భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి ఉత్సవమూర్తులకు బుధవారం బేడా మండపంలో పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అంతకుముందు ఉదయం గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి సుప్రభాత సేవ చేసి బాలబోగం నివేదించారు. అనంతరం అభిషేకం చేశారు. ప్రాకార మండపంలో కల్యాణమూర్తులకు నిత్య కల్యాణం జరిపించారు. భక్తులే కంకణాలు ధరించి ఈ క్రతువును నిర్వహించారు. మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత రాజబోగం నివేదించి సాయంత్రం దర్బారు సేవ జరిపారు. కృష్ణా జిల్లా పామర్రు గ్రామానికి చెందిన సీహెచ్ ధర్మవీర్ దంపతులు స్వామి నిత్యాన్నదాన పథకానికి రూ.50,116 విరాళంగా ఇచ్చారు.
కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ధర్నా
వైరా, వెలుగు: పట్టణంలోని పదో వార్డు గండగలపాడులో వడ్ల కొనుగోలు కేంద్రం ఎత్తివేయడాన్ని నిరసిస్తూ రైతులు బుధవారం వైరా విశాల సహకార పరపతి సంఘం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం సీఈవో డి నరసింహారావుకు కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. సొసైటీ డైరెక్టర్ బొల్లెపోగు శ్రీను, కర్నాటి హనుమంతరావు, బొడ్డు కృష్ణయ్య, గొడ్ల రామారావు, గొడ్ల వీరభద్రం, పూర్ణకంటి లక్ష్మయ్య, పూర్ణకంటి వెంకటప్పులు, పింగళి రామకృష్ణ, పూర్ణకంటి ఫకీరు బాబు, చిత్తారు మురళి, తుడుం రమేశ్ పాల్గొన్నారు.
ఘనంగా వివేక్ వెంకటస్వామి బర్త్‌డే
పాల్వంచ,వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామి బర్త్‌డేను బుధవారం పాల్వంచలో ఘనంగా నిర్వహించారు. తెలంగాణ మాల విద్యుత్ ఉద్యోగుల సంఘం జాతీయ అధ్యక్షుడు బూర్గుల విజయ భాస్కర్ ఆధ్వర్యంలో మండలంలోని లక్ష్మీదేవిపల్లి పంచాయతీలోని యువసేన అనాథ శరణాలయంలో విద్యార్థులతో కేక్ కట్ చేయించి పంచిపెట్టారు. అనంతరం అన్నదానం చేశారు. సంఘం కార్యదర్శి తుంపురు శివకుమార్ పాల్గొన్నారు.
సీసీ రోడ్లకు ఎంపీ ల్యాడ్స్ ఫండ్స్
ఖమ్మం, వెలుగు: సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.30 లక్షల ఎంపీ ల్యాడ్స్ నిధులు మంజూరు చేసినట్లు ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు తెలిపారు. ప్రజల అవసరాలను పరిగణనలోకి తీసుకొని, రోడ్ల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ఇటీవల వైరా, పాలేరు నియోజకవర్గాల్లో పర్యటించిన సందర్భంగా ప్రజా ప్రతినిధులు, నాయకులు, ప్రజలు రోడ్ల గురించి తన దృష్టికి తీసుకొచ్చారని తెలిపారు. ఎంపీ ల్యాడ్స్ కింద ఆరు రోడ్లకు రూ.30 లక్షలు మంజూరు చేసినట్లు చెప్పారు.
నిరుద్యోగ భృతి ఇవ్వాలి
మధిర, వెలుగు: నిరుద్యోగులకు నెలకు రూ. 3016 నిరుద్యోగ భృతి వెంటనే చెల్లించాలని బీజేపీ జిల్లా కార్యదర్శి చిలువేరు సాంబశివరావు, జిల్లా అధికార ప్రతినిధి రామిశెట్టి నాగేశ్వరావు డిమాండ్ చేశారు. బుధవారం తహసీల్దార్ రాంబాబుకు వినతిప్రతం అందచేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెచ్చుకున్న రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని విమర్శించారు. పట్టణ అధ్యక్షుడు పాపట్ల రమేశ్, పట్టణ ప్రధాన కార్యదర్శి బియ్యవరపు రామకృష్ణ, సీనియర్ నాయకులు కనపర్తి ప్రకాశ్, వెంకటేశ్వర్లు, యువమోర్చా నాయకులు రాము, రమేశ్, షేక్ జానీ, ప్రభుదాస్, యేసు రవి, షేక్ జానిమియా పాల్గొన్నారు.
నేలకొండపల్లి: రాష్ట్రంలోని నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అందించాలని కోరుతూ బీజేపీ యువమోర్చా మండల అధ్యక్షుడు మర్రి శివ ఆధ్వర్యంలో తహసీల్దార్ దారా ప్రకాశ్ కు వినతిపత్రం అందజేశారు. వెంటనే నిరుద్యోగ భృతిని మంజూరు చేసి ఖాతాల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. మన్నె కృష్ణారావు, గోపి, సాయి పాల్గొన్నారు.
పూసవెల్లిలో చిరుత కలకలం
ఇల్లందు, వెలుగు: మండలంలో చిరుత సంచారం కలకలం రేపింది. మండలంలోని తిలక్‌నగర్ గ్రామపంచాయతీ పూసపెల్లి గ్రామ శివారులోని అటవీ ప్రాంతంలో మంగళవారం రాత్రి తేజావత్ లాలు తన పత్తి చేనులో పెంపుడు కుక్కను కట్టేసి వెళ్లాడు. బుధవారం చేనుకు వెళ్లగా, కట్టేసిన కుక్క తల మాత్రమే కనిపించడంతో వెంటనే గ్రామస్తులకు, ఫారెస్ట్ ఆఫీసర్లకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న ఫారెస్ట్ ఆఫీసర్లు కాలి గుర్తులను పరిశీలించి చిరుతపులిగా నిర్ధారించారు. చుట్టుప్రక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇల్లందు డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ సాల్మన్ రాజు సూచించారు. చిరుత సంచారంపై ఉన్నతాధికారులకు సమాచారం అందించినట్లు తెలిపారు.
‘డబుల్’ ఇండ్ల పనులు పరిశీలన
ఖమ్మం టౌన్, వెలుగు: నగరంలోని అల్లిపురం, వైఎస్సార్ నగర్ లో నిర్మిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పనులను కలెక్టర్ వీపీ గౌతమ్ బుధవారం పరిశీలించారు. పనులు స్పీడప్ చేసి త్వరగా పూర్తి చేయాలని సూచించారు. పనులు త్వరగా పూర్తయితే బిల్లులు వెంటనే వస్తాయని అన్నారు. కేఎంసీ కమిషనర్ ఆదర్శ్ సురభి, డీఆర్వో శిరీష, ఆర్అండ్ బీ ఈఈ శ్యాంప్రసాద్, డబుల్ బెడ్రూమ్ డీఈ టి కృష్ణారెడ్డి ఉన్నారు.
ఇంటి వద్దకే ఉచిత వైద్య సేవలు
బస్తీ దవాఖానాల ద్వారా పట్టణ పేదలకు ఇంటి వద్దకే ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని కలెక్టర్ అన్నారు. వైఎస్సార్ నగర్ లోని బస్తీ దవాఖానాను తనిఖీ చేశారు. రోగులకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. రిజిస్టర్లను పరిశీలించారు. వైద్యాధికారి డా మౌర్య, స్టాఫ్ నర్స్ చైతన్య ఉన్నారు. ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్ పనులను కలెక్టర్ పరిశీలించారు. వారంలోగా పనులన్నీ పూర్తి చేయాలని సూచించారు. మున్సిపల్ ఈఈ కృష్ణలాల్, ఆఫీసర్లు ఉన్నారు.
బీజేపీలో చేరికలు
ఇల్లందు, వెలుగు: బీజేపీకి ఆదరణ పెరుగుతుందని నియోజకవర్గ కన్వీనర్ బాలగాని గోపికృష్ణగౌడ్ చెప్పారు. బుధవారం పార్టీ మండలాధ్యక్షుడు జర్పుల రాంచందర్ ఆధ్వర్యంలో మండలంలోని చెక్‌పోస్ట్ రొంపేడు, కొమరారం ప్రాంతాలకు చెందిన 20 కుటుంబాలు బీజేపీలో చేరాయి. వారికి కాషాయ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడూతూ రాబోయే ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పని చేయాలని సూచించారు. పార్టీ మండల ప్రధాన కార్యదర్శి బానోత్ రమేశ్, నాయకులు మిర్యాల వెంకన్న, తెప్పాల శ్రీనివాస్, రాంటెంకి నాగమల్లు, అనుగోజు సత్యనారాయణ పాల్గొన్నారు.