భద్రాచలం, వెలుగు: భద్రాద్రి రామయ్యకు ఇస్తానన్న రూ.100 కోట్లు ఏవని బీజేపీ జిల్లా అధ్యక్షుడు కోనేరు సత్యనారాయణ(చిన్ని), మాజీ ఎమ్మెల్యే కుంజా సత్యవతి ప్రశ్నించారు. భద్రాచలంలో సోమవారం మీడియాతో మాట్లాడుతూ భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామికి రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు కాగితాల్లో చూపించి, మాస్టర్ ప్లాన్ అంటూ హడావుడి చేసి కేసీఆర్ మోసం చేశారని విమర్శించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి భద్రాద్రి రాముడి ఆలయ అభివృద్ధి కోసం ప్రసాద్ స్కీం ద్వారా రూ.100 కోట్లు ఇస్తున్నారని తెలిపారు.
త్వరలో భద్రాచలం మీదుగా ఒడిశా నుంచి రైల్వే లైన్ కూడా వస్తోందని చెప్పారు. సీతారాముల కల్యాణానికి తలంబ్రాలు తీసుకురాకుండా సీఎం కేసీఆర్ భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారని విమర్శించారు. 40 ఏండ్ల తర్వాత భద్రాచలం వస్తున్న రాష్ట్రపతికి ఘనంగా స్వాగతం పలకాలని జిల్లా ప్రజలను కోరారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ఆలయ అభివృద్ధికి రూ.500 కోట్లు ఇవ్వాలని, భద్రాచలంలో రైల్వే స్టేషన్ నిర్మించాలని, మూడు పంచాయతీలుగా విభజిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీవో నెం.45ను రద్దు చేయాలని రాష్ట్రపతికి వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యడ్లవల్లి శ్రీనివాసరావు, ములిశెట్టి రామ్మోహన్రావు పాల్గొన్నారు.
వచ్చే నెలలో రెండో విడత గొర్రెల పంపిణీ
డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: వచ్చే నెల చివరి నాటికి రాష్ట్రంలో రెండో విడత గొర్రెల పంపిణీ చేపడతామని రాష్ట్ర గొర్రెలు, మేకల డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డాక్టర్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపారు. జిల్లాలోని మణుగూరు, పాల్వంచ, చుంచుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం ప్రాంతాల్లో సోమవారం ఆయన పర్యటించారు. చుంచుపల్లి మండలంలోని పశు సంవర్థక శాఖ జిల్లా కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. మాంసం ఉత్పత్తి, వినియోగంలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా ఉందన్నారు.
రాష్ట్రంలో 7,31,590 మందిని గొర్రెల పంపిణీకి అర్హులుగా గుర్తించామని చెప్పారు. మొదటి విడతలో 3,93,512 మందికి రూ.5వేల కోట్లతో 8 లక్షలకు పైగా గొర్రెలను పంపిణీ చేశామని తెలిపారు. రాష్ట్ర ఆర్థికాభివృద్ధి వెటర్నటీ శాఖపై ఆధారపడి ఉందన్నారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లాలో మొదటి విడతలో రూ. 95కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేసినట్లు తెలిపారు. రెండో విడతలో రూ. 62 కోట్ల విలువైన గొర్రెలను పంపిణీ చేయనున్నట్లు చెప్పారు.
కేంద్రం ఓబీసీకి రూ.14 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వం కేవలం యాదవులు, కురుమల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన గొర్రెల పంపిణీకి తెచ్చిన అప్పులకే ఈ ఐదేండ్లలో రూ. 1,378 కోట్లు వడ్డీ రూపంలో చెల్లిస్తుందని తెలిపారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వెటర్నరీ డాక్టర్ల పోస్టులను త్వరలో భర్తీ చేయనున్నట్టు చెప్పారు. మందుల కొనుగోళ్లకు సంబంధించిన బడ్జెట్‌ను రెట్టింపు చేసే విషయాన్ని సీఎంతో పాటు సీఎస్ దృష్టికి తీసుకెళ్లనున్నట్టు తెలిపారు. చైర్మన్‌ను పశు సంవర్థక శాఖ జిల్లా అధికారి పురంధర్ ఆధ్వర్యంలో అధికారులు సన్మానించారు.
బందోబస్తుకు 2 వేల మంది
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రాష్ట్రపతి భద్రాచలం పర్యటన కోసం 2వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ డాక్టర్ వినీత్ తెలిపారు. 28న ఉదయం 7.30 గంటల నుంచి భద్రాచలం పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు చెప్పారు. పలు చోట్ల ట్రాఫిక్ డైవర్షన్స్ ఉంటాయని తెలిపారు. ప్రజలు అత్యవసర సమయంలో డయల్100 కు కాల్చేయాలని సూచించారు. పోలీసులు అందుబాటులో ఉంటారని తెలిపారు. రాష్ట్రపతి పర్యటన సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
చెన్నారంలో ఎంపీ నామా పర్యటన
నేలకొండపల్లి, వెలుగు: మండలంలోని చెన్నారం గ్రామంలో సోమవారం బీఆర్ఎస్ లోక సభాపక్ష నేత, ఎంపీ నామ నాగేశ్వరరావు -పర్యటించారు. ఇటీవల చనిపోయిన నెల్లూరి రామయ్య కుటుంబ సభ్యులను, చిన్నమ్మ దంపతులను పరామర్శించారు. రామయ్య కుమారులు నెల్లూరి పార్థసారథి, అంబారావు, వెంకటేశ్వరరావు, నాగేశ్వరరావులను ఓదార్చారు. రైతుబంధు జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు, ఎంపీపీ వజ్జా రమ్య, దండా పుల్లయ్య, సూరపనేని రామకృష్ణ, కడియాల శ్రీనివాసరావు, నెల్లూరి భద్రయ్య, తలశీల గోపి, చిత్తారు సింహాద్రి యాదవ్, మంకెన వెంకటేశ్వరరావు, సర్పంచ్ మస్తాన్, చీకటి రాంబాబు, రాజేశ్ పాల్గొన్నారు.
మృతుల కుటుంబాలకు తుమ్మల పరామర్శ
ఖమ్మం రూరల్/కూసుమంచి, వెలుగు: రూరల్ మండలం గోళ్లపాడు గ్రామంలో సోమవారం తుమ్మల నాగేశ్వరరావు పర్యటించారు. శ్యామల రామిరెడ్డి సతీమణి ఇందిర ఇటీవల చనిపోగా, దశ దినకర్మకు హాజరై ఫొటోకు పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబాన్ని పరామర్శించారు. సాధు రమేశ్ రెడ్డి, మద్ది మల్లారెడ్డి, జొన్నలగడ్డ రవి, షాకమూరి రమేశ్, బండి జగదీశ్, తేజావత్ పంతులు నాయక్, తోట వీరభద్రం, భాస్కర్, అంబటి సుబ్బారావు పాల్గొన్నారు.
కూసుమంచిలో..
మండలంలోని మల్లేపల్లి గ్రామంలో ఇటీవల చనిపోయిన మాజీ సర్పంచ్ తాళ్లూరి రవి తండ్రి ఫొటోకు తుమ్మల నాగేశ్వరరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాలేరును అభివృద్ది చేశానని, ఆగిపోయిన ఎస్సారెస్పీ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు.
కోతల పేరుతో రైతులను ఇబ్బంది పెట్టొద్దు
ఎర్రుపాలెం, వెలుగు: రైతులకు ఇబ్బంది లేకుండా వడ్లు కొనుగోలు చేయాలని సీఎల్పీ లీడర్ భట్టి విక్రమార్క సూచించారు. మండలంలో సోమవారం పర్యటించారు. మాజీ మంత్రి శీలం సిద్ధారెడ్డి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఆయన చేసిన సేవలను కొనియాడారు. సర్కారు దవాఖానాను పరిశీలించి, సౌలతులు కల్పించాలని, డాక్టర్లను నియమించాలని అన్నారు. శిథిలావస్థలో ఉన్న భవనాన్ని వెంటనే నిర్మించాలని కోరారు.
మండలకేంద్రంలోని వడ్ల కొనుగోలు కేంద్రాన్ని ఆయన పరిశీలించి తరుగు పేరుతో కోత పెట్టొద్దని సూచించారు. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, బండారు నరసింహారావు, శ్రీనివాస్ రెడ్డి, అనుమోలు కృష్ణారావు, సామినేని హనుమంతరావు, లింగాల నాగేశ్వరరావు, కడియం శ్రీనివాసరావు, జనార్ధన్, దేవరకొండ శ్రీనివాసరావు, ఇస్మాయిల్ , పాండురంగారావు, కొండల రావు పాల్గొన్నారు.
ప్రకృతి వనం పడావు
ఖమ్మం సిటీలోని 27వ డివిజన్ లో ప్రభుత్వ స్థలంలో ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనం నిర్వహణను ఆఫీసర్లు పట్టించుకోవడం లేదు. పిల్లలు ఆడుకునే ఆట సామగ్రి తుప్పు పట్టింది. చెత్త, ఆకు కొమ్మలతో ఎందుకు పనికి రాకుండా పోయింది. ఫండ్స్ రాగానే డెవలప్ చేస్తామని డివిజన్ కార్పొరేటర్ చెబుతున్నారే తప్ప ఎలాంటి పనులు చేపట్టడం లేదని కాలనీవాసులు అంటున్నారు. పడావు పడిన పార్క్ ను అందుబాటులో కి తేవాలని స్థానికులు కోరుతున్నారు. - వెలుగు ఫొటోగ్రాఫర్, ఖమ్మం
పోలీస్ అభ్యర్థుల కుటుంబాలను ఆదుకోవాలి
భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: పోలీస్ ఈవెంట్స్‌లలో చనిపోయిన అభ్యర్థుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని బీఎస్పీ స్టేట్ జనరల్ సెక్రటరీ యెర్రా కామేశ్డిమాండ్ చేశారు. పోస్టాఫీస్ సెంటర్ నుంచి అమరవీరుల స్థూపం వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ఈవెంట్స్‌లో దేశంలోనే ఎక్కడా లేనివిధంగా రన్నింగ్, లాంగ్ జంప్, షాట్‌పుట్ టార్గెట్నుపెంచి నిరుద్యోగుల జీవితాలతో ఆడుకుంటున్నారని విమర్శించారు. ఈవెంట్స్ మధ్య గ్యాప్ తక్కువగా ఉండడం, రెస్ట్ తీసుకునే అవకాశం లేక అభ్యర్థులు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేశారు. గంధం మల్లికార్జున్, చిలకబత్తిన వీరయ్య, ప్రవీణ్, మల్లిక, రాణి, సునీల్ పాల్గొన్నారు.