భద్రాచలం, వెలుగు: స్వర్ణ కవచాలతో శుక్రవారం భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం గోదావరి నుంచి తీర్థబిందెను తీసుకొచ్చి స్వామికి సుప్రభాత సేవ చేశారు. బాలబోగం నివేదించారు. అనంతరం మూలవరులను బంగారు కవచాలతో అలంకరించి ప్రత్యేక హారతులు ఇచ్చారు. కల్యాణమూర్తులను ఊరేగింపుగా ప్రాకార మండపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణం జరిపించారు. విశ్వక్సేనపూజ, పుణ్యాహవచనం, ఆరాధన, యజ్ఞోపవీతం, కంకణధారణ, కన్యాదానం, జీలకర్రబెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాల వేడుక తర్వాత మంత్రపుష్పం నివేదించారు. మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత రాజబోగం నివేదించారు. సాయంత్రం అద్దాల మండపంలో దర్బారు సేవ నిర్వహించి సంధ్యాహారతి ఇచ్చారు.
సీఈవో వికాస్‌రాజ్ ప్రత్యేక పూజలు
రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వికాస్‌రాజ్ శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కలెక్టర్ అనుదీప్ దురిశెట్టితో కలిసి ఆలయానికి వచ్చిన ఆయనకు ఈవో శివాజీ ఆధ్వర్యంలో అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. పరివట్టం కట్టి ఆలయంలోకి తీసుకెళ్లారు. గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. రుష్యమూకం నగల మ్యూజియాన్ని తిలకించారు. లక్ష్మీతాయారు అమ్మవారి సన్నిధిలో వేదాశీర్వచనం ఇచ్చి ప్రసాదం, జ్ఞాపికతో పాటు శేషవస్త్రాలు, శేషమాలికలు అందజేశారు. అర్చకులు ఆలయ విశిష్టతను వివరించారు. ఆర్డీవో రత్న కల్యాణి, తహసీల్దార్ శ్రీనివాసయాదవ్ పాల్గొన్నారు.
ఎంక్వైరీ చేయాలి
వైరా మున్సిపాలిటీలో ఫేక్ డాక్యుమెంట్లతో రూ.50 కోట్ల అవినీతి జరిగింది. నాలుగేళ్లలో 3400 నకిలీ ధృవపత్రాలను మంజూరు చేశారు. వీటితో జరిగిన అన్ని రిజిస్ట్రేషన్లపై ఎంక్వైరీ చేయాలి. ఇలాంటి అక్రమాలు జరగకుండా రెగ్యులర్ మున్సిపల్ కమిషనర్ ను నియమించాలి. - భుక్యా వీరభద్రం, సీపీఎం నేత
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాం
వైరా మున్సిపాలిటీలో రికార్డుల మిస్సింగ్ విషయాన్ని కలెక్టర్ కు వివరించాం. పర్మిషన్లు లేకుండా ఇండ్ల నిర్మాణం చేపడుతున్న వారికి నోటీసులు ఇస్తున్నాం. - అనిత, ఇన్చార్జి మున్సిపల్ కమిషనర్
పంట దిగుబడులు పెరిగినయ్ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి
ఖమ్మం టౌన్, వెలుగు: ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలతో రాష్ట్రంలో పంట దిగుబడులు గణనీయంగా పెరిగాయని వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రఘునాథపాలెం మండలం జింకలతాండ వద్ద రూ.14.90 కోట్లతో నిర్మించిన 20 వేల మెట్రిక్ టన్నుల కెపాసిటీ కలిగిన గోదాములను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు గణనీయంగా పెరగడంతో గోదామ్‌లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. 65 లక్షల కుటుంబాలకు రైతుబంధు అమలుచేస్తున్నామని చెప్పారు. సిమ్లా, కాశ్మీర్ లలో పండే ఆపిల్ ను ఆదిలాబాద్ లో పండించారని, యాసంగిలో పత్తిని పండించవచ్చని ఖమ్మం జిల్లా రైతులు చూపించారని కొనియాడారు. సాగునీటి ప్రాజెక్టులకు రూ.1.50 లక్షల కోట్లు ఖర్చు పెట్టగా, సబ్సిడీ కరెంట్ కోసం రూ. 10,500 కోట్లు విద్యుత్ కంపెనీలకు ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపారు.
మంత్రి పువ్వాడ మాట్లాడుతూ జిల్లా రైతులు వైవిధ్యభరిత వ్యవసాయం చేస్తారన్నారు. పత్తి, మిరప, పామాయిల్, పండ్ల తోటలతో పాటు అన్ని రకాల పంటలను ఆధునిక పద్ధతులతో సాగు చేస్తున్నారని తెలిపారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ వేద సాయిచందర్, డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరిరావు, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, రైతుబంధు చైర్మన్ ఎన్ వెంకటేశ్వర రావు, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జితేందర్ రెడ్డి, అడిషనల్ కలెక్టర్ ఎన్ మధుసూధన్, ఏఎంసీ చైర్ పర్సన్ లక్ష్మీ ప్రసన్న, ఎంపీపీ గౌరి, జడ్పీటీసీ ప్రియాంక పాల్గొన్నారు.
రెండో రోజు ఫారెస్టర్ల ఆందోళన
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: చండ్రుగొండ ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు హత్యను వ్యతిరేకిస్తూ శుక్రవారం రెండోరోజు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఫారెస్ట్ ఆఫీసర్లు, ఉద్యోగులు ఆందోళనలు చేపట్టారు. కొత్తగూడెంలో నిరసన ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఫారెస్ట్ ఆఫీసర్లు మాట్లాడుతూ ఎఫ్ఆర్వో కుటుంబానికి రూ. 5 కోట్లు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆయన భార్యకు గెజిటెడ్ హోదా కలిగిన ఉద్యోగం ఇవ్వాలన్నారు. కలెక్టరేట్‌లోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అనంతరం కలెక్టర్ అనుదీప్కువినతిపత్రాన్ని ఇచ్చారు. ఎఫ్డీవోలు అప్పయ్య, తిరుమల్‌రావు, దామోదర్‌రెడ్డి, నీరజ్, బాబు, సూపరింటెండెంట్ మూర్తి, ఎఫ్ఆర్వోలు ముక్తార్ హుస్సేన్, శ్రీనివాసరావు, ప్రసాద్, చలపతి, ఉమ, డీఆర్వో రామకృష్ణ, శోభన్, మోహన్ పాల్గొన్నారు.
గొత్తి కోయలను తరిమేయాలి
ఖమ్మం టౌన్: అడవుల నుంచి గొత్తికోయలను తరిమేయాలని అటవీ శాఖ ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఎఫ్ఆర్వోను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రెండో రోజు విధులను బహిష్కరించి నిరసన ప్రదర్శన నిర్వహించారు. టింబర్ డిపో, కార్పెంటర్స్, దుగడ మిషన్స్ అసోసియేషన్స్ నాయకులు సంఘీభావం తెలిపి ర్యాలీలో పాల్గొన్నారు. రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రీనివాసరావుకు నివాళులు అర్పించారు. అనంతరం డీఆర్వో శిరీషకు వినతిపత్రం అందజేశారు. ఎఫ్ఆర్వోలు రాధిక, ప్రకాశ్, డిఆర్వో సురేశ్ పాల్గొన్నారు.
మండల సమావేశం వాయిదా
చండ్రుగొండ: ఎఫ్ఆర్వో చలమల శ్రీనివాసరావు హత్యను నిరసిస్తూ శుక్రవారం ఎంపీడీవో ఆఫీస్‌లో జరిగిన మండల సర్వ సభ్య సమావేశం వాయిదా వేశారు. ముందుగా శ్రీనివాసరావు ఫొటోకు ప్రజాప్రతినిధులు, ఆఫీసర్లు పూలమాల వేసి నివాళులు అర్పించారు. రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఎంపీపీ పార్వతి, జడ్పీటీసీ వెంకటరెడ్డి, ఎంపీడీవో అన్నపూర్ణ పాల్గొన్నారు.
అర్హులందరినీ ఓటర్లుగా నమోదు చేయాలి
సమవేశంలో మాట్లాడుతున్న సీఈవో రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్‌రాజ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: జిల్లాలోని 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరినీ ఓటర్లుగా నమోదు చేయించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ అన్నారు. కొత్తగూడెం కలెక్టరేట్లో శుక్రవారం ఏర్పాటు చేసిన మీటింగ్‌లో ఆయన మాట్లాడారు. ఈ నెల 26,27, వచ్చే నెల 3,4 తేదీల్లో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక ఓటరు నమోదు ప్రక్రియ చేపట్టాలని సూచించారు. వచ్చే ఏడాది జనవరి 5న ఓటరు తుది జాబితా ప్రకటించాల్సి ఉంటుందని చెప్పారు. జిల్లాలో 25,242 మందికి ఎపిక్ కార్డులు జారీ చేయాల్సి ఉందని, ప్రింటింగ్ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలన్నారు. కొత్త ఓటర్ల నమోదు పర్యవేక్షణకు ప్రత్యేక నోడల్ అధికారిని నియమించాలన్నారు. ఆధార్‌తో లింక్చేసేందుకు జిరాక్స్ కాపీని బూత్‌స్థాయి అధికారికి అందజేయాలని ఓటర్లకు సూచించారు. కలెక్టర్ అనుదీప్, జాయింట్ సీఈవో రవికిరణ్, నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్లు గౌతమ్, వెంకటేశ్వర్లు, స్వర్ణలత, రత్నకళ్యాణి, విజయకుమారి, స్వీప్ నోడల్ ఆఫీసర్ మధుసూధనరాజు పాల్గొన్నారు.
అర్హులంతా ఓటు హక్కు కలిగి ఉండాలి
భద్రాచలం, వెలుగు: 18 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూఓటు హక్కు కలిగి ఉండేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి వికాస్‌రాజ్ అన్నారు. భద్రాచలంలోని నన్నపునేని మోహన్ స్కూల్ పోలింగ్ కేంద్రాన్ని ఆయన శుక్రవారం పరిశీలించి ఓటర్ ఎన్రోల్మెంట్ చేస్తున్న బీఎల్ఓలు, అంగన్ వాడీ టీచర్లను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
తప్పులు లేకుండా జాబితా తయారు చేయాలి
బూర్గంపహాడ్: వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తప్పులు లేకుండా ఓటర్ జాబితా తయారు చేయాలని సీఈవో వికాస్ రాజ్ సూచించారు. మండలంలోని మోరంపల్లి బంజర్ లో ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. స్కూల్ విద్యార్థులతో సమావేశమై పేరెంట్స్‌కు ఓటు ప్రాధాన్యతను వివరించాలని సూచించారు.
గ్రామసభను అడ్డుకున్న పోడు రైతులు
సుజాతనగర్, వెలుగు: మండలంలోని గరీబ్ పేట గ్రామపంచాయతీలో శుక్రవారం నిర్వహించిన పోడు గ్రామసభను లిస్ట్ లో తమ పేర్లు లేవని పోడు రైతులు అడ్డుకున్నారు. పంచాయతీ సెక్రటరీతో వాగ్వాదానికి దిగారు. దీంతో గ్రామసభ జరగకుండానే ముగిసింది. లబ్ధిదారుల అంగీకారం లేకుండానే గ్రామసభ ఆమోదించినట్టు రాసుకున్నారనే అనుమానంతో గ్రామపంచాయతీ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. అర్హులైన వారందరికీ పట్టాలు ఇవ్వాలని కోరారు. ధర్మా, బానోత్ హిరాలి, బానోత్ బుజ్జి, బానోత్ జీబా, సక్రామ్ పాల్గొన్నారు.
యువతే దేశ భవిష్యత్
ఖమ్మం టౌన్, వెలుగు: అవినీతి నిర్మూలన, ఓటర్ల ఆలోచన విధానంలో మార్చు తేవడంలో యువతదే కీలక పాత్ర అని సీబీఐ మాజీ డైరెక్టర్ వీవీ లక్ష్మీనారాయణ అన్నారు. శుక్రవారం సిటీలోని ఎస్ బీఐటీ ఇంజనీటింగ్ కాలేజీలో 2022 ఇన్స్పైర్ రెండో రోజు కార్యక్రమానికి చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జొమెటో, రెడ్ బస్ యాప్ లు ఎంతో పేరుగాంచాయని గుర్తు చేశారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, బిగ్ డేటా, డేటా సైన్స్ లను వినియోగించుకొనే విధానాన్ని తెలుసుకోవాలని సూచించారు. ఇంపాక్ట్ మోటివేటర్లు వేణు గోపాల్, సుధీర్ సండ్ర, పి.మాధవరెడ్డి, చైర్మన్ కృష్ణ ప్రదీప్, కాలేజీ చైర్మన్ గుండాల కృష్ణ, సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ డా. జి.ధాత్రి, ప్రిన్సిపాల్ డా. రాజ్ కుమార్, వైస్ ప్రిన్సిపాల్ జి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
కాంట్రాక్టర్ పై ఎమ్మెల్యే ఆగ్రహం
సుజాతనగర్, వెలుగు: మండలంలోని సీతంపేట గ్రామం వద్ద ఎదుళ్లవాగుపై నిర్మిస్తున్న బ్రిడ్జి పనులు ఆలస్యం కావడం, నాణ్యత లోపించడంతో కాంట్రాక్టర్, ఆఫీసర్లపై ఎమ్మెల్యే వనమా వెంటేశ్వర రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం మండలంలోని సింగభూపాలెం చెరువులో చేప పిల్లలను వదిలారు. అనంతరం సీతంపేట బ్రిడ్జి, మండల కేంద్రంలోని రోడ్లను పరిశీలించారు. బ్రిడ్జి పనులు నాసిరకంగా జరుగుతున్నాయని పీఆర్ ఈఈ, డీఈలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంట్రాక్టర్లు చేస్తున్న తప్పులతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని, కాంట్రాక్టర్ ను వెంటనే బ్లాక్ లిస్టులో పెట్టాలని ఆదేశించారు. డెవలప్మెంట్ వర్క్స్‌పై క్వాలిటీ కంట్రోల్ కు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని తెలిపారు. ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, సొసైటీ చైర్మన్ మండే హనుమంతరావు, ఏఎంసీ చైర్మన్ భుక్యా రాంబాబు పాల్గొన్నారు.
ఎస్కార్ట్ వెహికల్స్‌ను ప్రారంభించిన జీఎం
మణుగూరు, వెలుగు: మణుగూరు ఏరియాలోని పీకే ఓసీపీ 2లో 3 భారీ ఎస్కార్ట్ వెహికల్స్‌ను జీఎం జి వెంకటేశ్వర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారీ యంత్రాలను మైన్స్ లో ఉపయోగించి రోజుకు 20 గంటలు పని చేసేలా చూస్తున్నామని చెప్పారు. వీటిని వినియోగించి లక్ష్యం మేరకు ఉత్పత్తి సాధించేందుకు కార్మికులు కృషి చేయాలని కోరారు. ఎస్ఓటు జీఎం డి లలిత్ కుమార్, ఏజీఎం ఫ్రిడ్జ్ రాల్డ్, పీవో లక్ష్మీపతి గౌడ్, డీజీఎం(పర్సనల్) రమేశ్, ప్రాజెక్ట్ మేనేజర్ ఎం రాముడు, రాజశేఖర్, శ్రీనివాసరావు, రాంబాబు, లింగబాబు, టీబీజీకేఎస్ లీడర్ వి.ప్రభాకర్ రావు, అబ్దుల్ రావు పాల్గొన్నారు.
ప్రైవేటు యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలి
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: విద్యార్థులను తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్న ప్రైవేట్ జూనియర్ కాలేజీల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని శుక్రవారం డీఐఈవోకు ఏబీవీపీ నాయకులు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ మెంబర్ బానోత్ శ్రీకాంత్ మాట్లాడుతూ ఖమ్మం నగరంలోని ప్రైవేట్ జూనియర్ కాలేజీలు ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా సెలవు రోజుల్లో కూడా క్లాసులు నిర్వహిస్తూ స్టూడెంట్లను మానసిక ఒత్తిడికి గురి చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో యశ్వంత్, నాగార్జున, సాయి, విజయ్, యాకూబ్, నవీన్ పాల్గొన్నారు.