ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

ఖమ్మం టౌన్, వెలుగు: జిల్లాలోని సమస్యలపై చర్చించి వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకోవాల్సిన జడ్పీ సమావేశం సాదాసీదాగా జరిగింది. చైర్మన్  లింగాల కమల్ రాజ్  అధ్యక్షతన బుధవారం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. విద్యుత్, గ్రామీణాభివృద్ధి, విద్య, కంటివెలుగు తదితర పథకాలపై సమీక్షించారు. పలువురు జడ్పీటీసీలు, ఎంపీపీలు తమ మండలాల సమస్యలను సమావేశంలో ప్రస్తావించి వాటిని పరిష్కరించాలని కోరారు. 

ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్​ మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ప్రజాప్రతినిధులు లేవనెత్తిన విద్యుత్  సమస్యలను వెంటనే పరిష్కరించాలన్నారు. మన ఊరు–మన బడి కార్యక్రమం కింద జిల్లాలో 426 స్కూల్స్​ను ఎంపిక చేసి పనులు ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం ఎజెండాలోని అంశాలకు ఆమోదం తెలిపారు. డీసీఎంఎస్ చైర్మన్ రాయల శేషగిరి, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, అడిషనల్​ కలెక్టర్ స్నేహలత మొగిలి, జడ్పీ సీఈవో వీవీ అప్పారావు పాల్గొన్నారు.

ట్యాంక్ ఎక్కి డైలీ వేజ్ వర్కర్ల ఆందోళన

పాల్వంచ,వెలుగు: సమస్యలు పరిష్కరించాలని 78 రోజులుగా సమ్మె చేస్తున్నా న్యాయం జరగడం లేదని ఆరోపిస్తూ బుధవారం పాల్వంచలో ట్రైబల్  వెల్ఫేర్  డైలీ వేజ్ కార్మికులు ఓవర్ హెడ్ ట్యాంక్ ఎక్కి నిరసన తెలిపారు. వెంకట్రావు, అర్జున్, కృష్ణకుమారి, రమకళ, కల్యాణి ట్యాంక్​ పైకెక్కి నినాదాలు చేయడం ప్రారంభించారు. విషయం తెలుసుకున్న తోటి కార్మికులు అక్కడికి చేరుకొని వారిని కిందికి దిగాలని కోరారు. విషయం తెలుసుకున్న సీఐ నాగరాజు, ఎస్ఐలు ప్రవీణ్ కుమార్, నాగబ్రహ్మం , ఏటీడబ్ల్యూవో చంద్రమోహన్, తహసీల్దార్ రంగాప్రసాద్ అక్కడికి చేరుకొని అధికారులతో ఫోన్​లో మాట్లాడించారు. వారం రోజుల్లో సమస్య పరిష్క రిస్తామని ఐటీడీఏ డీడీ రమాదేవి హామీ ఇవ్వడంతో ఆందో ళన విరమించారు. ఐఎఫ్టీయూ డివిజన్ కార్యదర్శి నాగేశ్వరరావు, పూనం భద్రయ్య, మంగీలాల్, బి నాగేశ్వరరావు, సేవియా, పాపయ్య, నరసింహారావు, కోటేశ్వ రరావు పాల్గొన్నారు. 

జీపీ నిధులు కాజేస్తున్రు

కల్లూరు, వెలుగు: గ్రామ పంచాయతీలను నిర్వీర్యం చేస్తూ సర్పంచుల జీవితాలతో తెలంగాణ ప్రభుత్వం చెలగాటమాడుతుందని బీజేపీ ఖమ్మం పార్లమెంటరీ కమిటీ కన్వీనర్  నంబూరి రామలింగేశ్వరరావు విమర్శించారు. బుధవారం కల్లూరులో మండల కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ పంచాయతీల బలోపేతం కోసం కేంద్ర ప్రభుత్వం జీపీల ఖాతాల్లోకి నేరుగా నిధులు విడుదల చేస్తుందని తెలిపారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లించి ఖాతాలను ఖాళీ చేసిందని ఆరోపించారు. పార్టీ మండల అధ్యక్షుడు గుమ్మా రామకృష్ణ, జిల్లా కార్యదర్శి నాయుడు రాఘవరావు, నియోజకవర్గ కన్వీనర్ భాస్కర్​ పాల్గొన్నారు.

వైరా: వచ్చే ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 స్థానాల్లో ఐదు స్థానాలు బీజేపీ కైవసం  చేసుకుంటుందని మాజీ ఎంపీ ధర్మావత్  రవీంద్ర నాయక్, విద్యాసాగర్​రెడ్డి అన్నారు. టౌన్  ఆఫీసులో టౌన్  ప్రెసిడెంట్​ ఏలే భద్రయ్య అధ్యక్షతన ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ నాయకులు నెల్లూరు కోటేశ్వరావు, శ్యాంసుందర్ నాయక్, బీపీ నాయక్, దిద్దుకూరి కార్తీక్, మనుబోలు వెంకటకృష్ణ, పాపగంటి నరేశ్, పిల్లి వెంకటసతీశ్​  పాల్గొన్నారు. 

తల్లాడ: సత్తుపల్లి నియోజకవర్గంలో కాషాయం జెండా ఎగరాలని బీజేపీ నియోజకవర్గ ఇన్​చార్జి కనగాల వెంకటరామయ్య, నంబూరి రామలింగేశ్వర రావు అన్నారు. మండల అధ్యక్షుడు ఆపతి వెంకట రామారావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడుతూ సత్తుపల్లి నియోజకవర్గంలో బీజేపీని బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కార్యకర్తలకు సూచించారు. వీరంరాజు, బాలాజీ నాయక్, యుద్దనపూడి శ్రీనివాస్, గాదె కృష్ణారావు, తొండపు మధు, మోదుగు తిరుమలయ్య పాల్గొన్నారు.


ప్రాజెక్టులు సకాలంలో పూర్తిచేయాలి

    సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం

ఖమ్మం టౌన్, వెలుగు: ఖమ్మం జిల్లాలో ప్రాజెక్టులన్నింటిని త్వరగా పూర్తి చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. ఇటీవల నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం మహాసభలు సక్సెస్​ కావడంతో ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. జిల్లాలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి లేదన్నారు. స్థానిక సుందరయ్య భవనంలో బుధవారం మీడియాతో మాట్లాడారు. జిల్లా పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. రోడ్లు, డివైడర్లు  అభివృద్ధిలో భాగమైనా వాటితోనే సరిపోదన్నారు. ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. లక్ష్యం మేరకు సీతారామ ప్రాజెక్టు పూర్తి చేయాలని కోరారు. ఉమ్మడి జిల్లాలో దళితులు, గిరిజనులు ఎక్కువగా ఉన్నారని, నియోజకవర్గానికి కేవలం 500 దళితబంధు యూనిట్లు సరిపోవని చెప్పారు. పోడు పట్టాల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంలో చాలా లోపాలున్నాయని తెలిపారు. 

36 ఏండ్లుగా స్థానికంగా నివాసం ఉంటేనే పట్టాలిస్తామనడంలో అర్థం లేదన్నారు. బీఆర్ఎస్ తో స్నేహపూర్వక వాతావరణాన్ని కొనసాగిస్తూనే, జిల్లా అభివృద్ధికి సూచనలు చేయాలని పార్టీ జిల్లా కమిటీకి సూచించారు. తప్పుడు రాజకీయాలు జిల్లా అభివృద్ధికి, భవిష్యత్తుకు మంచిది కాదన్నారు. అందుకే తప్పుడు రాజకీయాల వైపు వెళ్లొద్దని విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలిపారు. మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, కార్యదర్శి వర్గ సభ్యులు పొన్నం వెంకటేశ్వర్లు, వై విక్రమ్, బొంతు రాంబాబు, భుక్యా వీరభద్రం, కల్యాణం వెంకటేశ్వర్లు 
పాల్గొన్నారు.

సమాచారం ఇవ్వకుండా షాపులు కూల్చడం దారుణం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: కొత్తగూడెం మున్సిపల్​ మార్కెట్​లోని షాపులను ముందస్తు సమాచారం లేకుండా కూల్చివేయడం దారుణమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. కూల్చివేసిన షాపులను పార్టీ నాయకులతో కలిసి బుధవారం పరిశీలించారు. చిరు వ్యాపారులకు అండగా ఉంటామని చెప్పారు. అన్ని సౌలతులతో కొత్త మార్కెట్​ను నిర్మించి ఇవ్వాలని డిమాండ్​ చేశారు. ఆయన వెంట సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే షాబీర్​ పాషా, వై. శ్రీనివాస్​రెడ్డి, కంచర్ల జమలయ్య, నగేశ్, భుక్యా శ్రీనివాస్, విజయ్​కుమార్, లక్ష్మీనర్సింహారావు పాల్గొన్నారు.