ఉమ్మడి ఖమ్మం జిల్లా సంక్షిప్త వార్తలు

భద్రాచలం, వెలుగు: భద్రాచలంలోని సమ్మక్క-సారలమ్మ ఫంక్షన్​ హాలులో ఆదివారం కోయతూర్​ ఇలవేల్పుల మీటింగ్​ జరిగింది. ఆదివాసీ ఇలవేల్పుల పునరుద్ధరణ, చిరుమల్ల శ్రీసమ్మక్క సారక్క జాతర నిర్వహణ, ఇలవేల్పుల సమ్మేళనం, జోడాయాత్ర–-2, జాతి అస్తిత్వం కోసం సాంస్కృతిక పునరుజ్జీవనం కోసం తీసుకోవాల్సిన చర్యలు, తదితర అంశాలపై చర్చ జరిగింది. గిరిజన సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు కలిసి పోరాడాలని తీర్మానించారు. కరకగూడెం మండలం చిరుమల్లలో జరిగే సమ్మక్క-సారక్క జాతర, 21 రోజుల దీక్షాధారణ తేదీలను ప్రకటించారు. భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య, బీఆర్ఎస్​ భద్రాచలం నియోజకవర్గ ఇన్​చార్జి డా.తెల్లం వెంకట్రావ్, మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, ఆదివాసీ ఉద్యోగుల రాష్ట్ర వర్కింగ్​ ప్రెసిడెంట్​ పొడియం బాలరాజు, ఆధార్​ సొసైటీ సీతారాములు, వీరస్వామి పాల్గొన్నారు. అనంతరం చిరుమల్ల జాతర వాల్​పోస్టర్లను రిలీజ్​ చేశారు.

గ్రామీణ వైద్యుల సమస్యలు పరిష్కరించాలి

కామేపల్లి, వెలుగు: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వైద్య సేవలు అందిస్తున్న గ్రామీణ  వైద్యులను ప్రభుత్వం గుర్తించి సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ గ్రామీణ వైద్యుల సహాయక సంఘం జిల్లా అధ్యక్షుడు బి వెంకటేశ్వరరావు కోరారు. ఆదివారం మండలంలోని కొత్త లింగాల గ్రామంలో మండల 23వ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  సీజనల్  వ్యాధులు, ఎయిడ్స్, టీబీ, మలేరియా, డెంగీ, భ్రూణ హత్యలపై గ్రామీణ ప్రాంత ప్రజలకు అవగాహన కల్పించడంలో ముందున్నామని తెలిపారు. సంఘం మండల అధ్యక్షుడు బందెల నాగేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి వీరాచారి, ట్రెజరర్​ అమృతరావు, ఎల్ మహబూబ్ రెడ్డి, అప్పారావు, సుందర్ రావు, రమేశ్, ఆర్  నాగశంకర్, కె రాంబాబు, సతీశ్​ పాల్గొన్నారు.

కశ్మీర్​పై పంజాబ్​​ జట్టు విజయం

ఖమ్మం రూరల్, వెలుగు: ఖమ్మం సిటీలోని సర్దార్​ పటేల్​ స్టేడియంలో నాలుగో రోజు జరుగుతున్న ‘ఖమ్మం ప్రీమియర్​ లీగ్’​ క్రికెట్​ పోటీల్లో భాగంగా ఆదివారం పంజాబ్, -జమ్మూ కశ్మీర్​ టీమ్స్​ తలపడ్డాయి. నగర మేయర్​ పూనకొల్లు నీరజ టాస్​ వేసి పోటీలను ప్రారంభించారు. ఖమ్మం నగరంలో అంతర్జాతీయ స్థాయి క్రికెట్​ పోటీలు జరగడం ఆనందంగా ఉందన్నారు. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్  టీమ్​ కశ్మీర్  టీమ్​ను 12.3  ఓవర్లతో 88 పరుగులకు ఆల్ అవుట్ చేసింది. పంజాబ్ 6.5 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 90 పరుగులు చేసి విజయం సాధించింది. బీఆర్ఎస్  నగర అధ్యక్షుడు పగడాల నాగరాజు, కార్పొరేటర్ కామస్తపు మురళి, ఖమ్మం ప్రీమియర్  లీగ్  చైర్మన్  డాక్టర్ కూరపాటి ప్రదీప్, నిర్వాహక కార్యదర్శి మహమ్మద్  మతీన్, డైరెక్టర్లు ఆర్యన్ సందీప్, నరేశ్, అథ్లెటిక్స్  కోచ్  మహమ్మద్  గౌస్, టేబుల్  టెన్నిస్  కోచ్  ఓలేటి సాంబమూర్తి, వెంకటప్రసాద్, సలీం, సీనియర్ క్రికెటర్ ఖయ్యూం, వీరేశ్ గౌడ్, బావారీ గుర్జార్, నసీం, శోభన్ పాల్గొన్నారు. 

‘హాత్ సే హాత్ జోడో’ను సక్సెస్​ చేయాలి

ఖమ్మం టౌన్​, వెలుగు: ఈ నెల 26 నుంచి నిర్వహించనున్న హాత్ సే హాత్ జోడో కార్యక్రమాన్ని సక్సెస్​ చేయాలని డీసీసీ అధ్యక్షుడు పువ్వాళ్ల దుర్గాప్రసాద్ పిలుపునిచ్చారు. ఆదివారం సంజీవరెడ్డి భవనంలో పీసీసీ సభ్యులు, అనుబంధ సంఘాలు, పట్టణ, మండల, బ్లాక్ స్థాయి కాంగ్రెస్  అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యలను పక్కన పెట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారం కోసం పాకులాడుతున్నాయని విమర్శించారు. పంచాయతీలకు కేంద్రం ఇచ్చిన రూ. 35 వేల కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులను రాష్ట్ర ప్రభుత్వం దొంగ చాటుగా వేరే అకౌంట్లకు బదిలీ చేసిందన్నారు. రాష్ట్రంలో రైతులతో పాటు సర్పంచుల ఆత్మహత్యలు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. పుచ్చకాయల వీరభద్రం, మహ్మద్ జావేద్, బైరు మనోహర్ రెడ్డి, మాలోత్ రాందాస్ నాయక్, శీలం ప్రతాపరెడ్డి, యడ్లపల్లి సంతోష్, దొబ్బల సౌజన్య, బొడ్డు బొందయ్య, ఎర్రం బాలగంగాధర్ తిలక్, గోళ్ల అప్పారావు పాల్గొన్నారు.