రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి ఏకధాటిగా కుండపోతగా వర్షం కురుస్తూనే ఉంది. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతుండగా.. చెరువులు, కుంటలు మత్తడి దుంకుతున్నాయి. భారీగా కురుస్తున్న వర్షానికి ఏకంగా ఓ బ్రిడ్జ్ అయితే కొట్టుకుపోయింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది.
జుక్కల్ మండలంలోని రుద్రపహడ్, జుక్కల్ మధ్యలో గల వాగుపై ఉన్న తాత్కాలిక బిడ్జి కొట్టుకుపోయింది. దీంత జుక్కల్, బిచ్కుంద మధ్య రాకపోకలు బంద్ అయిపోయాయి. వాహన రాకపోకలకు ఇబ్బంది నెలకొంది. మరోవైపు యాదాద్రి భువనగిరి జిల్లాలోని వలిగొండ మండలం మల్లెపల్లి గ్రామంలో భారీ వర్షాపు నీటికి చెరువు కట్ట తెగిపోయింది. దీంతో వర్షాపు నీళ్లు వృధాగా పోతున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా రికార్డు స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. 2023 జూలై 26 బుధవారం ఉదయం 8.30 గంటల నుంచి జూలై 27 గురువారం ఉదయం 6 గంటల వరకు 31 చోట్ల 20 సెంటీమీటర్ల కంటే ఎక్కువగా వర్షపాతం నమోదయ్యింది. అత్యధికంగా వరంగల్ జిల్లాలో 27.2 మిల్లీమీటర్లు, హనుమకొండలో 19.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో వర్షాలకు
సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
హైదరాబాద్ కు వాతవరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది. 2023 జూలై 27 సాయంత్రం నుంచి భారీ వర్షం కురుస్తుందని వెల్లడించింది. వికారాబాద్, రంగారెడ్డి, జగిత్యాల, నిర్మల్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.