ఆసిఫాబాద్(రెబ్బెన),వెలుగు: రెబ్బెనలో రైల్వే భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎంపీ సోయం బాపూరావు హామీ ఇచ్చారు. బుధవారం ఆయన నిర్వాసితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ ఇబ్బందులు అన్నీ దూరమవుతాయని, నిర్వాసితులు ఎవరూ అధైర్యపడొద్దని భరోసా ఇచ్చారు. రానున్న రోజుల్లో రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని, ఇక్కడి 222 మంది నిర్వాసితులకు పట్టాలు ఇస్తామని తెలిపారు. గల్లీ ఖాళీ ఉంటే బ్రాందీ షాపు, జాగ ఖాళీ ఉంటే కబ్జాలు చేసుడు టీఆర్ఎస్లీడర్ల పనిగా మారిందని ఫైర్అయ్యారు. చిరు వ్యాపారుల కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శులు కొట్నాక విజయ్ కుమార్, సుదర్శన్ గౌడ్, కోర్ కమిటీ మెంబర్ అజ్మీర ఆత్మరాం నాయక్, అసెంబ్లీ కన్వీనర్ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
బెల్లంపల్లిలో ఎక్స్ ప్రెస్ రైళ్లు హాల్టింగ్కల్పించాలి...
బెల్లంపల్లి,వెలుగు: బెల్లంపల్లి రైల్వేస్టేషన్ లో దక్షిణ్, జీటీ, రాయ్ పూర్, కెరళ, ఏపీ, ఎక్స్ ప్రెస్ రైళ్ల హాల్టింగ్‌కు చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి నియోజికవార్గ బీజేపీ ఇన్ చార్జి కొయ్యల ఏమాజీ ఆధ్వర్యంలో బుధవారం ఎంపీకి వినతిపత్రం అందజేశారు. రైల్వే జీఎంతో మాట్లాడి రైళ్లు ఆపేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ వారికి హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు పులుగం తిరుపతి, జిల్లా కార్యదర్శి గోవర్దన్, అసెంబ్లీ కో కన్వీనర్ రాజులాల్ యాదవ్, శనిగరపు శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
పట్టపగలు దొంగల బీభత్సం
మందమర్రి,వెలుగు: కోల్బెల్ట్ఏరియాలో వరుస దొంగతనాలు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నాయి. బుధవారం పట్టపగలే సింగరేణి కార్మికుడి ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు పట్టణంలోని మూడోజోన్లోని గడ్డం రాజ్ కుమార్ ఇంట్లో 15 తులాల నగలు, రూ.15 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఏరియాలోని కేకే5 గనిలో రాజ్కుమార్జనరల్ మజ్దూర్‌గా పనిచేస్తున్నాడు. కార్మికుడు డ్యూటీకి వెళ్లగా మధ్యాహ్నం ఆయన భార్య సుజాత ఇంటికి తాళం వేసి పిల్లలకు లంచ్ బాక్స్ఇచ్చేందుకు స్కూల్‌కు వెళ్లింది. తిరిగి వచ్చి చూసేసరికి బీరువాలో దాచిన నగలు, క్యాష్ మాయమయ్యాయి. దొంగలు ఇంటి వెనుక తలుపులు పగులగొట్టి చోరీకి పాల్పడినట్లు సుజాత గుర్తించింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. సర్కిల్ పరిధిలో ఇటీవల వరుస దొంగతనాలు జరుగుతున్నాయి. గత నెల 30న రామకృష్ణాపూర్ భగత్‌సింగ్‌నగర్‌లోని ట్రాఫిక్ హెడ్‌కానిస్టేబుల్ తిరుమచారి ఇంట్లో దొంగలు 10 తులాల నగలు, ఎదురింట్లో ఉండే రమేశ్ ఇంట్లో రూ.రెండు లక్షల క్యాష్, రెండు తులాల నగలు ఎత్తుకెళ్లారు.
మోడీని కించపరిస్తే సహించేది లేదు
నిర్మల్,వెలుగు: ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కించపరిచే విధంగా మాట్లాడితే సహించేది లేదని బీజేపీ పెద్దపల్లి జిల్లా ఇన్ చార్జి రావుల రామ్‌నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి స్థాయిలో ఉన్న కేటీఆర్ ప్రధానమంత్రిపై అన్ పార్లమెంటరీ భాష వాడడం దారుణమన్నారు. సీఎం కేసీఆర్, కేటీఆర్ ల పేరు చెప్తేనే దేశంలోని ఇతర రాష్ట్రాల అన్ని పార్టీల లీడర్లు నవ్వుకుంటున్నారన్నారు. మునుగోడు టీఆర్ఎస్ ఓడిపోతుందని అన్ని సర్వేలు చెబుతున్నాయన్నారు. దీంతో కేసీఆర్, కేటీఆర్ మతిభ్రమించి మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. నర్సాపూర్ దళితులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో దళిత మోర్చా జిల్లా అధ్యక్షుడు రాచకొండ సాగర్, లీడర్లు శ్రీనివాస్, అయ్యన్నగారి రాజేందర్, అనుముల శ్రావణ్, అల్లం భాస్కర్, బాబా పాల్గొన్నారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
జన్నారం,వెలుగు: చింతలపల్లే గ్రామంలో మంగళవారం రాత్రి హత్యకు గురైన జింక లచ్చన్న, రాజేశ్వరి దంపతుల మృతదేహాలను బుధవారం నిందితుడు గూడ సత్తన్న ఇంటి ఎదుట ఉంచి బంధువులు ఆందోళన నిర్వహించారు. అక్కడే దహన సంస్కారాలు చేసేందుకు రెడీ అయ్యారు. విషయం తెలుసుకున్న లక్సెట్టిపేట సీఐ కరీముల్లాఖాన్ ఘటనా స్థలానికి చేరుకొని అడ్డుకున్నారు. బంధువులు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. చివరకు సీఐ, గ్రామపెద్దలు నచ్చజెప్పి నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని బంధువులకు హామీ ఇవ్వడంతో నిరసన విరమించారు. మృతదేహాలను అక్కడి నుంచి శ్మశానానికి తరలించి దహన సంస్కారాలు నిర్వహించారు.
గ్రూప్ 1 పరీక్ష కోసం పకడ్బందీ ఏర్పాట్లు
నిర్మల్,వెలుగు: గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కలెక్టరేట్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈనెల 16న ఉదయం 10.30 గంటల నుంచి ఒంటి గంట వరకు పరీక్ష ఉంటుందన్నారు. నిర్మల్‌జిల్లాలో మొత్తం 4,492 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నారు. దీని కోసం 19 కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అభ్యర్థుల కోసం బయోమెట్రిక్విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. కేంద్రాల చుట్టుపక్కల144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు హేమంత్ బోర్కడే, రాంబాబు, ఎస్పీ ప్రవీణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
వైద్య సేవలు సద్వినియోగం చేసుకోవాలి
కాగజ్ నగర్,వెలుగు: కాగజ్‌నగర్ రైల్వే స్టేషన్లో బుధవారం లైఫ్ లైన్ ఎక్స్ ప్రెస్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫ్రీ మెడికల్ క్యాంప్‌ను ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, అడిషనల్ కలెక్టర్ చాహ త్ బాజ్ పేయ్, మున్సిపల్ చైర్మన్ సద్దాం హుస్సేన్ తో కలిసి ప్రారంభించారు. వచ్చే నెల 2 వరకు నిర్వహించే ఈ శిబిరంలో రకరకాల ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి పరీక్షలు చేస్తారన్నారు. దీనిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు. అడిషనల్ కలెక్టర్ చాహత్ బాజ్‌పేయ్ మాట్లాడుతూ పేద ప్రజలకు మెరుగైన వైద్యం అందడం గొప్ప విషయమన్నారు. నిర్వాహకులు, వైద్యులు పునీత్ శర్మ, టవరా మాట్లాడుతూ ప్రతీ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఫ్రీగా పరీక్షలు, సర్జీలు చేసి మందులు పంపిణీ చేస్తామన్నారు. వైద్య పరీక్షల కోసం వచ్చిన వారికి రైల్వే స్టేషన్‌సమీపంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప భోజన సదుపాయం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో డీఎంహెచ్‌వో ప్రభాకర్ రెడ్డి, డిప్యూటీ డీ ఎం హెచ్ వో సీతారాం నాయక్, ఆర్పీ ఎఫ్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు.