యాదాద్రి, వెలుగు : సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని ఏపీలోనూ కోరుకుంటున్నారని మంత్రులు గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి చెప్పారు. యాదాద్రి జిల్లా అడ్డగూడూరు మండలం చౌళ్లరామారంలో నిర్మించిన గోడౌన్లను ఆదివారం వారు ప్రారంభించి మాట్లాడారు. ఒక్కొక్కరి అకౌంట్‌లో రూ. 15 లక్షలు వేస్తానని, రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న ప్రధాని మోడీ హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలను బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు అమలు చేయడం లేదన్నారు. తెలంగాణలో మోడీ పోటీ చేస్తే ఓడించి ఇంటికి పంపిస్తామన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేస్తానన్న ప్రధాని ఇప్పుడు మాట మార్చారన్నారు. ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచర్ల రామకృష్ణారెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, గిడ్డంగుల సంస్థ చైర్మన్ సాయిచంద్ పాల్గొన్నారు.
సంక్రాంతి సంబరాల నిర్వహణ సంతోషకరం
సూర్యాపేట, వెలుగు : సూర్యాపేట మినీ ట్యాంక్‌బండ్ వద్ద ఆదివారం నిర్వహించిన అక్షర సంక్రాంతి సంబురాలకు మంత్రి జగదీశ్‌రెడ్డి హాజరయ్యారు. ముగ్గుల పోటీలు, కోలాటం, పతంగుల పోటీల్లో గెలిచిన వారికి ప్రైజ్‌లు అందజేsuryaశారు. అక్షర ఫౌండేషన్ ఫౌండర్ అండ్ చైర్మన్, ఎన్జీవోస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యాస రాంకుమార్‌రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట నారాయణగౌడ్, రాచర్ల కమలాకర్, చల్లా లక్ష్మీకాంత్, ప్రసాద్, సొల్లేటి ఉపేంద్రాచారి పాల్గొన్నారు. అనంతరం స్థానిక సుమంగళి ఫంక్షన్ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో విద్యుత్ కార్మిక సంఘం హెచ్ 58 డైరీని ఆవిష్కరించారు. హుజూర్‌నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, టీఆర్‌వీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జాన్సన్, ఎస్పీడీసీఎల్ రఘోత్తంరెడ్డి, కోడూరి ప్రకాశ్ పాల్గొన్నారు.
భూ నిర్వాసితులకు అండగా ఉంటాం
దేవరకొండ, వెలుగు : ప్రాజెక్ట్‌ల నిర్మాణంలో భూములు కోల్పోతున్న వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని బీఆర్‌ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ చెప్పారు. నల్గొండ జిల్లా డిండి మండలం వీరబోయినపల్లి వద్ద నిర్మిస్తున్న కాల్వలో భూములు కోల్పోయిన రైతులకు ఆదివారం దేవరకొడ పట్టణంలోని క్యాంప్ ఆఫీస్‌లో పరిహారం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాజెక్ట్‌ల నిర్మాణం కోసం వ్యవసాయ భూములు, ఇండ్లు కోల్పోయిన వారిని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. డిండి, నక్కలగండి రిజర్వాయర్ పూర్తైతే దేవరకొండ నియోజకవర్గం సస్యశ్యామలం అవుతుందన్నారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోందని చెప్పారు. అనంతరం ఆలిండియా సమతా సైనిక్‌దళ్ క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవరం సునీతాజనార్దన్‌రావు, రైతుబంధు అధ్యక్షుడు రాజినేని వెంకటేశ్వర్‌రావు, దాసు కృష్ణయ్య, పీఏసీఎస్ చైర్మన్ తూంనాగార్జునరెడ్డి, మాధవరం శ్రీనివాస్‌రావు, తహసీల్దార్ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
పార్టీ కోసం సైనికుల్లా పనిచేయాలి
యాదాద్రి, వెలుగు : కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంతో పాటు, వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని యాదాద్రి డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం భువనగిరిలో నిర్వహించిన మీటింగ్‌లో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బీర్ల అయిలయ్యతో కలిసి మాట్లాడారు. నాయకులు నిరంతరం ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలన్నారు. వచ్చే ఎన్నికల్లో గెలవడమే లక్ష్యంగా ఇప్పటి నుంచే ప్రతి ఓటరును కలవాలని పిలుపునిచ్చారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి నిర్వహించే యాత్రపై విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. సమావేశంలో తంగెళ్లపల్లి రవికుమార్, సంజీవరెడ్డి పాల్గొన్నారు.
పురుగులున్న ఖర్జూరా అమ్ముతున్నారని ఆందోళన
మిర్యాలగూడ, వెలుగు : క్వాలిటీ లేని... పురుగులు పట్టిన ఖర్జూరా అమ్ముతున్నారంటూ నల్గొండ జిల్లా మిర్యాలగూడ రిలయన్స్ స్మార్ట్ ఎదుట పలువురు ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్తే... పట్టణానికి చెందిన కిరణ్, గోపి, కాశీ, భరత్ మూడు రోజుల కింద స్థానిక రిలయన్స్ స్మార్ట్ లో ఖర్జూరా బాక్స్ కొనుగోలు చేశారు. ఇంటికి వెళ్లి వాటిని ఓపెన్ చేయగా పురుగులు కనిపించాయి. దీంతో స్టోర్ నిర్వాహకులను అడిగితే సరైన సమాధానం చెప్పలేదని బాధితులు ఆరోపించారు. ఈ విషయంపై స్టోర్ మేనేజర్ పట్టాభి సూర్యనారాయణను సంప్రదించగా బాక్సులో పురుగులు ఉన్నది నిజమేనని, ఆ విషయాన్ని తాము గుర్తించలేకపోయామన్నారు.