ముగిసిన కిసాన్‌మోర్చా శిక్షణ తరగతులు
భద్రాచలం, వెలుగు: ప్రధాని నరేంద్రమోడీ రైతు పక్షపాతిగా వ్యవహరిస్తున్నారని బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి అన్నారు. కిసాన్‌మోర్చా మూడు రోజుల శిక్షణ తరగతులు శుక్రవారంతో ముగిశాయి. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఎం మోడీ రైతు సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతుంటే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం వాటిని రైతులకు అందకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఖాయిలా పడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని వేల కోట్లు వెచ్చించి జాతికి అంకితం చేస్తుంటే అభివృద్ధి వ్యతిరేక శక్తులు చిల్లర రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. అంతర్జాతీయ మార్కెట్లో రసాయన ఎరువుల ధరలు విపరీతంగా పెరిగినా, సబ్సిడీ పెంచి ధరలను నియంత్రించిన ఘనత మోడీదేనని అన్నారు. రుణమాఫీ ప్రకటించి ఇప్పటి వరకు అమలు చేయలేదని, కేంద్రం పంటల బీమా పథకం అమలు చేస్తే అడ్డుకున్నారని చెప్పారు. ధరణి పోర్టల్ పేరుతో రైతులను ఇబ్బంది పెడుతూ వేధిస్తున్నారని ఆరోపించారు. జాతీయ కార్యవర్గ సభ్యుడు గోలి మధుసూధనరెడ్డి, పాపయ్య గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జగన్మోహన్రెడ్డి, అంజన్న యాదవ్, ఉపాధ్యక్షులు సింగిడి కృష్ణారెడ్డి, తిరుపతిరెడ్డి పాల్గొన్నారు.
పలు అంశాలపై చర్చ
రైతుల కోసమే ఆర్ఎఫ్సీఎల్ జాతికి అంకితం
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: దేశ అభివృద్దే ప్రధాని మోడీ లక్ష్యమని బీజెపీ జిల్లా అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ అన్నారు. శుక్రవారం బీజేపీ ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడుతూ రెండు దశాబ్దాల నుంచి మూతపడ్డ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని రూ.6,210 కోట్లతో పునరుద్ధరించి జాతికి అంకితం చేస్తున్నారని తెలిపారు. దీంతో తెలంగాణతో పాటు దేశంలోని రైతులకు ఎరువుల కొరత, సబ్సిడీ ధరకే యూరియా లభిస్తుందని చెప్పారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు సబ్సిడీలు ఇవ్వకుండా రైతుబంధు ఇస్తున్నామంటూ దగా చేస్తుందని విమర్శించారు. పార్టీ రాష్ట్ర నాయకుడు గెంటేల విద్యాసాగర్, జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్ర ప్రదీప్, శ్యాం రాథోడ్, నున్నా రవికుమార్, మందా సరస్వతి, రాజేశ్, ప్రవీణ్, ఉపేందర్‌గౌడ్, అనిత, కుమిలి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కమ్యూనిస్టులు అమ్ముడుపోవడం సిగ్గుచేటు
భద్రాద్రికొత్తగూడెం: సీట్లు, డబ్బుల కోసం కమ్యూనిస్టులు సీఎం కేసీఆర్‌కు అమ్ముడుపోవడం సిగ్గు చేటని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ అన్నారు. బీజేపీ జిల్లా ఆఫీస్‌లో మీడియాతో మాట్లాడారు. రెండు, మూడు సీట్లకు కక్కుర్తి పడి కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాలను పక్కన పెట్టడమేమిటని ప్రశ్నించారు. ప్రధాని పర్యటనను అడ్డుకోవాలని కమ్యూనిస్టులు, టీఆర్ఎస్ నాయకులు పిలుపునివ్వడం సరైంది కాదన్నారు. యడ్లపల్లి శ్రీనివాసరావు, పగడిపాటి రవీందర్, లక్ష్మణ్ అగర్వాల్, బాల వెంకటరెడ్డి, వంశీ, నాగేశ్వరరావు, విమల్‌కుమార్, రవి రమేశ్పాల్గొన్నారు.
ప్రధానిని విమర్షించే అర్హత లేదు
సత్తుపల్లి : ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనను అడ్డుకొని తమ ఉనికిని కాపాడుకోవాలని ఎర్ర జెండాల నాయకులు యత్నించడం సిగ్గు చేటని బీజేపీ ఖమ్మం పార్లమెంట్ కన్వీనర్ నంబూరి రామలింగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, కొత్తగూడెం, సత్తుపల్లి రైల్వే లైన్లను ప్రజలకు అంకితం చేయడానికి ప్రధాని వస్తుంటే రాజకీయం చేస్తున్నారని విమర్శించారు. బీజేపీకి పెరుగుతున్న ఆదరణ చూసి తట్టుకోలేకే ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కళాభారతి ఆడిటోరియంలో నరేంద్ర మోడీ కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా తిలకించే ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లా కార్యదర్శి నాయుడు రాఘవరావు, మైనార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు రహమతుల్లా, మండల అధ్యక్షుడు పాలకొల్లు శ్రీనివాస్, జిల్లా నాయకులు మట్టా ప్రసాద్, మాదిరాజు శ్రీనివాసరావు, భీమిరెడ్డి సత్యనారాయణరెడ్డి పాల్గొన్నారు.
ప్రధాని పర్యటనను సక్సెస్ చేయాలి
ఇల్లందు: ప్రధాని రాష్ట్ర పర్యటనను సక్సెస్ చేయాలని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేశ్ రెడ్డి కోరారు. పార్టీ టౌన్ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర పర్యటనకు వస్తున్న ప్రధానిని అడ్డుకోవాలని పిలుపునివ్వటం సరైంది కాదన్నారు. 8 ఏండ్ల నుంచి నోటిఫికేషన్లు ఇవ్వకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమయ్యారని విమర్శించారు. ప్రతీ రోజు హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ అవుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. బాధ్యత కలిగిన పదవిలో ఉండి వినయ్ భాస్కర్ ఒక కుల సంఘ నాయకుడిలా వ్యవహరిస్తూ ధర్నా చేపట్టి సింపతీ కోసం ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు. బాలాజీ ఫంక్షన్ హాల్లో మోడీ సభ లైవ్ టెలికాస్ట్ చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. జిల్లా ఉపాధ్యక్షుడు నాళ్ల సోమసుందర్, గోపికృష్ణ గౌడ్, సంజీవరెడ్డి, రేవళ్ల నాగరాజు, శివకుమార్ పాల్గొన్నారు.
జేవీఆర్ ట్రస్ట్ సేవలు అభినందనీయం
ములకలపల్లి, వెలుగు: ఏజెన్సీలోని నిరుపేద గిరిజన రైతులకు జలగం వెంగళరావు(జేవీఆర్) ట్రస్టు అందిస్తున్న సేవలు అభినందనీయమని ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరావు కొనియాడారు. మండలంలోని గుండాలపాడు పరిసర గ్రామాలకు చెందిన 25 మంది రైతులకు జేవీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా వ్యవసాయ మోటార్లు అందచేశారు. మాజీ మంత్రి జలగం ప్రసాదరావుతో కలసి రైతులకు మోటార్లు పంపిణీ చేశారు. ఎంపీపీ మట్ల నాగమణి, ఎంపీటీసీ నూప సరోజిని, సర్పంచ్ కారం కుమారి, ఏఈ లక్ష్మీనర్సింహారావు, తుర్రం శ్రీను పాల్గొన్నారు.
పోక్సో కేసులో నిందితుడికి పదేండ్ల జైలు
స్వర్ణకవచధారిగా రామయ్య
భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామిని శుక్రవారం బంగారు కవచాలతో అలంకరించారు. స్వామికి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఉదయం గోదావరి జలాలతో స్వామికి సుప్రభాత సేవ చేశారు. బాలబోగం నివేదించాక బంగారు కవచాలను అలంకరించి పూజలు జరిపారు. లక్ష్మీతాయారు అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం చేశారు. లక్ష్మీఅష్టోత్తర పూజలు, లక్ష కుంకుమార్చన జరిగాయి. తిరుమంజనం అనంతరం మహిళలకు మంజీరాలు పంపిణీ చేశారు. కల్యాణమూర్తులను ప్రాకార మండపానికి తీసుకెళ్లి నిత్య కల్యాణం జరిపించారు. భక్తులు కంకణాలు ధరించి స్వామి వారి కల్యాణంలో పాల్గొన్నారు.
రామయ్య భూములను కాపాడాలని దీక్ష
భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి భూములను కాపాడాలని ఆదివాసీలు శుక్రవారం దేవస్థానం భూముల్లో ఆదివాసీ పోరాట దీక్షకు దిగారు. ఆదివాసీ సంక్షేమ పరిషత్ కేంద్ర ప్రధాన కార్యదర్శి సున్నం వెంకటరమణ ఆధ్వర్యంలో ఆదివాసీలు ఆందోళన చేపట్టి భూములను రక్షించాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ కొన్ని దశాబ్దాలుగా ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా నాన్ ట్రైబల్స్ దేవస్థానం భూములను కౌలు చెల్లించకుండా అనుభవిస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా కట్టడాలు కడుతున్నారని, కొందరు భూములు అమ్ముకుంటున్నారని వీరికి ఏపీలోని అధికార పార్టీ నేతలు అండగా ఉండడం సరైంది కాదన్నారు. దేవస్థానం భూములను ఖాళీ చేయించాలని డిమాండ్ చేశారు. సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి విశాల చంద్రయ్యదొర, చింతూరు డివిజన్ అధ్యక్షుడు కుంజా అనిల్, నియోజకవర్గ ఇన్చార్జి ఉమ్మల దుర్గారెడ్డి, కూర నాగేశ్వరరావు, బంగారు వెంకటేశ్వర్లు, సోడె నాగమణి పాల్గొన్నారు.
చదువుతోనే సమాజంలో గుర్తింపు
ఖమ్మం టౌన్,వెలుగు: చదువుతోనే సమాజంలో ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని టీఆర్ఎస్ లోక సభాపక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు చెప్పారు. ఖమ్మంలోని టీఎంఆర్ఈఈఎస్ లో శుక్రవారం జాతీయ విద్యా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మైనార్టీల కోసం 204 స్కూల్స్, రెసిడెన్షియల్ కాలేజీలు, జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం ఎంపీని స్కూల్ టీచర్లు, సిబ్బంది శాలువాతో సన్మానించారు. ఉపాధ్యాయులకు, విద్యార్థులకు, సిబ్బందికి ఎంపీ జ్ఞాపికలను అందజేశారు. ఎమ్మెల్సీ తాతా మధు, రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బాణాల వెంకటేశ్వర్లు, మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజ్ జిల్లా విజిలెన్స్ ఆఫీసర్లు జమీల్ పాషా, సీతారాములు, రీజినల్ కో ఆర్డినేటర్ అరుణకుమారి, ప్రిన్సిపాల్ అబిదా సాల్మ్, రఘనాథపాలెం మెడికల్ ఆఫీసర్ పి. ఉషారాణి, చీకటి రాంబాబు, కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.