నేటి వైకుంఠ ఏకాదశి ఉత్సవాలకు ఉమ్మడి మెదక్ జిల్లాలోని ప్రధాన ఆలయాలన్ని ముస్తాబయ్యాయి. మెదక్ పట్టణంలోని శ్రీకోదండరామాలయం, వేంకటేశ్వరాలయం, సాయిబాబా ఆలయం, సిద్దిపేటలోని మోహిన్ పూర వేంకటేశ్వరాలయం, కమాన్ వద్ద గల పాత వేంకటేశ్వరాలయం, పుల్లూరు లక్ష్మీనరసింహస్వామి, దుబ్బాక లోని వేంకటేశ్వరాలయం, నాచారం లక్ష్మీనరసింహాస్వామి, మిరుదొడ్డి మండలం ఖాజీపూర్ లోని వేంకటేశ్వరాలయం, హుస్నాబాద్ లోని శ్రీసీతారామాలయం, సంగారెడ్డి శివారులోని వైకుంఠపురం ఆలయంతోపాటు పలు టెంపుల్స్ ను రంగురంగుల విద్యుత్లైట్లతో అలంకరించారు. సోమవారం తెల్లారుజాము నుంచే భక్తులు దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు.
ఏడాదికి ఒకే రోజు అయిన ముక్కోటి ఏకాదశికి ఉత్తరద్వారం ద్వారా భక్తులు దర్శనం చేసుకోనున్నారు. సిద్దిపేట మోహిన్ పురా ఆలయంలో వేంకటేశ్వరాలయంలో జరిగే ఉత్సవాల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొని రూ.కోటితో తయారు చేసిన బంగారు కిరీటాన్ని స్వామికి అలంకరించనున్నారు. ఆయా ఆలయాల్లో నిర్వహించే పూజా కార్యక్రమాలకు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. ఆలయాల వద్ద పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. - వెలుగు, నెట్వర్క్
భక్తులతో కిటకిటలాడిన ఆలయాలు
కొత్త ఏడాది ప్రారంభం సందర్భంగా ఉమ్మడి మెదక్ జిల్లాలోని ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. కొమురవెల్లి మల్లన్న, ఏడుపాయల వనదుర్గా భవానీ, వీరన్నగూడెం.. బొంతపల్లిలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి, తదితర ఆలయాల్లో భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు చేశారు. మెదక్ చర్చికి భారీగా తరలివచ్చిన భక్తులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఆయా ఆలయాల అధికారులు ఏర్పాట్లు చేశారు. - వెలుగు, నెట్వర్క్
ఒక్కరోజే రూ.2.85 కోట్ల మందు తాగిన్రు
మెదక్, వెలుగు : మెదక్ జిల్లాలో ఇయర్ ఎండింగ్ డే పార్టీలు జోర్దార్గా జరిగాయి. శనివారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకు పట్నం, పల్లె అనే తేడా లేకుండా జిల్లా అంతటా పార్టీల హడావుడే కనిపించింది. ఈ ఒక్క రోజే జిల్లా వాసులు రూ.2.85 కోట్ల విలువైన మందు తాగడం గమనార్హం. జిల్లాలో మొత్తం 49 వైన్స్ లు, 4 బార్లు ఉండగా డిసెంబర్ 31న 3,008 లిక్కర్ కేసులు, 1,736 బీర్ కేసుల అమ్మకాలు జరిగాయి. కాగా గతేడాది డిసెంబర్ కంటే గడచిన డిసెంబర్ నెలలో 6.65 శాతం అధికంగా మద్యం అమ్మకాలు జరుగగా, 2022 డిసెంబర్లో రూ.52.39 కోట్ల విలువైన 53,992 కేసుల లిక్కర్, 67,669 కేసుల బీర్లు అమ్ముడుపోయాయి.
వేర్వేరు చోట్ల ముగ్గురి మృతి
మెదక్ (కొల్చారం), వెలుగు: కుంటలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కొల్చారం మండలం చిన్నఘనపూర్లో ఆదివారం జరిగింది. గ్రామ శివారులోని పత్తికుంటలో పడి దాదాపు 35 ఏళ్ల వయసున్న వ్యక్తి చనిపోయినట్టు పంచాయతీ సెక్రటరీ హేమంత్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.
చేపలు పట్టేందుకు వెళ్లి...
మెదక్ (శివ్వంపేట), వెలుగు : చేపలు పట్టేందుకు వెళ్లి ఓ మత్స్యకారుడు చెరువులో మునిగి మృతి చెందాడు. ఈ ఘటన శివ్వంపేట మండలం పెద్ద గొట్టిముక్కల గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన ఆగేశ్(47) శనివారం సాయంత్రం స్థానిక కన్నం చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. కానీ రాత్రి అయినా ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యలు పరిసర ప్రాంతాలు, బంధువుల వద్ద వెతికినా ఆచూకీ లభించలేదు. ఆదివారం చెరువులో గాలించగా ఆగేశ్ మృతదేహం లభ్యమైంది. ప్రమాదవశాత్తు అతడి కాలుకు వల చుట్టుకొని నీటిలో మునిగి చనిపోయినట్లుగా భావిస్తున్నారు. మృతుడి కుమారుడు ప్రసాద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్సై విఠల్ తెలిపారు.
బావిలో పడి..
సిద్దిపేట రూరల్, వెలుగు : మతిస్థిమితం సరిగా లేని ఓ వ్యక్తి బావిలో పడి మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట టౌటూన్ పరిధిలోని కేసీఆర్ నగర్ వద్ద ఆదివారం జరిగింది. సిద్దిపేట టూ టౌన్ సీఐ రవికుమార్ తెలిపిన ప్రకారం... నిర్మల్ జిల్లా ఖానాపూర్ గ్రామానికి చెందిన షేక్ వజియా తన భర్త బషీర్ కు మూడేండ్లుగా మతిస్థిమితం సరిగ్గా లేదు. సిద్దిపేటలో తమకు తెలిసిన వారికి చూపించి, ఇక్కడే హాస్పిటల్ లో జాయిన్ చేయించేందుకు వచ్చారు.
ఈక్రమంలో శనివారం సాయంత్రం కేసీఆర్ నగర్ లోని తమ బంధువుల ఇంటి నుంచి హాస్పిటల్ కు వెళ్లే సమయంలో బషీర్ భార్యాపిల్లలను వదిలి పారిపోయాడు. పరిసరాలన్నీ వెతికినా కనిపించలేదు. ఆదివారం ఉదయం కేసీఆర్ నగర్ శివారులోని ఓ బావిలో గుర్తు తెలియని శవం ఉందన్న సమాచారంతో అక్కడకు చేరుకున్న బషీర్ కుటుంబ సభులు అది అతడి డెడ్బాడీయేనని గుర్తించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు.
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని ఆందోళన
మెదక్ (మనోహరాబాద్ ), వెలుగు : మనోహరాబాద్ మండల కేంద్రంలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు అర్హులైనా పేదలకు కేటాయించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం తహసీల్దార్ ఆఫీస్ ముందు ఆందోళన చేశారు. పేదల కోసం కట్టిన ఇండ్లను ఆర్థికంగా ఉన్న వ్యక్తులకు, ఇదివరకు సొంత ఇళ్లు ఉన్న వారికి, గ్రామంలో ఉండని వారికి కేటాయించారని ఆరోపించారు. నిర్మించిన 72 ఇండ్లన్నింటిని పేదలకే కేటాయించాలని డిమాండ్ చేశారు. సెలవు రోజు అయినప్పటికీ, కొత్త ఏడాది ప్రారంభం రోజు అని నిరసన తెలిపినట్లు వారు చెప్పారు.
అట్టహాసంగా క్రికెట్ టోర్నమెంట్ షురూ..
జహీరాబాద్, వెలుగు : జహీరాబాద్ పట్టణంలోని బాగారెడ్డి స్టేడియంలో ఆదివారం అంతర్రాష్ట్ర టీ -20 క్రికెట్ టోర్నమెంట్ అట్టహాసంగా ప్రారంభమైంది. ఖిజార్ యా ఫై గోల్డ్ కప్ పేరుతో నిర్వహిస్తున్న ఈ పోటీలలో26 జట్లు పాల్గొంటున్నాయి. 15 రోజులపాటు కొనసాగే ఈ టోర్నమెంట్ లో విన్నర్ కు రూ.5 లక్షలు, రన్నర్ కు రూ.3లక్షల నగడుతోపాటు ట్రోఫీలు ఇవ్వనున్నారు. ఆదివారం ప్రారంభ మ్యాచ్ హైదరాబాద్ సీసీఏ, వీఎన్ సీసీ హైదరాబాద్ జట్ల మధ్య ఉత్కంఠ భరితంగా కొనసాగింది. అంతకు ముందు ఖిజర్ కుటుంబ స భ్యులు మ్యాచ్ ను టాస్ వేసి ప్రారంభించారు.
మనస్తాపంతో యువకుడు సూసైడ్
దుబ్బాక, వెలుగు: మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల పరిధిలోని దుంపలపల్లి లో శనివారం రాత్రి జరిగింది. దుబ్బాక ఎస్సై మహేందర్ తెలిపిన ప్రకారం.. దుంపలపల్లికి చెందిన ముదురుకోళ్ల అరుణ్ (24) గ్రామంలో టెంట్ హౌస్, డెకరేషన్ వర్క్ చేసేవాడు. అతడు రెండు రోజులుగా ఆందోళనగా కనిపించాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి తన పాత ఇంటిలోని రేకుల షెడ్డు వద్ద ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తన కుమారుడు తరచుగా నాలుగు ఫోన్ నంబర్లకు ఫోన్ చేసి మాట్లాడుతున్నాడని, అతడి చావుకు ఆ ఫోన్ చేసిన వ్యక్తులతో సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేస్తూ మృతుడి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.
వెంకట్ కు ఆర్ఎస్ ప్రవీణ్ పరామర్శ
సిద్దిపేట రూరల్, వెలుగు: బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి జక్కుల వెంకట్ ను ఆదివారం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన జక్కుల వెంకట్ కుమారుడు ఇటీవల మరణించిన విషయం తెలుసుకుని ఆర్ఎస్పీ ఆయనను కలిసి ఓదార్చారు. ఆర్ఎస్పీ వెంట జిల్లా ఉపాధ్యక్షుడు ఓం ప్రకాశ్, గజ్వేల్ నియోజకవర్గ అధ్యక్షుడు కరుణాకర్, సిద్దిపేట నియోజకవర్గ అధ్యక్షుడు పుల్లూరు ఉమేశ్, వెంకటేశ్, రోమాల బాబు తదితరులు
ఉన్నారు.
పేకాటరాయుళ్ల అరెస్ట్
నర్సాపూర్, వెలుగు : పేకాట ఆడుతున్న 11 మందిని పోలీసులు అరెస్టు చేసి నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటన నర్సాపూర్ మండలంలోని నత్నాయపల్లిలో జరిగింది. సీఐ షేక్ లాల్ మదర్ తెలిపిన వివరాల ప్రకారం నత్నాయపల్లి శివారులోని అటవీ ప్రాంతంలో కొందరు పేకాట ఆడుతున్నారని పక్కా ఇన్ఫర్మేషన్తో పోలీసులు శనివారం అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో రైడ్ చేసి పేకాట ఆడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.1,14,130 నగదు, 12 మొబైల్ ఫోన్లు, చార్జింగ్ లైట్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. రైడ్ చేసినవారిలో ఎస్సై గంగరాజు, కానిస్టేబుళ్లు రాము, చెన్నయ్య, భిక్షపతి, హోంగార్డులు పోచయ్య, నాగరాజు ఉన్నారు.