
- మెదక్ – కామారెడ్డి జిల్లాల మధ్య మంజీరానదిపై నిర్మాణం
- ఒకవైపు అప్రోచ్ రోడ్డులేక ఏండ్లుగా వృథాగా మారిన వైనం
- రెండు జిల్లాల వాసులకు తప్పని దూర భారం
- మెదక్ ఎమ్మెల్యే హామీతో ప్రజల్లో చిగురించిన ఆశలు
మెదక్, పాపన్నపేట, వెలుగు: మెదక్– -కామారెడ్డి జిల్లాలను కలుపుతూ మంజీరా నదిపై కట్టిన బ్రిడ్జి ఏండ్లుగా వృథాగా మారింది. కామారెడ్డి వైపు అప్రోచ్ రోడ్డు పూర్తి కాగా.. నిధుల్లేక మెదక్ జిల్లా వైపు మధ్యలోనే నిలిచింది. దీంతో బ్రిడ్జిపై రాకపోకలు లేక రూ. కోట్లలో ప్రజాధనం వృథా అయింది. రెండు జిల్లాల ప్రజలు రాకపోకలు సాగించాలంటే ఎల్లారెడ్డి మీద నుంచి చుట్టూ తిరిగి రావాల్సి వస్తుండగాప్రయాణం దూర భారంగా మారింది.
50 కిలో మీటర్ల ప్రయాణిస్తుండగా..
మెదక్ జిల్లా పాపన్నపేట, టేక్మాల్, పెద్దశంకరంపేట, అల్లాదుర్గం మండలాల ప్రజలు కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట, లింగంపేట, ఎల్లారెడ్డి మండలాలకు వెళ్లాలంటే మెదక్ టౌన్ మీదుగా 50 కిలో మీటర్లు దూరం ప్రయాణించి వెళ్లాలి. దీంతో అధిక ఖర్చుతో పాటు సమయం వృథా అవుతుంది. మెదక్–- కామారెడ్డి జిల్లాల మధ్య మంజీరాపై బ్రిడ్జి నిర్మించాలనే డిమాండ్వచ్చింది. దీంతో గత ప్రభుత్వం రెండు జిల్లాలను కలుపుతూ మెదక్ జిల్లా పాపన్నపేట మండలం రాంతీర్థం, కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలం వెంకంపల్లి గ్రామాల మధ్యన బ్రిడ్జి నిర్మించాలని నిర్ణయించింది.
2021లోనే పూర్తయినా..
2017లో అప్పటి ప్రభుత్వం రూ.22 కోట్లు మంజూరు చేసింది. ఆర్అండ్ బీ శాఖ పనులు చేపట్టి 2021లో పూర్తి చేసింది. కామారెడ్డి జిల్లా వైపు తాండూర్ మీదుగా ఎల్లారెడ్డి మెయిన్ రోడ్డు వరకు బీటీ రోడ్డు నిర్మించింది. మెదక్ జిల్లా పాపన్నపేట వరకు అప్రోచ్ రోడ్డు నిర్మించలేదు. మంజూరైన రూ.22 కోట్లు ఖర్చు అయ్యాయి. పూర్తి కావాలంటే మరిన్ని నిధులు కావాలి. కానీ అధికారులు మొదట్లోనే ఎన్ని నిధులు కావాలనేది సరిగా అంచనా వేయలేదు. బ్రిడ్జి అందుబాటులోకి రావాలంటే రాంతీర్థం నుంచి పాపన్నపేట వరకు 4.4 కిలోమీటర్లు అప్రోచ్ రోడ్డు నిర్మించాల్సి ఉంది.
అదే రూట్ లో 1.6 కి.మీ ఆర్అండ్ బీ రోడ్డు, 0.7 కి.మీ పీఆర్ రోడ్డు ఉండగా, మరో 2.1 కి.మీ కొత్తగా రోడ్డు వేయాల్సి ఉంది. ఇందుకు 12 ఎకరాల భూమి సేకరించాలని ఆర్అండ్ బీ అధికారులు తేల్చారు. అందుకు మరో రూ.22 కోట్లు కావాల్సి ఉందని అంచనా వేశారు. ప్రభుత్వానికి ప్రపోజల్ పంపినా నిధులు మంజూరు కాలేదు. దీంతో బ్రిడ్జిపై రాకపోకలు సాగించలేని పరిస్థితి నెలకొంది.
మెదక్ ఎమ్మెల్యే హామీతో..
ఇటీవల పాపన్నపేట మండలంలో పర్యటించిన మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు దృష్టికి ఆయా గ్రామాల ప్రజలు తీసుకెళ్లారు. దీనిపై సానుకూలంగా స్పందించారు. అప్రోచ్ రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే హామీ ఇవ్వడంతో జిల్లా వాసుల్లో ఆశలు చిగురించాయి.