ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాచలం, వెలుగు: శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో మంగళవారం నుంచి నిత్య కల్యాణాలు ప్రారంభమయ్యాయి. గత నెల 23న ముక్కోటి ఉత్సవాల సందర్భంగా నిత్య కల్యాణాలు రద్దు చేశారు. సీతారామయ్యకు తెప్పోత్సవం, వైకుంఠ ఉత్తర ద్వార దర్శనం నిర్వహించిన అనంతరం పగల్​పత్​ ఉత్సవాలు ముగిశాయి. దీంతో స్వామికి నిత్య కల్యాణాలు ప్రారంభించారు. ముందుగా గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి గర్భగుడిలో సుప్రభాత సేవ చేశారు. 

గాలి గోపురానికి ఎదురుగా ఉన్న ఆంజనేయస్వామికి పంచామృతాలతో అభిషేకం చేశారు. హనుమాన్​ చాలీసా పారాయణం జరిగింది. తమలపాకులు, అప్పాల మాలలు నివేదించారు. శ్రీసీతారామచంద్రస్వామి కల్యాణమూర్తులను ప్రాకార మండపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణం చేశారు. భక్తులు కంకణాలు ధరించి క్రతువులో పాల్గొన్నారు.

అంబసత్రంలో రాపత్​ సేవ

శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా మంగళవారం రాత్రి స్థానిక అంబసత్రంలో రాపత్ సేవ జరిగింది. ఆలయంలో దర్బార్​ సేవ అనంతరం శ్రీసీతారామచంద్రస్వామి ఊరేగింపుగా అంబసత్రానికి చేరుకున్నారు. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, ఆరాధన తర్వాత ప్రత్యేక పూజలు జరిగాయి. భక్తులు స్వామి వారిని ఆరాధించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. స్వామి తిరిగి రామాలయానికి చేరుకున్నారు.

గ్రామాల అభివృద్ధికి పాటుపడాలి

ఖమ్మం టౌన్, వెలుగు: గ్రామాలను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు పాటు పడాలని కలెక్టర్  వీపీ గౌతమ్  సూచించారు. మంగళవారం కలెక్టరేట్  ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులు, సర్పంచులతో గ్రామాల అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వనరులు, అధిక ఆదాయం ఉన్న గ్రామ పంచాయతీలు డెవలప్​మెంట్​ కోసం కార్యాచరణ తయారు చేసుకోవాలని సూచించారు. ఖమ్మం రూరల్ మండలం పెద్దతాండ, ఏదులాపురం, పోలేపల్లి, గుర్రాలపాడు, కూసుమంచి మండలం పాలేరు, కామేపల్లి మండలం కొమ్మినేపల్లి, కల్లూరు మండలం కల్లూరు గ్రామ పంచాయతీల ఆదాయం, అభివృద్ధి పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు.

ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని అందుకు అనుగుణంగా అభివృద్ధి చేయాలన్నారు. మున్సిపాలిటీలకు దీటుగా అభివృద్ధి చేయాలని అన్నారు. అడిషనల్​ కలెక్టర్ స్నేహలత మొగిలి, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు, పీఆర్  ఈఈ కేవీకే శ్రీనివాస్, డీఎల్పీవోలు ఆర్  పుల్లారావు, వి ప్రభాకర రావు, ఎంపీడీవోలు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

బీసీలను మోసం చేస్తున్రు​ 

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: బీసీలను బీఆర్ఎస్​ సర్కార్​ మోసం చేస్తుందని బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి దివాకర్, జిల్లా అధ్యక్షుడు ఆకుల నాగేశ్వరరావు గౌడ్​ విమర్శించారు. కొత్తగూడెం క్లబ్​లో ఓబీసీ మోర్చా ప్ర శిక్షణా తరగతులను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ రాబోయే కాలంలో కేంద్రంతో పాటు రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీసీల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం బీజేపీతోనే సాధ్యమని అన్నారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం ఓబీసీలకు పెద్దపీట వేసిందన్నారు. మంగళ, బుధవారాల్లో ట్రైనింగ్​ క్లాసులు జరుగుతాయని చెప్పారు. సంజయ్, రంగా కిరణ్, రమేశ్, రవికుమార్, శ్రీనివాస్, వీరు గౌడ్, రవీంద్రబాబు, సత్యనారాయణ, నిర్మలాదేవి, సత్యనారాయణ పాల్గొన్నారు. 

కార్యకర్తలకు అండగా ఉంటాం

గుండాల, వెలుగు: కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా ఉంటామని ములుగు ఎమ్మెల్యే సీతక్క కొడుకు సూర్య అన్నారు. మంగళవారం ఆళ్లపల్లి మండలం మర్కోడు గ్రామంలో పర్యటించారు. కాంగ్రెస్ కార్యకర్తలను కలిసి పార్టీ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రానున్న రోజుల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రతీ కార్యకర్తకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పార్టీ మండల అధ్యక్షుడు పాయం రామనరసయ్య, కిసాన్ సెల్ అధ్యక్షుడు పడిగె సమ్మయ్య, బీసీ సెల్ అధ్యక్షుడు తాళ్లపల్లి చిరంజీవి, కొమరం వెంకట దొర, ముప్పిడి రాజబాబు, ముప్పారపు నరసింహులు, సుతారి కృష్ణ, నాగేశ్  పాల్గొన్నారు.

 సీఐటీయూ ఆధ్వర్యంలో దీక్షలు

భద్రాచలం, వెలుగు: పెండింగ్​ వేతనాలు విడుదల చేయాలని డిమాండ్​ చేస్తూ మంగళవారం గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని పీఎంహెచ్​ పోస్టుమెట్రిక్​ హాస్టల్స్ లో పని చేస్తున్న ఔట్​ సోర్సింగ్​ కార్మికులు దీక్షలు ప్రారంభించారు. జిల్లా అధ్యక్షుడు బ్రహ్మచారి మాట్లాడుతూ జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లకు ప్రతి నెలా వేతనాలు ఇస్తున్న సర్కారు రెండేళ్లుగా కార్మికులను వేధిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రెండేండ్ల వేతనాలు వెంటనే చెల్లించాలని, పెంచిన వేతనం రూ.26 వేలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. సీఐటీయూ పట్టణ నాయకులు నకరికంటి నాగరాజు, జి లక్ష్మీకాంత్, శీలం సత్యవతి, కనితి శారద, శ్రీను, గుండి రాధ, జాడి లక్ష్మి, కారం లక్ష్మి, తుర్రం వెంకట్​రావు, రాములు, తిరుపతమ్మ, సమ్మక్క, నాగమణి 
పాల్గొన్నారు.

ఎమ్మెల్యేకు తెలియకుండా ఎలా కూల్చేస్తరు

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పట్టణంలోని మున్సిపల్​ మార్కెట్​ను ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుకు తెలియకుండా అధికారులు ఎలా కూల్చివేస్తారని బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేశ్​ ప్రశ్నించారు. పార్టీ జిల్లా ఆఫీసులో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూరగాయలు అమ్ముకునే చిరు వ్యాపారుల పొట్ట కొట్టేలా అధికారులు వ్యవహరించడం సరైంది కాదన్నారు. మున్సిపాలిటీలో ఏం జరుగుతుందో కూడా తెలియదని చైర్ పర్సన్​ అనడం విడ్డూరంగా ఉందన్నారు. ప్రత్యామ్నాం చూపకుండా షాపులను కూల్చివేసిన ఆఫీసర్లపై కేసులు పెట్టాలని అన్నారు.

పంచాయతీ ఆఫీసుకు తాళం

జూలూరుపాడు, వెలుగు: విలేజ్​ పార్కులో వర్కర్ గా పని చేసిన గుంటి సూరమ్మకు జీతం పూర్తిగా ఇవ్వకపోవడంతో మంగళవారం గ్రామ పంచాయతీ ఆఫీసుకు తాళం వేసి నిరసన తెలిపింది. మండలంలోని పాపకొల్లు గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనంలో గుంటి సూరమ్మను నెలకు రూ.5,500 వేతనంతో నియమించారు. 18 నెలల పాటు పని చేసిన సూరమ్మకు రూ.30 వేలు మాత్రమే చెల్లించారు. మిగతా డబ్బులు చెల్లించకుండా నిర్లక్ష్యంగా సమధానం చెప్పడంతో మంగళవారం పంచాయతీ ఆఫీసుకు తాళం వేసి తనకు న్యాయం చేయాలని ఆఫీసు ముందు బైఠాయించింది. ఎం‌‌పీవో రామారావు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో నిరసన విరమించింది.

ప్రశాంతంగా ముగిసిన పోలీస్​ ఈవెంట్స్

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: పోలీస్ శాఖలో వివిధ విభాగాల్లో పోస్టుల భర్తీలో భాగంగా 22 రోజుల పాటు నిర్వహించిన ఈవెంట్స్​ మంగళవారం ముగిశాయి. చివరి రోజు 939 మంది హాజరు కాగా, 605 మంది క్వాలిఫై అయినట్లు సీపీ విష్ణు ఎస్​ వారియర్​ తెలిపారు. ఈవెంట్స్​కు మొత్తం 21,809 మంది అభ్యర్థులు హాజరు కాగా, 12,567 మంది క్వాలిఫై అయినట్లు చెప్పారు. చివరి రోజు ఈవెంట్స్​ను కలెక్టర్  వీపీ గౌతమ్, మున్సిపల్  కమిషనర్ ఆదర్శ్ సురభి, ట్రైనీ అసిస్టెంట్  కలెక్టర్  రాధిక గుప్తా పరిశీలించారు. ఎంపిక ప్రక్రియను సీపీ వివరించారు. ఈ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించిన సిబ్బందికి ప్రశంసా పత్రాలను అందజేసి అభినందించారు. అడిషనల్ డీసీపీ  సుభాష్ చంద్రబోస్, ఏఎస్పీ అక్షాంశ్ యాదవ్, ఏసీపీలు ప్రసన్న కుమార్, అంజనేయులు, బస్వారెడ్డి, వెంకటేశ్, రహమాన్, వెంకటస్వామి, రవి, బాబురావు పాల్గొన్నారు.