ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి శనివారం సువర్ణ తులసీదళాలతో అర్చన జరిగింది. గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి గర్భగుడిలో సుప్రభాతసేవ చేసి బాలబోగం నివేదించారు. రామపాదుకలకు భద్రుని మండపంలో పంచామృతాలతో అభిషేకం, సమస్త నదీజలాలతో స్నపన తిరుమంజనం చేశారు. తర్వాత గర్భగుడిలో మూలవరులకు బంగారు తులసీ దళాలతో అర్చన చేసి ప్రత్యేక హారతులిచ్చారు. కల్యాణమూర్తులను ప్రాకార మండపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణం జరిపించారు. విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, ఆరాధన తర్వాత భక్తులు కంకణాలు ధరించి స్వామి వారికి కల్యాణ క్రతువు నిర్వహించారు.

కంకణధారణ, యజ్ఞోపవీతం, జీలకర్రబెల్లం, సుముహూర్తాన మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక తర్వాత మంత్రపుష్పం సమర్పించారు. మాద్యాహ్నిక ఆరాధనల తర్వాత రాజబోగం నివేదించారు. సాయంత్రం దర్బారు సేవ జరిగింది. కాగా ఆదివారం శ్రీరామపునర్వసు దీక్షల విరమణ, రామపాదుకలతో గిరిప్రదక్షిణ, శోభాయాత్ర, వెండి రథోత్సవం, సోమవారం శ్రీరామపట్టాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఈవో శివాజీ ఒక ప్రకటనలో తెలిపారు.

కాంగ్రెస్ గెలుపు కోసం కృషి చేయాలి

ఖమ్మం టౌన్, వెలుగు: రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్  పార్టీ గెలుపే లక్ష్యంగా మహిళా కాంగ్రెస్ లీడర్లు పని చేయాలని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. పార్టీ కార్యక్రమాల నిర్వహణ, కమిటీల ఏర్పాటు, సంఘ విస్తరణ, బలోపేతం, కమిటీ నిర్మాణం చేసుకొని రాష్ట్రంలోనే ఖమ్మం జిల్లా మహిళా కాంగ్రెస్  ముందుండాలని సూచించారు. సిటీలోని పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం మహిళా కాంగ్రెస్  జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఈ నెల 25 లోగా గ్రామ, మండల, జిల్లా స్థాయి కమిటీలు పూర్తి చేసుకోవాలని సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న మహిళా వ్యతిరేక విధానాలు, దాడులు, వివక్షతకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మహిళా కాంగ్రెస్  రాష్ట్ర ఉపాధ్యక్షురాలు దుర్గారాణి, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య పాల్గొన్నారు.

రేషన్  బియ్యం పట్టివేత

ఎర్రుపాలెం, వెలుగు: మండలంలోని సత్యనారాయణపురం గ్రామంలోని కోళ్ల ఫారం నిర్వాహకులు అక్రమంగా నిల్వ ఉంచిన 85 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని పట్టుకున్నట్లు టాస్క్ ఫోర్స్  సీఐ రమేశ్​ తెలిపారు. పూర్ణచంద్రరావు, సాంబశివరావు, పుల్లారావు, హనుమంతరావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మేడ ప్రసాద్  తెలిపారు.
మధిర: నేలకొండపల్లి నుంచి ఎర్రుపాలెం తరలిస్తున్న 30 క్వింటాళ్ల రేషన్​ బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. ఎర్రుపాలెం గ్రామానికి చెందిన అంకటి వెంకటేశ్, గన్నవరం గ్రామానికి చెందిన హనుమంతరావు కోళ్ల ఫారాలకు తరలిస్తున్నట్లు టౌన్​ ఎస్ఐ సతీశ్​కుమార్  చెప్పారు. పట్టుబడిన బియ్యాన్ని డిప్యూటీ తహసీల్దార్​కు అప్పగించినట్లు తెలిపారు.

సింగరేణి వేడుకలపై జీఎం సమీక్ష

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణి దినోత్సవ ఏర్పాట్లపై జీఎం (పర్సనల్)​, వేడుకల కన్వీనర్​ కె.బసవయ్య శనివారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రాభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తూ లక్షలాది కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నామని ఆయన తెలిపారు. ఈనెల 23న కొత్తగూడెం ప్రకాశం స్టేడియంలో ఉత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని సూచించారు. పతాకావిష్కరణ, స్టాల్స్ ఏర్పాటు తదితర అంశాలపై చర్చించారు. వేడుకలకు వచ్చే సింగరేణి కుటుంబ సభ్యులు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి

కారేపల్లి, వెలుగు: పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని వైరా ఎమ్మెల్యే లావుడ్యా రాములు నాయక్ కోరారు. మండలకేంద్రంలోని వైఎస్ఎన్ ఫంక్షన్ హాల్ లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 52 మంది లబ్ధిదారులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్  చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేదింటి ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఎంపీపీ మాలోత్ శకుంతల, జడ్పీటీసీ జగన్, వైస్ ఎంపీపీ రావూరి శ్రీనివాసరావు, సర్పంచ్ స్రవంతి, తహసీల్దార్  లక్ష్మి పాల్గొన్నారు.

భద్రాచలం చేరుకున్న శ్రీరామ దీక్షాపరులు

భద్రాచలం, వెలుగు: ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం పంజా వేమవరం గ్రామానికి చెందిన 60 మంది శ్రీరామపునర్వసు దీక్షాపరులు శనివారం రాత్రి పాదయాత్రగా భద్రాచలం చేరుకున్నారు. 240 కి.మీలు నడుచుకుంటూ శ్రీరామనామస్మరణ చేసుకుంటూ వచ్చారు. ఆదివారం శ్రీరామపునర్వసు దీక్షల విరమణ అనంతరం స్వామిని దర్శించుకుని తిరిగి వెళ్లనున్నారు.

దాడి ఘటనలో ఆరుగురు అరెస్ట్

ఖమ్మం టౌన్, వెలుగు: సిటీలోని మామిళ్లగూడెం ప్రాంతంలో యూపీకి చెందిన చిరు వ్యాపారులపై దాడి చేసిన కేసులో ఆరుగురిని అరెస్ట్  చేసి రిమాండ్ కు తరలించినట్లు ఖమ్మం టూ టౌన్  సీఐ శ్రీధర్  తెలిపారు. షేక్  హజ్మా నజీమ్, ఎండీ ఫైజన్ అఖిమ్,షేక్  జేషన్, కనుగంటి నితీష్, ఎండీ అద్నాన్, షేక్  ఖాజా మొయినుద్దీన్ లను అరెస్ట్ చేసినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఇంకా ఎవరిదైనా ప్రమేయం ఉందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ఆశ్రమ పాఠశాలల్లో తనిఖీలు షురూ

భద్రాచలం, వెలుగు: భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలల్లో వార్షిక తనిఖీలు ప్రారంభమయ్యాయి. జిల్లాలోని భద్రాచలం, దమ్మపేట, ఇల్లందు డివిజన్లుగా విభజించి మూడు టీమ్స్ తో 60 స్కూళ్లలో తనిఖీలు చేపట్టారు. ప్రతీ స్కూల్, హాస్టల్​లో విద్యార్థుల ప్రమాణాలు, టీచర్ల బోధన తదితర అంశాలను పరిశీలిస్తున్నారు. రికార్డులను పరిశీలించి లోపాలను గుర్తిస్తారు. హాస్టళ్లలో పరిసరాలు, కిచెన్, ఆహారంలో నాణ్యత, స్టోర్ రూమ్​ నిర్వహణ, క్లాస్​ రూమ్స్​లో సౌలతులు, ల్యాబ్​లు, మౌలిక సదుపాయాలపై అడిగి తెలుసుకుంటున్నారు.

స్టూడెంట్స్​ రోజువారీ కార్యకలాపాలను పరిశీలిస్తునారు. ట్రైబల్ వెల్ఫేర్​ డిపార్ట్​మెంట్​నుంచి వచ్చిన నమూనా ప్రకారం ప్రతీ ఆశ్రమ పాఠశాలకు 300 మార్కులకు గ్రేడ్లు ఇస్తారు. ఇలా అన్ని పాఠశాలల నుంచి వచ్చిన నివేదికలను పరిశీలించి భవిష్యత్​ అవసరాల ప్రకారం నిధులు, సౌలతులు సమకూర్చుతారు. జనవరి 30 వరకు ఈ తనిఖీలు నిర్వహిస్తామని పీవో గౌతమ్​ పోట్రు, డీడీ రమాదేవి తెలిపారు.

విద్యతోనే సమాజంలో గుర్తింపు

మధిర, వెలుగు: విద్యతోనే సమాజంలో గుర్తింపు లభిస్తుందని మధిర ఎమ్మెల్యే భట్టి విక్రమార్క అన్నారు. ఇంటర్నేషనల్  హ్యూమన్  రైట్స్  డే సందర్భంగా మధిర టీవీఎం స్కూల్​లో నియోజకవర్గ స్థాయి క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సతీసహగమనం, బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించి నిర్బంధ ఉచిత విద్యను తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ కు దక్కుతుందన్నారు. ప్రతీ ఒక్కరు చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. సీఐ మురళి, ఎంఈవో వై ప్రభాకర్, కాంగ్రెస్  పట్టణ అధ్యక్షుడు మిర్యాల రమణ గుప్తా, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, మునుగోటి వెంకటేశ్వర్లు, కర్నాటి రామారావు, చిట్టిబాబు, అద్దంకి రవికుమార్, మాగంటి జంపయ్య, శ్రీను పాల్గొన్నారు.

విజేతలకు ట్రోఫీ అందజేత

ఖమ్మం టౌన్: సోనియాగాంధీ బర్త్​డే సందర్భంగా ఎన్ఎస్ యూఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నగరంలో నిర్వహించిన రాజీవ్ గాంధీ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ లో తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్  జూనియర్  కాలేజ్(తిరుమలయపాలెం) గెలుపొందింది. ఖమ్మం ఎస్ బీఐటీ కాలేజీ సెకండ్​ ప్లేస్​లో నిలిచింది. విజేతలకు సీఎల్పీ లీడర్  మల్లు భట్టి విక్రమార్క ట్రోఫీలను అందజేశారు. ఎన్ఎస్ యూఐ జిల్లా అధ్యక్షుడు వి ఉదయ్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు వీరభద్రం, సిటీ అధ్యక్షుడు జావీద్  పాల్గొన్నారు.

మానవ హక్కులపై అవగాహన

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: మనిషి స్వతంత్రంగా జీవించేందుకు రాజ్యాంగం హక్కులు కల్పించిందని కొత్తగూడెం ప్రిన్సిపల్​జడ్జి జి భానుమతి అన్నారు. మండల లీగల్​సెల్​ సర్వీసెస్​ ఆధ్వర్యంలో ప్రపంచ మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా శనివారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మానవ హక్కులపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి ఒక్కరూ వివక్ష లేకుండా సమాన హక్కులతో జీవించాలని ఏటా ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల దినోత్సవాన్నినిర్వహిస్తోందని తెలిపారు. 

డీసీసీ అద్యక్షుడిగా మళ్లీ పొదెం వీరయ్య

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: భద్రాద్రికొత్తగూడెం డీసీసీ అద్యక్షుడిగా తిరిగి భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్యను నియమిస్తూ శనివారం కాంగ్రెస్​ అధిష్టానం ఉత్తర్వులు జారీ చేసింది. పీసీసీ సీనియర్​ ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరిస్తున్నారు. రెండోసారి డీసీసీ ప్రెసిడెంట్​గా అవకాశం కల్పించడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ వద్ద నాయకులు, కార్యకర్తలు పటాకులు కాల్చి, స్వీట్లు పంచుకొని సంబురాలు చేసుకున్నారు.

127 మంది రైతులకు మోటార్లు అందజేత

ములకలపల్లి, వెలుగు: మండలంలోని 127 మంది గిరిజన రైతులకు జేవీఆర్​ ట్రస్ట్​ ఆధ్వర్యంలో వ్యవసాయ మోటార్లను మాజీ మంత్రి జలగం ప్రసాదరావు, అశ్వరావుపేట ఎమ్మెల్యే మచ్చా నాగేశ్వరరావు అందజేశారు. కమలాపురం, కొత్త గంగారం, పాత గంగారం, వాగోడు గుంపు, తోగూడెం, చండ్రుకుంట గ్రామాల్లోని 127 మంది గిరిజన రైతులకు అందజేసి పంటల సాగుపై దృష్టి పెట్టాలని సూచించారు. గిరిజన రైతులను ఆదుకొనేందుకే ఈ కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. అనంతరం పాత గంగారంలో క్రీడా ప్రాంగణాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు.

తోగూడెం, చండ్రకుంట గ్రామానికి చెందిన మహిళలు రోడ్డు, అంగన్​వాడీ బిల్డింగు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయగా, మంజూరు చేపిస్తానని హామీ ఇచ్చారు. జడ్పీటీసీ సున్నం నాగమణి, ఎంపీపీ మట్ల నాగమణి, విద్యుత్​ శాఖ డీఈ శేషాద్రి, ఏడీ లక్ష్మణ్, ఎంపీడీవో సీహెచ్  నాగేశ్వరరావు, బీఆర్ఎస్  మండల అధ్యక్షుడు అప్పారావు, సర్పంచులు పెంటయ్య, సుధీర్, సవలం సుజాత, లక్ష్మి, ఎంపీటీసీలు విజయ, సునీత, తులసి,నాగల వెంకటేశ్వరరావు, పువ్వాల మంగపతి, పుష్పాల చందర్​రావు, రాజారావు పాల్గొన్నారు.

ఏఎస్ఐకి పోలీస్​ ఆఫీసర్ల నివాళి

ఖమ్మం టౌన్, వెలుగు: యాక్సిడెంట్​లో చనిపోయిన కూసుమంచి ఏఎస్ఐ సుధాకర్  మృతదేహాన్ని అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్ర బోస్, పోలీస్ అసోసియేషన్  ప్రతినిధులు సందర్శించి నివాళులు అర్పించారు. నగరంలోని సౌత్  ఇండియా షాపింగ్  మాల్ సమీపంలో శుక్రవారం జరిగిన ప్రమాదంలో సుధాకర్  చనిపోయారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించి పోలీస్​ శాఖ తరపున అండగా ఉంటామని భరోసా కల్పించారు. సీఐ సతీశ్, పోలీస్ అసోసియేషన్  ఆర్గనైజింగ్ సెక్రటరి  వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరి జానీమియా, మోహన్ రావు పాల్గొన్నారు.

ఎస్​బీఐటీ స్టూడెంట్స్​కు హైకోర్టులో జాబ్స్​

ఖమ్మం టౌన్, వెలుగు: హైకోర్టు పర్సనల్ సెక్రెటరీలుగా ఎస్ బీఐటీ కాలేజీలో ఎంబీఏ చదువుతున్న కొమ్మినేని లలిత, ఈఈఈ చదువుతున్న వల్లంకొండ సుమతి సెలెక్ట్ అయినట్లు కాలేజీ చైర్మన్  గుండాల కృష్ణ తెలిపారు. తమ కాలేజీ విద్యార్ధులు హైకోర్టులో ఉద్యోగాలు పొందడం గర్వకారణమని అన్నారు. వారిని చైర్మన్​తో పాటు లెక్చరర్లు అభినందించారు. కాలేజీ సెక్రటరీ అండ్  కరస్పాండెంట్  డాక్టర్  జి ధాత్రి, ప్రిన్సిపాల్ డాక్టర్ జి రాజ్ కుమార్, అకడమిక్ డైరెక్టర్లు డాక్టర్  ఏవీవీ శివప్రసాద్, డాక్టర్  సుభాష్ చందర్, జి ప్రవీణ్ కుమార్  పాల్గొన్నారు.

రాత పరీక్షకు 653 మంది క్వాలిఫై

ఖమ్మం టౌన్, వెలుగు: పోలీస్​ ఎంపిక ప్రక్రియలో భాగంగా శనివారం జరిగిన ఫిజికల్​ టెస్ట్​కు 936 మంది మహిళా అభ్యర్థులు హాజరు కాగా, 653 మంది క్వాలిఫై అయినట్లు సీపీ విష్ణు ఎస్  వారియర్  తెలిపారు. 1103 మంది అభ్యర్థులు హాజరు కావాల్సి ఉండగా, 936 మంది హాజరైనట్లు చెప్పారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, నియామకాలపై ఎలాంటి అపోహలు వద్దని సూచించారు.