యాదగిరిగుట్ట, వెలుగు : ‘యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో కాంగ్రెస్ కౌన్సిలర్లు ఉన్న వార్డుల అభివృద్ధికి రూ. 5 లక్షలు కూడా కేటాయించలేదు.. ఫండ్స్ కోసం శనివారం మంత్రి కేటీఆర్‌ను కలిశాం.. మున్సిపాలిటీ అభివృద్ధికి రూ. 20 కోట్ల స్పెషల్ ఫండ్స్ ఇస్తా అని హామీ ఇచ్చిండు.. అందుకే తాము టీఆర్‌ఎస్‌లో చేరాం’ అని కౌన్సిలర్లు గుండ్లపల్లి వాణీగౌడ్, గౌలికార్ అరుణ రాజేశ్, పట్టణ మాజీ అధ్యక్షుడు గుండ్లపల్లి భరత్‌గౌడ్ తెలిపారు. తమను టీఆర్‌ఎస్‌లో చేరాలని ఎవరూ బలవంతం చేయలేదని స్పష్టం చేశారు. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో ఆదివారం మీడియాతో మాట్లాడారు.
లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని అభివృద్ధి చేసినట్లుగానే పట్టణాన్ని కూడా డెవలప్ చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారని తెలిపారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ఎంపీ కోటాలో నిధులివ్వాలని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. దీంతో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం, అభివృద్ధి కోసమే టీఆర్ఎస్‌లో చేరాల్సి వచ్చిందన్నారు.
బలవంత పెట్టారనడం సరికాదు
తమను బలవంతంగా టీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారని యాదగిరిగుట్ట కాంగ్రెస్ కౌన్సిలర్లు ముక్కెర్ల మల్లేశ్‌యాదవ్, బిట్టు సరోజ హరీశ్ చెప్పడం సరికాదని టీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ గడ్డమీది రవీందర్‌గౌడ్ అన్నారు. తాము టీఆర్‌ఎస్‌లో చేరుతామని మల్లేశ్ యాదవ్, బిట్టు హరీశే మొదట చెప్పారని, శనివారం కేటీఆర్‌తో కూడా వారే ఎక్కువ టైం స్పెండ్ చేశారన్నారు. ఇష్టపూర్వకంగానే టీఆర్‌ఎస్‌లో చేరి, ఇప్పుడు బలవంత పెట్టారని చెప్పడం సరైంది కాదన్నారు. నిజాయితీ ఉంటే లక్ష్మీనరసింహస్వామి పాదాల వద్ద ప్రమాణం చేయాలని సవాల్ చేశారు. సమావేశంలో టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు పెలిమెల్లి శ్రీధర్‌గౌడ్, టీఆర్‌ఎస్ కౌన్సిలర్లు తాళ్లపల్లి నాగరాజు, కాటం రాజు, బూడిద సురేందర్, నాయకులు సుడుగు శ్రీనివాస్‌రెడ్డి, ఆవుల సాయి, అంకం నర్సింహ, బాబూరావు, నరేశ్ పాల్గొన్నారు.
కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేయాలి
హుజూర్‌నగర్, వెలుగు : కార్యకర్తలు కలిసికట్టుగా పనిచేసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని నల్గొండ ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆదివారం నిర్వహించిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. సర్వేలు కాంగ్రెస్‌కే అనుకూలంగా ఉన్నాయన్నారు. టీఆర్‌ఎస్ వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను తన దృష్టికి తీసుకురావాలని చెప్పారు. కార్యక్రమంలో సాముల శివారెడ్డి, దొంగరి వెంకటేశ్వర్లు, యరగాని నాగన్నగౌడ్, అరుణ్ కుమార్ దేశ్‌ముఖ్, తన్నీరు మల్లికార్జున్, నిజాం, కస్తాల శ్రవణ్, మహేశ్ గౌడ్ పాల్గొన్నారు.
పనికి తగ్గ వేతనం లేదు.. పనిచేసినా గుర్తింపు లేదు
సూర్యాపేట, వెలుగు : ఆశావర్కర్లకు పనికి తగ్గ జీతం ఇవ్వడం లేదని, కష్టపడి పనిచేసిన వారికి కనీసం గుర్తింపు కూడా దక్కడం లేదని ఆ సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు కవిత ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం చెబుతున్నట్లు ఇది బంగారు తెలంగాణ కాదు... బాధల తెలంగాణ అన్నారు. సూర్యాపేట పట్టణం జమ్మిగడ్డలోని మిల్లర్స్ అసోసియేషన్ భవనంలో ఆదివారం నిర్వహించిన జిల్లా స్థాయి ఆశా వర్కర్ల సదస్సులో ఆమె మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో ప్రస్తుతం 1050 మంది ఆశా వర్కర్లు పనిచేస్తున్నారన్నారు. కరోనా టైంలో ఎంతో శ్రమించినా సరైన గుర్తింపు దక్కలేదన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలుగానే మిగిలాయన్నారు. పనికి తగ్గ వేతనం ఇవ్వకుండా వెట్టిచాకిరీ చేయించుకుంటున్నారని, పైఆఫీసర్ల మాట వినకపోతే జీతంలో కోతలు పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆశా వర్కర్లకు ఉద్యోగ భద్రతతో పాటు, నెలకు రూ. 21 వేల జీతం ఇవ్వాలని, రూ. 50 లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం క్లపించాలని డిమాండ్ చేశారు.
జర్నలిస్టులసమస్యలు పరిష్కరిస్తాం
హుజూర్‌నగర్, వెలుగు : సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఆదివారం టీయూడబ్ల్యూజే జిల్లా మహాసభలు నిర్వహించారు. ఈ సభకు ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్, హుజూర్‌నగర్, కోదాడ ఎమ్మెల్యేలు సైదిరెడ్డి, బొల్లం మల్లయ్యయాదవ్ హాజరై మాట్లాడారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు విజయవంతంగా అమలు కావడంలో జర్నలిస్టుల కృషి ఎంతో ఉందన్నారు. అనంతరం సూర్యాపేట జిల్లా కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా కోలా నాగేశ్వరరావు, సెక్రటరీగా బంటు కృష్ణ, ప్రెస్‌క్లబ్ జిల్లా అధ్యక్షుడిగా గింజల అప్పిరెడ్డి ఎన్నికయ్యారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విరాహత్ అలీ, జాతీయ కమిటీ సభ్యులు కల్లూరు సత్యనారాయణ, జాతీయ కౌన్సిల్ సభ్యులు చలసాని శ్రీనివాస్ చౌదరి పాల్గొన్నారు.
చౌటుప్పల్‌ను అభివృద్ధి చేస్తా
చౌటుప్పల్, వెలుగు : చౌటుప్పల్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృ-ద్ధి చేస్తానని మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి హామీ ఇచ్చారు. వార్డు అభివృద్ధి కమిటీల మీటింగ్‌ను ఆదివారం స్థానింకంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలో నెలకొన్న సమస్యలపై కౌన్సిలర్లు వార్డు అభివృద్ధి కమిటీ సభ్యులు, ఎమ్మెల్యేతో చర్చించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలో ఆస్తి పన్ను హైదరాబాద్ కన్నా ఎక్కువగా ఉందని, దీని వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని మీటింగ్ దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామన్నారు.
చౌటుప్పల్‌లో ప్రయారిటీ ప్రకారం సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఊర చెరువు కాల్వ సమస్యను త్వరలోనే తీరుస్తామని, పట్టణంలో సర్వీస్ రోడ్ల నిర్మాణానికి జీఎంఆర్ ఆఫీసర్లతో మాట్లాడుతానని చెప్పారు. చిన్న కొండూరు నుంచి సంగెం వరకు డబుల్ రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెన్‌రెడ్డి రాజు, వైస్‌చైర్మన్ బత్తుల శ్రీశైలం, మున్సిపల్ కమిషనర్ కోమటిరెడ్డి నరసింహారెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్‌రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్‌రెడ్డి, కౌన్సిలర్లు శ్రీధర్‌బాబు, కొయ్యడ సైదులు, లింగస్వామి, బాబా షరీఫ్, సుల్తాన్ రాజు, తాడూరి శిరీష, కాసర్ల మంజుల పాల్గొన్నారు.
టీఆర్‌ఎస్ హయాంలోనే గ్రామాల అభివృద్ధి
నకిరేకల్, వెలుగు : టీఆర్‌ఎస్ హయాంలోనే గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయని నల్గొండ జడ్పీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య చెప్పారు. నల్గొండ జిల్లా నకిరేకల్ మండలం కడపర్తి, చందుపట్లలో పలు పనులకు ఆదివారం వారు శంకుస్థాపన చేశారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో మరెక్కడా లేవన్నారు. అయిటిపాముల లిఫ్ట్‌కు ప్రభుత్వం రూ. 100 కోట్లు మంజూరు చేసిందని, దీని ద్వారా కడపర్తి రైతులకు ఎంతో మేలు కలుగుతుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్‌గౌడ్, జడ్పీటీసీ మాద ధనలక్ష్మి నగేస్, వైస్ ఎంపీపీ గొర్ల సరిత వీరయ్య, ఎంపీడీవో లక్ష్మారెడ్డి, సోమ యాదగిరి, పెండెం సదానందం, మురారిశెట్టి కృష్ణమూర్తి, చింతల సోమన్న, ప్రగడపు నవీన్‌రావు పాల్గొన్నారు. అంతకుముందు ఎమ్మెల్యే పట్టణంలోని పలు కాలనీల్లో తిరుగుతూ ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చందుపట్లలో రాణీ రుద్రమదేవి శిలాశాసనం వద్ద నివాళి అర్పించారు.
టీచర్ల ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్లు చేపట్టాలి
మిర్యాలగూడ, వెలుగు : టీచర్ల ట్రాన్స్‌ఫర్లు, ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టకపోవడంతో తెలంగాణలో విద్యావ్యవస్థ నిర్వీర్యం అయిందని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి విమర్శించారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో నిర్మించిన టీఎస్ యూటీఎఫ్ బిల్డింగ్‌ను ఆదివారం ఆ సంఘం రాష్ట్ర కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎస్‌ఎస్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో నిర్వహించిన జిల్లా మహాసభల్లో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని 50 శాతం స్కూళ్లలో శానిటేషన్ అధ్వానంగా ఉందన్నారు. ‘మన ఊరు మన బడి’ నిధుల మంజూరులో ఆలస్యం అవుతుండడంతో స్కూళ్ల పునరుద్ధరణ పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు. అనంతరం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు మాట్లాడుతూ దేశ, రాష్ట్ర భవిష్యత్ టీచర్ల చేతుల్లోనే ఉందన్నారు. సమవేశంలో మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు నాగమణి, బక్కా శ్రీనివాసాచారి, అరుణ, శేఖర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఎడ్ల సైదులు, ప్రధాన కార్యదర్శి వెంకటేశం, పాల్వాయి
శ్రీనివాస్ పాల్గొన్నారు.
కాగితాలపైనే ఆలేరు అభివృద్ధి
బొమ్మలరామారం, వెలుగు : ఆలేరు నియోజకవర్గ అభివృద్ధి మొత్తం కాగితాలపైనే ఉందని ఆలేరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, బీజేపీ లీడర్ పడాల శ్రీనివాస్ అన్నారు. ఎనిమిదేండ్లుగా అభివృద్ధిలో ఆలేరు వెనుకబడిందన్నారు. యాదాద్రి జిల్లా బొమ్మలరామారానికి చెందిన పలువురు ఆదివారం బీజేపీలో చేరడంతో ఆయన కండువాలు కప్పి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ నిధులు సాధించడంలో ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత విఫలం అయ్యారన్నారు. బీజేపీతోనే అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో సూధగాని హరిశంకర్‌గౌడ్, పక్కీర్ రాజేందర్‌రెడ్డి, గిరిప్రసాద్‌రెడ్డి, రాజు, జగర్ల ఆనంద్‌గౌడ్, వేముల నరేశ్, ఆరె కుమార్, చీర గణేశ్ పాల్గొన్నారు.