- ఆసిఫాబాద్జిల్లాలో ఉప్పొంగిన నదులు, వాగులు కొట్టుకుపోయిన బ్రిడ్జి
- జలదిగ్బంధంలో దిందా గ్రామస్తులు
- కనీసం పడవ సౌకర్యమైనా కల్పించాలని కలెక్టర్‌కు లేఖ
- కుమ్రంభీం ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని వదిలిన ఆఫీసర్లు
ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాలో శుక్రవారం రాత్రి నుంచి ఏకధాటిగా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి పారుతున్నాయి. బ్రిడ్జిలు, రోడ్లు కొట్టుకుపోయాయి. పత్తి చేన్లు నీట మునిగాయి. చింతలమానేపల్లి మండలం దిందా గ్రామానికి ముందున్న వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో రెండ్రోజులుగా గ్రామం జలదిగ్బంధంలోనే ఉంది. కౌటాల మండలం కన్నేపల్లి గ్రామ పంచాయతీ ఆఫీస్ స్లాబ్ పెచ్చులూడి కిందపడింది. సిర్పూర్(టి) మండలం చీలపల్లి సమీపంలో సిర్పూర్(టి)- చీలపల్లి మార్గంలో లోలెవల్ వంతెన కొట్టుకుపోయింది. దీంతో చీలపల్లి, లింబుగూడ, మేడిపల్లి, చిన్న మాలిని, మాలిని, మానిక్ పటార్ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరదల కారణంగా పలు మండలాల్లోకి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి.
కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కలెక్టర్ వెంకటేశ్ ధోత్రే తెలిపారు. శనివారం జిల్లా అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) దాసరి వేణుతో కలిసి కంట్రోల్ రూమ్ ను పరిశీలించారు. వర్షాల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి సమస్య ఎదురైనా కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసి చెప్పాలన్నారు. ఫోన్ నం.08733-279033, మొబైల్ నం.6304686505 లలో సంప్రదించవచ్చని తెలిపారు. ముందస్తు చర్యలు తీసుకునేలా అధికార యంత్రాంగం నిత్యం అప్రమత్తంగా ఉండాలన్నారు.
కుమ్రంభీం ప్రాజెక్టు మూడు గేట్లు ఎత్తివేత
కుమ్రంభీం ప్రాజెక్టు 3,4,5 గేట్లు ఎత్తిన ఇరిగేషన్ అధికారులు నీటిని దిగువకు వదిలారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 10 టీఎంసీలు కాగా ప్రస్తుత సామర్థ్యం 5.9 టీఎంసీలుగా ఉంది. ఇన్ ఫ్లో 1778 క్యూసెక్కులు కాగా 1941 క్యూసెక్కుల నీటిని కిందకి వదులుతున్నారు. దిగువ ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మా గోస చూడండి.. కలెక్టర్‌కు దిందా గ్రామస్తుల లేఖ
‘‘వానొస్తే మా ఊరి ముందున్న వాగు ఉప్పొంగి రోజుల తరబడి రాకపోకలు బంద్ అయితున్నయ్. బ్రిడ్జి నిర్మాణం ఇప్పట్లో అయ్యేటట్లు లేదు. టీచర్లు వాగు దాటి రాలేకపోతున్నారు. పిల్లల చదువులు ఆగమైతున్నయ్. అవసరాల కోసం ఊరు దాటలేకపోతున్నం. మా అవస్థ గుర్తించి వాగు దాటేలా పడవ సౌకర్యం కల్పించండి సార్’’.. అంటూ జలదిగ్బంధంలో ఉన్న దిందా గ్రామస్తులు కలెక్టర్ కు లేఖ రాశారు. వానాకాలం సీజన్ లో కనీస అవసరాల కోసం పడవ సౌకర్యం కల్పించాలని కోరారు. ఎందరికో ఎన్నో విధాలా తమ సమస్య చెప్పినా పరిష్కరించలేదని, ఇప్పటికైనా సాయం చేయాలని వేడుకున్నారు.