ఖైరతాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి కోరారు. ‘జనంతో మమేకం’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం బంజారాహిల్స్ డివిజన్ శ్రీరామ్ నగర్ లో ఆయన పర్యటించారు. బూత్ స్థాయి బీజేపీ కార్యకర్తలతో కలిసి స్థానికులతో మాట్లాడారు. సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్న టైంలో శ్రీరామ్ నగర్ లో సొంత నిధులతో రామాలయం కామన్ నిర్మించినట్లు గుర్తుచేశారు. పేద యువతులకు పెండ్లి కానుకలు ఇచ్చినట్లు చెప్పారు. కార్యకర్తలు బంజారాహిల్స్ డివిజన్ లో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో డివిజన్ బీజేపీ అధ్యక్షుడు వినయ్ ముదిరాజ్, ఖైరతాబాద్ నియోజకవర్గ కన్వీనర్ గడ్డం వెంకటస్వామి, లీడర్లు బద్దం మహిపాల్ రెడ్డి, రాఘవరెడ్డి, మహాలింగం, రమేష్, మాధురి, నవరథన్, ఈశ్వర్ పాల్గొన్నారు.
తెలంగాణ ఉద్యమంలో పాటదే కీలక పాత్ర
ముషీరాబాద్, వెలుగు: కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత డాక్టర్ పసునూరి రవీందర్ రాసిన ‘పోటెత్తిన పాట’ పుస్తకాన్ని శుక్రవారం రాత్రి బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆవిష్కరించారు. నల్లిగంటి శరత్ సభ అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథులుగా ప్రజా గాయకుడు గద్దర్, సినీ గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, ప్రొఫెసర్పిల్లలమర్రి రాములు, విమలక్క, ప్రముఖ సాహిత్య విమర్శకులు జగన్ రెడ్డి, కవి డాక్టర్ కోయి కోటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..3 తరాల ఉద్యమ పాటలను డాక్టర్ పసునూరి రవీందర్ ఒకే పుస్తకంలో చక్కగా విశ్లేషించారని మెచ్చుకున్నారు. ప్రత్యేక తెలంగాణ మలిదశ ఉద్యమంలో పాటనే కీలకపాత్ర పోషించిందని, పాట లేని సభ లేదని, పాట పాడని ఊరే లేదని గుర్తుచేశారు. ‘పోటెత్తిన పాట’ పుస్తకం కొత్త చర్చకు తెరలేపిందన్నారు. రవీందర్ మొదలుపెట్టిన ఈ కార్యక్రమానికి చారిత్రక నేపథ్యం ఉందని, భవిష్యత్తు రచనలకు ఇదో సూచిక అని కొనియాడారు. ఈ తరహా రచనలకు, పరిశోధనలకు పూనుకున్న పసునూరి రవీందర్ బహుశా దేశంలోనే మొదటి వ్యక్తి అని చెప్పారు. ప్రజా వాగ్గేయకారులు యోజన, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి, మిట్టపల్లి సురేందర్ తదితరులు పాల్గొన్నారు.
పని ఒత్తిడి తగ్గించేందుకు స్పోర్ట్స్ మీట్
సికింద్రాబాద్, వెలుగు: క్రీడలు శారీరక, మానసిక ఉల్లాసానికి దోహదపడతాయని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి అన్నారు. గ్రేటర్మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగులకు విక్టరీ ప్లే గ్రౌండ్ లో శుక్రవారం ఏర్పాటు చేసిన స్పోర్ట్స్ మీట్ ముగింపు కార్యక్రమానికి ఆమె చీఫ్‌గెస్ట్‌గా హాజరై మాట్లాడారు. ఉద్యోగులు ఒత్తిడికి గురికాకుండా ఉత్సాహంగా పనిచేసేందుకు ఏటా స్పోర్ట్స్‌మీట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జీహెచ్ఎంసీ వ్యాప్తంగా నాలుగు రోజులపాటు ఎల్బీనగర్ జోన్ డీఆర్ఎఫ్ ట్రైనీ సెంటర్, ఫతుల్లాగూడ, విక్టరీ ప్లే గ్రౌండ్ లలో మహిళలకు, పురుషులకు ఇండోర్, ఔట్ డోర్ గేమ్స్విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు. స్పోర్ట్స్ మీట్ లో మొత్తం 2,300 మంది ఉద్యోగులు పాల్గొన్నారని, పోటీల్లో ఫస్ట్ వచ్చినవారికి రూ.10 వేలు, సెకండ్విన్నర్కు రూ.6 వేలు, థర్డ్విన్నర్కు రూ.3 వేలతోపాటు పాటు మెమోంటోలు, పత్రాలు అందజేశారు.
సకాలంలో జీతాలు చెల్లించాలి
హైదరాబాద్, వెలుగు: సకాలంలో జీతాలు రాక సిటీ ఎయిడెడ్ స్కూళ్లలోని స్టాఫ్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని టీఎస్‌యూటీఎఫ్(తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్) హైదరాబాద్ జిల్లా కమిటీ నాయకులు చెప్పారు. శుక్రవారం హైదరాబాద్ డీఈఓ ఆఫీస్ ముందు ధర్నా చేశారు. ఈ సందర్భంగా జిల్లా జిల్లా కమిటీ అధ్యక్షుడు జి.రామారావు మాట్లాడుతూ.. ఎయిడెడ్ టీచర్లకు సకాలంలో జీతాలు అందక ఈఎంఐలు, పిల్లల ఫీజులు, ఇంటి అద్దెలు చెల్లించలేకపోతున్నారన్నారు. గవర్నమెంట్ బడ్జెట్‌విడుదల చేసినప్పటికీ నెలల తరబడి జీతాలు పెండింగ్ పెట్టడం కరెక్ట్‌కాదన్నారు. పీఆర్‌సీ, డీఏ ఎరియర్స్ బిల్లుల చెల్లింపు విషయంలో తీవ్ర జాప్యం జరుగుతోందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి.రాజారావు, శ్యాంసుందర్, రాష్ట్ర కమిటీ సభ్యుడు సింహాచలం, సీనియర్ నాయకులు నర్సింహారెడ్డి, విఠలాచారి, జిల్లా ఉపాధ్యక్షురాలు రేణు, కోశాధికారి వినయ్ కుమార్, జిల్లా కార్యదర్శులు రఘునాథ్ బాబు, బాషా, విద్యావతి, వెంకటేశ్వర్లు, అంకమ్మ, టీచర్లు పాల్గొన్నారు.
అయినవాళ్లున్న అనాథలు
పద్మారావునగర్, వెలుగు: అయినవాళ్లు ఉండి కూడా నిరాదరణకు గురై, దిక్కుతోచని స్థితిలో ఉన్న నలుగురికి పోలీసులు గాంధీ హాస్పిటల్లో చికిత్స అందించి పునరావాసం కల్పించారు. ఛత్తీస్‌గఢ్ లోని బిలాస్‌పూర్‌కు చెందిన రామ్‌లాల్(50)ను కుటుంబ సభ్యులు పట్టించుకోకపోవడంతో బతుకుదెరువు కోసం హైదరాబాద్వచ్చాడు. 6 నెలల క్రితం తీవ్ర అనారోగ్యానికి గురై, దిక్కుతోచని స్థితిలో ఫుట్ పాత్‌పై పడి ఉండడాన్ని చూసిన పోలీసులు చికిత్స కోసం గాంధీ ఆసుపత్రిలో చేర్పించారు. ఒడిశా సరిహద్దు ప్రాంతానికి చెందిన చందు(28) సికింద్రాబాద్‌లో బోర్వెల్వేసే రిగ్గింగ్వెహికల్పై పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ప్రమాదానికి గురవడంతో గాంధీలో చేర్పించారు. నేరేడ్మెట్కు చెందిన మల్లేశ్(38 ), బాలాజీ నగర్ కు చెందిన వెంకటేశ్(28) తీవ్ర అనారోగ్యంతో రోడ్డు పక్కన అచేతన స్థితిలో పడి ఉండడాన్ని గమనించిన పోలీసులు గాంధీ హాస్పిటల్లో చేర్పించారు. ఇటీవల వీరందరికి ట్రీట్మెంట్పూర్తి కావడంతో హాస్పిటల్సిబ్బంది ఫ్యామిలీ మెంబర్స్‌కు ఫోన్లు చేయగా, ఎవరూ తీసుకెళ్లేందుకు ముందుకు రాలేదు. దీంతో ఆసుపత్రి సూపరింటెండెంట్‌డా.ఎం.రాజారావు హైదరాబాద్జిల్లా లీగల్సెల్సర్వీసెస్అథారిటీ సెక్రటరీ, సిటీ సివిల్కోర్డు జడ్జి కె.మురళీ మోహన్‌కు లేఖ రాశారు. ఆయన వెంటనే స్పందించి ఆదేశాలివ్వడంతో పారా లీగల్వలంటీర్లు శుక్రవారం గాంధీ ఆసుపత్రికి చేరుకొన్నారు. నలుగురిని బన్సీలాల్‌పేట డివిజన్న్యూ బోయిగూడ లోని మిషనరీ ఆఫ్చారిటీ, హోమ్ఫర్డెస్టిట్యూట్ లో చేర్పించారు. తమ కుటుంబ సభ్యులు స్పందిచకపోగా, తమను కాపాడి, ఆదుకున్న పోలీసులు, గాంధీ హాస్పిటల్డాక్టర్లు, లీగల్ సెల్ అథారిటీకి ఆ నలుగురు కృతజ్ఞతలు తెలిపారు.
విద్యా రంగ పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు
ఓయూ, వెలుగు: నేషనల్ ఎడ్యుకేషన్పాలసీకి వ్యతిరేకంగా అభ్యుదయ విద్యార్థి సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాలు చేపడతామని ఎస్ఎఫ్ఐ జాతీయ సహాయ కార్యదర్శి నితీశ్ నారాయణ పేర్కొన్నారు. క్షేత్ర స్థాయి ఉద్యమాలతోనే సమస్యలు పరిష్కారమవుతాయన్నారు. శుక్రవారం ఎస్ఎఫ్ఐ జాతీయ మహాసభల చివరి రోజు సందర్భంగా మీడియా పాయింట్ లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. నూతన జాతీయ విద్యా విధానానికి ప్రత్యామ్నాయ విద్యావిధానం ముసాయిదాపై మహాసభల్లో చర్చినట్లు తెలిపారు. దీనిపై అన్ని రాష్ట్రాలకు, కేంద్రానికి నివేదించనున్నట్లు పేర్కొన్నారు. దేశమంతా ఒకే పరీక్షా విధానానికి తాము వ్యతిరేకమని, వృత్తి విద్యా కోర్సుల బోధన కూడా మాతృభాషలో జరగాలన్నారు. కరోనా సమయంలో స్టూడెంట్లలో డ్రగ్ వినియోగం బాగా పెరిగిందని, వర్సిటీల్లో ప్రధాన సమస్యగా మారిందన్నారు. స్టూడెంట్లు డ్రగ్స్‌కు దూరంగా ఉండాలని సూచించారు. కాలేజీల్లో ప్రోగ్రెసివ్ కల్చర్ ఇంకా పెరగాలని ఆకాంక్షించారు. రాష్ట్రాల గవర్నర్లు సమస్యల సృష్టికర్తలుగా మారారని, సంఘ్ పరివార్ పొలిటికల్ ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు. ఈ సమావేశంలో ఎస్ఎఫ్ఐ తెలంగాణ అధ్యక్ష, కార్యదర్శులు ఆర్ఎల్ మూర్తి, నాగరాజు, ఆహ్వాన సంఘం కోశాధికారి జావిద్, నాయకులు షేజినా తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ సీనియర్ హాకీ షురూ
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ సీనియర్ మెన్స్ ఇంటర్ డిస్ట్రిక్ట్ హాకీ టోర్నమెంట్ జింఖానా గ్రౌండ్‌లో శుక్రవారం మొదలైంది. తొలి మ్యాచ్‌లో వరంగల్ 5–0 గోల్స్ తేడాతో రంగారెడ్డి జట్టును ఓడించింది. మరో మ్యాచ్‌లో హైదరాబాద్3–1తో ఆదిలాబాద్ జిల్లా జట్టుపై గెలిచింది. ఇతర మ్యాచ్‌ల్లో మెదక్ 5–0తో కరీంనగర్‌పై, నిజామాబాద్ 5–0తో నల్లగొండపై, మహబూబ్ నగర్ 2–0తో వరంగల్‌పై విజయం సాధించాయి. హైదరాబాద్ జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో 10 జట్లు పాల్గొంటున్న ఈ టోర్నీని టూరిజం, క్రీడాశాఖ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానియా లాంఛనంగా ప్రారంభించారు. హైదరాబాద్ కమర్షియల్ ఆడిడ్ డైరెక్టర్ జనరల్ సుబ్రమన్యం, తెలంగాణ హాకీ అసోసియేషన్ ప్రెసిడెంట్ సరల్ తల్వార్, సెక్రటరీ, ట్రిపుల్ ఒలింపియన్ ముకేశ్ కుమార్, ఆర్గనైజిం్ సెక్రటరీ కామిని విద్యాసాగర్, ప్లేయర్లు, కోచ్‌లు పాల్గొన్నారు.