నేడు తెప్పోత్సవం.. రేపు ఉత్తర ద్వారదర్శనం
భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో అధ్యయనోత్సవాల్లో భాగంగా ఆదివారం గోదావరిలో తెప్పోత్సవం, సోమవారం తెల్లవారుజామున వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారదర్శనం కోసం భక్తుల రాక మొదలైంది. ఓఎస్డీ సాయిమనోహర్, ఏఎస్పీ రోహిత్‌రాజు, ఆర్డీవో రత్నవల్లి గోదావరిలో హంస వాహనం ఫైనల్ ట్రయల్ రన్‌ను శనివారం రాత్రి నిర్వహించారు. తెప్పోత్సవం రోజున ఆలయంలో రామయ్యకు విశేష అభిషేకాలు చేసి తిరుమంగై ఆళ్వార్ పరమపదోత్సవాన్ని నిర్వహిస్తారు. సాయంత్రం స్వామి ఊరేగింపుగా గోదావరి తీరానికి వెళ్లి హంస వాహనంలో విహరిస్తారు.
ఈ వేడుకల్లో మంత్రి పువ్వాడ అజయ్కుమార్, విప్ రేగా కాంతారావుతో పాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, ఎస్పీ డా.వినీత్ ఆధ్వర్యంలో ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. భక్తులకు కావాల్సిన సౌకర్యాలు కల్పించారు. ఉత్తర ద్వారదర్శనం రోజున ఇబ్బంది కలగకుండా భక్తులకు సెక్టార్లు ఏర్పాటు చేశారు. ఉచిత దర్శనంతో పాటు వైకుంఠ ద్వారం గుండా దర్శనం చేసుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు.
ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్
భద్రాద్రికొత్తగూడెం: ముక్కోటి వైకుంఠ ఏకాదశి సందర్భంగా భద్రాచలంలో ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ అనుదీప్ తెలిపారు. ముక్కోటి ఉత్సవాలపై కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పారిశుధ్య పనులకు 400 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్టు చెప్పారు. హోటళ్లు, లాడ్జీలలో ధరలను నియంత్రించాలని సూచించారు. భక్తులు గోదావరిలోకి వెళ్లకుండా బందోబస్తు నిర్వహించాలన్నారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. భద్రాచలంలో తెప్పోత్సవం, వైకుంఠ ద్వార దర్శనాలను వైభవోపేతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. భక్తుల కోసం 1.25 లక్షల లడ్డూలను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ చెప్పారు. అడిషనల్ కలెక్టర్ కె వెంకటేశ్వర్లు, భద్రాచలం టెంపుల్ ఈవో శివాజీ, విద్యుత్ శాఖ ఎస్ఈ రమేశ్, డీపీవో రమాకాంత్, డీఎంహెచ్‌వో డాక్టర్ శిరీష పాల్గొన్నారు.
‘మన బడి’లో భద్రాద్రి జిల్లాకు మూడో స్థానం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: మన ఊరు–మన బడి పనులు చేపట్టడంలో భద్రాద్రికొత్తగూడెం జిల్లా రాష్ట్రంలో మూడో స్థానంలో ఉందని విద్య, సంక్షేమ, మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ రావుల శ్రీధర్‌రెడ్డి తెలిపారు. కలెక్టరేట్లో శనివారం మన ఊరు–మన బడి పనులపై విద్యా శాఖ, ఇంజనీరింగ్ అధికారులతో రివ్యూ మీటింగ్ నిర్వహించారు. రాష్ట్రంలో 9,123 స్కూళ్లను ఎంపిక చేసి, రూ.9 వేల కోట్లతో పనులు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 7లోగా ఈజీఎస్ కింద చేపట్టనున్న అన్ని పనులు గ్రౌండింగ్ పూర్తి చేయాలన్నారు. మన ఊరు–మన బడి పనులకు నిధుల కొరత లేదని తెలిపారు. కలెక్టర్ అనుదీప్, డీఈవో సోమశేఖర శర్మ, ఈఈలు నాగశేషు, భీమ్లా, తానాజీ, సురేశ్, డీఆర్డీవో మధుసూదనరాజు పాల్గొన్నారు.
దొంగ దీక్షలతో మోసం చేస్తున్రు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: దొంగ దీక్షలతో టీబీజీకేఎస్ నాయకులు కార్మికులను మోసం చేస్తున్నారని అఖిల భారతీయ ఖదాన్ మజ్దూర్ సంఘ్ కార్యదర్శి పి మాధవ్‌నాయక్ ఆరోపించారు. బీఎంఎస్ భవన్లో శనివారం జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బొగ్గు గనుల వేలాన్ని ప్రైవేటీకరణగా చిత్రీకరిస్తూ టీబీజీకేఎస్ అబద్ధాలతో కార్మికులను మభ్య పెడుతుందన్నారు. సింగరేణి పరిధిలోని నాలుగు బొగ్గు బ్లాకుల వేలంలో పాల్గొనేందుకు ఐదు టెండర్ షెడ్యూళ్లనురూ. 25 లక్షలు పెట్టి కొనుగోలు చేసి, రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడితో టెండర్ వేయకపోవడంతో సంస్థకు రూ. లక్షల్లో నష్టం జరిగిందన్నారు. పవన్ కుమార్, ప్రభాకర్‌రావు, సంఘం చందర్, కృష్ణారెడ్డి, మొగిలిపాక రవి పాల్గొన్నారు.
టీచర్లు పనితీరు మార్చుకోవాలి
ఎర్రుపాలెం, వెలుగు: టీచర్లు బాధ్యతాయుతంగా పని చేయాలని జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు సూచించారు. శనివారం నారాయణపురం స్కూల్‌ను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూల్ ఆవరణ శుభ్రంగా ఉంచాలని, మిడ్డే మీల్స్‌ను సక్రమంగా అందించాలన్నారు. చావా రామకృష్ణ, పంబి సాంబశివరావు, షేక్ మస్తాన్ వలి, శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు.
100 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తే లక్ష్యం
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: సింగరేణిలోనే అతి పెద్దదైన జేవీఆర్ ఓసీపీలో ఈ ఆర్థిక సంవత్సరంలో 100 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ జక్కం రమేశ్ తెలిపారు. జీఎం ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు 65.84 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి చేసినట్లు చెప్పారు. రక్షణతో కూడిన బొగ్గు ఉత్పత్తికి ప్లాన్ చేస్తున్నామన్నారు. వీకే ఓసీపీతో కొత్తగూడెం ఏరియాకు పూర్వ వైభవం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎస్వో టూ జీఎం నారాయణరావు, ఆఫీసర్లు వెంకటేశ్వర్లు, రవీందర్, శామ్యూల్, సుధాకర్, రమేశ్, సూర్యానారాయణ, శ్రీకాంత్, రాజశేఖర్ పాల్గొన్నారు.
న్యూ ఇయర్ జోష్
న్యూ ఇయర్ కు వెల్కమ్ చెబుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు జోష్ లో మునిగిపోయారు. స్వీట్ షాపులు, బేకరీలు, రెస్టారెంట్లు ఆఫర్లతో ఆదరగొట్టాయి. ఫ్యామిలీలు, ఫ్రెండ్స్ తో కలిసి కేక్ లు కట్ చేసి న్యూ ఇయర్‌ను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఖమ్మం సిటీలోని పలు సెంటర్లలో డీజే సిస్టమ్స్ ఏర్పాటు చేసి డ్యాన్సులు చేస్తూ యూత్ హంగామా చేశారు. ఒకరికొకరు న్యూ ఇయర్ విషెస్ చెప్పుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు. - వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం