భూ సర్వేను వీడియోగ్రఫీ చేసి భద్రపర్చాలి: కలెక్టర్ అనుదీప్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలో భూ సేకరణ సర్వేను వీడియోగ్రఫీ చేసి భద్రపర్చాలని కలెక్టర్అనుదీప్ అధికారులను ఆదేశించారు. ఓఎస్డీ మనోహార్‌తో కలిసి మంగళవారం కలెక్టరేట్లో రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో భూసేకరణపై రివ్యూ మీటింగ్నిర్వహించారు. అథారిటీకి రికమండ్చేసిన రైతుల బ్యాంక్ అకౌంట్లు పంపాలని, సంబంధిత యజమానులకు నోటీసులు జారీ చేయాలన్నారు. తదుపరి ఉత్తర ప్రత్యుత్తరాలు అథారిటీ నుంచే జరుగుతాయన్నారు. పెగ్ మార్కింగ్, సర్వే సబ్ డివిజన్ ప్రక్రియను ఆయా శాఖల అధికారులు సంయుక్త సర్వే నిర్వహించాలన్నారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ కె.వెంకటేశ్వర్లు, ఈఈలు వెంకటేశ్వరరెడ్డి, శ్రీనివాసరెడ్డి, ఆర్డీఓలు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, తహసీల్దార్లు పాల్గొన్నారు.
16,898 న్యూట్రీషన్ కిట్స్ రెడీ
కొత్తగూడెం పట్టణం రామవరంలోని మాతా, శివు సంరక్షణ హాస్పిటల్లో న్యూట్రిషన్ కిట్లను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ బుధవారం ప్రారంభించనున్నారని కలెక్టర్ అనుదీప్ పేర్కొన్నారు. జిల్లాకు అవసరమైన 16,898 కిట్లను పంపిణీకి సిద్ధంగా ఉంచామన్నారు.
కోడిపందాల ఆశచూపి ఆర్ఎంపీ హత్య
మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
అశ్వారావుపేట, వెలుగు: కోడిపందాల ఆశచూపి ఓ ఆర్ఎంపీని ను అతికిరాతకంగా చంపిన నిందితున్ని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్ కు తరలించారు. మంగళవారం అశ్వారావుపేట పోలీస్ స్టేషన్ లో సీఐ బాలకృష్ణ వివరాలు వెల్లడించారు. ఈనెల 8న మండలంలోని తిరుమలకుంటకు చెందిన ఆర్ఎంపీ లింగాల చక్రధర్ కు వినాయకపురం గ్రామానికి చెందిన నజీర్ అలియాస్ డాంగ్లీతో కోడి పందాల ద్వారా పరిచయం ఏర్పడింది. వినాయకపురం శివారులో కోడిపందాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారని పందాల్లో డబ్బు సంపాదించుకోవచ్చని నజీర్.. చక్రధర్‌కు చెప్పాడు.
దీంతో అతను బైక్‌పై నజీర్ చెప్పిన ప్రదేశానికి వెళ్లాడు. అతడిని నిందితుడు నజీర్కత్తితో మెడ కోసి, చాతీపైన పొడవడంతో చక్రధర్చనిపోయాడు. మృతుడి సెల్ ఫోన్, బైక్, అతని వద్దనున్న బంగారం తీసుకొని పారిపోయాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గాలిస్తుండగా.. నారంవారిగూడెం నిందితుడు పట్టుబడ్డాడు. అతడిని అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టినట్లు సీఐ తెలిపారు. కార్యక్రమంలో ఎస్సైలు రాజేశ్‌కుమార్, సాయి కిషోర్ రెడ్డి పాల్గొన్నారు.
నా భర్త మర్డర్ పై పూర్తి విచారణ జరపాలి : మృతుడి భార్య జయలక్ష్మి
అశ్వారావుపేట, వెలుగు: నా భర్తను చంపే అవసరం నజీర్ కు లేదని, అతనికి ఓ ప్రభుత్వ ఉద్యోగి సాయం చేసి నేరం మోపుతున్నట్లుగా అనుమానం ఉందని మృతుడు ఆర్ఎంపీ చక్రధర్ భార్య, పిల్లలు ఆరోపిస్తున్నారు. మంగళవారం అశ్వారావుపేటలో మీడియాతో వారు మాట్లాడుతూ ఈనెల 8న ఆసుపాకకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ప్లాన్ప్రకారం హత్య చేయించాడని ఆరోపించారు. ఇదే విషయమై సీఐ బాలకృష్ణ వద్దకు కంప్లైంట్ ఇవ్వగా ఆల్రెడీ కేసు విచారణలో ఉందని చెప్పారని ఆమె పేర్కొన్నారు. ఈ కేసు పై పూర్తిస్థాయి విచారణ చేపడుతున్నామని, ఇదే విషయం ఆమెకు చెప్పినట్లు సీఐ స్పష్టం చేశారు.
తెలంగాణలో బీజేపీని గెలవనివ్వం : సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం
నేలకొండపల్లి , వెలుగు : రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో గెలవనీయమని, దానికోసం కలిసివచ్చే పార్టీలతో పొత్తు పెట్టుకుంటామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం నేలకొండపల్లిలోని రావెళ్ల సత్యనారాయణ భవన్లో మాట్లాడుతూ 2024 పార్లమెంటు ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీని ఎదుర్కొనేందుకు ఆ పార్టీ వ్యతిరేక శక్తులతో కలిసి పనిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అందులో భాగంగానే మునుగోడు ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు బీఆర్ఎస్ కు మద్దతు పలికామన్నారు.
అలా అని రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబిస్తే సహించేది లేదన్నారు. ఈనెల 29, 30, 31 తేదీల్లో ఖమ్మంలో జరిగే తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం మూడో మహాసభలకు కేరళ సీఎం పినరయి విజయన్ హాజరవుతున్నారన్నారు. పార్టీ జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేశ్, లీడర్లు నాగేశ్వరరావు, వెంకటేశ్వర్లు, రామిరెడ్డి, రామారావు, నరసింహారావు, నాగేశ్వరరావు, లక్ష్మి పాల్గొన్నారు.
స్కూల్లో సౌలత్లు కల్పించాలని పేరెంట్స్ ఆందోళన
చండ్రుగొండ, వెలుగు: స్కూల్ అభివృద్ధిని ఎస్ఎంసీ కమిటీ పట్టించుకోవడంలేదని, స్కూల్ లో కనీస సౌలత్లు లేవని మంగళవారం మహ్మద్ నగర్ ఎంపీఎస్ స్కూల్ లో పేరెంట్స్ ఆందోళన చేశారు. వసతులు కల్పించేదాకా స్కూల్‌కు పంపించమని తమ పిల్లలను ఇండ్లకు తీసుకెళ్లారు. స్కూల్ లో 1 నుంచి 5 తరగతుల వరకు 36 మంది స్టూడెంట్స్ చదువుతున్నారు. ఇద్దరు టీచర్లు ఉన్నారు. స్కూల్ లో వంట గది, టాయిలెట్స్, కాంపౌండ్, ఫ్లోరింగ్, తాగునీరు, విద్యుత్.. లాంటి కనీస వసతులు లేవని పేరెంట్స్ ఆరోపించారు. స్కూల్ హెచ్ ఎం శ్రీలక్ష్మీ పేరెంట్స్ కి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు.
అనంతరం విషయం ఎంఈవో సత్యనారాయణకు దృష్టికి తీసుకెళ్లారు. ఎంఈవో, కాంప్లెక్స్ హెచ్ఎం ఆనంద్ గ్రామానికి వెళ్లి పేరెంట్స్ తో చర్చించారు. ఎస్ఎంసీ చైర్మన్ ను తొలగించాలని పేరెంట్స్ డిమాండ్‌చేశారు. ఈ అంశం తమ పరిధిలోనిది కాదని, జిల్లా ఆపీసర్ల దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. మిగిలిన సమస్యలు పరిష్కరించేందుకు సర్పంచ్, ఈజీఎస్ ఆఫీసర్ల తో మాట్లాడి చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడంతో పేరెంట్స్ ఆందోళన విరమించి పిల్లలను బడికి పంపించారు.
విజయ శంఖారావ సభకు తరలిరండి
మీడియా సమావేశంలో టీడీపీ లీడర్ల పిలుపు
ఖమ్మం టౌన్, వెలుగు: నేడు ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో జరిగే తెలుగుదేశం విజయ శంఖారావ సభకు కార్యకర్తలు, లీడర్లు, ప్రజలు పెద్దఎత్తున తరలిరావాలని ఆ పార్టీ స్టేట్ఉపాధ్యక్షుడు వాసిరెడ్డి రామనాథం, జిల్లా అధ్యక్షుడు కూరపాటి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఖమ్మంలోని టీడీపీ ఆఫీసులో మంగళవారం వారు మీడియాతో మాట్లాడుతూ టీడీపీ భారీ బహిరంగ సభకు పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వరరావు హాజరుకానునట్లు చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ధ్యేయంగా టీడీపీ పనిచేస్తుందన్నారు. తెలుగుదేశం పార్టీకి తిరిగి పూర్వ వైభవం రానుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో టీడీపీకి బలమైన క్యాడర్ ఉందన్నారు. సభకు హైదరాబాద్ నుంచి రంగారెడ్డి, నల్గొండ ల మీదుగా ఖమ్మం వరకు 20 వేల వాహనాలతో ర్యాలీ ఉంటుందన్నారు. సమావేశంలో చంద్రహాసన్, కేతినేని హరీశ్, విజయ్ పాల్గొన్నారు.