ఆదిలాబాద్ సంక్షిప్త వార్తలు

  • డ్యూటీలు కరెక్ట్​గా చేయండి
  • క్వాలిటీ ఎడ్యుకేషన్, సరుకులు అందించాలి
  • స్కూళ్లలో ఆహ్లాదకర వాతావరణం ఉండాలి
  • విధులు విస్మరించే వారిపై కఠిన చర్యలు: ఐటీడీఏ పీవో

ఆసిఫాబాద్ : విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని ఐటీడీఏ పీవో వరుణ్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఆసిఫాబాద్ గర్ల్స్​హాస్టల్​లో రెసిడెన్షియల్​స్కూల్స్​హెచ్ఎం, స్కూల్ కాంప్లెక్స్ రిసోర్స్ పర్సన్స్, వెల్ఫేర్​ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ట్రైబల్ వెల్ఫేర్ హాస్టళ్లలో చదువుతున్న విద్యార్థులకు క్వాలిటీ ఎడ్యుకేషన్​అందించాలన్నారు. విధులపట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవన్నారు. గిరిజన విద్యాభివృద్ధికి ప్రతీ ఒక్కరు కృషిచేయాలన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలన్నారు. విద్య, వ్యక్తిత్వ వికాసం కోసం కౌన్సెలింగ్​ నిర్వహించాలన్నారు. పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించేలా చూడాలని, ఆరోగ్యకర వాతావరణం అందించాలన్నారు. జీసీసీల ద్వారా నాణ్యమైన సరుకులు అందించాలని, లేదంటే ఆఫీసర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో ఐటీడీఏ డీడీ  మణెమ్మ, ఏసీఎంవో పుర్క ఉద్దవ్, జీసీడీవో శకుంతల తదితరులు 
పాల్గొన్నారు.

తలసేమియా బాధితులకు సదరం సర్టిఫికెట్లు ఇవ్వాలి
మంచిర్యాల :  తలసేమియా, సికిల్​సెల్​, హీమోఫీలియా వ్యాధిగ్రస్తులకు జీవో నంబర్​ 5 ప్రకారం సదరం సర్టిఫికెట్లు జారీ చేయాలని బాధితులు, వారి తల్లిదండ్రులు డిమాండ్​ చేశారు. తలసేమియా, సికిల్​సెల్​ వెల్ఫేర్​ సొసైటీ రాష్ర్ట ఉపాధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్​, రాష్ర్ట సంయుక్త కార్యదర్శి కాసర్ల రంజిత్​ ఆధ్వర్యంలో బుధవారం గవర్నమెంట్​ హాస్పిటల్​ ఆర్​ఎంవో శ్రీమన్నారాయణకు, అడిషనల్​ కలెక్టర్​ మధుసూదన్​ నాయక్​కు వినతిపత్రాలు అందజేశారు. వినతిపత్రాలు ఇచ్చిన వారిలో బాధితులు, వారి తల్లిదండ్రులు సుమారు వంద మంది పాల్గొన్నారు.

60 ఫీట్ రోడ్డు పనులు ప్రారంభించాలి
మంచిర్యాల :  మంచిర్యాల పట్టణంలోని హమాలివాడ –- తిలక్​నగర్ 60 ఫీట్​రోడ్డు పనులు వెంటనే ప్రారంభించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్​రావు డిమాండ్​ చేశారు. బుధవారం ఆయన హమాలివాడలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారు. రోడ్డు వైడెనింగ్​​లో ఇరు వైపుల కోల్పోతున్న ఇండ్లను, డ్రైనేజీలను ధ్వంసం చేసి మూడు నెలలు అవుతున్నా పనులు ఎందుకు చేయడం లేదని ప్రశ్నించారు. మున్సిపల్ కమిషనర్ బాలకృష్ణకు ఫోన్​ చేసి సమస్య వివరించారు. డ్రైనేజీలను తొలగించడంతో ఇండ్ల నుంచి వచ్చే నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయి దుర్వాసన వస్తోందన్నారు. మున్సిపాలిటీ దగ్గర ఫండ్స్​ లేకున్నా ఎమ్మెల్యే దివాకర్​రావు, పాలకవర్గ సభ్యులు అభివృద్ధి చేస్తున్నామని చెప్పుకోవడానికి పనులను మొదలుపెట్టి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. వెంటనే పనులు చేపట్టాలని, లేకుంటే మున్సిపల్ ఆఫీసును ముట్టడిస్తామని హెచ్చరించారు. బీజేపీ టౌన్​ ప్రెసిడెంట్​ వంగపల్లి వెంకటేశ్వర్​రావు, బోయిని హరికృష్ణ, ఆకుల సంతోష్, ఆనంద్ కృష్ణ, జోగుల శ్రీదేవి, తన్నీరు కృష్ణ, రాజేందర్ పాల్గొన్నారు.  

కొందరికే ఇండ్ల పట్టాలు ఇచ్చిన్రు
రామకృష్ణాపూర్/నస్పూర్ : కొందరికి మాత్రమే ఇండ్ల పట్టాలు ఇచ్చి అందరికి ఇచ్చినట్టు ఎమ్మెల్యే దివాకర్ రావు గొప్పలు చెప్పుకుంటున్నాడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్​వెరబెల్లి తెలిపారు. బుధవారం ఆయన శ్రీరాంపూర్, వాటర్ ట్యాంక్ ఏరియాలో గడప గడపకు బీజేపీ కార్మికుల కాలనీల్లో తాగునీరు, డ్రైనేజీ సమస్యలు పరిష్కరించడం లో సింగరేణి యాజమాన్యం విఫలమయ్యిందన్నారు. కార్యక్రమంలో రజినీశ్​ ​జైన్, ఆనంద్ కృష్ణ, సత్రం రమేశ్, ఈర్ల సదానందం, జంగంపల్లి మహేశ్, కుర్రె చక్రి, తాడురి మహేశ్, కొంతం మహేందర్, సాగర్, రణధీర్, స్వప్నారెడ్డి, రాజలింగు తదితరులు పాల్గొన్నారు.పేద కుటుంబానికి రఘునాథ్​ సాయం క్యాతన్​పల్లి మున్సిపాలిటీ మల్లికార్జున్​నగర్​కు చెందిన పాముల రాజు కుటుంబానికి బీజేపీ రఘునాథ్​ వెరబెల్లి కుట్టుమిషన్​ అందించారు.

సోషల్​ మీడియాకు దూరంగా ఉండాలి
బెల్లంపల్లి : విద్యార్థులు సోషల్​మీడియాకు దూరంగా ఉండాలని బెల్లంపల్లి జూనియర్ సివిల్ జడ్జి జి. హిమబిందు సూచించారు. మండల న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక యువ సంఘటన ఇంగ్లిశ్​ మీడియం హైస్కూల్ లో ఏర్పాటు చేసిన న్యాయ విజ్ఞాన సదస్సుకు ఆమె హాజరయ్యారు. చదువుకుంటేనే ఉన్నత స్థాయికి చేరుకుంటారన్నారు. అనంతరం జడ్జి స్థానిక పోలీస్​స్టేషన్​తనిఖీ చేశారు. 

కోల్ ఎంప్లాయీస్  పెన్షన్​ పెంచాలి
మందమర్రి : బొగ్గు పరిశ్రమల్లో పనిచేసి రిటైర్డు అయిన ఎంప్లాయీస్ పెన్షన్​ పెంచాలని ఆల్ ఇండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్ కన్వీనర్ పీకే సింగ్ రాథోడ్, సింగరేణి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు దండంరాజు రాంచందర్ రావు, ఉపాధ్యక్షుడు ఆళవందార్ వేణు మాధవ్ కోరారు. బుధవారం వారు స్థానికంగా మీడియాతో మాట్లాడారు. గత నెల 25 నుంచి ఢిల్లీలోని జంతర్​మంతర్​వద్ద ఆల్ ఇండియా కోల్ పెన్షనర్స్ అసోసియేషన్స్, పెన్షన్ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నా విజయవంతం అయ్యిందన్నారు. డిసెంబర్​5న మళ్లీ నిర్వహించనున్న భారీ ధర్నాను సక్సెస్​ చేయాలన్నారు. 

కేంద్ర ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తున్రు
ఆదిలాబాద్ :
కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్డుకుంటోందని చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆరోపించారు. బుధవారం జైనథ్ మండలం హసీంపూర్ గ్రామస్తులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్​కు కేంద్రం 70 శాతం నిధులిస్తే... రాష్ట్ర వాటా ఇచ్చేందుకు ఐదేళ్లు పట్టిందన్నారు. పార్టీ జైనథ్ మండల అధ్యక్షుడు రాందాస్, లీడర్లు రమేశ్,​వెంకన్న, లోక ప్రవీణ్ రెడ్డి, ముకుంద్, ధోనిజ్యోతి, విజయ్ కుమార్ తదితరులు ఉన్నారు. 

హెల్మెట్‌‌‌‌ తప్పనిసరి: డీసీపీ అఖిల్​ మహాజన్​
మంచిర్యాల : ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్​ ధరించాలని డీసీపీ అఖిల్​ మహాజన్​ అన్నారు. రోడ్డు భద్రత వారోత్సవాల్లో భాగంగా బుధవారం జిల్లా కేంద్రంలోని లక్ష్మీ టాకీస్ చౌరస్తా వద్ద హెల్మెట్‌‌‌‌ ధరించిన వారికి గులాబీ పూలు ఇచ్చి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మద్యం తాగి, సెల్‌‌‌‌ఫోన్‌‌‌‌ మాట్లాడుతూ వాహనం నడపరాదని, బైక్​పై ముగ్గురు వెళ్లరాదని సూచించారు. మితిమీరిన వేగంతో వాహనం నడిపేవారికి ఫైన్లు వేస్తామన్నారు. సీటు బెల్టు ధరించి కారు నడపాలని కోరారు. ట్రాఫిక్ ఇన్స్​పెక్టర్ నరేష్​కుమార్, ఎస్సైలు సిబ్బంది పాల్గొన్నారు. 

ఎంపీ ఫొటో ఎందుకు పెట్టలేదు?
బైంసా : ముధోల్ డీలక్స్​కల్యాణమండపంలో బుధవారం నిర్వహించిన తల్లిపాల వారోత్సవాల ఫ్లెక్సీలో ఎంపీ సోయం బాపూరావు ఫొటో ఎందుకు పెట్టలేదని బీజేపీకి చెందిన ఎంపీటీసీ సభ్యుడు భూమేశ్​ఆఫీసర్లను నిలదీశారు. ప్రొటోకాల్​విస్మరించడం దారుణమని ఫైర్​అయ్యారు. కొద్దిసేపు నిరసన వ్యక్తం చేశారు. స్పందించిన ఐసీడీఎస్​పీడీ విజయలక్ష్మి ఫొటో పెట్టకపోవడం తప్పేనని క్షమాపణ కోరారు. మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటామన్నారు.

ఇంటింటా జాతీయ జెండా ఎగరాలి
ఆదిలాబాద్ :
భారతదేశ ఖ్యాతి ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి చెప్పారు. బుధవారం రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ బైక్ ర్యాలీకి వీడ్కోలు పలికి మాట్లాడారు. ర్యాలీ ఈనెల 15న ఢిల్లీ చేరుకుంటుందన్నారు. ఆజాదీకా అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతీ ఇల్లు, ప్రతీ వాడలో జాతీయ జెండా ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో టూ టౌన్ సీఐ కె. శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. 

వర్గీకరణ చేయకుంటే బీజేపీని ఓడిస్తాం
ఆసిఫాబాద్ : ఎస్సీల వర్గీకరణ బిల్లుకు చట్టబద్ధత కల్పించకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడిస్తామని ఎమ్మార్పీఎస్​జాతీయ ఉపాధ్యక్షుడు రేగుంట కేశవ్ రావు మాదిగ ఫైర్ అయ్యారు. బుధవారం ఆయన జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కోరుతూ రిలే నిరాహారదీక్ష చేపట్టారు. పార్లమెంటు సమావేశాల్లో బిల్లును చట్టబద్ధత కల్పించకపోతే బీజేపీ లీడర్లను తిరగనిచ్చే ప్రసక్తేలేదన్నారు. దీక్షలో మహిళా సమాఖ్యా జిల్లా నాయకురాలు రేగుంట యశోద మాదిగ , ఏముర్ల పోచం మాదిగ, పస్తము అంజన్న, కల్యాణ్, భీమేశ్​ తదితరులు పాల్గొన్నారు.

కుభీరులో జ్వరాలు
కుభీరు : కుభీరు మండలంలో జ్వరపీడితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. గ్రామాలు, పల్లెలు, తండాల్లో ప్రతీ ఇంట్లో ఒకరిద్దరు జ్వరంతో బాధపడుతున్నారు. బాధితులతో గవర్నమెంట్, ప్రైవేట్​హాస్పిటళ్లు కిటకిటలాడుతున్నాయి. చాలామంది వైద్యం కోసం పీఎంపీలు, ఆర్ఎంపీల చుట్టూ తిరుగుతున్నారు. మండల కేంద్రంలోని సర్కార్​దవాఖానలో ఒకే బెడ్​పై ఇద్దరికి చికిత్సలు అందిస్తున్నారు. వైద్య సిబ్బంది రౌండ్​ద క్లాక్​అందుబాటులో ఉండి సేవలు అందించాలని స్థానికులు కోరుతున్నారు.

జాతీయభావన పెంచేందుకే ‘ఘర్​ఘర్​ తిరంగా’
నిర్మల్ :
ప్రధాని నరేంద్రమోడీ పిలుపు మేరకు ‘హర్​ఘర్..​ తిరంగా’లో భాగంగా ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని బీజేపీ పెద్దపల్లి ఇన్​చార్జి, ఆపార్టీ కృష్ణ, గోదావరి జలాల పరిరక్షణ కమిటీ కన్వీనర్​ రావుల రాంనాథ్​ పిలుపునిచ్చారు. బుధవారం నిర్మల్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. జాతీయ భావం పెంపొందించేదుకే ప్రధాని ఈ కార్యక్రమాన్ని చేపట్టారన్నారు. సింగరేణి ఉద్యోగుల ఇళ్లపై ...మందమర్రి,వెలుగు: సింగరేణి ఉద్యోగులకు, కాంట్రాక్ట్​ కార్మికులకు జాతీయ పతాకాలను పంపిణీ చేస్తున్నట్లు మందమర్రి ఏరియా జీఎం చింతల శ్రీనివాస్ చెప్పారు. బుధవారం జీఎం ఆఫీస్​లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఉద్యోగులకు జాతీయ జెండాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఏరియా ఎస్​వోటు జీఎం సీహెచ్.కృష్ణారావు, పర్సనల్ మేనేజర్​ వరప్రసాద్, డీజీఎం ఐఈడీ రాజన్న, కేకే ఓసీపీ పీవో రమేశ్, డీవైపీఎం శ్యాంసుందర్, సర్వే అధికారిఉజ్వల్ బందోపాధ్యాయ, సీనియర్ అకౌంట్స్​ ఆఫీసర్ రమేశ్ తదితరులు పాల్గొన్నారు. 

నాణ్యమైన భోజనం అందించాలి 
దండేపల్లి : హాస్టల్ విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని ఏఎస్​డబ్ల్యూవో రవీందర్​గౌడ్ సూచించారు. మంగళవారం రాత్రి లక్సెట్టిపేటలోని ఎస్సీ బాయ్స్​ హాస్టల్​లో బస చేసి నిద్రించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. హాస్టల్ చుట్టూ పరిశుభ్రత పాటించాలని, పారిశుధ్యంపై సిబ్బంది ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని సూచించారు. వర్షాకాలం కావడంతో వ్యక్తిగత శుభ్రత పాటించాలన్నారు. విద్యార్ధులకు ఎప్పటికప్పుడు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేయాలని అన్నారు.కిచెన్ రూమ్ పరిశీలించి ఆహార పదార్థాలను చెక్ చేశారు. హాస్టల్ రికార్డ్స్ తనిఖీ చేశారు. ఆయన వెంట హాస్టల్ వార్డెన్ రాజు ఉన్నారు.

బీజేపీలో చేరిన టీఆర్ఎస్ సర్పంచ్ 
దండేపల్లి : దండేపల్లి మండలం కర్ణపేట సర్పంచ్ మారినేని రాజేశ్వరి టీఆర్​ఎస్​ నుంచి బీజేపీలో చేరారు. బుధవారం మంచిర్యాలలోని బీజేపీ జిల్లా ఆఫీసులో పార్టీ జిల్లా అధ్యక్షుడు వెర్రబెల్లి రఘునాథ్​రావును కలిసి ఆయన సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. ఆదివాసీ గిరిజనుల హక్కులను కాపాడేది నరేంద్రమోదీ ప్రభుత్వమేనని ఆమె అన్నారు. రాజేశ్వరి నాయక్​ పోడ్​ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.  

ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానం 
మంచిర్యాల : ఒక సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమని ఏసీపీ తిరుపతిరెడ్డి చెప్పారు. బుధవారం కమ్యూనిటీ పోలీసింగ్​లో భాగంగా హైటెక్ సిటీ కాలనీలో సీపీ కెమెరాల గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సీసీ కెమెరాల ఏర్పాటుపై కాలనీవాసులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు సహకరించాలని కోరారు. జైపూర్ డివిజన్​లో ఎన్నో కీలకమైన కేసులను సీసీ కెమెరాల ద్వారా ఛేదించామన్నారు. సీఐ నారాయణ నాయక్​ పాల్గొన్నారు. 

రేణుకా సిమెంట్​ ఫ్యాక్టరీ ప్రారంభించాలి
ఆదిలాబాద్ : ఆదిలాబాద్ కు మంజూరు చేసిన రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ పనులు ప్రారంభించాలని బీజేపీ నేత సుహాసిని రెడ్డి కోరారు. బుధవారం ఢిల్లీలో నేషనల్ కమిషన్ షెడ్యుల్ ట్రైబ్స్ సభ్యులు అనంత నాయక్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ సిక్తా పట్నాయక్, రాథోడ్ రమేశ్ తో పాటు బీజేపీ నేత సుహాసిని రెడ్డి హాజరయ్యారు. రేణుకా సిమెంట్ ఫ్యాక్టరీ పేరుతో ఆదివాసీ రైతులకు మోసం జరిగిందన్నారు. మూడేళ్లలో ఫ్యాక్టరీ నిర్మించి ఉద్యోగాలు ఇస్తామని నమ్మించి నట్టేట ముంచారన్నారు. భూ నిర్వసితులు కొట్నక్ విఠల్, కొట్నాక్ జంగు,కాంత రావు అధికారులు పాల్గొన్నారు.

కరెంట్​ కోతలపై రైతుల కన్నెర్ర  
దండేపల్లి : కరెంట్​ కోతలపై మంచిర్యాల జిల్లా దండేపల్లి మండల రైతులు కన్నెర్రజేశారు. అప్రకటిత కోతలను నిలిపివేయాలని రోడ్డెక్కి రాస్తారోకో నిర్వహించారు. మండలంలోని మాకులపేట, నాగసముద్రం రైతులు బుధవారం మాకులపేట స్టేజీ వద్ద రాస్తారోకో నిర్వహించి విద్యుత్ అధికారుల పనితీరుపై నిరసన వ్యక్తం చేశారు. జన్నారం మండలం తపాలపూర్ సబ్ స్టేషన్ ఫీడర్ నుంచి కరెంట్​ సప్లై ఇస్తుండడంతో మాటిమాటికి అంతరాయం కలుగుతోందన్నారు. కడెం ప్రాజెక్టు నీళ్లు రాకపోవడంతో మోటర్ల కింద సాగు చేస్తున్న భూములకు నీళ్లందక దుక్కులు ఎండి పోయి నాట్లు ఆలస్యం అవుతున్నాయని అన్నారు. ఎస్సై సాంబమూర్తి ఏఈతో ఫోన్​లో మాట్లాడి సపరేట్ ఫీడర్ ఏర్పాటుకు హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.