ఘనంగా సమైక్యతా వేడుకలు
ఖమ్మం, వెలుగు: జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా ఖమ్మం నగరంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్స్‌లో మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. తర్వాత మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలలో ఖమ్మం జిల్లా పురోగతిని వివరించారు. దళితబంధు పథకం కింద మంజూరైన 54 గూడ్స్ వాహనాలు, 3 కార్లతో పాటు గిరిజన సంక్షేమ శాఖ ద్వారా ఆరుగురు లబ్ధిదారులకు గూడ్స్ వెహికల్స్ అందించారు. సీఎం గిరివికాసం కింద ఆరుగురు లబ్ధిదారులకు పంప్సెట్లను పంపిణీ చేశారు. వేడుకల్లో భాగంగా వివిధ ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల పాఠశాలల విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషయ్య, కలెక్టర్ వీపీ గౌతమ్, పోలీస్ కమిషనర్ విష్ణు ఎస్ వారియర్, నగర మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ లక్ష్మీ ప్రసన్న, డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహ్రా, అడిషనల్ కలెక్టర్లు మధుసూదన్ రావు, మొగిలి స్నేహలత, మున్సిపల్ కమిషనర్
ఆదర్శ్ సురభి, జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ్ విక్రమ్ సింగ్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ రాధిక గుప్తా పాల్గొన్నారు.
పోడు సమస్యకు త్వరలో పరిష్కారం
ప్రభుత్వ విప్ రేగా కాంతారావు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కరువు కోరల్లో చిక్కుకున్న తెలంగాణాను ధాన్యాగారంగా మార్చిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందని ప్రభుత్వ విప్ రేగా కాంతారావు అన్నారు. కొత్తగూడెంలోని ప్రగతి మైదానంలో శనివారం ఆయన జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోడు భూముల సమస్యను త్వరలోనే ప్రభుత్వం పరిష్కరిస్తుందని చెప్పారు. దళితబంధు, కల్యాణలక్ష్మి, మిషన్‌భగీరథ వంటి పలు స్కీమ్‌లతో రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు న్యాయం చేస్తుందన్నారు. గోదావరి వరద ముంపు బాధితులకు ప్రభుత్వం అండగా నిలిచిందని తెలిపారు. ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, కలెక్టర్ అనుదీప్, ఎస్పీ డాక్టర్ వినీత్, అడిషనల్ కలెక్టర్ కె వెంకటేశ్వర్లు, లైబ్రరీ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ చైర్పర్సన్ కె సీతాలక్ష్మి పాల్గొన్నారు. ప్రజలు రాకపోవడంతో ప్రగతి మైదానంలో కుర్చీలన్నీ ఖాళీగా కనిపించాయి. వేడుకల అనంతరం హెలీ కాప్టర్లో విప్ రేగా కాంతారావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య హైదరాబాద్‌లో జరిగే వేడుకల్లో పాల్గొనేందుకు బయలుదేరి వెళ్లారు.
భద్రాచలంలో..
భద్రాచలం ఐటీడీఏ కార్యాలయం ఆవరణలో ఐటీడీఏలో పీవో గౌతమ్ పోట్రు, క్యాంప్ ఆఫీసులో ఎమ్మెల్యే పొదెం వీరయ్య, శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం ఆఫీసులో ఈవో శివాజీ, ఏఎస్పీ రోహిత్ రాజు జాతీయ పతాకాలను ఆవిష్కరించారు.
రాజకీయ లబ్ధి కోసమే పోటాపోటీగా సభలు
మధిర, వెలుగు: తెలంగాణ స్వాతంత్ర్య పోరాటంలో ఎలాంటి భాగస్వామ్యం లేని టీఆర్ఎస్, బీజేపీలు రాజకీయ లబ్ధి కోసం పోటాపోటీగా సభలు నిర్వహిస్తున్నాయని సీఎల్పీ నేత, మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. శనివారం క్యాంపు ఆఫీసులో మీడియాతో మాట్లాడారు. భూమి, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటంపై చర్చ జరగాలన్నారు. రజాకర్ల సైన్యాన్ని అడ్డుపెట్టుకొని దేశముఖ్ లు జాగీర్దారులు, జమీందారులు ప్రజలపై జరిపిన దాడులు, అరాచకాలపై చర్చించాల్సిన అవసరం ఉందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధ్వర్యంలో జనరల్ చౌదరి నాయకత్వాన అప్పటి ప్రధాని నెహ్రూ ఆర్మీని పంపించి నిజాం రాజును లొంగదీసుకుని తెలంగాణకు స్వాతంత్ర్యం కల్పించారని తెలిపారు. సెప్టెంబర్ 17ను తెలంగాణ స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవాలని కోరారు.
జాలుముడి కాలువ పరిశీలన
మండలంలోని జాలిముడి కాలువను సీఎల్పీ నేత కాంగ్రెస్ నాయకులతో కలిసి పరిశీలించారు. పిచ్చి మొక్కలు పెరగడంతో సాగు నీరు సక్రమంగా పారడం లేదని రైతులు వాపోయారు. ఇరిగేషన్ డీఈని పిలిపించి పిచ్చి మొక్కలను వెంటనే తొలగించాలని ఆదేశించారు. కాలువ నీరు చివరి ఆయకట్టు వరకు పారేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం బయ్యారం నుంచి మడుపల్లి వరకు నిర్మిస్తున్న బీటీ రోడ్డు పనులను పరిశీలించారు. సూరంశెట్టి కిశోర్, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, కిశోర్, పారుపల్లి విజయ్, నవీన్ రెడ్డి, వంశీ, శ్రీనివాస్, కర్నాటి రామారావు పాల్గొన్నారు.
మావోయిస్టు పోస్టర్ల కలకలం
భద్రాచలం, వెలుగు: భద్రాచలం మన్యంలో శనివారం మావోయిస్టుల వాల్‌పోస్టర్లు కలకలం రేపాయి. ఏపీ–తెలంగాణ సరిహద్దులోని ఎటపాక, దుమ్ముగూడెం మండలాల్లోని దుమ్ముగూడెం, తూరుబాక, కన్నాయిగూడెం కల్వర్ట్, ఎటపాక, పిచ్చుకులపాడు బస్టాండ్లు, మణుగూరు ఓసీ, కొత్తగూడెం సింగరేణి ఆఫీస్ వద్ద వాల్‌పోస్టర్లు అంటించారు. ఈ నెల 21 నుంచి 27 వరకు పార్టీ18వ వార్షికోత్సవాన్ని గ్రామగ్రామాన నిర్వహించాలని భద్రాద్రికొత్తగూడెం, -అల్లూరి సీతారామరాజు డివిజన్ కమిటీ కార్యదర్శి ఆజాద్ శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. దీర్ఘకాలిక ప్రజాయుద్దంతోనే దోపిడీ, అణచివేత, వివక్షతకు తావులేని ప్రజాస్వామిక భారతదేశాన్ని సాధించగలుగుతామని ఆ లేఖలో పేర్కొన్నారు.
మాతా శిశు కేంద్రంలో బాలింత మృతి
వైద్యుల నిర్లక్ష్యంతోనే చనిపోయిందని బంధువుల ఆందోళన
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: జిల్లా కేంద్రంలోని రామవరం మాతా, శిశు సంరక్షణ కేంద్రంలో బాలింత చనిపోయింది. మృతురాలి కుటుంబీకుల వివరాల ప్రకారం.. పాల్వంచ మండలం నాగారం గ్రామానికి చెందిన కొలగాని ప్రియాంక(21)ను డెలివరీ కోసం కొత్తగూడెం జిల్లా హాస్పిటల్‌కు శుక్రవారం సాయంత్రం తీసుకొచ్చారు. టెస్టులు చేసిన అనంతరం ఆమెను రామవరంలోని మాత, శిశు హాస్పిటల్‌కు తరలించారు. శనివారం ఉదయం టెస్టులు చేసి బ్లడ్ తక్కువగా ఉందని చెప్పిన వైద్యులు, ఆ తర్వాత బేబీ హార్ట్ బీట్ సరిగా లేదని సిజేరియన్ చేశారు. బాబు పుట్టాడని చెప్పిన డాక్టర్లు ప్రియాంక ఆరోగ్యం సరిగా లేదని, వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్లాలని సూచించారు. సాయంత్రం ప్రియాంక చనిపోయిందని చెప్పారని, అవసరమైన పరికరాలు హాస్పిటల్లో లేవని నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారని భర్త చెన్నారావు వాపోయాడు. కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వకుండా ఆమె మృతదేహాన్ని కొత్తగూడెం గవర్నమెంట్ హాస్పిటల్‌కు పోలీసుల సాయంతో తరలించేందుకు వైద్యులు యత్నించడంతో కుటుంబ సభ్యులు అడ్డుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే ప్రియాంక చనిపోయిందని ఆందోళన చేపట్టారు.
వేటగాళ్ల ఉచ్చుకు అడవిదున్న బలి
కారేపల్లి,వెలుగు : మండలంలోని మాణిక్యారం అటవీ ప్రాంతంలో వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు అడవిదున్న బలైంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మాణిక్యారం, చీమలపాడు అటవీ ప్రాంతాల్లో వేటగాళ్లు అడవి జంతువుల కోసం విద్యుత్ తీగలను అమర్చారు. తీగలకు తగిలి అడవి దున్న మృతి చెందగా, దానిని వేటగాళ్లు అలాగే వదిలేసి పోయారు. పోడు రైతులు గమనించి ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ ఆఫీసర్లు సంఘటన స్థలానికి వచ్చి పంచానామా అనంతరం అక్కడే పూడ్చి వేశారు.
భూ వివాదంలో ఘర్షణ ఆరుగురికి తీవ్ర గాయాలు
నేలకొండపల్లి,వెలుగు: భూ వివాదంలో రెండు కుటుంబాల మధ్య జరిగిన ఘర్షణలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. అధికార పార్టీ నాయకుడు, పోలీసుల అండతో తమపై దాడికి దిగి చంపేందుకు యత్నించారని బాధితులు కొమ్ము పవన్, విజయ్రాస్తారోకో చేశారు. గాయాలపాలైన వారిని ఎస్సై స్రవంతి సమాధాన పరిచి రాస్తారోకో విరమింపజేశారు. గాయాలపాలైన ఇరు వర్గాలకు చెందిన ఆరుగురిని పోలీసులు మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ కు తరలించారు.
- అడ్డాకూలీలను అడ్డుకున్న కాంట్రాక్ట్ కార్మికులు
- కొత్తగూడెంలో ఉద్రిక్తత
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెంలోని ఆఫీసర్లు ఉండే రైటర్ బస్తీలో శానిటేషన్ పనులు చేస్తున్న అడ్డా కూలీలను కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు అడ్డుకున్నారు. అడ్డాకూలీలతో కార్మికుల వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు కార్మిక సంఘాల నాయకులు, కాంట్రాక్ట్ కార్మికులను అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. యాజమాన్యం తీరును నిరసిస్తూ కొత్తగూడెంలోని సింగరేణి హెడ్ ఆఫీస్ ఎదుట కార్మికులు ధర్నా చేశారు. ఆర్ఎల్సీ వద్ద సింగరేణి యాజమాన్యానికి, కార్మిక సంఘాల జేఏసీ నాయకుల మధ్య శుక్రవారం జరిగిన చర్చలు విఫలం కావడంతో సమ్మెను సింగరేణి వ్యాప్తంగాఉధృతం చేసేందుకు కార్మిక సంఘాల నేతలు సమాయత్తమవుతున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని 11 ఏరియాల్లో కాంట్రాక్ట్ కార్మికులు ఈ నెల 9 నుంచి సమ్మె చేస్తున్నారు. కంపెనీలో అన్ని విభాగాల్లో 30 వేల నుంచి 35 వేల కాంట్రాక్ట్ కార్మికులు పని చేస్తున్నారు. కోల్సైడ్లో పని చేస్తున్న కార్మికులు సమ్మె చేస్తే కోల్ ప్రొడక్షన్, ట్రాన్స్‌పోర్టుపై ప్రభావం పడనుంది. సమ్మెతో సింగరేణిలోని కాలనీల్లో చెత్త పేరుకుపోతోంది. ఆఫీసర్ల ఇండ్లలో హౌస్ కీపింగ్ పని చేసే కార్మికులు రాక పోవడంతో అధికారుల కుటుంబాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు కుట్ర చేస్తున్నారని సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు రాసూరి శంకర్ ఆరోపించారు.
ఆర్టిజన్ కార్మికుడి ఆత్మహత్య
పాల్వంచ,వెలుగు: కుటుంబ కలహాలతో కేటీపీఎస్ లో ఆర్టి జన్ కార్మికుడిగా పని చేస్తున్న దొడ్డిపల్లి వేణు(43) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ధనమ్మతో తరచూ ఘర్షణ జరుగుతుండడంతో కొన్ని నెలలుగా వేణు వేరుగా ఉంటున్నాడు. గతంలో భార్య తరపు బంధువులు వేణుపై దాడి చేయడంతో పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మనస్థాపానికి గురైన వేణు కేటీపీఎస్ ఏ కాలనీలోని హెచ్–53 క్వార్టర్లోఉరేసుకొని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పట్టణ అడిషనల్ ఎస్సై ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాలికల హాస్టల్స్ నిర్వహణపై జడ్జి అసహనం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం పట్టణంలోని బాలికల ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్, బాబు క్యాంప్‌లోని ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహాన్ని అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి నీరజ తనిఖీ చేశారు. వంటగదులు, మరుగుదొడ్లు, క్లాస్ రూమ్‌లను పరిశీలించారు. హాస్టల్స్‌లో సౌకర్యాలు, భోజనం ఎలా ఉందని స్టూడెంట్స్‌ను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సౌకర్యం మెరుగు పర్చాలని వార్డెన్లకు ఆమె సూచించారు. హాస్టల్, పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, శిథిలావస్థలో ఉన్న మరుగుదొడ్లను చూసి ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
రామయ్యకు సువర్ణ తులసీదళార్చన
భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో శనివారం గర్భగుడిలో మూలవరులకు సువర్ణ తులసీదళాలతో అర్చన చేశారు. ముందుగా భద్రుని మండపంలో రామపాదుకులకు పంచామృతాలతో అభిషేకం చేశారు. అనంతరం కల్యాణమూర్తులను ప్రాకార మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం జరిపించారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన, యజ్ఞోపవీతం, జీలకర్ర బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక తర్వాత మంత్రపుష్పం సమర్పించి క్రతువు ముగించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది.
లోక్ అదాలత్ లో 163 కేసులు పరిష్కారం
సుజాతనగర్/మధిర, వెలుగు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కోర్టులో శనివారం జరిగిన బ్యాంకు లోక్ అదాలత్ లో 163 కేసులు పరిష్కరించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి పసుపులేటి చంద్రశేఖర ప్రసాద్ తెలిపారు. కొత్తగూడెంలో 131, ఇల్లందులో 32 కేసుల్లో రూ.62,91,350లతో సెటిల్ చేసినట్లు చెప్పారు. మధిర జూనియర్ సివిల్ కోర్టులో బ్యాంక్ లోక్ అదాలత్ నిర్వహించారు. మొండి బకాయిలుగా ఉన్న అప్పులను బ్యాంకు అధికారులు వన్ టైం సెటిల్మెంట్ కింద చెల్లించేలా చర్యలు తీసుకున్నారు. ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి డి ధీరజ్ కుమార్, అదనపు జూనియర్ సివిల్ జడ్జి టి కార్తీకరెడ్డి, ఏపీవో నాగలక్ష్మి, జె భద్రయ్య, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బి. పుల్లారావు పాల్గొన్నారు.
బాలికల హాస్టల్స్ నిర్వహణపై జడ్జి అసహనం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం పట్టణంలోని బాలికల ఎస్సీ, ఎస్టీ హాస్టల్స్, బాబు క్యాంప్‌లోని ప్రభుత్వ గిరిజన బాలికల వసతి గృహాన్ని అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జి నీరజ తనిఖీ చేశారు. వంటగదులు, మరుగుదొడ్లు, క్లాస్ రూమ్‌లను పరిశీలించారు. హాస్టల్స్‌లో సౌకర్యాలు, భోజనం ఎలా ఉందని స్టూడెంట్స్‌ను అడిగి తెలుసుకున్నారు. తాగునీటి సౌకర్యం మెరుగు పర్చాలని వార్డెన్లకు ఆమె సూచించారు. హాస్టల్, పరిసరాలు శుభ్రంగా లేకపోవడం, శిథిలావస్థలో ఉన్న మరుగుదొడ్లను చూసి ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని సూచించారు.
ఆర్టిజన్ కార్మికుడి ఆత్మహత్య
పాల్వంచ,వెలుగు: కుటుంబ కలహాలతో కేటీపీఎస్ లో ఆర్టి జన్ కార్మికుడిగా పని చేస్తున్న దొడ్డిపల్లి వేణు(43) ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. భార్య ధనమ్మతో తరచూ ఘర్షణ జరుగుతుండడంతో కొన్ని నెలలుగా వేణు వేరుగా ఉంటున్నాడు. గతంలో భార్య తరపు బంధువులు వేణుపై దాడి చేయడంతో పోలీస్ స్టేషన్లో కేసులు కూడా పెట్టినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మనస్థాపానికి గురైన వేణు కేటీపీఎస్ ఏ కాలనీలోని హెచ్–53 క్వార్టర్లోఉరేసుకొని ఆత్మహత్యకు పాల్ప డ్డాడు. మృతుడికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పట్టణ అడిషనల్ ఎస్సై ప్రవీణ్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
వేటగాళ్ల ఉచ్చుకు అడవిదున్న బలి
కారేపల్లి,వెలుగు : మండలంలోని మాణిక్యారం అటవీ ప్రాంతంలో వేటగాళ్ల విద్యుత్ ఉచ్చుకు అడవిదున్న బలైంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మాణిక్యారం, చీమలపాడు అటవీ ప్రాంతాల్లో వేటగాళ్లు అడవి జంతువుల కోసం విద్యుత్ తీగలను అమర్చారు. తీగలకు తగిలి అడవి దున్న మృతి చెందగా, దానిని వేటగాళ్లు అలాగే వదిలేసి పోయారు. పోడు రైతులు గమనించి ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ ఆఫీసర్లు సంఘటన స్థలానికి వచ్చి పంచానామా అనంతరం అక్కడే పూడ్చి వేశారు.