కళ్లల్లో కారం పొడి చల్లి.. పెళ్లి కూతురు కిడ్నాప్

మరికొద్ది సేపట్లో పెళ్లి  జరుగుతుందనగా.. కళ్యాణ మండపం నుంచి వధువును ఎత్తుకెళ్లడం మనం చాలా సినిమాల్లో చూసుంటాం.. అచ్చం, అలాంటి  సంఘటన ఒకటి ఏపీలోని తూర్పుగోదావరి జిల్లా కడియంలో జరిగింది. పెళ్లి మండపంపై కొందరు దాడి చేసి పెళ్లి కూతురుని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పూర్తి వివరాల్లోకి వెళితే..

కడియం గ్రామానికి చెందిన బత్తిన వెంకటనందు, కర్నూలు జిల్లా చాలగమర్రి మండలం గొడిగనూరు గ్రామానికి చెందిన స్నేహ.. ఇద్దరు  గుంటూరు జిల్లా నరసరావుపేటలోని ఓ  వెటర్నరీ కాలేజీలో డిప్లొమా చదువుతన్నారు. ఈక్రమంలో ఇద్దరు మధ్య ప్రేమ చిగురించడంతో.. పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఇందుకు అమ్మాయి తరుపు వాళ్లు ఒప్పుకోరనే భయంతో వారిద్దరు పారిపోయి ఏప్రిల్ 13న విజయవాడ దుర్గ గుడిలో పెళ్లి చేసుకున్నారు. ఈ విషయాన్ని  వెంకటనందు తన కుటుంబ సభ్యులకు చెప్పి.. స్నేహాను తీసుకుని ఇంటికి వెళ్లాడు. అయితే, వారిద్దరికీ అధికారికంగా మళ్లీ పెళ్లి చేయాలని నందు కటుంబ సభ్యులు నిర్ణయించారు.  

ఈ క్రమంలో ఏప్రిల్ 21న పెళ్లి జరపనున్నట్లు అమ్మాయి కుటుంబ సభ్యులకు తెలియజేశారు. పెళ్లికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మరి కొన్ని క్షణాల్లో పెళ్లి జరుగనున్న క్రమంలో అమ్మాయి తరుపు బంధువులు పెళ్లి మండపంపై కారం పొడితో దాడి చేసి.. పెళ్లి పీటల నుంచి  బలవంతంగా అమ్మాయిని తీసుకెళ్లారు. పెళ్లి కొడుకు, అతని కుటుంబ సభ్యులు అడ్డుపడగా వారిపై దాడి చేసి.. అమ్మాయిని ఈడ్చుకుంటూ తీసుకెళ్లారు. దీంతో అబ్బాయి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.