కోదాడ : తెలంగాణ జాతీయ సమైక్యతా వేడుకలను సక్సెస్ చేయాలని సూర్యాపేట కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్, ఎస్పీ రాజేంద్రప్రసాద్ సూచించారు. కోదాడ పట్టణంలోని సీసీరెడ్డి స్కూల్‌లో జరుగుతున్న వేడుకల ఏర్పాట్లను బుధవారం వారు పరిశీలించి మాట్లాడారు. 15 నుంచి 18 వరకు అన్ని శాఖల ఆఫీసర్లు కోఆర్డినేషన్‌తో పనిచేయాలన్నారు. ఈ నెల 16న సుమారు 15 వేల మందితో ర్యాలీ నిర్వహించాలని, స్టూడెంట్లకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే ఆఫీసర్లపై చర్యలు తప్పవని హెచ్చరించారు. వారి వెంట ఆర్డీవో కిశోర్‌కుమార్, డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్‌రెడ్డి, సీఐలు శివశంకర్, ప్రసాద్, తహసీల్దార్ శ్రీనివాస్‌శర్మ పాల్గొన్నారు. అలాగే ఈ నెల 17న హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే ఆదివాసీ గిరిజన సమ్మేళనం వాల్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీడీ కిరణ్‌కుమార్, గిరిజన సంక్షేమ శాఖ ఆఫీసర్ శంకర్, డీపీఆర్‌వో రమేశ్‌కుమార్ పాల్గొన్నారు.
ఏర్పాట్లపై హాలియాలో ఎమ్మెల్యే రివ్యూ
హాలియా : జాతీయ సమైక్యతా ఉత్సవాల నిర్వహణపై బుధవారం హాలియాలో ఎమ్మెల్యే నోముల భగత్ రివ్యూ నిర్వహించారు. వేడుకల్లో భాగంగా 16న హాలియాలో 15 వేల మందితో ర్యాలీ, స్కూళ్లలో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. జన సమీకరణ, భోజన ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. స్పెషల్ ఆఫీసర్ రాజ్‌కుమార్, నోడల్ ఆఫీసర్ అశ్వక్, జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, ఎంపీపీ బొల్లం జయమ్మ, తహసీల్దార్ లావూరి మంగ, సీఐలు సురేశ్‌కుమార్, నాగరాజు పాల్గొన్నారు..
తెలంగాణ పోరాట వారసులు కమ్యూనిస్టులే..
సూర్యాపేట : తెలంగాణ పోరాటానికి నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి చెప్పారు. సూర్యాపేటలో బుధవారం జరిగిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. కమ్యూనిస్టుల నాయకత్వంలోనే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం జరిగిందన్నారు. ఈ పోరాటంలో 3 వేల మంది కమ్యూనిస్టులు చనిపోయారని, 4,500 గ్రామాలు వెట్టి నుంచి విముక్తి అయ్యాయన్నారు. సాయుధ పోరాటానికి సంబంధం లేని బీజేపీ చరిత్రను వక్రీకరించి మాట్లాడడం సిగ్గుచేటన్నారు. 17న అర్వపల్లిలో జరిగే సభకు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి హాజరవుతారన్నారు. సమావేశంలో నెమ్మాది వెంకటేశ్వర్లు, మల్లు లక్ష్మి, మల్లు నాగార్జునరెడ్డి, కొలిశెట్టి యాదగిరిరావు, బుర్రి శ్రీరాములు పాల్గొన్నారు.
ఇన్సూరెన్స్ చెక్ అందజేత
యాదాద్రి : యాదాద్రి జిల్లా మోటకొండూరుకు చెందిన బొలగాని శ్రీనివాస్‌గౌడ్ ఇటీవల తాటిచెట్టు పైనుంచి పడి చనిపోయాడు. కాంగ్రెస్ సభ్యత్వం ఉండడంతో అతడి ఫ్యామిలీకి రూ. 2 లక్షల ఇన్సూరెన్స్ మంజూరైంది. ఈ చెక్‌ను మృతుడి భార్య స్వరూపకు బుధవారం హైదరాబాద్‌లో పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అందజేశారు.
మత్స్యకారుల అభివృద్ధికి టీఆర్‌ఎస్ కృషి...
మునుగోడు : మత్స్యకారుల అభివృద్ధి కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని మత్స్యశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ చెప్పారు. నల్గొండ జిల్లా మునుగోడు మండలం కిష్టాపురంలో బుధవారం విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలిసి జీవాలకు వ్యాక్సినేషన్‌ను ప్రారంభించారు. అనంతరం స్థానిక పెద్ద చెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చిన తర్వాతే మత్స్యకారుల జీవితాల్లో వెలుగు వచ్చిందన్నారు. కులవృత్తులను ప్రోత్సహిస్తున్న ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మత్స్యకారుల అభివృద్ధి కోసం రూ. 125 కోట్లతో ఫ్రీగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికల కోసమే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కొందరు వ్యక్తులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గత పాలకుల నిర్లక్ష్యం కారణంగానే మునుగోడు నియోజకవర్గంలో ఎంతో మంది ఫ్లోరైడ్ బారిన పడ్డారని ఆరోపించారు. ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తేనే అభివృద్ధి జరుగుతందని తప్పుడు ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ బండ ప్రకాశ్, నాయకులు దూదిమెట్ల బాలరాజుయాదవ్, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, కృష్ణారెడ్డి, ఏడీ వెంకటయ్య, కర్నాటి స్వామియాదవ్ పాల్గొన్నారు.
అర్హులందరికీ పెన్షన్ ఇస్తాం
కోదాడ/మునగాల : అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆసరా పెన్షన్ అందజేస్తామని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్ చెప్పారు. సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని పలు గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు బుధవారం పెన్షన్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల అభివృద్ధే లక్ష్యంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ బుర్ర సుధారాణి పాల్గొన్నారు. అంతకుముందు క్యాంప్ ఆఫీస్‌లో మునగాల మండలం విజయ రాఘవపురానికి చెందిన పలువురు టీఆర్‌ఎస్‌లో చేరగా వారికి కండువాలు కప్పారు.
మృతుల ఫ్యామిలీలకు పరామర్శ...
నల్గొండ : నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీ అంగడిపేటకు చెందిన పెద్దబోయిన గోపిచంద్ హైదరాబాద్‌లోని బొంగులూరు వద్ద యాక్సిడెంట్‌లో చనిపోయారు. అలాగే నాంపల్లి మాజీ సర్పంచ్, సింగిల్ విండో మాజీ చైర్మన్ సామ వెంకట్‌రెడ్డి అనారోగ్యంతో చనిపోయారు. విషయం తెలుసుకున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి బుధవారం ఆయా గ్రామాలకు వెళ్లి మృతదేహాలపై పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం వారి ఫ్యామిలీ మెంబర్స్‌ను పరామర్శించారు.
లారీ బ్యాటరీలు చోరీ చేస్తున్న వ్యక్తుల అరెస్ట్
కోదాడ : లారీ బ్యాటరీలను చోరీ చేస్తున్న ముగ్గురు వ్యక్తులను బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడ పోలీసులు అరెస్ట్ చేశారు. కేసుకు సంబంధించిన వివరాలను బుధవారం ఎస్పీ రాజేంద్రప్రసాద్ వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం... కోదాడ పట్టణంలోని శ్రీమన్నారాయణ కాలనీకి చెందిన జిల్లపల్లి రమేశ్, శ్రీరంగాపురానికి చెందిన పనస మహేశ్, వంకా నరేశ్ కలిసి కోదాడ, హుజూర్‌నగర్ మునగాల స్టేషన్ల పరిధిలో లారీల నుంచి బ్యాటరీలను చోరీ చేశారు. వీటిని విజయవాడ తరలించి అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులకు సమాచారం అందడంతో పట్టణ సీఐ శివశంకర్, ఎస్సై రాంబాబు కలిసి శ్రీరంగాపురం రోడ్ వద్ద వారిని పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 40 బ్యాటరీలు, మూడు సెల్‌ఫోన్లు, బైక్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. సమావేశంలో డీఎస్పీ వెంకటేశ్వర్‌రెడ్డి, సీఐ శివశంకర్, ఎస్సై రాంబాబు పాల్గొన్నారు.
160 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత...
కోదాడ : అక్రమంగా నిల్వ ఉంచిన రేషన్ బియ్యాన్ని బుధవారం సూర్యాపేట జిల్లా చిలుకూరు పోలీసులు పట్టుకున్నారు. వారు తెలిపిన వివరాల ప్రకారం... చిలుకూరు మండలం బేతవోలులో నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని బెడవాడ లక్ష్మీనారాయణ అనే వ్యక్తి ఏపీకి తరలించేందుకు బుధవారం తెల్లవారుజామున ప్రయత్నం చేస్తున్నాడు. విషయం తెలుసుకున్న పోలీసులు దాడి చేసి 160 క్వింటాళ్ల రేషన్ బియ్యం, డీసీఎం, టాటా ఏస్ వెహికల్‌ను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి, బియ్యన్ని సివిల్ సప్లై ఆఫీసర్లకు అప్పగించినట్లు ఎస్సై శ్రీనివాస్ తెలిపారు.
టెక్నాలజీని వినియోగించుకోవాలి...
నల్గొండ అర్బన్ : పోలీసు శాఖ చేపట్టిన 16 ఫంక్షనల్ వర్టికల్స్ పటిష్టంగా అమలయ్యేలా చూడాలని, టెక్నాలజీని వినియోగించుకుంటూ క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ చేయాలని నల్గొండ ఎస్పీ రెమా రాజేశ్వరి ఆదేశించారు. నల్గొండలో ఎస్పీ ఆఫీస్‌లో బుధవారం నిర్వహించిన రివ్యూలో ఆమె మాట్లాడారు. పెండింగ్ కేసులు లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న కేసులను ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్‌లో భాగంగా గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సత్వర న్యాయం చేసేలా కృషి చేయాలని ఆదేశించారు.
పార్క్ పనులను త్వరగా పూర్తి చేయాలి
దేవరకొండ : నల్గొండ జిల్లా దేవరకొండ ఖిల్లా దుర్గంలో రూ. 5 కోట్లతో నిర్మిస్తున్న పార్క్‌ను త్వరగా పూర్తి చేయాలని ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ఆదేశించారు. పార్క్ నిర్మాణ పనులపై బుధవారం ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో మున్సిపల్ ఆఫీసర్లతో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్క్ నిర్మాణం పూర్తైతే పట్టణ ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందుబాటులోకి వస్తుందన్నారు. పనులను క్వాలిటీగా చేయాలని సూచించారు. పట్టణంలోని అన్ని వార్డుల్లో దశల వారీగా మినీ పార్కులను నిర్మిస్తామని చెప్పారు. 16 నుంచి 18 వరకు నిర్వహించనున్న జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను సక్సెస్ చేయాలని సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ వెంకటయ్య, ఏఈ రాజు పాల్గొన్నారు.
సాగర్‌ను సందర్శించిన మంగోలియా రాయబారి
హాలియా : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని బుద్ధవనాన్ని బుధవారం మంగోలియా రాయబారి గాన్ బోల్డ్‌ధామ్ బజావ్ సందర్శించారు. సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్, బుద్ధవనం స్పెషల్ ఆఫీసర్ మల్లేపల్లి లక్ష్మయ్యతో కలిసి పరిసరాలను పరిశీలించారు. బుద్ధవనం ఎంతో అద్భుతంగా ఉందని కొనియాడారు. ఈ సందర్భంగా బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించారు. కర్ణ బ్రహ్మారెడ్డి , మున్సిపల్ వైస్‌చైర్మన్ మంద రఘువీర్ బిన్నీ, కౌన్సిలర్లు రామకృష్ణ, రమేశ్, ఆవులదొడ్డి రాహుల్, కామెర్ల జానయ్య, సత్యపాల్ పాల్గొన్నారు.
కాంగ్రెస్ హయాంలోనే పేదలకు న్యాయం...
సంస్థాన్‌నారాయణపురం : కాంగ్రెస్ హయాంలోనే పేదలకు న్యాయం జరిగిందని ములుగు ఎమ్మెల్యే సీతక్క చెప్పారు. బీజేపీ, టీఆర్‌ఎస్ పేదలను దోచి పెద్దలకు పెట్టే ప్రభుత్వాలని ఆరోపించారు. కేంద్రం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలను పెంచి సామాన్యులపై భారం మోపుతోందని మండిపడ్డారు. యాదాద్రి జిల్లా సంస్థాన్‌నారాయణపురం, పుట్టపాక గ్రామాల్లో బుధవారం నిర్వహించిన రచ్చబండలో ఆమె మాట్లాడారు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంట్రాక్టుల కోసం మునుగోడు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టారని, ప్రజలు ఆయనకు తగిన గుణపాఠం చెప్పాలన్నారు. ఎనిమిదేళ్లలో బీజేపీ, టీఆర్‌ఎస్ లీడర్లు లక్షల కోట్లు దోచుకున్నారని, ఆ డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి నియోజకవర్గానికి అందించించిన సేవలే స్రవంతిని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్ష పార్టీలో ఉన్నందునే అభివృద్ధి జరగడం లేదని, అందుకే బీజేపీలోకి వెళ్తున్నట్లు రాజగోపాల్‌రెడ్డి చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ములుగు ఎమ్మెల్యే అయిన తాను కూడా ప్రతిపక్షంలోనే ఉన్నానని అయినా పోరాడి నిధులు తెచ్చుకుంటున్నానని చెప్పారు. 2023లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాజగోపాల్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరుతారా అని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్వాయి స్రవంతిని గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఉప ఎన్నికల మండల ఇన్‌చార్జి గండ్ర సత్యనారాయణరావు, కేంద్ర మాజీ మంత్రి పోరిక బలరాం నాయక్, కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి, చలమల కృష్ణారెడ్డి, బండ్రు శోభారాణి, నగరగారి ప్రీతం, మందుగుల బాలకృష్ణ, అక్బర్ అలీ, ఏపూరి సతీశ్, చిలువేరు కృష్ణ పాల్గొన్నారు.
ఎంఐఎంకు భయపడి చరిత్రను వక్రీకరిస్తున్నరు...
సూర్యాపేట/కోదాడ/చౌటుప్పల్ : తెలంగాణ విమోజన దినోత్సవం సందర్భంగా బుధవారం సూర్యాపేటతో పాటు కోదాడ, యాదాద్రి జిల్లా చౌటుప్పల్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. సూర్యాపేటలో బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి సంకినేని వరుణ్‌రావు, కోదాడలో బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి అక్కిరాజు యశ్వంత్, చౌటుప్పల్‌లో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు రమణగోని శంకర్ మాట్లాడారు. తెలంగాణ సాయుధ పోరాటాన్ని పాఠాల్లో చేర్చాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ ఎంఐఎంకు భయపడి చరిత్రను వక్రీకరిస్తూ విమోచన దినోత్సవాన్ని జాతీయ సమైక్యతా దినోత్సవంగా ప్రకటిస్తున్నారని ఆరోపించారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ఇప్పటివరకు పట్టించుకోలేదన్నారు. సెప్టెంబర్ 17న పరేడ్‌గ్రౌండ్‌లో జరిగే జాతీయ జెండావిష్కరణకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పాల్గొంటారని చెప్పారు. సూర్యాపేటలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు కట్కూరి కార్తీక్‌రెడ్డి, యువ మోర్చా పట్టణ అధ్యక్షులు దోసకాయల ఫణినాయుడు, ఎండీ. అబిద్, కోదాడలో స్టేట్ లీడర్ కృష్ణయ్య, బీజేపీ పట్టణ అధ్యక్షుడు జగన్‌మోహన్‌రావు, చౌటుప్పల్‌లో జడ్పీటీసీ చిలుకూరి ప్రభాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
కుల వృత్తులను కాపాడుకోవాలి...
యాదాద్రి : కుల వృత్తులను కాపాడుకోవాలని బీజేపీ స్టేట్ లీడర్ గూడూరు నారాయణరెడ్డి చెప్పారు. వృత్తుల రక్షణకు తన వంతుగా సహకరిస్తానని చెప్పారు. యాదాద్రి జిల్లా వలిగొండ మండలం గోకారం, నెమిలి కాల్వ, జాలు కాల్వ గ్రామాలకు చెందిన నాయీబ్రాహ్మణ, రజకులకు ఆయన బుధవారం పనిముట్లు అందజేసి మాట్లాడారు. వృత్తుల పరిరక్షిస్తామని చెప్పుకుంటున్న టీఆర్‌ఎస్ సర్కార్ మాటలకే పరిమితం అయిందన్నారు. వలిగొండ ఎంపీపీ నూతి రమేశ్‌రాజు, గోకారం సర్పంచ్ తుర్కపల్లి మాధవి, గుండు దానయ్య, బైరు మల్లేశ్, వీరమళ్ల శ్రీశైలం, బాషయ్య, రాధారపు మల్లేశ్ పాల్గొన్నారు.
తాటిచెట్టు పైనుంచి పడి గీత కార్మికుడు మృతి
చౌటుప్పల్ : తాటి చెట్టు పైనుంచి పడి ఓ గీత కార్మికుడు చనిపోయాడు. ఈ ఘటన యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని లింగారెడ్డిగూడెంలో బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన తొర్పునూరి హనుమంతుగౌడ్ (52) బుధవారం ఉదయం తాటిచెట్టు ఎక్కాడు. ప్రమాదవశాత్తు పట్టు తప్పడంతో జారి కిందపడి స్పాట్‌లోనే చనిపోయాడు. గమనించిన స్థానికులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలుసుకున్న మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి హనుమంతుగౌడ్ ఫ్యామిలీని పరామర్శించి, రూ. 10 వేల ఆర్థికసాయం అందజేశారు.
కాంగ్రెస్‌తోనే సమస్యల పరిష్కారం...
యాదాద్రి : కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఆ పార్టీ ఆలేరు నియోజకవర్గ ఇన్‌చార్జి బీర్ల అయిలయ్య చెప్పారు. పాదయాత్రలో భాగంగా బుధవారం ఆలేరు మండలంలోని సాయిగూడెం, ఆలేరు, బహదూర్‌పేట, మంతపురి, శర్భణాపురం గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం అయిలయ్య మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో టీఆర్‌ఎస్ పూర్తిగా విఫలమైందన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు ప్రజా సమస్యలను పక్కనపెట్టి సొంత పనులు చూసుకుంటున్నారన్నారు. సంక్షేమ ఫథకాల పేరుతో అప్పులు చేస్తూ ఆస్తులు కూడబెట్టుకుంటున్నారని ఆరోపించారు. ఎంపీపీలు చీర శ్రీశైలం, అశోక్, నీలం పద్మ, బండ్రు శోభారాణి, జనగాం ఉపేందర్‌రెడ్డి, ఎంఏ.ఎజాజ్ పాల్గొన్నారు.
నిర్వాసితులకు న్యాయం చేయాలి...
చండూరు (మర్రిగూడ) : డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న చర్లగూడెం రిజర్వాయర్‌లో భూములు కోల్పోతున్న వారికి న్యాయం చేయాలని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జక్కలి ఐలయ్య యాదవ్ డిమాండ్ చేశారు. పరిహారం ఇవ్వాలని, ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16న శివన్నగూడెం పైలాన్ నుంచి మర్రిగూడ తహసీల్దార్ ఆఫీస్ వరకు పాదయాత్ర నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మర్రిగూడలో దీక్షలు చేస్తున్న నిర్వాసితులకు బుధవారం సంఘీభావం ప్రకటించిన అనంతరం ఆయన మాట్లాడారు. రెండున్నరేళ్లలోనే ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. మర్రిగూడ మండల అధ్యక్షుడు దోమల వెంకన్న, పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి కుక్కల నరసింహ, అధికార ప్రతినిధిఅప్పారావు, పగడాల లింగయ్య పాల్గొన్నారు.