అదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

సింగరేణి హాస్పిటళ్లలో డాక్టర్లను నియమించాలె

రామకృష్ణాపూర్/నస్పూర్,వెలుగు: రామకృష్ణాపూర్​ సింగరేణి ఏరియా హాస్పిటల్​లో స్పెషలిస్టు డాక్టర్లు, సిబ్బంది కొరత ఉందని, సింగరేణి కుటుంబాలకు వైద్య సేవలు అందడంలేదని ఏఐటీయూసీ జనరల్ సెక్రటరీ వాసిరెడ్డి సీతారామయ్య ఆరోపించారు. బుధవారం మందమర్రి ఏరియా రామకృష్ణాపూర్​ ఏరియా హాస్పిటల్, శ్రీరాంపూర్  సీహెచ్​పీ ఆవరణలో వేర్వేరుగా జరిగిన గేట్​ మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ఆసుపత్రుల్లో అంబులెన్స్ సౌకర్యం, సరియైన మందులు లేవన్నారు. గుర్తింపు సంఘం ఎన్నికల్లో ఏఐటీయూసీ ఒంటరిగా పోటీ చేస్తోందని తెలిపారు. టీబీజీకేఎస్​తో ఎలాంటి పొత్తు ఉండదన్నారు. బీజేపీని ఓడించడమే టార్గెట్​గా మునుగోడులో టీఆర్ఎస్​కు సీపీఐ మద్దతు తెలుపుతుందన్నారు. 

కాసిపేట గనిపై ఎంప్లాయీస్​ ఆందోళన

మందమర్రి,వెలుగు: మందమర్రి ఏరియా కాసిపేట-1 గనిలో సీనియర్ ఎంప్లాయీస్​ను కాదని జూనియర్​ బదిలీ వర్కర్​కు ల్యాంప్​రూమ్​లో డ్యూటీ కేటాయించడాన్ని నిరసిస్తూ గని కార్మికులు ఆందోళనకు దిగారు. బుధవారం గని మేనేజర్​ ఆఫీస్​ ఎదుట 'ఏ'రిలే కార్మికుల నల్లబ్యాడ్జీలు ధరించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ ఏరిలే షిఫ్ట్​లో ల్యాంప్ ​రూం మజ్దూర్ యాక్టింగ్ పోస్టు ఖాళీగా ఉందన్నారు. తమ రిలేకు చెందిన జనరల్ మజ్దూర్ ఒకరు యాక్టింగ్​ చేస్తున్నాడని, ఆయన డ్యూటీలకు రాకపోతే ఆఫీసర్లు తమలో ఒక్కరికి బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుందన్నారు. నిరసనలో ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ దాగం మల్లేశ్, పిట్​సెక్రటరీ వెంకటస్వామి, లక్ష్మీనారాయణ, వి.రాజేందర్, 
ఆడెపు రవీందర్, అయిలి రాజం, రామకృష్ణ, రాయమల్లు, ఆంకులు, దామోదర్, శ్రీనివాస్​  పాల్గొన్నారు. 

ఒకే ఊరిలో నలుగురి ఆత్మహత్యాయత్నం

ఖానాపూర్/కడెం, వెలుగు: వేరేవేరు కారణాలతో ఒకే ఊరికి చెందిన నలుగురు బుధవారం ఆత్మహత్యకు యత్నించారు. దస్తురాబాద్​ మండలం మున్యాల్ తండాకు చెందిన నాగవత్ రేఖ తన చిన్నకొడుకుతో కలిసి గ్రామ శివారులోని పత్తి చేనులో పురుగుల మందుతాగింది. డబ్బులు కావాలని పెద్ద కొడుకు గొడవ చేయడంతోనే వారు ఆత్మహత్యకు యత్నించినట్లు తెలిసింది. గమనించిన స్థానికులు వైద్యం కోసం కరీంనగర్​లో హాస్పిటల్​కు తరలించారు. అదే గ్రామానికి చెందిన నగవత్ ప్రేమ్ సింగ్ భార్యతో గొడవ పడ్డాడు. ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో మనస్థాపానికి గురై పురుగుల మందు తాగాడు.  మరో ఘటనలో భూవివాదం కారణంగా గ్రామానికి చెందిన ధర్మసోత్ శ్రీనివాస్ లిక్కర్​లో పురుగుల మందు కలుపుకొని తాగాడు. న్యాయా చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో తాను ఈ అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు వాట్సాప్​లో పోస్టు పెట్టాడు. ఒకే రోజు ఒకే ఊరిలో నలుగురు ఆత్మహత్యకు యత్నించడంతో గ్రామంలో విషాద ఛాయలు 
అలుముకున్నాయి.

ఆధ్యాత్మిక కేంద్రంగా నిర్మల్​మహా పాదయాత్రలో  మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి

నిర్మల్,వెలుగు: జిల్లాను ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఇప్పటివరకు దాదాపు రూ.100 కోట్లు ఖర్చుచేసినట్లు మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి చెప్పారు. బుధవారం స్థానిక గండి రామన్న సాయిబాబా ఆలయం నుంచి కదిలి పాపహరేశ్వర ఆలయం వరకు చేపట్టిన మహా పాదయాత్రలో మంత్రి పాల్గొన్నారు. మొదట మంత్రి సాయిబాబా ఆలయంలో సింగిల్ ట్రస్టీ లక్కడి జగన్మోహన్ రెడ్డి తో కలిసి పూజలు నిర్వహించారు. అనంతరం మహాపాదయాత్రను మంత్రి ప్రారంభించి కాషాయ జెండా పట్టుకొని యాత్రలో పాల్గొన్నారు. కార్యక్రమానికి ముందు స్థానిక దత్తాత్రేయ నగర్ లో దత్తాత్రేయ ఆలయానికి భూమిపూజ చేశారు. మహా పాదయాత్ర కదిలి పాపహరేశ్వర ఆలయం వద్ద ముగిసింది. దేవాలయాలు ప్రశాంత కేంద్రాలుగా వర్ధిల్లుతున్నాయని మంత్రి తెలిపారు. దైవ సన్నిధిలో గడిపితే నైతిక విలువలు, విచక్షణ జ్ఞానం పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో సాయి సేవ దీక్షా సమితి అధ్యక్షుడు లక్కడి జగన్మోహన్ రెడ్డి, జడ్పీ చైర్​పర్సన్​విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, టీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ రాము తదితరులు పాల్గొన్నారు

చెన్నూర్​ నుంచి  సుమన్​ను తరిమికొట్టాలి 

చెన్నూర్​, వెలుగు: చెన్నూర్​ నియోజకవర్గ ప్రజల సమస్యలు పట్టించుకోకుండా, హైదరాబాద్​కే పరిమితమైన ఎమ్మెల్యే బాల్క సుమన్​ను ఇక్కడి నుంచి తరిమికొట్టేందుకు ప్రజలందరూ సిద్ధం కావాలని టీడీపీ పెద్దపల్లి పార్లమెంట్​ కన్వీనర్ సంజయ్​కుమార్​  పిలుపునిచ్చారు. బుధవారం టీడీపీ మండల కమిటీని ప్రకటించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. బాల్క సుమన్​ పాలనలో చెన్నూర్​ టౌన్​ అధ్వానంగా మారిందన్నారు. కోట్లు దండుకొని చైర్​పర్సన్​ పదవిని కట్టబెట్టాడని విమర్శించారు. మున్సిపల్​ కౌన్సిలర్లు బెల్టుషాపులు నడుపుతూ, లంచాలు తీసుకుంటూ, ఉద్యోగాలు ఇప్పిస్తామని వసూళ్లకు పాల్పడుతున్నారని ఆరోపించారు. 

29 మంది టీచర్లకు షోకాజు నోటీసులు 

నిర్మల్,వెలుగు: గవర్నమెంట్ టీచర్లు లైవ్ లోకేషన్ షేర్ చేయకపోవడంపై  కలెక్టర్ ముషారఫ్​అలీ ఫారూఖీ సీరియస్​అయ్యారు. బుధవారం లోకేషన్​షేర్​చేయని 29 మంది ఉపాధ్యాయులకు షోకాజు నోటీసులు జారీచేశారు. 24 గంటల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించారు. రెండేళ్లుగా జిల్లాలో టీచర్ల హాజరు కోసం లైవ్ లోకేషన్ సిస్టం అమలు చేస్తున్న విషయం తెలిసిందే. కొద్ది రోజులుగా పలువురు లోకేషన్​షేర్​చేయకపోవడంపై కలెక్టర్ సీరియస్ గా తీసుకున్నారు. 

రోడ్లు వేయలేదని బురదలో నిరసన

ఆదిలాబాద్​టౌన్,వెలుగు: ఆదిలాబాద్ రూరల్ మండలంలోని ఆదివావాసీ గిరిజనల గ్రామాల్లోని సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు, జడ్పీ మాజీ చైర్​పర్సన్ సుహాసినిరెడ్డి పాదయాత్ర చేపట్టారు. తిప్ప గ్రామం నుంచి ఆదిలాబాద్ వరకు 35 కిలో మీటర్ల పాదయాత్ర నిర్వహించారు. అనంతరం కలెక్టర్​కు వినతి పత్రం అందజేశారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా.. ప్రభుత్వం ఆదివాసీలకు రోడ్డు, తాగునీరు కల్పించడం లేదంటే సిగ్గు చేటన్నారు. ఈ సందర్భంగా బురద రోడ్డుపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసన వ్యక్తం చేశారు. అత్యవసర సమయాల్లో అంబులెన్స్ సైతం గ్రామాలకు రావడంలేదన్నారు. రెండు సంవత్సరాలు గడుస్తున్న రోడ్ల పనులు శిలాఫలకాలకే పరిమితమయ్యాయన్నారు. ఆదివాసీలకు ఇంతవరకు భగీరథ నీరు అందడంలేదన్నారు. ఆదివాసీల సమస్యలు వెంటనే పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. 

విద్యా సంస్థల బంద్ సక్సెస్ చేయండి

ఆసిఫాబాద్ ,వెలుగు: పెంచికల్​పేట మండలం ఎల్లూర్ రెసిడెన్షియల్​స్కూల్​లో చదువుతున్న విద్యార్థి అల్లం రాజేశ్ మృతి నిరసనగా గురువారం విద్యా సంస్థల బంద్ సక్సెస్ చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. బుధవారం వారు స్థానికంగా మాట్లాడారు. విద్యార్థి కుటుంబానికి రూ. 15 లక్షల ఎక్స్​గ్రేషియా, ఇంట్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి ఆత్మకూరు చిరంజీవి, డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గొడిసెల కార్తీక్, పీడీఎస్ యూ జిల్లా కార్యదర్శి జగజంపుల తిరుపతి, యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు గుండా శ్యామ్, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు పొల్కర్ సాయిరాం, కాంగ్రెస్ మండల కమిటీ అధ్యక్షుడు చరణ్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు అవిడపు ప్రణయ్ పాల్గొన్నారు.