మునగాల, వెలుగు : మునగాల మండలం గణపవరం, తాడ్వాయి గ్రామాల వద్ద నిర్మిస్తున్న బ్రిడ్జి నిర్మాణ పనులు స్లోగా సాగుతున్నాయి. మునగాల నుంచి కీతవారిగూడెం వరకు వెళ్లే రహదారిపై గణపవరం వాగు దగ్గర ఉన్న బ్రిడ్జి వర్షాకాలంలో వరద నీటికి మునిగిపోయి రాకపోకలకు తీవ్ర ఇబ్బందిగా మారింది.
వర్షాకాలంలో వరద ఉధృతికి గణపవరం వద్ద ఉన్న బ్రిడ్జిపై వాహనదారులు, పాదాచారులు సైతం నడవలేని పరిస్థితి ఏర్పడింది. గతేడాది వచ్చిన వరద నీటి ప్రవాహానికి ఓ వ్యక్తి గల్లంతయ్యారు. ఎట్టకేలకు గత ఆరు నెలల క్రితం బ్రిడ్జి నిర్మాణానికి ప్రభుత్వం రూ.8 కోట్లు మంజూరు చేసింది.
కాంట్రాక్టర్ నిదానంగా పనులు చేయిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలుగుతూనే ఉంది. తాడ్వాయి వాగు వద్ద రెండున్నర కోట్లతో మంజూరైన బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా స్లోగానే సాగుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఈ బ్రిడ్జిల నిర్మాణ పనులను వేగవంతం చేయించాలని స్థానికులు కోరుతున్నారు.