వంతెనలా..పేకమేడలా.!

శతాబ్దాల క్రితం రాజులు కట్టించిన కోటలు,  దేవాలయాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా మనకు దర్శనమిస్తున్నాయి. ఆంగ్లేయుల పాలనలో నిర్మితమైన వంతెనలు అనేకం ఇప్పటికీ భద్రంగానే ఉన్నాయి. కానీ, ఈ మధ్య పనులు పూర్తికాని వంతెన(బ్రిడ్జి)లు,  ప్రారంభానికి సిద్ధమైన వంతెనలే కాకుండా కొన్నాళ్ల  క్రితం వినియోగంలోకి వచ్చినవి కూడా స్వల్ప కాలంలోనే పేక మేడల్లా కుప్ప కూలిపోతున్నాయి.  పిచ్చుక గూళ్ల కంటే అధ్వాన్నంగా కూలిపోతున్న పరిస్థితి చూస్తుంటే...పనిమంతుడు పందిరి వేస్తే  కుక్క తోక తగిలి కూలిందట అనే సామెత గుర్తుకువస్తోంది. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా వినియోగంలోకి వచ్చాక కూడా ఈ దుస్థితి పదే పదే పునరావృతం అవుతోందంటే... సాంకేతిక పరిజ్ఞాన లోపమా లేక అవినీతి చీడా.. ఏదేమైనా ఈ సమస్య మన దేశానికి తలవంపుగా మారుతోంది.  బిహార్ రాష్ట్రంలో వరుసగా పేకమేడల్లా పడిపోతున్న వంతెనలు కలకలం రేపుతున్నాయి. మూడు వారాల వ్యవధిలో 13వంతెనలు  కూలిపోవడం  ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. 

నిర్మాణంలో నాణ్యత లోపం

నిర్మాణ నాణ్యతపై తీవ్రస్థాయిలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. పాలకులు వంకలు వెతుకుతుండగా మరోవైపు రాజకీయ దుమారం చెలరేగుతోంది. నిర్మాణ సంస్థల నిర్లక్ష్యం, ఇసుక తవ్వకాలు, నాణ్యతా లోపాలే ప్రధాన కారణాలని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ మధ్య  హఠాత్తుగా కూలుతున్న వంతెనలను చూశాక, ఇప్పుడు ప్రజలు వంతెనలపై ప్రయాణించాలంటేనే భయపడే పరిస్థితి నెలకొంది.   బిహార్లో ఇటీవల ఒకేరోజు 5వంతెనలు కూలిపోయాయి. వాటిలో శివాని జిల్లాలోని చాడీ నదిపై నిర్మించినవి రెండు ఉన్నాయి. అదే నదిపై నిర్మించిన మరొక వంతెనకు వెళ్లే రోడ్డు మార్గం వర్షానికి కొట్టుకుపోవడంతో ఇప్పుడు వారధికి దారి లేదు. బిహార్ రాష్ట్రంలోని మధుబని, సుపౌల జిల్లాల మధ్య కోశీ నది మీద 10 కిలోమీటర్ల పొడవున ఒక వంతెనను కడుతున్నారు. కేంద్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకమైన "భారత్ మాల" ప్రాజెక్టులో భాగమైన ఈ బ్రిడ్జి మొన్న మార్చిలో కూలిపోయింది. ఇలా కొన్ని పాతవి, కొన్ని నిర్మాణ దశలో, మరి కొన్ని  ప్రారంభోత్సవం జరిగినవి కూలిపోవడం ఆందోళనకరం.

ప్రకృతి విపత్తులు, అవినీతి

ఢిల్లీలోని సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్​స్టిట్యూట్,  బ్రిడ్జ్ ఇంజినీరింగ్ స్ట్రక్చర్ విభాగానికి చెందిన చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ రాజీవ్ కుమార్ బృందం మనదేశంలో బ్రిడ్జిలు కూలిపోతున్న వైనంపై కొంతకాలంగా అధ్యయనం చేస్తున్నారు. భూకంపాలు, తుపానుల వంటి  ప్రకృతి విపత్తుల వల్లే మన దేశంలో వంతెనలు కూలిపోతున్నాయని ఆ బృందం ప్రాథమికంగా అంచనాకు వచ్చింది.  వంతెనలకు సమీపంలో నదుల్లో ఇసుకను విపరీతంగా తవ్వేయడం వల్ల వంతెన పునాదులు బలహీనపడుతున్నాయని, దానికి తోడు నిర్మాణ సమయంలో వినియోగించే మెటల్, ఇసుక, సిమెంట్ నాణ్యత లేకపోవడం వల్ల కూడా వంతెనలు కూలుతున్నాయని తేల్చారు.  ప్రాథమికంగా వంతెన నిర్మాణానికి ఇచ్చే డిజైన్​కు తర్వాత కట్టేటప్పుడు పాటించడానికి ఉన్న వ్యత్యాసాలు కూడా వంతెనలు కూలడానికి కారణమని చెప్తున్నారు.  దేశవ్యాప్తంగా1977 తర్వాత 40 ఏండ్లలో  సుమారు 2130 వంతెనలు పడిపోయాయి. 2020-–22 మధ్యకాలంలో జాతీయ రహదారుల మీద సగటున నేలకు ఒక బ్రిడ్జి చొప్పున కూలిపోయిందని కేంద్రమే గత డిసెంబర్​లో రాజ్యసభలో వెల్లడించింది. 

నిపుణుల పర్యవేక్షణలో నిర్మాణాలు జరగాలి

ఏడాదిన్నర కిందట గుజరాత్​లోని  మోర్చీలో తీగల వంతెన తెగిపడి 140 మంది మరణించారు.  కోల్​కత్తా  మొదలు మహారాష్ట్ర చిప్లూన్ వరకు ఎన్నోచోట్ల ఫ్లైఓవర్లు నేలమట్టమయ్యాయి. ఇటువంటి వార్తలు వినడమే తప్ప ఆయా నిర్మాణాల దుర్గతికి కారకులైనవారికి ఎప్పుడైనా శిక్షలు పడ్డాయా!  ఏదైనా ఘటన జరిగినప్పుడు హడావుడి చేయడం తప్ప,   ఆ తర్వాత సర్దుకుపోతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం.  విదేశాల్లో అక్రమార్కులపై చర్యలు తీవ్రంగా ఉంటాయి.  చైనా, వియత్నాం, ఇండోనేషియా వంటి దేశాల్లో అవినీతి తిమింగలాలకు మరణశిక్షలు విధిస్తుంటారు. మన దగ్గరేమో ప్రజల సొమ్మును మేసిన మహానుభావులే పాలకులై మననెత్తిన కూర్చుంటున్నారు. ఈ దౌర్భాగ్యమే అన్ని రకాల అక్రమాలకు  మూలం.  తల్లివేరులాంటి  రాజకీయ అవినీతిని, పెంచి పోషించినంత కాలం మనదేశం అభివృద్ధి తిరోగమనంలో ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. కాబట్టి,  ఎలాంటి బ్రిడ్జిలైన,  వంతెనలైనా సరే రకరకాల కోణాల్లో విస్తృతంగా అధ్యయనం చేయాలి.  పొంచి ఉన్న ప్రమాదాలను ముందుగానే పరిగణనలోకి తీసుకొని నిర్మాణాలు అన్నింటికీ తట్టుకునేవిధంగా నాణ్యతా ప్రమాణాలు పాటించి కట్టాలి.  వంతెనల నిర్మాణంలో అన్ని జాగ్రత్తలు పాటించాలి.  నిజాయితీగల అధికారుల పర్యవేక్షణ పెంచాలి.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమగ్ర  నిపుణులచే దర్యాప్తు జరిపించాలి.  పురాతన వంతెనల పునర్ నిర్మాణం, నూతన నిర్మాణాల్లో నాణ్యతల అంశం ముమ్మాటికీ రాజీ ధోరణి అవలంబించ కూడదు.  ప్రజాజీవనం,  ప్రజాధనాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత పాలకులపైనే ఉందనే వాస్తవాన్ని విస్మరించి రాదు.

వరుస దుర్ఘటనలతో ప్రజలు బేంబేలు

నిర్దేశిత డిజైన్ ప్రకారం పనులు చేయకపోవడం, నాణ్యతలేని సామగ్రిని వాడటం, ప్రభుత్వ పర్యవేక్షణ కొరవడడం తదితర కారణాలతోనే  నిర్మాణంలో ఉన్న వంతెనలు పడిపోతున్నాయనేది ఇంజినీరింగ్ నిపుణుల పరిశీలనలో వెల్లడైన వాస్తవాలు. పాత బ్రిడ్జిల బాధ్యతను ప్రభుత్వాలు గాలికి వదిలేయడం భావ్యం కాదు. కేవలం బిహార్ రాష్ట్రంలోనే కాదు, కీలక మౌలిక సదుపాయాల కల్పనలో దేశమంతా ఇదే ధోరణి కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా అరాచకం 3 పువ్వులు 36 కాయలుగా వర్ధిల్లుతోంది.  వాస్తవానికి  నాణ్యంగా నిర్మాణం చేపట్టే  పనిమంతులకు మన దేశంలో లోటులేదు.  ముఖ్యంగా వంతెనలు, ఫ్లైఓవర్లు వంటివి తరచుగా కూలిపోవడానికి కారణం పాలకులు, అధికారులు, కాంట్రాక్టర్లు నడుమ పెనవేసుకుపోయిన అవినీతి బంధమే.  అక్రమ సంపాదనపై వీరికి ఉన్న ఆశ సామాన్య ప్రజానీకానికి యమపాశంగా మారుతోంది. అక్రమాలలో ఆరితేరిన అవినీతి బృందాలు నాసిరకం పనులతో వందల కోట్లు ప్రజాధనాన్ని దోచుకుపోతున్నారు. 

- మేకిరి దామోదర్, సోషల్​ ఎనలిస్ట్​