు . అవినీతికి పాల్పడిన అధికారులను ప్రాసిక్యూషన్ చేసేందుకు ఆయా శాఖలు పర్మిషన్ ఇవ్వకపోవడమే దీనికి ప్రధాన కారణమని ప్రాసిక్యూటర్లు చెప్తున్నారు. ఇలాంటి లొసుగులే రూ.1.10 కోట్లు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు లాంటి వారిని అవినీతి అనకొండను చేశాయి.
విజిలెన్స్ సిఫార్సును లెక్క చేస్తలేరు..
ఏసీబీ కేసుల్లో నిందితులైన పబ్లిక్ సర్వెంట్స్ ను ప్రాసిక్యూషన్ చేయాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. అవినీతి కేసుల్లో ఏసీబీ నిందితులను అరెస్టు చేశాక విజిలెన్స్ కమిషన్కు లెటర్ రాస్తుంది. నిందితుడి వివరాలు, అక్రమాలు, అవినీతికి సంబంధించి ఫైల్ అందజేస్తుంది. కమిషన్ దాన్ని పరిశీలించి ప్రాసిక్యూషన్ కు అనుమతి ఇవ్వాలని ఆ శాఖల అధికారులకు సిఫార్సు చేస్తుంది. వాటిని అధికారులు పట్టించుకోవట్లేదు.
అందుకే లైట్ అంటున్రు..
ప్రాసిక్యూషన్ కు సర్కార్ పర్మిషన్ ను, డిపార్ట్ మెంటల్ ఎంక్వైరీని కరప్షన్ ఆఫీసర్లు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆయా శాఖల ఉన్నతాధికారులు, రాజకీయ నేతలతో పైరవీలు చేయించుకొని కేసులను క్లోజ్ చేయించుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో దొంగ లెక్కలు చూపడం, కొంతమంది అధికారులకు ప్రాసిక్యూషన్ కోసం సర్కార్ ఓకే చెప్పకపోవడం.. ఈ రెండు కారణాలతో ఏసీబీ కేసులంటే ఆఫీసర్లు లైట్ తీసుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది.
కేసులన్నీ పెండింగ్…
2014 నుంచి నమోదైన దాదాపు 850 కేసుల్లో 65 శాతం కేసులకు ప్రభుత్వం నుంచి ప్రాసిక్యూషన్ పర్మిషన్ లభించలేదని తెలిసింది. కరప్షన్ ఆఫీసర్లు డిపార్ మెంటల్ ఎంక్వైరీతో పాటు ట్రిబ్యునల్ ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్, కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్‌కు సిఫార్సు చేయించుకుంటున్నారని సమాచారం. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్, ట్రిబ్యునల్ ఫర్ డిసిప్లినరీ ప్రొసీడింగ్స్ వద్దపెద్ద సంఖ్యలో కేసులు పెండింగ్ లో ఉన్నట్లు తెలిసింది. ఇలాంటి కేసుల్లో ఏసీబీకి దొరికిన అధికారులు సస్పెన్షన్ తర్వాత మళ్లీ పోస్టింగ్స్ తెచ్చుకుంటున్నారు. సస్పెన్షన్ టైమ్‌లో సగం జీతం కూడా రావడంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా గడుపుతున్నారు.
ఏటా పెరుగుతున్న కేసులు
రాష్ట్రంలో ఏటా కరప్షన్ కేసులు పెరుగుతున్నాయి. 2018లో 139 ఏసీబీ కేసులు నమోదు కాగా, 2019లో 173 కేసులు రిజిస్టర్ అయ్యాయి. 54 మందితో రెవెన్యూ డిపార్ట్ మెంట్ కరప్షన్ కేసుల్లో ఫస్ట్ ప్లేస్ లో ఉంది.