భద్రాచలం, వెలుగు: శ్రీసీతారామచంద్రస్వామికి సోమవారం ముత్తంగి సేవ నిర్వహించారు. ముత్యాలు పొదిగిన వస్త్రాలను సీతారాముల మూలవరులు, ఉత్సవమూర్తులు, లక్ష్మీతాయారు అమ్మవారు, ఆంజనేయస్వామికి అలంకరించి ముత్తంగి సేవ చేశారు. ఉదయం గోదావరి నుంచి తీర్థబిందెను తెచ్చి గర్భగుడిలో స్వామికి సుప్రభాతసేవ చేసి బాలబోగం నివేదించారు. కల్యాణమూర్తులను ప్రాకార మండపానికి తీసుకొచ్చి నిత్య కల్యాణం జరిపించారు. మాధ్యాహ్నిక ఆరాధనల తర్వాత రాజబోగం నివేదించారు. శ్రీరామదీక్ష స్వీకరించిన భక్తుల కోసం చందనగోష్టి, రామార్పణం నిర్వహించారు. తర్వాత దర్బారు సేవ జరిగింది.
‘జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంది’
ఖమ్మం టౌన్, వెలుగు: రాష్ట్రంలోని జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం త్వరగా పరిష్కరిస్తుందని మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ తెలిపారు. సోమవారం ఖమ్మం వచ్చిన ఆయనను టీయూడబ్ల్యూజే (టీజేఎఫ్) జిల్లా అధ్యక్షుడు ఆకుతోట ఆదినారాయణ ఆధ్యర్యంలో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వం జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందని, జిల్లాల వారీగా జర్నలిస్టులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దళిత జర్నలిస్టులకు దళితబంధు అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. జర్నలిస్టుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డీపీఆర్వో గౌస్ పాషాను ఆదేశించారు. వెన్నెబోయిన సాంబశివరావు, బొల్లం శ్రీనివాస్, చిర్రా రవి, రామకృష్ణ, ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు.
‘శాటిలైట్ మ్యాప్‌లకు విశ్వసనీయత లేదు’
పెనుబల్లి, వెలుగు: అటవీశాఖ అధికారులు పోడు భూముల్లో చూపించే శాటిలైట్ మ్యాప్‌లకు విశ్వసనీయత లేదని సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు సింగు నరసింహారావు తెలిపారు. మండలంలోని లింగగూడెంలో సోమవారం పార్టీ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం శాటిలైట్ మ్యాప్ తో సంబంధం లేకుండా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికీ పోడు పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2005 కంటే ముందు నుంచే సాగు చేసుకుంటున్నా అటవీశాఖ అధికారులు క్లెయిమ్‌లను తిరస్కరిస్తున్నారని విమర్శించారు. ఈ నెల 14న మండలకేంద్రాల్లో జరిగే ధర్నాలను సక్సెస్ చేయాలని కోరారు. జిల్లా కార్యవర్గ సభ్యుడు దండు ఆదినారాయణ, మండల కార్యదర్శి కొమ్మినేని సుధాకర్, కిరణ్, రమేశ్, సునీత, లక్ష్మి పాల్గొన్నారు.
భూములు గుంజుకోవడం అన్యాయం: కలెక్టరేట్ ధర్నాలో భట్టి విక్కమార్క
ఖమ్మం కార్పొరేషన్, వెలుగు: ధరణి పోర్టల్‌తో రైతులు తమ భూమిపై హక్కులు కోల్పోయారని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని సీఎల్పీ నేత భట్టి విక్కమార్క అన్నారు. సోమవారం ఖమ్మం కలెక్టరేట్ ఎదుట రైతు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలో 24 లక్షల ఎకరాలను పంపిణీ చేయగా, ఇప్పటి ప్రభుత్వం 12లక్షల ఎకరాలను పార్ట్– బీలో నమోదు చేయడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని విమర్శించారు. రెవెన్యూ రికార్డులను ధరణిలో నమోదు చేస్తున్న క్రమంలో జరిగిన పొరపాట్లకు రైతులను ఆఫీసుల చుట్టూ తిప్పించుకోవడం సమంజసం కాదన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పేదలకు భూ పంపిణీ జరగలేదన్నారు. పేదలకు పంపిణీ చేసిన అసైన్డ్, ఇనాం, సర్కార్ భూములను అభివృద్ధి పేరుతో ప్రభుత్వం గుంజుకుంటూ పేదలకు అన్యాయం చేస్తుందన్నారు. మాజీ జడ్పీ చైర్మన్ చందా లింగయ్య దొర, దాసరి డానియేలు, దొబ్బల సౌజన్య, సంతోష్, మహ్మద్ జావీద్, శేఖర్, బొందయ్య, రాందాస్ నాయక్, మనోహర్‌రెడ్డి, అజయ్, కిశోర్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ ను గద్దె దింపాలి
సుజాతనగర్: రైతులకు అన్యాయం చేస్తున్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని డీసీసీ అధ్యక్షుడు పొదెం వీరయ్య కోరారు. ధరణి పోర్టల్ రద్దు, పోడు భూములకు పట్టాలు, రైతు రుణమాఫీ డిమాండ్లపై కొత్తగూడెంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం అడిషనల్ కలెక్టర్ వెంకటేశ్వర్లు కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ధరణి పోర్టల్ ప్రారంభించి ఐదేళ్లు గడస్తున్నా హక్కు పత్రాలు ఇవ్వకపోవడంతో రైతులకు అన్యాయం జరుగుతుందని తెలిపారు. టీపీసీసీ సభ్యుడు నాగ సీతారాములు, పోట్ల నాగేశ్వరరావు, యడవల్లి కృష్ణ, కొత్తగూడెం అసెంబ్లీ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు తోట దేవి ప్రసన్న, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు ఏలూరి కోటేశ్వరావు, చింతలపూడి రాజశేఖర్, అబీద్ పాల్గొన్నారు.
టీఆర్ఎస్ అవినీతితో ప్రజలు విసిగిపోయారు
కూసుమంచి, వెలుగు: రాష్ట్రంలో టీఆర్ఎస్ కుటుంబపాలన, అవినీతితో ప్రజలు విసిగిపోయారని కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్‌రెడ్డి తెలిపారు. సోమవారం తిరుమలాయపాలెం మండలం కాకరవాయి గ్రామంలో మండల అధ్యక్షుడు బొడ్డుపల్లి ప్రసాద్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థాగత నిర్మాణం, ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటమే లక్ష్యంగా బీజేపీ నాయకులు, కార్యకర్తలు పని చేయాలని సూచించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్కు ప్రత్యామ్నాయంగా బీజేపీ రావాలని మెజార్టీ ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు గుండా శ్రీనివాసరెడ్డి, పాలేరు అసెంబ్లీ కన్వీనర్ సంతోష్‌రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు శ్రీనివాస్, నందీప్‌రెడ్డి, గోవర్ధన్, ఉపేందర్, మహేశ్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు.
సంధాని మృతి బాధాకరం:ములుగు ఎమ్మెల్యే సీతక్క
గుండాల, వెలుగు: ప్రజలకు సేవ చేస్తూ మంచి పేరు తెచ్చుకున్న ఎస్కే సంధాని చనిపోవడం బాధాకరమని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. సోమవారం మండలకేంద్రంలో టీడీపీ ఆధ్వర్యంలో సంతాప సభ నిర్వహించారు. ఈ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి వివిధ పార్టీల నాయకులు హాజరయ్యారు. ఏపీ మాజీ సీఎం చంద్రబాబు ఫోన్ చేసి సంధాని ఫ్యామిలీని పరామర్శించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ ఆదివాసీల సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారని కొనియాడారు. చనిపోయేంత వరకు ప్రజల సమస్యల పరిష్కారానికే పాటు పడ్డారని అన్నారు. న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు మధు, సీపీఐ జిల్లా కార్యదర్శి షాబీర్ బాషా, ఎస్ వెంకటేశ్వర్లు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆరిఫ్, షేక్ షావలి, ప్రసాద్, మాధవీ లత, ఎస్ వెంకటేశ్వర్లు, నున్న నాగేశ్వరరావు, సత్యనారాయణ, చలపతిరావు, చందర్రావు, టీడీపీ నాయకులు ఇల్లందుల అప్పారావు, నర్సింహులు,
ఎఫ్ఆర్వో కుటుంబానికి తమ్మినేని పరామర్శ
ఖమ్మం టౌన్, వెలుగు: గొత్తికోయల దాడిలో చని పోయిన ఎఫ్ఆర్వో శ్రీనివాసరావు కుటుంబాన్ని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పరామర్శించారు. రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామంలో సోమవారం ఆయన కర్మ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై ఎఫ్ఆర్వోఫొటోకు పూలమాలలు వేసి నివా ళులర్పించారు. అనంతరం వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. శ్రీనివాసరావు మృతి కుటుంబసభ్యులకు తీరని లోటన్నారు. సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు యెర్రా శ్రీకాంత్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు భుక్యా వీరభద్రం, మండల కార్యదర్శి ఎస్ నవీన్ రెడ్డి, రైతు సంఘం నాయకుడు బానోత్ నాగేశ్వరరావు, కాపర్తి రవీందర్ పాల్గొన్నారు.
సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించాలి
ఖమ్మం టౌన్, వెలుగు: ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ స్నేహలత మొగిలి సూచించారు. సోమవారం జడ్పీ మీటింగ్ హాల్లో అడిషనల్ కలెక్టర్ ఎన్ మధుసూదన్ తో కలిసి ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. 80 మంది వివిధ సమస్యలపై దరఖాస్తులు అందజేసి తమ సమస్యలను తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో శిరీష, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
కొత్తగూడెం: ప్రజావాణిలో వచ్చిన సమస్యలను వెంటనే పరిష్కరించాలని అడిషనల్ కలెక్టర్ కర్నాటి వెంకటేశ్వర్లు ఆఫీసర్లను ఆదేశించారు. కలెక్టరేట్ మీటింగ్ హాల్లో ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకొని వాటిని పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 20 ఏండ్లుగా సాగు చేస్తున్న పోడు భూమిలో ఫారెస్ట్ ఆఫీసర్లు మొక్కలు నాటారని కరకగూడెం మండ లం రేగళ్లకు చెందిన కుంజా జోగయ్య కంప్లైంట్ చేశాడు. కొత్తగూడెం, జూలూరుపాడు మండలాలకు చెందిన పలువురు తమకు ఉపాధి కల్పించాలని కోరారు. పీఆర్ ఈఈ సుధాకర్, ఎస్సీ డెవలప్మెంట్ ఆఫీసర్ అనసూర్య పాల్గొన్నారు.
చురుగ్గా ముక్కోటి ఏకాదశి పనులు
శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పనులు స్పీడ్‌గా జరుగుతున్నాయి. జనవరి 1న తెప్పోత్సవం, 2న ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నారు. ఈనెల 23 నుంచే అధ్యయనోత్సవాలు షురూ కానుండడంతో భక్తులకు సౌలతులు కల్పించేందుకు దేవస్థానం పనులు చేపట్టింది. క్యూలైన్లు, గోదావరి తీరం, వైకుంఠ ద్వారం వద్ద చలువ పందిళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ప్రధాన ఆలయాలతో పాటు ఉప ఆలయాలకు కూడా రంగులు వేస్తున్నారు. హంస వాహనం పనులు కూడా మొదలయ్యాయి. లక్ష మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్న అధికారులు అందుకు తగ్గట్టుగా ప్రసాదాలు, దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు. – భద్రాచలం, వెలుగు