ముక్కోటికి భద్రాద్రి శ్రీరామదివ్యక్షేత్రం ముస్తాబైంది. జనవరి 1న గోదావరిలో జరిగే తెప్పోత్సవం, 2న జరిగే వైకుంఠ ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. లక్ష మందికి పైగా భక్తులు తెప్పోత్సవం, వైకుంఠ ద్వార దర్శనం చేసుకుంటారనే అంచనాతో శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం రూ.1.30 కోట్లతో సౌలతులు కల్పిస్తోంది. గోదావరి నదిలో సీతారామయ్య విహరించే సన్నివేశం తిలకించేందుకు స్నానఘట్టాలను సుందరంగా తీర్చదిద్దారు.
మెట్లకు రంగులు వేసి అందంగా మలిచారు. వైకుంఠ ద్వార దర్శనం తర్వాత అంతరాలయంలో అర్చనల కోసం ఏర్పాటు చేశారు. భక్తుల కోసం 2 లక్షల లడ్డూలను అదనంగా సిద్ధం చేస్తున్నారు. భక్తులందరికీ దర్శనం అనే నినాదంతో ఏర్పాట్లు చేస్తున్నట్లు ఈవో శివాజీ తెలిపారు. వైకుంఠ ద్వారం సెక్టార్ల టిక్కెట్లను ఆన్లైన్లో పెట్టారు. వీఐపీ, ఏ, బీ, సీ, డీ,ఈ సెక్టార్ల టిక్కెట్లను విక్రయిస్తున్నారు. అలాగే ఆఫ్లైన్లోనూ ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేసి టిక్కెట్లను అమ్ముతున్నారు. -భద్రాచలం,వెలుగు
బీఆర్ఎస్ కౌన్సిలర్లే లొల్లి పెట్టుకున్రు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: అధికార బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ల మధ్య లొల్లితో శుక్రవారం జరిగిన కొత్తగూడెం మున్సిపల్ సమావేశం రసాభాసగా మారింది. మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అధ్యక్షతన జరిగిన మీటింగ్ ప్రారంభం నుంచే బీఆర్ఎస్ పార్టీలోని రెండు వర్గాల మధ్య గొడవ మొదలైంది. అధికారులు, చైర్పర్సన్, కాంట్రాక్టర్లు కుమ్ముక్కై ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారంటూ పలువురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ఆరోపించారు. మార్కెట్ టెండర్‌కు సంబంధించి చిరు వ్యాపారుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న కాంట్రాక్టర్ మున్సిపాలిటీకి డబ్బులు కట్టడం లేదని నిలదీశారు.
దీంతో రెండు వర్గాల నడుమ వాగ్వాదం జరిగింది. చైర్ పర్సన్‌తో పాటు ఆమె అనుచరుల తీరును నిరసిస్తూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు బండి నర్సింహారావు, కూరపాటి విజయ, సత్యభామ, సాహెరాబేగం, రాజనళిని, జయంతి, భీమా శ్రీవల్లి, మోరే రూప, లాలా రాణి, వేణు, దామోదర్ మీటింగ్ బహిష్కరించి మున్సిపల్ ఆఫీస్ ఎదుట ప్ల కార్డులతో నిరసన తెలిపారు. ప్రజా సమస్యలపై ప్రశ్నించే కౌన్సిలర్ల పట్ల వివక్ష చూపుతున్నారని ఆరోపించారు.
బీఆర్ఎస్ నేతల నిరసన..
చైర్ పర్సన్‌తో పాటు ఆమె అనుచరులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ పార్టీని భ్రష్టు పట్టిస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు భీమా శ్రీధర్, సుందర్, యూసుఫ్, మసూద్, మోరే రమేశ్ఆరోపించారు. పార్టీ పరువు తీసేలా చైర్ పర్సన్, కొందరు కౌన్సిలర్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ మున్సిపాలిటీ ఎదుట నిరసన తెలిపారు.
బీఎస్పీ ఆందోళన..
కొత్తగూడెం పట్టణంలోని రామవరంలో ప్రభుత్వ నిధులతో నిర్మించిన పార్క్‌కు ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు పేరు పెట్టేందుకు బీఆర్ఎస్ పాలకులు యత్నించడం దారుణమని బీఎస్పీ నాయకులు విమర్శించారు. దీనిని నిరసిస్తూ మున్సిపాలిటీ ఎదుట కళ్లకు గంతలు కట్టుకొని ధర్నా చేపట్టారు. పార్క్‌కు వనమా పేరు పెడితే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేశ్, నాయకులు పాల్గొన్నారు.
ఉప సర్పంచ్ పై అవిశ్వాస తీర్మానం
అశ్వారావుపేట, వెలుగు: మండలంలోని అనంతారం ఉప సర్పంచ్ దాసరి నాగేందర్రావుపై వార్డు సభ్యులు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. శుక్రవారం రాత్రి తీర్మానం కాపీని ఎంపీవోకు అందించేందుకు మండలకేంద్రానికి రాగా, ఆయన అందుబాటులో లేకపోవడంతో ఎంపీపీ జల్లిపల్లి శ్రీరామమూర్తికి అందజేశారు. వార్డు సభ్యులు వెంకటలక్ష్మి, సావిత్రి, సుబ్బమ్మ, అశోక్, అజయ్, వెంకటేశ్, పుష్పవతి మాట్లాడుతూ సర్పంచ్ పాయం కామయ్య అనారోగ్య కారణాలతో రాజీనామా చేయడంతో సర్పంచ్‌గా కొనసాగుతున్న నాగేందర్రావు ఇష్టారీతిగా పనులు చేస్తున్నాడని ఆరోపించారు. ఎంపీవో ద్వారా డీపీవోకు తీర్మాన పత్రాన్ని అందజేయనున్నట్లు తెలిపారు.
సంబురాలు శృతిమించొద్దు
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: న్యూ ఇయర్ సంబురాలు ఇతరులను ఇబ్బంది పెట్టేలా ఉండకూడదని సీపీవిష్ణు ఎస్ వారియర్ తెలిపారు. నిబంధనలు పాటిస్తూ వేడుకలు సజావుగా జరుపుకొని పోలీసులకు సహకరించాలని ఆయన సూచించారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగుకుండా బందోబస్తు, పెట్రోలింగ్, డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తామని తెలిపారు. మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కేసులు నమోదు చేయాలని ఆదేశించినట్లు చెప్పారు.
పాల్వంచ: న్యూ ఇయర్ వేడుకల్లో నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని డీఎస్పీ టి సత్యనా రాయణ హెచ్చ రించారు. డీజేలకు అనుమతి లేదని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగినా, మద్యం తాగి వాహనాలు నడిపినా జరిమానాతో పాటు జైలుకు పంపుతామని తెలిపారు. ప్రజలు నిబంధనలు పాటించి సహకరించాలని సూచించారు.
గుండాల: న్యూ ఇయర్ వేడుకలను నిబంధనల మేరకు ప్రశాంతంగా జరుపుకోవాలని డీఎస్పీ రమణ మూర్తి సూచించారు. శుక్రవారం ఆలపల్లి పోలీస్ స్టేషన్ ను సందర్శించారు. రికార్డులను పరిశీలించి పలు సూచనలు చేశారు. న్యూ ఇయర్ సందర్భంగా రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తీసుకోవాలని ఎస్ఐ రతీశ్ను ఆదేశించారు.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యం
ఇల్లందు, వెలుగు: ప్రతీ ఒక్కరికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే హరిప్రియ అన్నారు. శుక్రవారం మండలంలోని పలు గ్రామాల్లో సబ్సెంటర్లను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రతి పల్లెకు వైద్యం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. అన్ని వసతులతో ఏర్పాటు చేసిన హెల్త్ సెంటర్లను ప్రజలు సద్వినియోగం చేసుకొవాలని కోరారు. హెల్త్సెంటర్లలో సిబ్బంది ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. టీఆర్ఎస్ మండల కన్వీనర్ రేణుక, ఎంపీపీ చీమల నాగరత్నమ్మ, కో ఆప్షన్ మెంబర్ ఘాజీ పాల్గొన్నారు.
బైరి నరేశ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలి
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: హిందూ దేవుళ్ల పట్ల అభ్యంతరకరంగా మాట్లాడిన బైరి నరేశ్‌ను వెంటనే అరెస్ట్ చేయాలని బీజేపీ యువ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఉపేందర్ డిమాండ్ చేశారు. పీడీ యాక్ట్ నమోదు చేయాలని కోరారు. ఖానాపురం హవేలీ పోలీస్‌స్టేషన్‌లో కంప్లైంట్ చేసినట్లు తెలిపారు. ఇలాంటి వ్యక్తుల పట్ల ఉదాసీనంగా వ్యవహరిస్తే కులాలు, మతాల మధ్య ఘర్షణలు జరిగే ప్రమాదం ఉందన్నారు.
కేసీఆర్ మెప్పు కోసం పాకులాడుతున్రు
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: సీఎం కేసీఆర్ మెప్పు కోసం సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభ్రదం బీజేపీని, ప్రధానిని విమర్శిస్తున్నారని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ మండిపడ్డారు. శుక్రవారం పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలో కేసీఆర్ రైతు వ్యతిరేక విధానాలపై మాట్లాడకుండా, మోడీపై విషం చిమ్మడమేమిటని ప్రశ్నించారు. కేరళలో అనేక మంది ఆర్ఎస్ఎస్, బీజెపీ కార్యకర్తలను దారుణంగా చంపించిన సీఎం పినరయి విజయన్, బీజేపీ విద్వేషాలను రెచ్చగొడుతుందని అనడం విడ్డూరంగా ఉందన్నారు. దేశాన్ని మోడీ నుంచి కాపాడేందుకు బీఆర్ఎస్తో కలిసి పని చేస్తామనడం హాస్యాస్పదమన్నారు. మునుగోడు ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్న కమ్యూనిస్టులు కేసీఆర్ తప్పిదాలను ప్రశ్నించడం మానేశారన్నారు. రుద్ర ప్రదీప్, నున్నా రవి, చంద్రశేఖర్, మందా సరస్వతి, అనంతు ఉపేందర్‌గౌడ్, రవి రాథోడ్, రాజేష్‌గుప్తా పాల్గొన్నారు.
ప్రతిపక్షం లేకుండా చేసేందుకు బీజేపీ యత్నం
వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ అధ్యక్షుడు విజయ రాఘవన్
ఖమ్మం టౌన్, వెలుగు: ప్రతిపక్షాలు లేకుండా చేయాలని బీజేపీ ప్రయత్నిస్తుందని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షుడు విజయ రాఘవన్ చెప్పారు. శ్రీనివాసరావునగర్ అమరవీరుల ప్రాంగణంలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మూడో మహాసభలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లౌకిక విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పి సోమయ్య, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బుర్రి ప్రసాద్, రాష్ట్ర అధ్యక్షుడు జి.నాగయ్య, ఆహ్వాన సంఘం అధ్యక్షుడు డాక్టర్ యలమంచిలి రవీంద్రనాథ్, బి. వెంకట్, విక్రమ్ పాల్గొన్నారు.