మెట్ పల్లి, వెలుగు : దేశానికి, ధర్మానికి రక్షణగా ప్రతి భారతీయుడు కట్టుబడి ఉండాలని కరీంనగర్ ఆర్ఎస్ఎస్ విభాగ్ బౌద్ధిక్ ప్రముఖ్ పాక మురళీకృష్ణ అన్నారు. పట్టణంలోని కోదండ రామాలయం అవరణలో మంగళవారం రక్ష బంధన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. దేశంలో కొన్ని దుష్ట శక్తులు కావాలని హిందూ సమాజంలో చిచ్చు పెడుతున్నాయని, అలాంటి వారి దురాలోచనలు తిప్పికొట్టాలని కోరారు. కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ నగర కార్యవాహ మురళి, భూమయ్య, నాగయ్య, గంగాధర్, ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.
రెండు బైకులు ఢీ , ఒక్కరు మృతి
మల్లాపూర్, వెలుగు : మండలంలోని ముత్యంపేట శివారులో మంగళవారం రెండు బైక్ లు ఢీ కొన్నాయి. ఈ యాక్సిడెంట్లో ఒకరు చనిపోయారు. స్థానికుల వివరాల ప్రకారం.. గుండంపల్లి చెందిన శివరాత్రి సాగర్(25), తల్లి లక్షి(40)తో బైక్‌పై మెట్ పల్లికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో ముత్యంపేట్ శివారులో వీళ్ల బైక్‌తో మరో బైక్‌ఢీ కొట్టింది. ఈ ఘటనలో సాగర్ తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే చనిపోగా.. లక్ష్మికి కాలు విరిగింది. మరో బైక్ పైఉన్న మారంపల్లి శివకు తీవ్ర గాయాలు కాగా పరిస్థితి విషమంగా ఉంది. అతన్ని నిజామాబాద్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు.
స్వాతంత్య్ర సమరయోధులకు సత్కారం
జమ్మికుంట, వెలుగు : స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు అవుతున్న సందర్భంగా స్థానికంగా ఉంటున్న స్వాతంత్ర్య సమరయోధుడు బుర్ర వెంకట్రాజం, -ప్రమీల దంపతులకు వీణవంక తహసీల్దార్ రాజయ్య, మున్సిపల్ చైర్మన్ తక్కల్లపల్లి రాజేశ్వర్‌రావు, కమిషనర్ సమ్మయ్య మంగళవారం సన్మానించారు. స్వాతంత్ర్యం కోసం పొరాడిన యోధులను సత్కరించడం గర్వకారణమన్నారు.
పోలీస్ స్టేషన్‌కు బెంచీల డొనేషన్
గోదావరిఖని, వెలుగు : రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో గోదావరిఖని వన్‌టౌన్‌కు 10 సిమెంట్ బేంచీలను పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్ అధ్యక్షులు కజాంపురం రాజేందర్, కార్యదర్శి పి.మల్లికార్జున్, ట్రెజరర్ ఎల్లప్ప అధ్యక్షతన మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో టౌన్ ఇన్స్పెక్టర్ రమేశ్ బాబుకు బేంచీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సీనియర్ సభ్యులు డాక్టర్ వెంకటేశ్వర్లు, కోలేటి శ్రీనివాస్, ముడతనపల్లి సారయ్య, లక్కం బిక్షపతి, శంకరయ్య, తదితరులు పాల్గొన్నారు. అలాగే స్థానిక మార్కండేయకాలనీలో నిరుపేదలకు కోలేటి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులను లయన్స్‌క్లబ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు.
16వ రోజూ వీఆర్ఏల సమ్మె
ఇల్లందకుంట, వెలుగు: తమ డిమాండ్ల సాధన కోసం వీఆర్ఏలు చేస్తున్న సమ్మె మంగళవారంతో 16 వ రోజుకు చేరింది. సమ్మె శిబిరం వద్ద వంటా వార్పు కార్యక్రమాన్ని నిర్వహించి నిరసన తెలియజేశారు.ఈ సందర్భంగా జేఏసీ కో కన్వీనర్ పంజాల జనార్ధన్ మాట్లాడుతూ వీఆర్ఏల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం 16 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కార్యక్రమంలో సంపత్, కొడం పోచమ్మ, తిరుపతి, బి.విష్ణువర్ధన్, రవికుమార్,మల్లయ్య, కౌసల్య, సర్వర్, అనూష, కవిత, రాజకొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
భక్తి శ్రద్ధలతో మొహర్రం
మత సామరస్యానికి ప్రతీకైన మొహర్రం పండుగ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం భక్తి శ్రద్ధలతోనిర్వహించారు. వేడుకల్లో భాగంగా గత తొమ్మిది రోజులుగా హసన్, హుస్సేన్ పీరీలను కుల,మతాలకు అతీతంగా కొలిచి నిమజ్జనం చేశారు. పీరీలను డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగించారు. భక్తులు కుడుకల దండ వేసి కొత్త దట్టీ కట్టి బెల్లం , పేలాలను సమర్పించారు. పెద్ద పులి వేషాధారణలో యువకులు ఆకట్టుకున్నారు.
- ఇల్లందకుంట/కోరుట్ల/కోనరావుపేట వెలుగు
గాంధీ సినిమా ప్రదర్శన
స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా ప్రభుత్వ ఆదేశాలతో మహాత్మా గాంధీ జీవిత చరిత్రపై రూపొందించిన చిత్రాన్ని మంగళవారం కరీంనగర్‌లోని ప్రతిమా మల్టీఫ్లెక్స్ థియేటర్లో, సిరిసిల్ల, వేములవాడ పట్టణాల్లోని పలు థియేటర్లలో ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని స్థానిక ప్రభుత్వ పాఠశాలల స్టూడెంట్లు, టీచర్లు ఆసక్తిగా చూశారు.
- సిరిసిల కలెక్టరేట్ / కరీంనగర్,వెలుగు: