మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారి వాజ్‌పేయిని బీజేపీ నేతలు గుర్తు చేసుకున్నారు. ఆదివారం ఆయన జయంతి సందర్భంగా విగ్రహాలు, ఫొటోలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. పలుచోట్ల స్వచ్ఛంద సంస్థల సహకారంతో రక్తదాన శిబిరాలు నిర్వహించారు. పేదలు, అనాథలు, పేషెంట్లకు పండ్లు, బ్రెడ్లు అందించారు. పలువురు నేతలు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు అభ్యంతరం చెప్పినా పోఖ్రాన్ పరీక్షలు నిర్వహించి.. భారత్ సత్తా చాటిన యోధుడని కొనియాడారు. - నెట్‌వర్క్, వెలుగు
ఈబీసీ రిజర్వేషన్లు అమలు చేస్తాం
వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
వనపర్తి, వెలుగు: అగ్రవర్ణ పేదలకు కల్పిస్తున్న ఈబీసీ రిజర్వేషన్లు కచ్చితంగా అమలయ్యేలా చూస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం వనపర్తి జిల్లా కేంద్రంలో నాగవరం రెడ్డి సేవా సమితి ఫంక్షన్ హాల్‌ను ప్రారంభించారు. అనంతరం బోన్ మ్యారోతో బాధపడుతున్న రేవల్లికి చెందిన బాల్ రెడ్డి కుమార్తె శివాని చికిత్సకు సీఎం కేసీఆర్ రూ.25 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు.
వెయ్యి ఎకరాలకు నీళ్లిచ్చిన దానికన్నా అమ్మాయికి వైద్య సాయం చేయడం సంతృప్తినిచ్చిందన్నారు. వనపర్తిలో అధునాతన గురుకుల వసతిగృహాల నిర్మాణంతో పాటు, రెడ్డి సేవా సమితి ఫంక్షన్ హాల్ నిర్మాణానికి వ్యక్తిగతంగా రూ.2 లక్షలు, ప్రభుత్వపరంగా రూ.10 లక్షలు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు.
హాకీ టీమ్‌కు అభినందన
రాష్ట్ర స్థాయి 7వ హాకీ సీనియర్ మెన్స్ టోర్నమెంట్‌లో రన్నర్‌గా నిలిచిన ఉమ్మడి జిల్లా టీమ్‌ను మంత్రి నిరంజన్‌రెడ్డి ఆదివారం వనపర్తిలో అభినందించారు. డిసెంబర్ 13,14,15 తేదీల్లో హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌంగ్‌లో రాష్ట్ర అసోసియేషన్ ఆధ్వర్యంలో హాకీ టోర్నీ నిర్వహించారు. ఇందులో రన్నర్‌గా నిలిచిన టీమ్ క్రీడాకారులతో పాటు జిల్లా హాకీ అసోషియేషన్ సెక్రటరీ బొలమోని కుమార్, సభ్యులు నిరంజన్ గౌడ్, దయానంద్‌ను మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో వనపర్తి మునిసిపల్ చైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.
హ్యాపీగా క్రిస్మస్
క్రిస్మస్ వేడుకలను ఉమ్మడి జిల్లాలోని క్రైస్తవులు సంతోషంగా జరుపుకున్నారు. ఆదివారం ఉదయం నుంచే చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేయడంతో పాటు ఏసు గీతాలను ఆలపించారు. అనంతరం పాస్టర్లు శాంతి సందేశం ఇచ్చారు. మహబూబ్‌నగర్ ఎంబీ చర్చిలో జరిగిన వేడుకలో పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, వనపర్తిలో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు పాల్గొని కేక్ కట్ చేసి విషెస్ చెప్పారు. -నెట్‌వర్క్, వెలుగు
గురుకుంటకు సీఎం కేసీఆర్ రాలే..
మన్నె కుటుంబాన్ని పరామర్శించిన ఎంపీలు, ఎమ్మెల్యేలు
నవాబుపేట, వెలుగు: నవాబుపేట మండలం గురుకుంటలో సీఎం కేసీఆర్ పర్యటన రద్దైంది. ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి సోదరుడు మన్నె వెంకట్రాంరెడ్డి దశదినకర్మ కార్యక్రమాన్ని ఆదివారం సీఎం రానున్నారని సీఎంవో నుంచి ఆదేశాలు అందడంతో అధికార యంత్రాంగం హెలీప్యాడ్, ఇతర ఏర్పాట్లు చేశారు. స్థానిక నేతలు కటౌట్లు, ఫ్లెక్సీలు పెట్టుకున్నారు. కానీ, అనివార్య కారణాల వల్ల ఆయన రాలేకపోయారు. మధ్యాహ్నం సమయంలో సీఎంకు బదులు మంత్రి కేటీఆర్ వస్తున్నారని ప్రచారం జరిగింది. ఆయన కూడా రాకపోవడంతో ఎంపీలు, ఎమ్మెల్యేలు అటెండ్ అయ్యి మన్నె కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మన్నె కుటుంబానికి ప్రముఖుల పరామర్శ
నాగర్‌కర్నూల్, జహీరాబాద్, ఖమ్మం ఎంపీలుపోతుగంటి రాములు, బీబీపాటిల్, నామానాగేశ్వర్‌రావు, జడ్చర్ల మక్తల్, గద్వాల, నారాయణపేట, అలంపూర్ ఎమ్మెల్యేలు లక్ష్మారెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, అబ్రహం, మాజీ ఎమ్మెల్యే శంకర్రావు, బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్ డీకే అరుణ, రాష్ట్ర నాయకులు నాగూరావునామోజి, నెల్లి శ్రీవర్దన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి మన్నె కుటుంబాన్ని పరామర్శించారు. వెంకట్రాంరెడ్డి ఫొటో వద్ద నివాళి అర్పించి.. ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, ఎంఎస్ఎన్ అధినేత సత్యనారాయణరెడ్డి, టీటీడీ బోర్టు మెంబర్ జీవన్‌రెడ్డికి ధైర్యం చెప్పారు.
నిధులు మళ్లించి ధర్నాలా..?
బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు
పానగల్, వెలుగు: కేంద్రం ఈజీఎస్ కింద రైతు వేదికలు, కల్లాల కోసం ఇచ్చిన నిధులను ఇతర పథకాలకు మళ్లించి.. ఉల్టా ధర్నాలు చేయడం రాష్ట్ర సర్కారుకే చెల్లిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు సుధాకర్ రావు విమర్శించారు. పాదయాత్రలో 17వ రోజైన శనివారం పానగల్ మండలం చిక్కేపల్లి వద్ద అస్వస్థతకు గురైన ఆయన హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి వెళ్లారు. చికిత్స అనంతరం ఆదివారం తెల్ల రాళ్లపల్లి, తెల్ల రాళ్లపల్లి తండాలో పాద యాత్ర చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొల్లాపూర్ అభివృద్ధి కోసం తాను ప్రభుత్వ ఉద్యోగానికి రాజనామా చేశానని చెప్పారు.
మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావుకి 19 ఏళ్లు, కాంగ్రెస్ నుంచి గెలిచి బీఆర్‌ఎస్‌లోకి పోయిన ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డికి 5 ఏళ్లు అవకాశం ఇచ్చినా చేసిందేమీ లేదన్నారు. తనకు ఒక్క సారి అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి జిల్లా అధ్యక్షుడు రాజవర్ధన్, మండల అధ్యక్షుడు అన్వేశ్, రాష్ట్ర మహిళా మోర్చా అధికార ప్రతినిధి రోజా రమణి, నేతలు ముంత వెంకటేశ్, భాను, వెంకటరమణ పాల్గొన్నారు.