గోదావరిఖని, వెలుగు : రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్ ప్రాతినిధ్యం వహిస్తున్న 30వ డివిజన్‌లోని మల్లికార్జున్ నగర్‒హనుమాన్ నగర్‌కు మధ్య ఉన్న బ్రిడ్జి కూలిపోయి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కల్వర్ట్‌పై నిర్మించిన ఈ బ్రిడ్జి నాలుగు నెలల క్రితం కూలిపోయింది. పట్టణంలోని మెయిన్ చౌరస్తాకు, కూరగాయల మార్కెట్, సింగరేణి మైన్స్‌కు ఈ బ్రిడ్జి పైనుంచే వెళతారు. బ్రిడ్జి కూలిపోవడంతో తాత్కాలికంగా ఏర్పాటు చేసిన ఇనుప గాడర్ల పైనుంచి స్థానికులు రాకపోకలు సాగిస్తున్నారు. ఇటీవల నలుగురు వ్యక్తులు అదపుతప్పి కాలువలో పడి గాయపడ్డారు. దీంతో సమస్యను పరిష్కరించాలని ప్రజలు మేయర్ ను కోరారు. మూడు సార్లు ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. ఓసారి మేయర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాలుగు నెలలుగా ఇబ్బందులు పడుతుంటే మేయర్ ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేయర్ ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్‌లో సమస్యలు ఇలా ఉంటే మిగతా డివిజన్లలో పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు.
చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది
బ్రిడ్జి వల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నాము. అత్యవసర సమయాల్లో ఆటో వెళ్లడానికి వీలు లేకుండా ఉంది. కాలువపై ప్రస్తుతమున్న ఇనుప గాడర్లపైనే నడుస్తున్నాము. అలా నడిచేటపుడు ఇటీవల అదుపు తప్పి నలుగురు కాలువలో పడ్డారు. మేయర్ స్పందించి కాలువపై బ్రిడ్జి నిర్మించాలి.
–దాసరి శ్రావణ్ కుమార్
20 రోజుల్లో పనులు మొదలు పెడతాం
బ్రిడ్జి కూలిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం నా దృష్టికి వచ్చింది. మొదటి సారి టెండర్ పిలిచినప్పుడు కాంట్రాక్టర్లు ఎవరూ ముందుకు రాలేదు. రెండోసారి కూడా టెండర్ పిలవగా కొందరు కాంట్రాక్టర్లు ముందుకు వచ్చారు. రెండు రోజుల క్రిందటే టెండర్ ఓపెన్ చేశాం. కాంట్రాక్టర్‌తో అగ్రిమెంట్ చేయించుకుని 20 రోజుల్లో పని మొదలు పెడతాం.
–బి.అనిల్ కుమార్, మేయర్, రామగుండం