సూర్యాపేట డీఎంహెచ్‌వో కోట చలం
సూర్యాపేట, వెలుగు : కొవిడ్ ఫోర్త్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సూర్యాపేట జిల్లా యంత్రాంగం రెడీగా ఉందని డీఎంహెచ్‌వో కోట చలం చెప్పారు. ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునేలా ప్రణాళికలు సిద్ధం చేశారని, కరోనా నివారణకు ముందస్తు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా రోగులకు ట్రీట్‌మెంట్ అందించేందుకు హుజూర్‌నగర్, కోదాడ, తుంగతుర్తిలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌తో పాటు నడిగూడెంలో ప్రత్యేక ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. మొత్తం 77 ఐసోలేషన్ బెడ్స్‌ను రెడీ చేశామన్నారు.
బూస్టర్ డోస్ వేసుకునేలా ప్రతిఒక్కరికీ అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. జనవరి 18 నుంచి ప్రారంభం కానున్న కంటి వెలుగు కార్యక్రమం కోసం 50 టీమ్స్ ఏర్పాటు చేశామని, త్వరలోనే వారికి ట్రైనింగ్ ఇస్తామన్నారు. నార్మల్ డెలివరీల్లో సూర్యాపేట జిల్లా రాష్ట్రంలోనే ఫస్ట్ ప్లేస్‌లో ఉందన్నారు. 50 బెడ్స్‌తో ఏర్పాటు చేసిన ఎంసీహెచ్‌లో ఇప్పటివరకు 7,112 డెలివరీలు చేసినట్లు చెప్పారు. అక్టోబర్‌లో 56 శాతం ఉన్న నార్మల్ డెలివరీల సంఖ్యను ప్రస్తుతం 80 శాతానికి పెంచినట్లు తెలిపారు.
నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలి
యాదాద్రి, వెలుగు : స్టూడెంట్లకు నైతిక విలువలతో కూడిన విద్యను అందించాలని యాదాద్రి కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్‌ను శనివారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించి మాట్లాడారు. సర్కార్ స్కూళ్లలో స్టూడెంట్లకు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. టీచర్లు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో రేపాక ఉమ, కొమిరెల్లి భాస్కర్‌రెడ్డి, కొత్తకొండ శ్రీధర్, పల్లా రామకృష్ణారెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, నవీన్, పాండు, హరిప్రసాద్ పాల్గొన్నారు.
కేసులతో అభివృద్ధిని అడ్డుకోవద్దు
హుజూర్‌నగర్, వెలుగు : కేసులతో అభివృద్ధిని అడ్డుకోవద్దని హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. పట్టణంలోని క్యాంప్ ఆఫీస్‌లో శనివారం మీడియాతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఎన్నో ఏళ్లుగా నెలకొని ఉన్న సమస్యలను మూడేళ్లళోనే పరిష్కరించానని చెప్పారు. 25 ఏళ్లలో ఉత్తమ్ చేసిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు. రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని సవాల్ చేశారు. మేనిఫెస్టోలో చెప్పిన వాటికన్నా ఎక్కువ అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. జనవరి6 నియోజకవర్గంలో నిర్వహించే పలు కార్యక్రమాలకు మంత్రి కేటీఆర్ హాజరవుతారని చెప్పారు. మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కడియం వెంకట్‌రెడ్డి, కె. లక్ష్మీనర్సింహారెడ్డి, దొంతగాని శ్రీనివాస్‌గౌడ్, నర్సింగ్ వెంకటేశ్వర్లు, అమరనాథరెడ్డి పాల్గొన్నారు.
‘మన ఊరు మన బడి’తో స్కూళ్ల అభివృద్ధి
నల్గొండ అర్బన్, వెలుగు : స్కూళ్ల అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనకే ప్రభుత్వం మన ఊరు మన బడి కార్యక్రమాన్ని చేపట్టిందని నల్గొండ డీఈవో బొల్లారం భిక్షపతి చెప్పారు. నల్గొండ పట్టణ పరిధిలోని కతాల్‌గూడ ప్రైమరీ స్కూల్‌లో జరుగుతున్న పనులను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జనవరి 7వ తేదీ లోగా పనులు పూర్తి చేసి ప్రారంభానికి రెడీ చేయాలని సూచించారు. పనులను క్వాలిటీగా చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో హెచ్‌ఎం తరాల పరమేశ్‌యాదవ్, ఎస్‌ఎంసీ చైర్మన్ ఊబిది యాదయ్య, వైస్ చైర్మన్ పామనగుండ్ల కళావతి, దండెంపల్లి సత్తయ్య, కంకణాల నాగిరెడ్డి, లతీఫ్, రఫీ, పజ్జూరి అశోక్, కోరె అంజయ్య పాల్గొన్నారు.
పనులను త్వరగా పూర్తి చేయాలి
తుంగతుర్తి, వెలుగు : సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తండ గ్రామ ఎస్సీ కాలనీలోని ఎంపీపీఎస్ స్కూల్‌లో జరుగుతున్న మన ఊరు మన బడి పనులను డీఈవో కె.అశోక్‌రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
‘సాగర్‌లో జానారెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదు’
హాలియా, వెలుగు : నాగార్జునసాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి చేసిన అభివృద్ధి ఏమీ లేదని ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. నల్గొండ జిల్లా హాలియా క్యాంప్ ఆఫీస్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గంలో నోముల నర్సింహయ్య గెలిచిన తర్వాతే అభివృద్ధి జరిగిందన్నారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారన్నారు. దేశంలో ఎక్కడా లేని పథకాలు ఒక్క తెలంగాణలో అమలవుతున్నాయని చెప్పారు. అనంతరం అనుముల, త్రిపురారం, పెద్దవూర, తిరుమలగిరి, నిడమనూరు మండలాలకు చెందిన 31 మంది సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిమీ చేశారు. జడ్పీటీసీ అబ్బిడి కృష్ణారెడ్డి, మార్కెట్ చైర్మన్ వెంకటేశం, మున్సిపల్ చైర్‌పర్సన్ పార్వతమ్మ శంకరయ్య, గుంటుక వెంకట్‌రెడ్డి, జయరాంనాయక్ పాల్గొన్నారు.