- వర్షాలు ఫుల్లుగా పడితే ఇబ్బందే
- పునాదులు దాటని వంతెనలు
- ఈ ఏడాదీ కష్టాలు తప్పేలా లేవు
ఆసిఫాబాద్, వెలుగు : జిల్లాలో రోడ్డు, రవాణా సౌలత్ లు లేక ప్రతి ఏటా వానాకాలంలో అనేక గిరిజన గ్రామాలు ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నాయి. వాగులపై పదేళ్లుగా నిర్మిస్తున్న వంతెనలు నేటికీ పూర్తి కాలేదు. గిరిజనులు దవాఖానకు వెళ్లేందుకు అరిగోస పడుతున్నారు. వర్షాకాలంలో పలు గిరిజన గ్రామాలకు రవాణా సదుపాయాలు నిలిచిపోతాయి.
రోగులు, గర్భిణులు, బాలింతలు సర్కార్ దవాఖానకు వెళ్లేందుకు కూడా అష్టకష్టాలు పడాల్సి వస్తుంది. గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుని బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. ఈ ఏడాది సైతం వంతెనలు పూర్తి కాకపోవడంతో వర్షాకాలంలో వారికి గోసలు తప్పేలా లేవు.
రాష్ట్రంలోనే ఆసిఫాబాద్ జిల్లా వెనుకబాటుకు ప్రధాన కారణం రహదారులు, వంతెనలు లేకపోవడమే. జిల్లాలో 15 మండలాలు ఉన్నాయి. పదేళ్లకు పైగా వంతెనల పనులు కొనసాగుతూనే ఉన్నాయి. పనులు నత్తనడకన కొనసాగుతుండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అత్యవసర సమయాల్లో ప్రజలు, రోగులు, గర్భిణీలు సకాలంలో దవాఖానకు వెళ్లలేని దుస్థితి నెలకొంది.
- పదహారు ఏళ్లు గడుస్తున్నా ఆసిఫాబాద్ మండలంలోని గుండి పెద్దవాగు పై నిర్మిస్తున్న వంతెన పిల్లర్ల దశ దాటలేదు. ఆఫీసర్లు, లీడర్లు పట్టించుకోవడం లేదు. వర్షాకాలంలో ఆయా గ్రామాల ప్రజలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతున్నాయి. గుండి గ్రామస్తులు వాంకిడి మండలం మీదుగా 20 కిలోమీటర్లు చుట్టూ తిరిగి ఆసిఫాబాద్ కు చేరుకుంటారు.
- కెరమెరి మండలంలోని అనార్ పెల్లి పెద్ద వాగుపై వంతెన పనులు పదేళ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. లక్మాపూర్ పెద్ద వాగుపై రూ. 3 కోట్లతో నిర్మిస్తున్న వంతెన పూర్తి కాలేదు. దీంతో గిరిజనులు ప్రతి ఏడాది కష్టాలు పడుతూనే ఉన్నారు.
- చింతల మానే పల్లి మండలం బాబా సాగర్ లోని రూ 2.50 కోట్లతో నిర్మిస్తున్న నాయికపు గూడ బ్రిడ్జి రెండేళ్లుగా నిర్మాణం లోనే ఉంది.
- దహెగాం మండలం లోని పెసరిగుంట గ్రామపంచాయతి పరిధిలో 25 కుటుంబాలున్న మొర్లిగూడ గ్రామానికి రోడ్డు సరిగా లేదు. ఊరికి పక్కనే ఉన్న డోలుమర్రి వాగు మీద బ్రిడ్జి కట్టలేదు.
- తిర్యాణి మండలంలోని గుండాల, వాడి గూడ, ధాబా గూడ, కొత్త గూడ, సాల్పలా గూడ, దొడ్డి గూడ, పున గూడ, కేరె గూడ, గోవేనా, గోపెరా, కొలం గూడ గ్రామాలు మండల కేంద్రానికి 9నుంచి 20 కిలోమీటర్లు నడిచి రావాల్సిందే.
వానకాలం వచ్చిందంటే తిప్పలే..
వానకాలం వచ్చిందంటే మాకు తిప్పలు తప్పడం లేదు. ఎన్నోసార్లు ప్రజాప్రతినిధులకు తెలిపిన ఫలితం లేకుండా పోయింది . పోలీసుల ఆధ్వర్యంలో పోయిన యేడు మట్టి రోడ్డు వేయించారు. వానకాలం పనిచేయడం లేదు. ఆఫీసర్లు, లీడర్లు ఫారెస్ట్ క్లియరెన్స్ చేసి రోడ్డును వేయాలి.
మర్సకోలా అశోక్, గుండాల, తిర్యాణి.
ఏటా గోస పడుతున్నం
గుండి పెద్ద వాగుపై ఏళ్లు గడుస్తున్నా వంతెన పనులు పూర్తి కావడం లేదు. అధికారులు, లీడర్లకు ఎంత చెప్పినా ఫాయిదా లేదు. ఫుల్లుగా వానలు పడితే రాకపోకలు బంద్ అయితయ్. వాంకిడి మీదుగా ఆసిఫాబాద్ కు రానుపోను రూ.200 కిరాయి అవుతుంది. వానాకాలం మా బతుకులు వనవాసం. అధికారులు, లీడర్లు జర పట్టించుకోవాలే.
జాడి. లక్ష్మీ ,గుండి ,ఆసిఫాబాద్