ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

టీయూడబ్ల్యూజే 3వ మహాసభలో మంత్రి పువ్వాడ అజయ్

ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: జిల్లాలోని జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు కొత్త సంవత్సరంలో పూర్తి చేసి రుణం తీర్చుకుంటానని మంత్రి పువ్వాడ అజయ్​కుమార్​ తెలిపారు. ఆదివారం ఎస్ఆర్​ గార్డెన్​లో టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ అధ్యక్షతన జర్నలిస్టుల మహాసభకు మంత్రి చీఫ్​ గెస్ట్​గా హాజరై మాట్లాడారు. ఖమ్మంలో ఇప్పటికే జర్నలిస్టుల కోసం 100 డబుల్​బెడ్రూమ్​ ఇండ్లు నిర్మిస్తున్నామని, మరో 100 ఇండ్ల స్థలాలు కేటాయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎమ్మెల్యేలు కూడా ఈ సమస్యను పరిష్కరించాలని సూచించారు. మీడియా అకాడమీ చైర్మన్​ అల్లం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్య తీవ్రమైందని, మిగిలిన సమస్యలను పోరాడి సాధించుకుందామని పిలుపునిచ్చారు.

రాష్ట్ర సాధన సమయంలో  యూనియన్​ ఒక చుక్కానిగా నిలిచి, సబ్బండ వర్గాలను ముందుకు నడిపించిందన్నారు. ఎంపీ నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో జర్నలిస్టుల పాత్ర కీలకమన్నారు. రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ ఇండ్ల స్థలాల కేటాయించేందుకు జిల్లాలోని ఎమ్మెల్యేలతో మంత్రి సమావేశం ఏర్పాటు చేసి చర్చించాలని కోరారు. మాజీ ఎంపీ పొంగులేటి మాట్లాడుతూ జర్నలిస్టులకు ఎలాంటి సమస్య వచ్చినా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రయానాయక్, సీపీఐ(ఎంఎల్)​ ప్రజాపంథా రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు, సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జడ్పీ చైర్మన్​ లింగాల కమల్​రాజు, నగర మేయర్​ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్​ విజయ్​కుమార్, బీఆర్ఎస్​ నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, పారుపల్లి ఉషాకిరణ్, ఇస్మాయిల్, మేకల కల్యాణ్​చక్రవర్తి, రమణ్​కుమార్​ పాల్గొన్నారు.

రామయ్యకు సువర్ణ పుష్పార్చన

భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి ఆదివారం పంచామృతాలతో అభిషేకం, బంగారు పుష్పాలతో అర్చన జరిగింది. ముందుగా గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి స్వామికి గర్భగుడిలో సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించారు. అనంతరం ఆవుపాలు, నెయ్యి, పెరుగు, తేనె, పంచదారలతో అభిషేకం చేశారు. సమస్త నదీ, సముద్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు మంజీరాలు పంపిణీ చేశారు. తర్వాత శ్రీశ్రీశ్రీ త్రిదండి చినజీయర్ స్వామీజీ అందించిన బంగారు పుష్పాలతో భక్తరామదాసు కోరిక మేరకు సువర్ణ పుష్పార్చన జరిగింది.

కల్యాణమూర్తులను ప్రాకార మండపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణం చేశారు. 64 జంటలు కంకణాలు ధరించి స్వామి కల్యాణ క్రతువులో పాల్గొన్నాయి. ధనుర్మాసోత్సవాల్లో భాగంగా తిరుప్పావై మూడో పాశురాన్ని నివేదించారు. ఏపీ సీఎం పేషీలో పని చేస్తున్న ఐఏఎస్​ ఆఫీసర్, భద్రాచలం సబ్​ కలెక్టర్​గా పనిచేసిన నారాయణ భరత గుప్తా, ఆల్లూరి సీతారామరాజు పాడేరు జిల్లా ఎస్పీ సతీశ్​కుమార్​కుటుంబ సమేతంగా స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గోశాల కోసం హరిప్రసాద్​రెడ్డి రూ.50,116 విరాళంగా అందజేశారు.

రాష్ట్రంలో వచ్చేది బీజేపీ సర్కారే

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రాష్ట్రంలో రాబోయేది బీజీపీ ప్రభుత్వమేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ ధీమా వ్యక్తం చేశారు.  లక్ష్మీదేవిపల్లి మండలం ఎదురుగడ్డ గ్రామ పంచాయతీలో ఆదివారం నిర్వహించిన కార్యకర్తల మీటింగ్​లో ఆయన మాట్లాడారు. ప్రధాని మోడీ ఆధ్వర్యంలో దేశం అన్నిరంగాల్లో ముందుకెళ్తుందని చెప్పారు. రాష్ట్రంలో సీఎం కేసీఆర్​ నియంతృత్వ పాలన సాగిస్తున్నారని ఆరోపించారు. జిల్లాలో బీజేపీకి ఆదరణ పెరుగుతుందని, కార్యకర్తలు ప్రజలకు కేంద్ర ప్రభుత్వ పథకాలను వివరించాలని సూచించారు. అనంతరం వివిధ పార్టీల నేతలు బీజేపీలో చేరారు. పార్టీ మండల అధ్యక్షుడు రవీందర్, ఓబీసీ మండల అధ్యక్షుడు మాచర్ల ప్రవీణ్, గాంధీ, బానోత్​ నరేశ్, వీరన్న, బాలాజీ, రవి, దేవి, అనూష పాల్గొన్నారు. 

ఈసారి హంస వాహనం రంగు మారింది!

భద్రాచలం, వెలుగు: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ఈ నెల 23 నుంచి వచ్చే నెల12 వరకు ముక్కోటి వైకుంఠ ఏకాదశీ ఉత్సవాలు జరగనున్నాయి. ఇందులోభాగంగా జనవరి 1న గోదావరిలో తెప్పోత్సవం జరుగుతుంది. ఇందు కోసం ఒక లాంచీని హంస వాహనంగా తయారు చేశారు. ఇప్పటి వరకు హంస వాహనం రంగు బ్లూ, రెడ్, వైట్​ కలర్లతో ఉండేది. ఈసారి మాత్రం తెలుపు రంగులో హంస వాహనాన్ని తయారు చేస్తున్నారు. ఇందుకు రూ.5 లక్షలు ఖర్చు చేస్తున్నట్లు ఈఈ వేగిస్న రవీందర్​రాజు తెలిపారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి హంస వాహనం మాదిరిగానే రామయ్య హంస వాహనం రంగు ఉంటుందని చెప్పారు.

భక్తిశ్రద్ధలతో శ్రీ కృష్ణ విగ్రహ ప్రతిష్టాపన

సత్తుపల్లి, వెలుగు: శ్రీ కృష్ణ మందిర పున: ప్రతిష్ట కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ప్రముఖ సిద్ధాంతి వెల్గటూరు ప్రసాద్ చారి పర్యవేక్షణలో గణపతి పూజ, గోపూజ, హోమం, పూర్ణాహుతి, శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, మున్సిపల్  చైర్మన్  కూసంపూడి మహేశ్, కమిషనర్  సుజాత దంపతులు, ఎంపీపీ దొడ్డ హైమావతి, శంకర్​రావు దంపతులు, లైబ్రరీ చైర్మన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, కౌన్సిలర్ అద్దంకి అనిల్ కుమార్, మట్ట ప్రసాద్, డీసీసీబీ డైరెక్టర్ చల్లగుండ్ల కృష్ణయ్య, మెప్మా సీసీ ప్రసాద్, వల్లభినేని పవన్, పసుపులేటి నాగేశ్వరరావు, మధుసూదన్ రాజు, క్రాంతి శ్రీను, రిటైర్డ్​ జైలర్ నాగేశ్వరరావు 
పాల్గొన్నారు.