భద్రాద్రికొత్తగూడెం/ ఖమ్మం కార్పొరేషన్, వెలుగు : తెలంగాణ రైతులకు కల్లాలు నిర్మించేందుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.150 కోట్లను తిరిగి ఇవ్వాలని నోటీస్ ఇవ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు మండిపడ్డాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్లీడర్లు ఆందోళన చేపట్టారు. భద్రాద్రి కొత్తగూడెంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ప్రభుత్వ విప్రేగ కాంతారావు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించి, బస్టాండ్ సెంటర్లో నడిరోడ్డుపై ధర్నా నిర్వహించారు.
కాంతారావు మాట్లాడుతూ రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై దశల వారీగా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఖమ్మంలో కలెక్టరేట్ ఎదుట ఉన్న ధర్నాచౌక్‌లో బీఆర్ఎస్జిల్లా అధ్యక్షుడు తాతా మధుసూధన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎమ్మెల్యే రాములు నాయక్, జడ్పీ చైర్మన్కమల్రాజ్లతో కలిసి మాట్లాడుతూ.. తెలంగాణపై బీజేపీ ప్రభుత్వం విషం చిమ్ముతోందన్నారు.
బీఆర్ఎస్పుట్టుక చూస్తేనే వారికి వణుకు పుడుతోందన్నారు. ఎమ్మెల్యేలు వనమా వెంకటేశ్వరరావు, భానోత్ హరిప్రియ, మెచ్చ నాగేశ్వరరావు, డీసీసీబీ చైర్మన్నాగభూషయ్య, సుడా చైర్మన్విజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
‘తొలిమెట్టు’ సక్సెస్‌కు ప్లాన్ చేయండి
ఖమ్మం టౌన్, వెలుగు: జిల్లాలో ‘తొలిమెట్టు’ సక్సెస్‌కు ప్లాన్‌చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్ లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘తొలిమెట్టు’ కార్యక్రమ లక్ష్య సాధనలో వెనుకబడిన స్కూళ్ల హెడ్మాస్టర్లు, ఎంఈవోలు, సెక్టార్ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ నవంబర్ నెల లక్ష్యం సాధించకపోవడంపై మాట్లాడుతూ పక్కాగా ప్లాన్ చేసి ఈ నెల 20 లోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
జిల్లాలో 1 నుంచి 5 వ తరగతి వరకు 43,145 మంది స్టూడెంట్లు ఉన్నారన్నారు. నిర్ధేశిత గడువు తర్వాత ఈ నెల 21న స్టూడెంట్లకు పరీక్షలు నిర్వహిస్తే 5,654 మంది స్టూడెంట్లు లక్ష్యం మేరకు కనీస విద్యా ప్రమాణాలు అందుకోలేక పోయారని తేలిందన్నారు. ఎంఈవోలు స్కూళ్లను విజిట్‌చేసి పూర్తి రిపోర్టు ఇవ్వాలని కలెక్టర్ఆదేశించారు. అడిషనల్కలెక్టర్ స్నేహలత మొగిలి, డీఈవో శర్మ, ఏఎంవో రవికుమార్, ఎంఐఎస్ కోఆర్డినేటర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
తప్పుదోవ పట్టించేందుకే ఆందోళనలు
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే బీఆర్ఎస్ లీడర్లు ఆందోళనలకు దిగుతున్నారని కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కోనేరు నాగేశ్వరరావు విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం బీఆర్ఎస్లీడర్లు అనుసరిస్తున్న తీరును నిరసిస్తూ కొత్తగూడెంలో కలెక్టరేట్ ఎదుట మోర్చా లీడర్లు శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ ఉపాధి హామీ ఫండ్స్‌ను దారి మళ్లించినందుకే వాపస్ చేయాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని కోరిందన్నారు.
దీంతో ఖంగుతిన్న బీఆర్ఎస్లీడర్లు తప్పుడు ప్రచారం చేసేందుకు నిరసనలు చేపడ్తున్నారన్నారు. బీజేపీ ప్రతినిధులు ఈ విషయాన్ని ఇంటింటా ప్రచారం చేయాలన్నారు. రాంబాబు, లక్ష్మణ్, రవీందర్ పాల్గొన్నారు.
ఈ నెల 27 నుంచి పీపీఎల్టీ–20 లీగ్
హెచ్‌సీఏ జిల్లా కోఆర్డినేటర్ ఎండీ మసూద్ పాషా
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: సర్దార్‌పటేల్‌స్టేడియంలో ఈ నెల 27 నుంచి జనవరి 2 వరకు పువ్వాడ ప్రీమియర్ లీగ్ (పీపీఎల్) క్రికెట్ పోటీలు నిర్వహించనున్నట్లు హెచ్‌సీఏ జిల్లా కో ఆర్డినేటర్ ఎండీ మసూద్ పాషా తెలిపారు. శుక్రవారం స్టేడియంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మూడేండ్లుగా పీపీఎల్ టోర్నమెంట్‌ను నిర్వహిస్తూ క్రీడాకారుల్లో ఉన్న ప్రతిభను వెలికితీసే ప్రయత్నం చేస్తున్నామన్నారు.
రాష్ర్ట రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి ఎంతో కృషిచేస్తున్నారని, ఇటీవల స్టేడియంలో ఫ్లడ్లైట్లను ఏర్పాటు చేశారన్నారు. అనంతరం పీపీఎల్టీషర్ట్లను ఆవిష్కరించారు. సుడా చైర్మన్బచ్చు విజయ్‌కుమార్, నిర్వాహకులు పగడాల నాగరాజు, కమర్తపు మురళీ, కాకి భాస్కర్, సందీప్, ఫారూఖ్ తదితరులు పాల్గొన్నారు.
సెలవు రోజు కూడా కాంటాలు !
- దడువాయి లేకుండానే మిర్చి బస్తాలు తూకం
- పీవోఎస్ మెషీన్ లేకుండా వైట్‌పేపర్ పై తూకాలు
- జీరో సరుకు తరలించారని ఆరోపణలు
- ముందు రోజు నిల్వ ఉన్న బస్తాలంటున్న ఆఫీసర్లు
ఖమ్మం/ ఖమ్మం టౌన్, వెలుగు: మిర్చి మార్కెట్లో జోరుగా జీరో దందా సాగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అమావాస్య కారణంగా శుక్రవారం మార్కెట్ కు సెలవు ఇచ్చినా, దాదాపు 200 బస్తాల మిర్చిని కొందరు ప్రైవేట్ వ్యక్తులు కాంటాలు వేశారు. పీవోఎస్ మెషీన్ లేకుండా కాంటాలు అయిన బస్తాల తూకం వివరాలను తెల్ల కాగితాలపైనే రాసుకున్నారు. ఆ తర్వాత బస్తాలను ట్రాలీ ఆటోల్లో లోడ్ చేసి మార్కెట్ నుంచి బయటకు పంపించారు.
ఈ సమయంలో మార్కెట్ సెక్యూరిటీ గార్డుకు ఒక తెల్ల కాగితంపై చిన్న స్లిప్పు రాసిచ్చి బస్తాలను తీసుకెళ్లారు. తక్ పట్టీలు, గేట్ పాస్ లు లేకపోవడం, దడువాలు లేకుండానే కాంటాలు వేయడంతో సరుకును రికార్డుల్లో ఎంట్రీ లేకుండా బయటకు తరలించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆఫీసర్లు మాత్రం వాటిని ముందుగానే రికార్డుల్లో ఎంట్రీ చేశారని చెబుతున్నారు.
ముందు రోజు నిల్వ ఉన్న బస్తాలు
ఒక కోల్డ్ స్టోరేజీ నుంచి గురువారం మార్కెట్ కు వచ్చిన బస్తాలను రైతు ఆలస్యంగా రావడం వల్ల శుక్రవారం కాంటాలు వేశారు. వాటిని రికార్డుల్లో ఎంట్రీ చేశారు. వాటికి మార్కెట్ ఫీజును ముందుగానే చెల్లించారు. - రుద్రాక్షల మల్లేశం, వ్యవసాయ కార్యదర్శి, ఖమ్మం