
కడలూరు: తమిళనాడులోని కడలూరు జిల్లాలో దారుణం జరిగింది. కాపురం చేయడం ఇష్టం లేక పెళ్లయిన 20 రోజులకే భార్య తన భర్తకు జ్యూస్లో విషం కలిపి ఇచ్చింది. కుటుంబ సభ్యులు అతనిని హాస్పిటల్ కు తరలించారు. ఎమర్జెన్సీ విభాగంలో ఆ యువకుడు చికిత్స పొందుతున్నాడు. చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ ఘటనలో కొన్ని చీకటి కోణాలు కూడా వెలుగుచూశాయి. కడలూరు జిల్లా కరువెపంపట్టికి చెందిన కలైయారసన్ అనే 27 ఏళ్ల యువకుడికి జనవరి 27, 2025న పెళ్లైంది.
పెళ్లై నెల రోజులు కూడా తిరగక ముందే ఆ నవ వధువు అతనిని చంపాలని చూసింది. పెళ్లికి ముందు రోజు కూడా ఆ యువతి విషం తాగి ఆత్మహత్యకు యత్నించింది. ఆమె కుటుంబ సభ్యులు గమనించడంతో విషం తాగే లోపే ఆమెను కాపాడారు. కలైయారసన్కు ఇచ్చి పెళ్లి చేశారు. ఫస్ట్ నైట్ రోజే భర్తకు గుండె పగిలే నిజం చెప్పి ఈ నవ వధువు షాకిచ్చింది. తనకు ఈ పెళ్లి ఏమాత్రం ఇష్టం లేదని, తాను మరొకరిని ప్రేమించానని చెప్పింది. భర్త ముందే తన లవర్ తో వీడియో కాల్ కూడా మాట్లాడింది. దీంతో.. పెళ్లి కొడుకుకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంకై శోభనం క్యాన్సిల్ చేసుకున్నాడు.
Also Read : పెళ్లి చేసుకుని ఎంచక్కా హనీమూన్కు వెళ్లారు
తన భార్య తరచూ వీడియో కాల్ మాట్లాడటం ఇతని కంట పడింది. దీంతో.. ఇక లాభం లేదనుకుని పెళ్లి కూతురి గురించి ఆమె కుటుంబానికి చెప్పాడు. ఫిబ్రవరి 12న ఈ నవ వధువు తన భర్తతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ఆ తర్వాత కొన్ని రోజులకు కలైయారసన్ తన భార్యను తీసుకుని తన ఇంటికి వెళ్లాడు. అంతటితో ఈ ఎపిసోడ్ సుఖాంతం కాలేదు. పెళ్లి కూతురి ఇంటి నుంచి కొందరు బంధువులు కలైయారసన్ ఇంటి మీదకి గొడవకొచ్చారు. తమ అమ్మాయి ఏం తప్పు చేసిందనేది తమకు అనవసరమని, ఆమెతో కలిసి ఉండాల్సిందేనని.. అర్ధరాత్రి 12 గంటల సమయంలో ఇంట్లో కట్టేసి కొట్టి మరీ వార్నింగ్ ఇచ్చి వెళ్లారు.
ఈ ఘటన జరిగిన మూడు రోజుల తర్వాత కలైయారసన్ పనికెళ్లి ఇంటికొచ్చాడు. టీ పెట్టివ్వమని భార్యను అడిగాడు. ఎండన పడి వచ్చిన మీరు టీ తాగకూడదని, జ్యూస్ తాగాలని.. అతనికి ఈ యువతి జ్యూస్ ఇచ్చింది. భార్య మారిపోయి తనతో ప్రేమగా ఉంటుందని భ్రమ పడిన ఇతను ఆ జ్యూస్ తాగాడు. జ్యూస్ తాగిన వెంటనే అస్వస్థతకు లోనవడంతో కాసేపు పడుకుంటానని చెప్పి పడుకున్నాడు. పడుకున్నన అతనిని లేపి మరీ జ్యూస్ లో విషం కలిపి ఇచ్చానని ఈ నవ వధువు తన భర్తతో చెప్పింది. దీంతో.. కంగుతిన్న కలైయారసన్ చావు భయంతో కేకలేశాడు. కుటుంబ సభ్యులు వచ్చి అతనిని పుదుచ్చేరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆ నవ వధువుపై కలైయారసన్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది.