
- 150% టారిఫ్ విధిస్తానని చెప్పగానే ఆ దేశాలు భయపడ్డయ్: ట్రంప్
- డాలర్‌ను దెబ్బతీయాలనుకున్నయ్
- కొత్త కరెన్సీని తెచ్చేందుకు ప్లాన్ చేసినయ్
- బైడెన్ ఉంటే మూడో ప్రపంచ యుద్ధం వచ్చేదని కామెంట్
- కానీ తన నాయకత్వం దాన్ని అడ్డుకుంటుందని వెల్లడి
వాషింగ్టన్: తన దెబ్బకు బ్రిక్స్ కూటమి ఆగమైపోయిందని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అన్నారు. డాలర్‌కు ప్రత్యామ్నాయం తీసుకొస్తే ఆ దేశాలపై 150 శాతం టారిఫ్ విధిస్తానని బెదిరించడంతో భయపడిపోయాయని తెలిపారు. ‘‘బ్రిక్స్ దేశాలన్నీ కలిసి డాలర్‌ను నాశనం చేయాలని అనుకున్నాయి. వారు కొత్త కరెన్సీ సృష్టించాలని అనుకున్నారు. నేను అధికారంలోకి రాగానే వారికి ఒకటే విషయం చెప్పాను. డాలర్నాశనం గురించి మాట్లాడే ఏ దేశంపైనైనా 150 శాతం టారిఫ్ విధిస్తానని హెచ్చరించా.
అలాగే, ఆ దేశం నుంచి వస్తువుల దిగుమతిని ఆపేస్తామని చెప్పా. అంతే బ్రిక్స్ దేశాలన్నీ చెల్లాచెదురైపోయాయ్” అని వ్యాఖ్యానించారు. ‘‘అసలు వారికి ఏమైందో నాకు తెలియదు. ఇప్పుడు ఆ దేశాల మాటే వినిపించడం లేదు” అని వ్యంగ్యంగా అన్నారు. బ్రిక్స్ ఒక చెడు ఉద్దేశంతో ఏర్పడిందని ఆరోపించారు. ఆ కూటమిలోని చాలామంది దాన్ని కోరుకోరని, ఇప్పుడు దానిగురించి మాట్లాడేందుకు కూడా ఇష్టపడడం లేదని చెప్పారు. ఇప్పుడు బ్రిక్స్ కూటమే చనిపోయిందని ఎద్దేవా చేశారు.
బైడెన్ ఇంకో ఏడాది ఉంటే వరల్డ్ వార్ 3 వచ్చేదే
ఈసారి కూడా బైడెన్అడ్మినిస్ట్రేషన్ కొనసాగితే కచ్చితంగా మూడో ప్రపంచ యుద్ధం వచ్చేదని ట్రంప్ అన్నారు. వరల్డ్ వార్ ఎంతో దూరంలో లేదని హెచ్చరిస్తూనే.. దాన్ని తన నాయకత్వం నిరోధిస్తుందని చెప్పుకొచ్చారు. మియామిలో జరిగిన ఎఫ్ఐఐ ప్రయారిటీ సమ్మిట్‌లో ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘మూడో ప్రపంచ యుద్ధం జరగడం వల్ల ఎవరికీ లాభం లేదు. అయినా వరల్డ్ వార్ ఎంతో దూరంలో లేదు. బైడెన్ సర్కారు మరో ఏడాది కొనసాగితే ప్రపంచం యుద్ధంలో మునిగిపోయేది. ఇప్పుడు అది జరగదు” అని పేర్కొన్నారు.
ఈ యుద్ధాల్లో అమెరికా పాల్గొనకపోయినా.. తాను వాటిని ఆపేస్తానని చెప్పారు. అలాగే, రష్యా– ఉక్రెయిన్యుద్ధంపైనా ట్రంప్ స్పందించారు. ఈ యుద్ధం ముగింపునకు ఉన్నతస్థాయి చర్చలు ప్రారంభమైనట్టు చెప్పారు. గెలవలేని యుద్ధం కోసం అమెరికాతో ఉక్రెయిన్ప్రెసిడెంట్ జెలెన్స్కీ 350 బిలియన్ డాలర్లు ఖర్చు చేయించాడని మండిపడ్డారు. యుద్ధం ఆపేయాలని రష్యా కోరుకుంటున్నదని, త్వరలోనే తాను ఆ దేశ అధ్యక్షుడు పుతిన్‌తో భేటీ కానున్నట్టు చెప్పారు.
అమెరికాకు హాని చేస్తే సహించను: కాశ్ పటేల్
అమెరికాకు గుండె కాయ వంటి ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(ఎఫ్ బీఐ)కు భారతీయ అమెరికన్ లీడర్ కాశ్ పటేల్ ను సెనేట్ ఎన్నుకుంది. ఈ నేపథ్యంలో కాశ్ పటేల్ కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికన్లకు హాని చేయాలని చూస్తే సహించబోమని అన్నారు. ఈమేరకు ఆయన ఎక్స్ వేదికగా ఓ పోస్ట్ చేశారు.
తనపై నమ్మకం ఉంచి.. కీలక బాధ్యతలు అప్పగించిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ , అటార్నీ జనరల్ పామ్ బోండికి ధన్యవాదాలు తెలిపారు. ఎఫ్ బీ ఐకి ఎంతో ఘన చరిత్ర ఉన్నదని, దేశ ప్రజలకు పారదర్శకంగా, జవాబుదారీగా ఉండేందుకు బ్యూరో కట్టుబడి ఉందని చెప్పారు. దేశం గర్వించే విధంగా ఎఫ్‌బీఐని పునర్నిర్మిస్తామని ఆయన స్పష్టం చేశారు.