ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షిప్త వార్తలు
  • చలో అసెంబ్లీకి వెళ్లకుండా 
  • ఎక్కడికక్కడ కార్మికుల అరెస్ట్‌‌‌‌లు

గోదావరిఖని : సింగరేణిలో పనిచేస్తున్న కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం కదంతొక్కారు. తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేస్తూ చేపట్టిన సమ్మె మంగళవారం నాటికి సమ్మె ఐదో రోజుకు చేరింది. ఈ సమ్మెకు సింగరేణి జాతీయ కార్మిక సంఘాలు మద్దతు ప్రకటించాయి. మంగళవారం చేపట్టిన చలో అసెంబ్లీ ముట్టడిని పోలీసులు అడ్డుకుని ఎక్కడికక్కడ జేఏసీ లీడర్లు, కార్మికులను అరెస్ట్‌‌‌‌ చేశారు.  సోమవారం అర్ధరాత్రి  నుంచే కాంట్రాక్టు కార్మికుల జేఏసీ లీడర్లు వెంకన్న, వేల్పుల కుమారస్వామి, సాగర్‌‌‌‌, తోకల రమేశ్‌‌‌‌, వైవీ రావు, బి.అశోక్‌‌‌‌, కాంట్రాక్టు కార్మికులను అరెస్ట్‌‌‌‌ చేసి గోదావరిఖని,  యైటింక్లయిన్‌‌‌‌ కాలనీ, ఎన్టీపీసీ, రామగిరి, రామగుండం పోలీస్‌‌‌‌ స్టేషన్లకు తరలించారు. వారిని ఏఐటీయూసీ జనరల్‌‌‌‌ సెక్రెటరీ వి.సీతారామయ్య,  హెచ్‌‌‌‌ఎంఎస్ జనరల్‌‌‌‌ సెక్రెటరీ రియాజ్‌‌‌‌ అహ్మద్‌‌‌‌, బీఎంఎస్‌‌‌‌ ప్రెసిడెంట్‌‌‌‌ యాదగిరి సత్తయ్య, సిఐటీయూ ప్రెసిడెంట్ టి.రాజారెడ్డి పరామర్శించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వై.యాకయ్య, మెండె శ్రీనివాస్‌‌‌‌, సాగర్‌‌‌‌ ఆధ్వర్యంలో గోదావరిఖనిలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. న్యూడెమోక్రసీ, ఇప్టూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఐ.కృష్ణ, ఇ.నరేశ్‌‌‌‌ ఆధ్వర్యంలో పట్టణంలో ప్రదర్శన చేపట్టారు. సమస్యలపై మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌, ప్రభుత్వం స్పందించకపోతే సమ్మెను ఉధృతం చేసేందుకు ఈ నెల 15న కొత్తగూడెంలో జరగనున్న జాతీయ కార్మిక సంఘాల సమావేశంలో కార్యాచరణ ప్రకటిస్తామని ఏఐటీయూసీ జనరల్‌‌‌‌ సెక్రటరీ వి.సీతారామయ్య తెలిపారు.

కార్మికుల డిమాండ్లు ఇవీ... 
సింగరేణి సంస్థలో సుమారు 30 వేల మంది కాంట్రాక్టు కార్మికులు 50 రకాల పనులు చేస్తున్నారు. కొన్ని మైన్స్​లలో పర్మినెంట్ కార్మికులు చేసే పని కూడా ఔట్‌‌‌‌ సోర్సింగ్‌‌‌‌ కార్మికులతో చేయిస్తున్నారు. సింగరేణి సాధిస్తున్న లాభాల్లో  పరోక్షంగా భాగస్వాములవుతున్న  కాంట్రాక్ట్​ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్​ చేస్తున్నారు. గని ప్రమాదంలో మరణించిన కాంట్రాక్టు కార్మికులకు రూ.కోటి ఎక్స్‌‌‌‌గ్రేషియా చెల్లించాలని, కాంట్రాక్టు కార్మికులకు పని భద్రత కల్పించాలని, సంస్థలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు  చేయాలని, సంస్థ సాధిస్తున్న లాభాల్లో 20 శాతం బోనస్‌‌‌‌ చెల్లించాలని, చట్టబద్ద హక్కులు, సౌకర్యాలు కల్పించాలని, కాంట్రాక్టు కార్మికుల కుటుంబ సభ్యులకు సింగరేణి హాస్పిటల్‌‌‌‌లో ఉచిత వైద్యం, కాంట్రాక్టు కార్మికులకు గుర్తింపు ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించాలని, కార్మికులకు సింగరేణి క్వార్టర్లను కేటాయించాలని తదితర డిమాండ్లను పరిష్కరించాలని కాంట్రాక్టు కార్మిక సంఘాల జేఏసీ లీడర్లు 
కోరుతున్నారు.

కరీంనగర్ కు బ్యూటిఫుల్​ ఎంట్రన్స్
రూ.147 కోట్లతో సురక్షిత తాగునీరు అందిస్తాం

కరీంనగర్ ఎంట్రన్స్ లోని అలుగునూర్​ చౌరస్తాలో బ్యూటిఫుల్​ఎంట్రన్స్​ ఏర్పాటు చేసుకుందామని మేయర్ యాదగిరి సునీల్ రావు అన్నారు. మంగళవారం స్థానిక అలుగునూర్ లో అభివృద్ధి  పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ.147కోట్లతో కరీంనగర్ సిటీలోని విలీన గ్రామాల్లో సురక్షిత తాగునీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. రూ.28లక్షలతో అందమైన ఫౌంటెన్, రూ.35లక్షలతో గ్రీనరీ,రూ.38లక్షలతో అలుగునూర్ చౌరస్తా నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ఇరువైపుల అందమైన గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు సల్ల శారద, మేచినేని వనజ, ఈఈ మహేందర్, డీఈ ఓంప్రకాశ్ పాల్గొన్నారు. 

ఏ ఒక్క విద్యార్థీ అనారోగ్యం బారిన పడొద్దు
హాస్టల్స్​ను తనిఖీ చేసిన సిరిసిల్ల కలెక్టర్​

స్టూడెంట్స్ కు  కాచి చల్లార్చిన నీటిని ఇవ్వాలని, సంక్షేమ హాస్టళ్లలో ఏ ఒక్క విద్యార్థి అనారోగ్యానికి గురికాకుండా టీచర్లు జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ అనురాగ్ జయంతి  ఆదేశించారు. మంగళవారం  ఇల్లంతకుంట మండలంలోని పలు సంక్షేమ స్కూళ్లను కలెక్టర్ ఆకస్మికంగా విజిట్  చేశారు. పాఠ్య పుస్తకాలు వచ్చాయా? యూనిఫాం లు అందాయా అంటూ టీచర్లను అడిగారు. స్టూడెంట్స్ కు కల్పిస్తున్న సౌలతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున టీచర్లు విద్యార్థుల ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. అనంతరం ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి గ్రామంలోని ప్రైమరీ స్కూల్, అంగన్​వాడీ కేంద్రంలో సాగుతున్న రిపేర్​పనులను పరిశీలించారు. కలెక్టర్ వెంట బీసీ వెల్ఫేర్​ఆఫీసర్​మోహన్ రావు, డీఎంహెచ్​వో సుమన్ మోహన్ రావు, డిప్యూటీ డీఎంహెచ్​వో డా. రజిత, ప్రోగ్రాం అధికారి మీనాక్షి, స్థానిక ప్రజాప్రతినిధులు 
పాల్గొన్నారు.

ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ అఖిలపక్షం బూటకం
'ఖని'లో బాధితుల నిరసన 

తమకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌‌‌‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అఖిలపక్షం బూటకమని ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ బాధితులు ఆరోపించారు. మంగళవారం గోదావరిఖని మున్సిపల్ కార్యాలయం ముందు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ 8నెలలుగా తమ సమస్యలు పరిష్కరించాలని తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అఖిలపక్ష కమిటీలోకి ఆర్‌‌‌‌ఎఫ్‌‌‌‌సీఎల్‌‌‌‌ బాధితులను కూడా తీసుకోవాలని డిమాండ్ చేశారు. దళారుల చేతిలో మోసపోయి ఆర్థికంగా ఎన్నో సమస్యలతో రోడ్డున పడే పరిస్థితులు వచ్చాయని, తమను  ఆదుకునేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నిరుద్యోగుల నుంచి డబ్బులు దండుకుని తిరిగి ఇవ్వకుండా వేధిస్తూ ఆత్మహత్యలకు కారణమవుతున్న దళారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధితులు అందరికీ న్యాయం చేస్తానని చెప్పిన ఎమ్మెల్యే ఇప్పటివరకు ఎవరికి ఒక్క రూపాయి కూడా ఇప్పించలేకపోయారని విమర్శించారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌కు తరలించారు.

ఈటల సస్పెన్షన్​పై నిరసన
అసెంబ్లీ సమావేశాల నుంచి ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను సస్పెండ్​ చేయడాన్ని నిరసిస్తూ మంగళవారం హుజురాబాద్ , జమ్మికుంట, వీణవంక పట్టణాల్లో బీజేపీ నాయకులు సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జమ్మికుంట గాంధీచౌక్​ లో కేసీఆర్​దిష్టిబొమ్మ దహనాన్ని అడ్డుకునేందుకు పోలీసులు యత్నించారు. దీంతో కార్యకర్తలకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్​రావు, జీడి మల్లేశ్, స్వరూపలతోపాటు మరికొంత మంది నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఈటల అంటే కేసీఆర్​కు భయం పట్టుకుందన్నారు. అందుకే అసెంబ్లీ నుంచి ఆయనను సస్పెండ్​ చేయించారన్నారు. కార్యక్రమంలో నాయకులు గంగిశెట్టి రాజు,  ప్రభాకర్,  శశిధర్,  రమేష్ కుమార్, వీణవంక మండలాధ్యక్షుడు రామిడి ఆదిరెడ్డి, జమ్మికుంట మున్సిపల్​మాజీ చైర్మన్​ శీలం శ్రీనివాస్​, ఇతర నాయకులు, కార్యకర్తలు 
పాల్గొన్నారు. 

నిర్వాసితులు ఆందోళన చెందవద్దు
ముంపు గ్రామాల నిర్వాసితులు ఆందోళన చెందవద్దని.. అండగా ఉంటామని అడిషనల్ కలెక్టర్ ఖిమ్యా నాయక్ అన్నారు. వేములవాడ అర్బన్ మండలం ఆరెపల్లి, సంకెపల్లి గ్రామాల్లోని ముంపు నిర్వాసితులతో అదనపు కలెక్టర్, ఆర్డీవో శ్రీనివాస్ చర్చలు జరిపారు. నిర్వాసితుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సర్వే జరిపి, ప్రభుత్వం నుంచి వచ్చే నష్టపరిహారం అందజేస్తామన్నారు. నిర్వాసితులు మాట్లాడుతూ తాము సర్వస్వం కోల్పోయామని ప్రభుత్వం నుంచి త్వరగా నష్ట పరిహారం అందించాలని కోరారు.  కార్యక్రమంలో జడ్పీటీసీ మ్యాకల రవి, డీఎస్పీ నాగేంద్ర చారి, తహసీల్దార్​ రాజిరెడ్డి, సర్పంచ్ నవీన రాజు, ఎంపీటీసీ బుర్ర లహరిక,  బాబు, శేఖర్పా, తదితరులు పాల్గొన్నారు.

కుటుంబ పాలనకు చరమగీతం పాడుదాం
మెట్ పల్లి, వెలుగు: తెలంగాణలో కేసీఆర్ కుటుంబ నిరకుంశ పాలన సాగుతోందని, రానున్న ఎన్నికల్లో కుటుంబపాలనకు చరమగీతం పాడుదామని జగిత్యాల జిల్లా బీజేపీ ప్రెసిడెంట్ పైడిపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం మెట్ పల్లి లో బీజేపీ, బీజేవైఎం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి, సర్దార్ పటేల్ ఫొటోకు నివాళులర్పించారు. బీజేపీ లీడర్లు కేవీఎల్ఎన్​రాజు, చంద్రశేఖర్, సదాశివ్, ప్రభాకర్, మహేశ్​, గంగాధర్ రెడ్డి, రెంటం జగదీశ్ పాల్గొన్నారు. వేములవాడ, వెలుగు : టీఆర్ఎస్ ప్రభుత్వం ఓట్ల రాజకీయం చేస్తోందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ  అన్నారు. వేములవాడ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్, చాకలి ఐలమ్మ ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పట్టణ అధ్యక్షుడు సంతోష్ బాబు, హరీశ్​,  శ్రీనివాస్, కృష్ణస్వామి పాల్గొన్నారు.

సర్దార్ పటేల్, చాకలి ఐలమ్మకు నివాళి
హైదరాబాద్​రాష్ట్రంలో ఆపరేషన్​పోలో ప్రారంభించిన రోజు(సెప్టెంబర్​13)ను  పురస్కరించుకొని సర్దార్ వల్లభాయ్ పటేల్ కు తెలంగాణ చౌక్ లో  మంగళవారం నివాళులర్పించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు  గంగా డి.కృష్ణారెడ్డి మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్1948 సెప్టెంబర్ 13 న చేపట్టిన ఆపరేషన్ పోలోతో అప్పటి రజాకర్లు, నైజాం మెడలు వంచారని తెలిపారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోమటిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, శివరామకృష్ణయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. చొప్పదండిలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు బత్తిని ప్రశాంత్, జిల్లా కార్యదర్శి చేపూరి సత్యనారాయణ పాల్గొన్నారు. కథలాపూర్​ మండలాల్లో సర్దార్​పటేల్ ఫొటోకు, స్వాతంత్ర్య సమరయోధురాలు చాకలి ఐలమ్మ విగ్రహనికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయా కార్యక్రమాల్లో కోరుట్ల టౌన్​ బీజేపీ ప్రెసిడెంట్​ ధనుంజయ్,  కౌన్సిలర్​ నరేశ్, రాజమురళి, శ్రీనివాస్, కథలాపూర్​ మండలాధ్యక్షుడు సత్యనారాయణ, వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.