ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

తల్లీ.. సల్లగ సూడు

ఉమ్మడి జిల్లాలో పలు గ్రామాల్లో బోనాల సందడి నెలకొంది.  శ్రావణ మంగళవారం కావడంతో మహిళలు బోనం కుండను నెత్తిన పెట్టుకొని డప్పుచప్పుళ్లు, పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల శిగాల మధ్య గ్రామదేవతలైన పోచమ్మ, ఈదమ్మ ఆలయాలకు చేరుకున్నారు. గుళ్ల చుట్టూ పదక్షిణలు చేసి అమ్మవారికి నైవేద్యం పెట్టారు.   కొందరు భక్తులు కోళ్లు కోసి, కల్లు సాక పోసి మొక్కులు చెల్లించుకున్నారు.  వనపర్తి జిల్లా కేంద్రంలో  వ్యవసాయ శాఖ మంత్రి  నిరంజన్ రెడ్డి,  జడ్చర్లలో  ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వీరబ్రహ్మ చారి ఉత్సవాలకు హాజరై గ్రామదేవతలకు పూజలు చేశారు. - వనపర్తి,  నాగర్‌‌‌‌‌‌‌‌ కర్నూల్ టౌన్‌‌‌‌, జడ్చర్ల టౌన్, వెలుగు

వైభవంగా జములమ్మ కల్యాణం

గద్వాల, వెలుగు:  గద్వాల టౌన్‌‌‌‌ పరిధిలోని జమ్ముచెడులోని జమదగ్ని సమేత జములమ్మ అమ్మవారి కల్యాణాన్ని మంగళవారం వైభవంగా నిర్వహించారు.  వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల మధ్య  సాగిన ఈ వేడుకను చూసేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు.  అంతకుముందు ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.  ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ బీఎస్‌‌‌‌ కేశవ్ దంపతులు, గుడి చైర్మన్ సతీశ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రామేశ్వరమ్మ  పాల్గొన్నారు.

బాధిత ఫ్యామిలీకి పరిహారం
అమ్రాబాద్, వెలుగు: ఎలుగు బంటి దాడిలో గాయపడి మృతి చెందిన పదర మండలం చిట్లంకుంటకు చెందిన జెల్ల పోతయ్య (55) కూతురు జెల్ల లక్ష్మికి మంగళవారం డీఎఫ్‌‌‌‌వో రోహిత్ గోపిడి  రూ.  లక్ష  పరిహారం అందించారు. 2019లో పశువులను మేపేందుకు అడవి వెళ్లిన పోతయ్యపై  ఎలుగు దాడి చేయడంతో చికిత్స పొందుతూ 2020లో చనిపోయాడు. 

చెంచుల ఇండ్ల కోసం ప్లాన్ రెడీ
కలెక్టర్ ఉదయ్ కుమార్ 

నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు :  చెంచులకు 102 ఇండ్లు నిర్మించడంతో పాటు 10 శాతం వ్యక్తిగత పెట్టుబడిపై వ్యాపార యూనిట్లు నెలకొల్పేందుకు ప్లాన్‌‌‌‌ రెడీ చేసినట్లు కలెక్టర్ ఉదయ్ కుమార్ తెలిపారు.  మంగళవారం క్యాంపు ఆఫీసులో  ఐడీడీఏ పీవో, ఏపీవోలతో చెంచుల సాధికారతపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2019లో మంజూరు అయిన ఇండ్లు దాదాపు పూర్తికావచ్చాయన్నారు.  ప్రస్తుతం ఉపాధి కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని, ఇందులోభాగంగానే  చేపలు, తేనె ప్రాసెసింగ్ యూనిట్లు,  నన్నారి, గిరిరాజ కోళ్ల పెంపకం, చీపురు తయారీ లాంటి యూనిట్లు ఏర్పాటు ప్రణాళికు సిద్ధం చేశామన్నారు.  వీటితో పాటు సేంద్రియ సాగుకు నిధులు మంజూరయ్యాయని, వ్యవసాయ అధికారులతో చెంచులకు అవగాహన కల్పిమని చెప్పారు.  అలాగే ఆరోగ్యం, విద్య పరంగా అన్ని వసతులు సమకూరుస్తున్నామని చెప్పారు.  అనంతరం  చెంచు పెంటల్లో కల్పిస్తున్న మౌలిక సదుపాయాల గురించి అడిగి తెలుసుకొని..  ఇంకా ఎలాంటి సేవలు అందివచ్చో చర్చించారు.  ఈ సమావేశంలో రీజనల్ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ పుష్ప, డీటీడీవోలు చత్రు, కోటాజీ, అనిల్ ప్రకాశ్ పాల్గొన్నారు.

24న పల్లె, పట్టణాల్లో అధికారుల బస
కలెక్టర్ యాస్మిన్ బాషా

వనపర్తి, వెలుగు:వనపర్తి నియోజకవర్గంలోని 41 గ్రామాలు, 9 మున్సిపాలిటీల్లో సమస్యలు గుర్తించేందుకు ఈ నెల 24 న జిల్లా అధికారులు బస చేయనున్నట్లు  కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా తెలిపారు. మంగళవారం  కలెక్టరేట్‌‌‌‌లో  అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అధికారులు బృందం, ప్రజా ప్రతినిధులు సమావేశాలు నిర్వహించి కార్యాచరణ రెడీ చేసుకోవాలని సూచించారు.  గ్రామాలు, వార్డుల్లో పర్యటించి తాగునీరు, పారిశుద్ధ్యం, వైకుంఠ దామాలు, పల్లె ప్రకృతి వనాలు, తడి, పొడి చెత్తను వేరు చేయుట, కరెంట్ స్తంభాలకు లైట్లు అమర్చటం, హరితహారం కింద ఏర్పాటుచేసిన మొక్కలకు నీరు అందించటం లాంటి సమస్యలను పరిష్కరించాలన్నారు.  ఈ కార్యక్రమంలో అడిషనల్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌‌‌‌‌  ఆశిష్ సంగ్వాన్, జిల్లా అధికారులు  పాల్గొన్నారు.

బయో పెట్రోల్ వినియోగించాలి
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి, వెలుగు: కాలుష్యాన్ని నివారించేందుకు  బయో పెట్రోల్ వినియోగించాలని వ్యవసాయ శాఖ మంత్రి  నిరంజన్ రెడ్డి సూచించారు. మంగళవారం జిల్లాలోని నాగవరం, అంకూర్ ప్రాంతాల్లో బయో పెట్రోల్ బంక్‌‌‌‌లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆగ్రో ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో ఆగ్రో పెట్రోల్ పంపులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.  బయో పెట్రోలు ఉత్పత్తులను పెంచి  రాష్ట్రవ్యాప్తంగా ఈ బంక్‌‌‌‌లు పెట్టేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో  కలెక్టర్ షేక్ యాస్మిన్ బాషా,  జడ్పీ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గట్టు యాదవ్, అచ్మన్ ద్రిహాన్, గురు రాజ్ సంక్ పాల్గొన్నారు.

ఉడకని బువ్వ, నీళ్లచారు పెడుతున్రు

ఆలంపూర్, వెలుగు:  మధ్యాహ్న భోజనంలో ఉడికి ఉడకని బువ్వ, నీళ్లచారు పెడుతున్నారని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆరోపించారు.  మంగళవారం ఉండవెల్లి మండలం పుల్లూరు గ్రామంలోని జడ్పీహెచ్ఎస్‌‌‌‌లో ధర్నా చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్కూల్‌‌‌‌లో 163 విద్యార్థులు ఉన్నాయరని, మెనూ ప్రకారం భోజనం పెట్టడం లేదని మండిపడ్డారు.  ప్రతిరోజూ నీళ్లచారు,  ఉడకని అన్న పెండుతున్నారని, ఆఫీసర్లకు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పైఆఫీసర్లు స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.  

నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించండి
ఎస్పీ వెంకటేశ్వర్లు

నారాయణపేట, వెలుగు: నేరాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలను గుర్తించి నిఘా పెంచాలని ఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు.  మంగళవారం  సీఐ, ఎస్సైలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు.  ఈ సందర్భంగా  జిల్లాలో 13 ఫంక్షనల్ వర్టికల్స్‌‌‌‌లో ప్రతిభ కనబరిచిన 33 మంది అధికారులు, సిబ్బందికి  రివార్డు ప్రకటించి అభినందించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ   గణేశ్‌‌‌‌ ఉత్సవాల నేపథ్యంలో ఆర్గనైజర్లతో శాంతి మీటింగ్‌‌లు పెట్టాలన్నారు.  సమస్యాత్మక ప్రాంతాలుంటే పైఆఫీసర్లకు సమాచారం ఇవ్వాలన్నారు . ఈనెల 28న నిర్వహించనున్న కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్‌‌కు పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.  ఈ సమావేశంలో డీఎస్పీలు కె.సత్యనారాయణ, వెంకటేశ్వరరావు ఉన్నారు.

కానిస్టేబుల్ ఎగ్జామ్‌‌‌‌ పక్కాగా నిర్వహించాలి
అడిషనల్ ఎస్పీ రాములు నాయక్


గద్వాల, వెలుగు:  ఆగస్టు 28న కానిస్టేబుల్ ప్రిలిమినరీ ఎగ్జామ్‌‌‌‌ పక్కాగా నిర్వహించాలని అడిషనల్ ఎస్పీ రాములు నాయక్ సూచించారు.  మంగళవారం ఇన్విజిలేటర్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.  రాష్ట్ర పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ రూల్స్ ప్రకారం ఎగ్జామ్‌‌‌‌ నిర్వహించాలని,  పరీక్షలు రాసే అభ్యర్థులు ఒకరోజు ముందుగానే సెంటర్లను చూసుకోవాలన్నారు.  జిల్లాలో 11,420 మంది అభ్యర్థులు ఉండగా 32 సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 

ట్రాన్స్‌‌‌‌ఫర్లు, ప్రమోషన్ల షెడ్యూల్ ఇవ్వాలి

మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు:  రాష్ట్రంలో టీచర్ల ట్రాన్స్‌‌‌‌ఫర్లు, ప్రమోషన్లకు సంబంధించిన షెడ్యూల్ వెంటనే ప్రకటించాలని తపస్‌‌‌‌ రాష్ట్ర అధ్యక్షుడు  హనుమంతరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం మహబూబ్‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌ పట్టణంలోని స్కూళ్లలో సంఘం సభ్యత్వ నమోదు చేపట్టారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏండ్లు గడుస్తున్నా టీచర్ల బదిలీల, పదోన్నతుల ప్రక్రియ చేపట్టకపోవడం సరికాదన్నారు.  జీవో 317కు సంబంధించి అన్ని అప్పీళ్లను పరిష్కరించాలని , బ్లాక్ చేసిన 13 జిల్లాల స్పౌజ్ బదిలీలను వెంటనే చేపట్టాలన్నారు. కేజీబీవీ, మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్ల సమస్యలను పరిష్కరించాలని, ప్రైమరీ స్కూళ్లలో క్లాస్‌‌‌‌కు ఒక టీచర్‌‌‌‌‌‌‌‌ను  నియమించాలని కోరారు. ప్రతి స్కూల్‌‌‌‌కు స్కావెంజర్లను నియమించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి కరుణాకర్ గౌడ్, బి సునీల్ కుమార్ , పట్టణ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంద్ర కాంత్ రెడ్డి, రాఘవ, శివ కుమార్, సత్యనారాయణ , వీరన్న  పాల్గొన్నారు. 

కుల వివక్ష బాధాకరం

వనపర్తి టౌన్, వెలుగు: స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు పూర్తయినా విద్యాసంస్థల్లో ఇంకా కుల వివక్ష కొనసాగడం బాధాకరమని ఎమ్మార్పీఎస్‌‌‌‌ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. రాజస్థాన్‌‌‌‌లోని సరస్వతి శిశు మందిర్ స్కూల్‌‌‌‌లో టీచర్‌‌‌‌‌‌‌‌ దళిత విద్యార్థిని కొట్టి చంపడాన్ని నిరసిస్తూ మంగళవారం ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో విద్యాసంస్థల బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా  వారు మాట్లాడుతూ దళితులకు స్కూల్లో నీళ్లు తాగే స్వేచ్ఛ కూడా లేదంటే పాలకులు ఎవరి కోసం పనిచేస్తున్నారో అర్థం చేసుకోవచ్చన్నారు.  అగ్రవర్ణ టీచర్‌‌‌‌ బాలుడిని హత్య చేస్తే ప్రధానమంత్రి ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం సరికాదన్నారు. వెంటనే టీచర్‌‌‌‌పై చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్, అంబేద్కర్ సంఘం నేతలు రాజనగరం రాజేశ్, శివ నాయక్, సునీల్, రవి యాదవ్ , సిద్దు, రమేశ్,  ప్రమోద్ ,  కృష్ణ ,   వెంకటేశ్ ,  లక్ష్మణ్ , వెంకటయ్య, కృష్ణ, కుమార్​, శేఖర్​,శివరాజ్​,  అశోక్ , జగదీశ్, నర్సిములు , నాగరాజ్, సునీల్, విజయ్ ,రాఘవేంద్ర , రవిశంకర్ పాల్గొన్నారు.

నేడు ఎంపీపీ ఎన్నిక

అలంపూర్, వెలుగు: మూడేళ్లగా పెం డింగ్‌‌‌‌లో ఉన్న అలంపూర్ ఎంపీపీ ఎన్నిక నేడు జరగనుంది. 2019లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మండలంలో టీఆర్ఎస్ నుంచి ఆరుగురు ఎంపీటీసీలు గెలుపొందారు.  అయితే ఎంపీటీసీలు ఎమ్మెల్యే అబ్రహం బలపర్చిన బుక్కాపురం ఎంపీటీసీ రూపాదేవిని కాదని, కాసాపురం ఎంపీటీసీ బేగంను ఎంపీపీగా ఎన్నుకున్నారు.  దీంతో లింగన్నవాయి ఎంపీటీసీ జ్యోతి విప్ జారీ చేసి ఎన్నికల అధికారిగా వ్యవహరించిన సక్రియ నాయక్ కు కంప్లైంట్ చేశారు. ఆయన ఆమె ఎన్నిక చెల్లదంటూ ఉత్తర్వులు ఇచ్చారు. దీనిపై బేగం కోర్టుకు వెళ్లడంతో  మూడేళ్లుగా కేసు నడుస్తోంది. ఎట్టకేలకు మళ్లీ ఎన్నికల జరపలని తీర్పు వచ్చింది. కాషాపురం ఎంపీటీసీ బేగంనే ఎంపీపీగా ఎన్నుకునేలా ఒప్పందం కుదరడంతో ఇరు వర్గాలు రాజీకి వచ్చినట్టు తెలుస్తోంది. బుధవారం ఎంపీపీ ఎన్నిక నిర్వహిస్తామని ఎంపీడీవో నాగ శేషాద్రి తెలిపారు. 

ఓర్వలేకనే అరెస్టులు చేస్తున్నరు

నెట్‌‌‌‌వర్క్‌‌‌‌, వెలుగు: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రకు ప్రజల నుంచి వస్తున్న ఆదరణను ఓర్వలేకనే ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిందని ఆ పార్టీ నేతలు విమర్శించారు. మంగళవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో నిరసనలు తెలపడంతో పాటు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ  లిక్కర్ స్కామ్‌‌‌‌ ఆరోపణల నేపథ్యంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటి ముందు ప్రజాస్వామ్య బద్ధంగా నిరసన తెలుపుతున్న పార్టీ నేతలు, కార్యకర్తలపై టీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్ గుండాలు దాడి చేయడం దారుణమన్నారు. పోలీసులు దాడులు చేసిన వారిని వదిలిపెట్టి బీజేపీ నేతలపై కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఏంటని మండిపడ్డారు.  కాగా, నిరసన తెలుపుతున్న బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌‌‌‌కు తరలించారు.  బీజేపీ జిల్లా ప్రెసిడెంట్లు  రామచంద్రారెడ్డి, పగుడాకుల శ్రీనివాసులు,  రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి,  ఓబీసీ మోర్చా రాష్ట్ర ఇన్‌‌‌‌చార్జ్ పురంధర్ శెట్టి,  రాష్ట్ర అధికార ప్రతినిధులు  శ్రీశైలం నాగేంద్ర యాదవ్, నాగర్‌‌‌‌‌‌‌‌ కర్నూల్ పార్లమెంట్‌‌‌‌ కన్వీనర్ బుసిరెడ్డి సుధాకర్ రెడ్డి, నేతలు  కె.రతంగ్ పాండురెడ్డి,   దొడ్ల రాజవర్ధన్ రెడ్డి, కృష్ణాగౌడ్,   నారాయణ, రామన్ గౌడ్‌‌‌‌,  నిరంజన్ గౌడ్,  కంచె శ్రీనివాస్, సుమిత్ర, మహబూబ్ అలీ,  ప్రభాకర్ వర్ధన్, మాదన్న రమేశ్‌‌‌‌, సామల నాగరాజు   మధు, చందు  పాల్గొన్నారు.